నీళ్ల కోసం ఇక పాక్‌ కాళ్లబేరం! | Sakshi Guest Column On India Pakistan Water Issues | Sakshi
Sakshi News home page

నీళ్ల కోసం ఇక పాక్‌ కాళ్లబేరం!

May 14 2025 1:20 AM | Updated on May 14 2025 1:20 AM

Sakshi Guest Column On India Pakistan Water Issues

సందర్భం

ఇండియా, పాకిస్తాన్‌ మే 10న కాల్పులను విరమించాయి. దీనికి అమెరికా చొరవ చూపి నట్టుగా వార్తలొచ్చాయి. ఏప్రిల్‌ 22 పహల్‌ గామ్‌ దాడి నుంచి మే 10 కాల్పుల విరమణ వరకు గడచిన ఈ స్వల్పకాలంలో ఇరు దేశాల సంబంధాలు మౌలికంగా కొత్త రూపు సంతరించుకున్నాయి. 

ఉగ్రదాడికి ముందు ఇండియా–పాకి స్తాన్‌ సంబంధాలు ఎలా ఉండేవో ముందుగా తెలుసుకోవాలి. రెండు దేశాల నడుమ పరిష్కారం కాని సమస్యలపై ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, కాల్పుల విరమణ సజావుగా కొనసాగుతోంది. సింధూ నదీ జలాల ఒప్పందానికి (ఇండస్‌ వాటర్‌ ట్రీటీ– ఐడబ్ల్యూటీ) ఇండియా కట్టుబడి ఉంది. పరిమిత కాల పర్యటనలకు వీలుగా అటారీ–వాఘా సరిహద్దు తెరిచే ఉంటోంది. రాజధానుల్లో హై కమిషనర్లు మినహా సీనియర్‌ దౌత్యాధికారులు పనిచేస్తున్నారు. 

ఏదో ఒకరోజు కశ్మీర్‌ మీద చర్చలు సాధ్యమేనన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రదాడి మరునాడు, అంటే ఏప్రిల్‌ 23న, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ఇండియా ప్రకటించింది. అటారీ– వాఘా సరిహద్దును మూసేసింది. రక్షణ సహాధి కారుల పోస్టులను రద్దు చేసింది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ భగ్నమైంది. పాకిస్తాన్‌ ఒకడుగు ముందుకేసి 1972 సిమ్లా ఒప్పందం రద్దు చేస్తానని బెదిరించింది. 

ఉగ్రవాదాన్ని అంతం చేస్తేనే నీళ్లు!
కట్‌ చేస్తే... మే 11న అకస్మాత్తుగా వైరాలు నిలిచిపోయాయి. మళ్లీ కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. దీంతో మారిన పరిస్థి తులు ఏవి? దీని తర్వాతా మారనివేమిటి? మే 10న రెండు దేశాల డీజీఎంఓ (డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌)లు టెక్నికల్‌ అగ్రిమెంటు కుదుర్చుకున్నారు. దీని ప్రకారం, నియంత్రణ రేఖ (లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌–ఎల్‌ఓసీ) పొడవునా కాల్పులు జరగవు. డ్రోనులు, క్షిపణులు ప్రయోగించుకోరు. ఇతర లాంగ్‌ రేంజ్‌ ఆయు ధాల ప్రయోగం జరగదు.  పరస్పర సైనిక దాడులు నిలిచిపోతాయి. 

ఇక కాల్పుల విరమణ ఒప్పందం వమ్ము చేయలేనివి ఏమిటో చూద్దాం. ఏప్రిల్‌ 23న ఇండియా, ఆ తర్వాత పాకిస్తాన్‌ తీసుకున్న చర్యలను మే 10 ఒప్పందం రద్దు చేయలేదు. ఇది టెక్నికల్‌ స్థాయి పత్రం తప్ప రాజకీయ ఒప్పందం కాదు. డీజీఎంఓలకు రాజకీయ ఒప్పందాలు చేసుకునే అధికారం లేదు. వీటిని విదేశీ వ్యవహారాల శాఖలు మాత్రమే కుదుర్చుకోగలవు. మరో విధంగా చెప్పాలంటే, ఏప్రిల్‌ 22 నాటి పరిస్థితిని ఇరు దేశాలూ పునరుద్ధరించలేదు. 

అందుకే, ఇండియా, పాకిస్తాన్‌ నడుమ ఇప్పుడున్నది నయా స్టేటస్‌ కో! అంటే, ఐడబ్ల్యూటీ ఇక ముందు కూడా నిలుపుదలలోనే ఉంటుంది. సింధు జలాలు ఇండియా ఇష్టానుసారం ప్రవహిస్తాయి. ఈ జలాల గణాంకాలను పాకిస్తాన్‌తో పంచుకోవడానికి ఇండియా సుముఖంగా లేదు. దాయాది దేశ ఆర్థిక వ్యవస్థను, అంతర్గత రాజకీయాలను దీర్ఘ కాలంలో ఈ నిర్ణయం తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. 

ఐడబ్ల్యూటీ నిలిపివేత ఇండియా–పాకిస్తాన్‌ దౌత్య సంబంధాల రూపురేఖలను మౌలికంగా మార్చేసిన తీవ్ర చర్య. పాక్‌ టెర్రరిజానికి స్వస్తి పలికితే తప్ప సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించబో మని ఇండియా తేల్చిచెప్పింది. ఏకపక్షంగానో, లేదా ద్వైపాక్షిక చర్చల అనంతరమో దీన్ని పునరుద్ధరించడం పూర్తిగా ఇండియా చేతిలో ఉంది. మే 10 కాల్పుల విరమణ ఒప్పందం పరిధిలోకి ఈ అంశం రాదు.

భవిష్యత్‌ చర్చల్లో పాకిస్తాన్‌ మెడలు వంచడానికి ఈ ఐడబ్ల్యూటీ సస్పెన్షన్‌ గొప్ప అస్త్రం అని చెప్పాలి. పాకిస్తాన్‌కు సింధూ బేసిన్‌ నీళ్లు కావాలంటే, టెర్రరిజం విషయంలో ఇండియా డిమాండ్లకు అది తలొగ్గాల్సిందే. కశ్మీర్‌ అనేది భావోద్వేగాలకు సంబంధించిన అంశం. అయితే, పాకిస్తాన్‌ ప్రజలకు నీరు జీవన్మరణ సమస్య. పాకిస్తాన్‌ ఇకముందు కూడా కశ్మీర్‌ పాట పాడుతుంది. 

కానీ, ఐడబ్ల్యూటీ విషయంలో ఇండియాను సానుకూలం చేసుకోడమే మున్ముందు వారి అసలు లక్ష్యం అవుతుంది. ఉభయ పక్షాల చర్చల్లో కశ్మీర్‌ అంశం ప్రాముఖ్యం కోల్పోతుంది. దాని స్థానంలో ఐడబ్ల్యూటీ కీలకాంశంగా మారుతుంది. మరో విధంగా చెప్పాలంటే, ఇండియా తీసు కున్న ఐడబ్ల్యూటీ సస్పెన్షన్‌ అనే ఒకే ఒక్క చర్యతో... ఇరు దేశాల సంబంధాల్లో ఇప్పటి వరకు కేంద్రబిందువుగా ఉన్న కశ్మీర్‌ స్థానాన్ని ఇప్పుడు నీరు ఆక్రమించింది. 

నిగ్రహం బాధ్యత పాక్‌ మీదే...
1971 బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ధం అనంతరం, 1972లో సిమ్లా ఒప్పందంపై సంతకాలు చేసినప్పుడు కూడా ఇండియా ఇలానే వ్యవహరించింది. యుద్ధం ముందు ఉన్న ప్రాదేశిక స్థితిని (1965 యుద్ధానంతరం మాదిరిగా) యథాతథంగా అంగీకరించలేదు. కశ్మీర్‌ సరిహద్దు పేరును ‘కాల్పుల విరమణ రేఖ’ నుంచి ‘నియంత్రణ రేఖ’ (ఎల్‌ఓసీ)గా మార్చింది. ఇలా చేయడం ద్వారా కశ్మీర్‌లో తృతీయ పక్షం జోక్యాన్ని వ్యతిరేకించగలిగింది. అప్పటి నుంచి జమ్ము– కశ్మీర్‌లో యూఎన్‌ పరిశీలకుల ఉనికి నామమాత్రమైంది. 

సారాంశం ఏమిటంటే, పహల్‌గామ్‌ ఉగ్రదాడి, దాని పర్యవ సానాలు ఇండియా–పాకిస్తాన్‌ సంబంధాలను రెండు విధాలుగా ప్రభావితం చేశాయి. మొదటిది: పాకిస్తాన్‌ కోరుకున్నట్లు కశ్మీర్‌ అంశం కొంతవరకు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది. అయితే ద్వైపాక్షిక చర్చల నుంచి కశ్మీర్‌ను తప్పించడంలో ఇండియా విజయం సాధించింది. పాకిస్తాన్‌ ఇప్పుడు సర్వశక్తులూ ఐడబ్ల్యూటీ మీదే కేంద్రీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్‌కు నీళ్లు కావాలి.

ఇండియాకు టెర్రరిజం అంతం కావాలి. ఇప్పటి వరకు, టెర్రరిజం అంతానికి పాకిస్తాన్‌ అంగీకరించాలంటే ఇండియా కశ్మీర్‌పై చర్చలు జరపాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడది మారింది.

రెండవది: ఇరు దేశాల నడుమ సంఘర్షణ తలెత్తినప్పుడు, వైరాన్ని ఉప–సాంప్రదాయిక (సబ్‌–కన్వెన్షనల్‌) స్థాయిని దాటనివ్వ లేదని ఇండియా తన చర్యలు, ప్రతిచర్యల ద్వారా చాటిచెప్పింది. భవిష్యత్తులో మాత్రం ఇది కుదరదని, సబ్‌–కన్వెన్షనల్‌ దాడులకు సాంప్రదాయిక స్థాయిలోనే ప్రతి చర్యలు ఉంటాయని ప్రకటించింది. అంటే, ఇండియాతో పూర్తిస్థాయి యుద్ధం వద్దనుకుంటే, ఉప–సాంప్రదాయిక స్థాయిలోనూ పోరు ప్రారంభించకుండా నిగ్రహం పాటించాల్సిన బాధ్యత పాకిస్తాన్‌ మీదే ఉంటుంది. 

సింపుల్‌గా చెప్పాలంటే, టెర్రరిజానికి ఇక సాంప్రదాయిక యుద్ధంతోనే జవాబు చెబుతామని ఇండియా స్పష్టం చేయగలిగింది. ఇందుకోసం భారీ మిలిటరీ సంక్షోభం ఉత్పన్నమై అనేక మంది బలి కావలసి రావడం దురదృష్టకరం. వైరి దేశం ఉగ్ర దాడులకు తెగబడ కుండా నిరోధకత సాధించడానికి, దాన్ని కొనసాగించడానికి ఈ పాటి మూల్యం చెల్లించక తప్పదు.

హ్యాపీమాన్‌ జాకబ్‌ 
వ్యాసకర్త జేఎన్‌యూలో ఇండియా ఫారిన్‌ పాలసీ బోధకులు (‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement