అపూర్వం.. అనూహ్యం.. అద్భుతం.. వాయుసేనకు వందనం | pm modi salutes indian armed forces | Sakshi
Sakshi News home page

అపూర్వం.. అనూహ్యం.. అద్భుతం.. వాయుసేనకు వందనం

May 14 2025 1:25 AM | Updated on May 14 2025 6:47 AM

pm modi salutes indian armed forces

మంగళవారం పంజాబ్‌లోని ఆదంపూర్‌ ఎయిర్‌బేస్‌లో వాయుసేన జవాన్లతో కలిసి భారత్‌ మాతా కీ జై అంటూ నినదిస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో రన్‌వేపై మిగ్‌–29 యుద్ధవిమానం, గగనతల రక్షణ వ్యవస్థ సుదర్శన చక్ర (ఎస్‌–400). ఎస్‌–400ను ధ్వంసం చేశామన్న పాక్‌ ప్రగల్భాలు ఉత్తమాటలని నిరూపిస్తూ మోదీ దాని ఎదుటే నిల్చుని ప్రసంగించారు.

మరోసారి తెగించొద్దని పాకిస్తాన్‌కు లక్ష్మణరేఖ గీసి వచ్చారు

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పోరాటపటిమను శ్లాఘించిన ప్రధాని మోదీ

దాయాది నడిబోడ్డున బాంబులు పేల్చారు 

మీ మెరుపువేగం, కచ్చితత్వం శత్రువులను నిశ్చేషు్టలను చేసింది 

భారతీయులంతా మీ పోరాటానికి ఉప్పొంగిపోయారు.. ఇది ఎన్నటికీ తీర్చుకోలేని రుణం 

పంజాబ్‌లోని ఆదంపూర్‌ ఎయిర్‌బేస్‌లో వాయుసేన జవాన్లనుద్దేశించి ప్రసంగం

ఇది నవయుగ భారతం. దేశం శాంతినే కోరుకుంటుంది. కానీ శాంతిమయ మానవత్వంపై దాడి చేస్తే ఊరుకోం. అవసరమైనప్పుడు సమరమూ చేస్తాం. యుద్ధక్షేత్రంలో శత్రువును ఎలా అణగదొక్కాలో భారత్‌కు బాగా తెలుసు.  

వాయుసేన వేగం, సత్తా చూసి పాకిస్తాన్‌ నిద్రలేని రాత్రులు గడిపింది. సమరంలో నేరుగా పోరాడే దమ్ములేక వైమానిక స్థావరంలో పౌరవిమానాలను ముందు నిలిపి పాక్‌ వక్రబుద్ధిని ప్రదర్శించింది. అయినా వాయుసేన కచ్చితత్వంతో పాక్‌ సాయుధ సంపత్తి, వైమానిక స్థావరాలనే గురిచూసి కొట్టింది. – ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: దుష్టదేశ గగనతలాన్ని చీల్చుకుంటూ దూసుకెళ్లి ముష్కర మిన్నాగుల పుట్టలను నేలమట్టంచేస్తూ, దాయాదిదేశం యుద్ధం ఆపాలని కాళ్లబేరానికి వచ్చే స్థాయిలో శత్రువుల వైమానిక స్థావరాలను తుత్తునియలు చేసి తిరుగులేని ధైర్యసాహసాలను ప్రదర్శించిన భారత వాయుసేనను ప్రధాని మోదీ పొగడ్తల్లో ముంచెత్తారు. పాక్‌ సరిహద్దుకు కేవలం 100 కిలోమీటర్ల దూరంలోని పంజాబ్‌లోని ఆదంపూర్‌ వైమానిక స్థావరానికి స్వయంగా వెళ్లి అక్కడి వాయుసేన బలగాలపై ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు. వారి అసమాన పోరాట పటిమను భుజం తట్టి ప్రోత్సహించి పొగిడారు.

తర్వాత అక్కడి ఎయిర్‌ఫోర్స్‌ జవాన్లనుద్దేశించి దాదాపు అరగంటపాటు ప్రసంగించారు. మరోసారి తెగించేందుకు దుస్సాహసం చేయొద్దని సరిహద్దు వెంట భారతవాయుసేన బలగాలు లక్ష్మణరేఖ గీశాయని మోదీ వ్యాఖ్యానించారు. ఆదంపూర్‌ వైమానిక స్థావరంలోని భారత అత్యంత అధునాతన గగనతల రక్షణ వ్యవస్థ అయిన సుదర్శన చక్ర(ఎస్‌–400) మిస్సైల్‌ లాంఛర్లను ముక్కలుచెక్కలు చేశామని పాక్‌ పలికిన ప్రగల్భాలన్నీ ఉత్తమాటలని నిరూపిస్తూ మోదీ మంగళవారం ఆ ఎయిర్‌డిఫెన్స్‌ సిస్టమ్‌ ఎదుటే నిలబడి ప్రసంగించారు. ఆపరేషన్‌ సిందూర్‌ విజయంపై జాతినుద్దేశించి ప్రసంగించిన మరుసటి రోజే మోదీ ఎయిర్‌ఫోర్స్‌నుద్దేశిస్తూ మాట్లాడటం గమనార్హం. త్రిశూలం చిహ్నంతో ఉన్న ఎయిర్‌ కమాండ్‌ క్యాప్‌ ధరించి భారత్‌ మాతా కీ జై అంటూ ప్రధాని ప్రసంగం ప్రారంభించారు.  

అనుపమాన పరాక్రమం 
‘‘పాక్‌ గడ్డపై మీరు చేసిన యుద్ధం అనుపమానం. అపూర్వం. అసాధారణం. అద్భుతం. పాకిస్తాన్‌ నడిబొడ్డున బాంబులు పేల్చారు. కేవలం 20–25 నిమిషాల్లో లక్ష్యాలను నేలమట్టంచేశారు. మీ మెరుపువేగం, కచ్చితత్వం శత్రువులను నిశ్చేష్టులను చేసింది. చూసుకునేలోపే ఛాతీని చీల్చేశాం. మీ పోరాటంతో ప్రతి ఒక్క భారతీయుడు గౌరవంతో ఉప్పొంగిపోయాడు. మేం మీకు రుణపడిపోయాం. ఇది ఎన్నటికీ తీర్చుకోలేని రుణం. ఊహకందనంతటి శక్తియుక్తుల్ని ప్రదర్శించి దేశానికి విజయం చేకూర్చిన మీ నుంచి ఆశీస్సులు తీసుకోవడానికే నేను వచ్చా.

ఆపరేషన్‌ సిందూర్‌ ధాటికి ఇక లక్ష్మణరేఖ దాటొద్దని పాకిస్తాన్‌కు బాగా అర్థమైంది. తరచూ అణుబాంబులతో బెదిరించాలని చూస్తున్న దాయాదికి మన బలగాలు భారత్‌ మాతాకీ జై నినాదంలోని అపారశక్తిని బయటకు తీసి చూపారు. భారత్‌ మాతాకీ జై అనేది కేవలం నినాదం కాదు. దేశం కోసం తమ ప్రాణాలనైనా పణంగా పెడతామని బలగాలు చేసిన ప్రతిజ్ఞ. మన డ్రోన్లు, క్షిపణుల మోత పాక్‌ గడ్డపై ప్రతిధ్వనించిన ప్రతిసారీ పాకిస్తాన్‌ సైనికుల చెవుల్లో భారత్‌ మాతాకీ జై అనే నినాదమే మార్మోగింది. వాయుసేన శౌర్యం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మన సైనిక, వాయు, నావికా దళాలకు నా సెల్యూట్‌’’ అంటూ మోదీ సెల్యూట్‌ చేశారు. 

కన్నేస్తే కనుమరుగు ఖాయం 
‘‘భారత గడ్డపై కన్నేస్తే తాము కనుమరుగు అవడం ఖాయమని ఉగ్రపోషకులకు ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత బాగా గుర్తుంటుంది. మీ పరాక్రమంతో ఆపరేషన్‌ సిందూరం నినాదం ప్రపంచమంతా మార్మోగుతోంది. శత్రువులు ఈ ఎయిర్‌ఫోర్స్‌ను నాశనంచేద్దామని కంకణం కట్టుకుని ఎడాపెడా దాడులు చేశారు. వాళ్ల ప్రయత్నాలను మీరు సులభంగా వమ్ముచేశారు. మన వైమానిక స్థావరాలు, రక్షణ మౌలిక సదుపాయాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో వాళ్ల 9 కీలక ఉగ్రస్థావరాలను సమాధులుగా మార్చేశాం. 100 మందికిపైగా ముష్కరులను మట్టుపెట్టాం. పాక్‌కు చెందిన ఎనిమిది సైనిక స్థావరాలను నాశనం చేశాం. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత్‌ గీసిన లక్ష్మణరేఖ ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తోంది’’ అని అన్నారు. 

ధర్మ సంస్థాపనకు యుద్ధం 
‘‘ధర్మ సంస్థాపనే లక్ష్యంగా శత్రు సంహారం కోసం ఆయుధం చేతబట్టి యుద్ధంచేయడం భారతీయుల సంప్రదాయం. మన అక్కచెల్లెళ్ల, కుమార్తెల పసుపు కుంకుమలు, సిందూరాన్ని తుచ్ఛమైన ముష్కరులు తుడిచేయగానే మనం వాళ్ల నట్టింట్లోకి వెళ్లి మరీ నాశనం చేశాం. కనీసం పారిపోయే అవకాశం కూడా ఇవ్వలేదు. పహల్గాంలో వాళ్లు దొంగదెబ్బ తీస్తే మనం మాత్రం నేరుగా వెళ్లి, ఎదురునిలిచి పోరాడాం. పాకిస్తాన్‌ సైన్యం చంకనెక్కి భద్రంగా ఉండొచ్చని ఇన్నాళ్లు ఉగ్రవాదులు భావించారు. కానీ మన బలగాలు ఇక పాక్‌లో ఉగ్రవాదానికి సురక్షిత స్థలమంటూ ఏదీ లేదని నిరూపించాయి.

సూర్యోదయం వేళ మీ సుందర దర్శనం చేసుకునేందుకే నేను ఇక్కడికొచ్చా. మీరు ఈ తరానికే కాదు భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిదాతలు. మరోసారి సాహసిస్తే నాశనం, వినాశనం అని శత్రువులకు సందేశం ఇచ్చారు. భారత్‌ మాతాకీ జై అన్నప్పుడల్లా భయంతో శత్రువుల గుండెలు జారిపోయాయి. పరాక్రమవంతుల అడుగులతో నేల కూడా పులకిస్తుంది. అంతటి ధైర్యవంతులను నేరుగా చూడటంతో జన్మ ధన్యమవుతుంది. ఆ భాగ్యం కోసమే నేను ఇక్కడికొచ్చా. వీరుల నేలపై నిలబడి ఇప్పుడు నేను ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఆర్మీ, బీఎస్‌ఎఫ్‌లోని యోధులకు సలామ్‌ చేస్తున్నా. మీ వీరత్వంతో ఆపరేషన్‌ సిందూర్‌ నినాదం నేల నలుచెరుగులా ప్రతిధ్వనిస్తోంది’’ అంటూ బలగాలను మోదీ పొగిడారు.

త్రికరణ శుద్ధితో..
‘‘ఇప్పుడు భారత్‌ మూడే సూత్రాలతో ముందుకెళ్తోంది. ఒకటి.. ఉగ్రదాడి జరిగితే మనదైన శైలిలో సమయం చూసి దీటుగా బదులిస్తాం. రెండు.. అణుబాంబులకు భయపడేదే లేదు. మూడు.. ఉగ్రవాదాన్ని పెంచిపోíÙంచే వాళ్లను, ఉగ్రవాదాన్ని జాతీయవాదంగా మార్చేసిన ప్రభుత్వాలను ఇకపై భారత్‌ వేర్వేరుగా చూడబోదు’’ అని మోదీ స్పష్టంచేశారు. ఆదంపూర్‌ ఎయిర్‌బేస్‌ అనేది దేశంలోని రెండో అతిపెద్ద వైమానిక స్థావరం. ఇక్కడ అత్యంత అధునాతన రఫేల్, మిగ్‌–29 యుద్ధవిమానాల స్క్వాడ్రన్‌ దళాలు ఉంటాయి. 1965, 1971 యుద్ధాల్లోనూ ఆదంపూర్‌ వైమానిక స్థావరం అత్యంత కీలకపాత్ర పోషించింది.  

మానవ యుక్తి.. మెషీన్‌ శక్తి
‘‘వాయుసేన ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణుల వేగం, సత్తా చూసి పాకిస్తాన్‌ నిద్రలేని రాత్రులు గడిపింది. సమరంలో నేరుగా పోరాడే దమ్ములేక వైమానికస్థావరంలో పౌరవిమానాలను ముందు నిలిపి పాక్‌ తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. అయినాసరే మన వాయుసేన అత్యంత కచ్చితత్వంతో పాక్‌ సాయుధ సంపత్తి, వైమానిక స్థావరాలనే గురిచూసి కొట్టింది. అమాయక పౌరులకు ఏ హానీ తలపెట్టలేదు. ఒక్క పౌరవిమానాన్నీ మీరు ధ్వంసంచేయలేదు. ఈ విషయంలో నేను నిజంగా గర్వపడుతున్నా. దాడుల్లో మీరు శత్రు స్థావరాలు, ఉగ్రశిబిరాలనే కాదు మరోసారి దుస్సాహసం చేయాలనే దుర్బుద్ధినీ దెబ్బతీశారు.

గగనతల, భూతల యుద్ధ వ్యవస్థల మధ్య అద్భుతమైన సమన్వయం సాధించారు. మానవ యుక్తిని మెషీన్‌ శక్తిని చక్కగా మేళవించారు. మీరు భారత్‌ మాతా కీ జై అన్న ప్రతిసారీ శత్రువుల వెన్నులో వణుకుపుట్టింది. మీ సారథ్యంలో దేశీయ తయారీ ఆకాశ్‌ మిస్సైళ్లు, అధునాతన సుదర్శన చక్ర(ఎస్‌–400) వ్యవస్థలు శత్రు దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా మీరు దేశ ఆత్మవిశ్వాసం, సమైక్యత, ప్రతిష్టను నూతన శిఖరాలపై నిలిపారు. అణుబూచికి ఏమాత్రం భారత బలగాలు బెదరవని నిరూపించారు. మన శక్తియుక్తుల ముందు పాకిస్తాన్‌ అన్ని డ్రోన్లు, యూఏవీలు, క్షిపణులన్నీ దిగదుడుపే. నమ్మశక్యంకాని రీతిలో రణతంత్రం ప్రదర్శించారు.

గత దశాబ్దకాలంలో అత్యంత అధునాతన సమర సాంకేతికతలన్నింటినీ మన బలగాలు అందిపుచ్చుకున్నాయి. టెక్నాలజీ వాడకంలో, యుద్ధం వచ్చినప్పుడు ఎలా వినియోగించుకోవాలో మీకు బాగా తెలుసు. రియల్‌ గేమ్‌లో మీరు అదరగొట్టారు. మీరు ఆయుధాలతో మాత్రమే యుద్ధం చేయలేదు. భారత్‌ ఇప్పుడు డ్రోన్లు, డేటా, టెక్నాలజీ సహిత రణాల్లో రాటుదేలింది. మీరు దమ్ము చూపించి శత్రువులను దుమ్ములో కలిపేశారు’’ అని మోదీ అన్నారు. మహారాణా ప్రతాప్‌ అశ్వమైన చేతక్‌ చూపిన తెగువ, సాహసం ఇప్పుడు మన ఆధునిక యుద్ధవిమానాలకు పాటవానికి సరిగ్గా సరిపోతుంది అంటూ నాటి వచనాలను మోదీ గుర్తుచేశారు. ‘‘కదలికల్లో నైపుణ్యం కనబరిచాయి. మెరుపువేగంతో దూకుడు చూపాయి. శత్రుసైన్యం మధ్యల్లోంచే శ్రస్తాలు సంధించాయి’’ అని మోదీ ఆ వచనాలను వల్లెవేశారు.  

శాంతంగా ఉంటాం.. సమరమూ చేస్తాం
‘‘ఇది నవయుగ భారతం. దేశం శాంతినే కోరుకుంటుంది. శాంతంగా ఉంటాం. శాంతిమయ మానవత్వంపై దాడి చేస్తే ఊరుకోం. యుద్ధ క్షేత్రంలో శత్రువును ఎలా అణగదొక్కాలో భారత్‌కు బాగా తెలుసు. శాంతంగా ఉంటాం. అవసరమైనప్పుడు సమరమూ చేస్తాం. ఆపరేషన్‌ సిందూర్‌ అంటే పోరాటానికి పెట్టుకున్న పేరు కాదు. భారత విధాననిర్ణయ పతాక. దృఢ సంకల్పానికి, శక్తిసామర్థ్యాలకు ప్రతీక. శాంతిమయ జీవనం సాగించాలని ప్రపంచానికి బోధించిన బుద్ధుని నేల మాత్రమేకాదు శత్రువులను చీల్చి చెండాడిన గురు గోవింద్‌ సింగ్‌ లాంటి వీరపరాక్రముల పవిత్రభూమి’’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement