ఉగ్రవాదంపై పోరులో ఏకమైన దేశం | Sakshi Guest Column On nation united in fight against terrorism | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదంపై పోరులో ఏకమైన దేశం

Published Fri, May 2 2025 2:30 AM | Last Updated on Fri, May 2 2025 8:51 AM

Sakshi Guest Column On nation united in fight against terrorism

సందర్భం

పహల్‌గామ్‌ ఊచకోత పట్ల భారత ప్రభుత్వం ఎంతో పరిపక్వత ప్రదర్శించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటన అర్ధాంతరంగా ముగించుకున్నారు. తక్షణం కశ్మీర్‌ వెళ్లి పరిస్థితి ఏమిటో స్వయంగా తెలుసుకోవాలని హోంమంత్రిని ఆదేశించారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై అప్పటికప్పుడు ఏయే చర్యలు చేపట్టాలో గుర్తించారు. వీసాలు రద్దు చేశారు. అటారీ చెక్‌ పోస్టు మూసేశారు. పాక్‌ హైకమిషన్‌ కీలక అధికారులను దేశం నుంచి బహిష్కరించారు. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్‌ చేశారు. ఉగ్రదాడి సూత్రధారులకు తగిన గుణపాఠం చెప్పేందుకు వ్యూహ రచనా జరుగుతోంది. 

‘‘భారత రిపబ్లిక్‌తోనే ఆటలాడతారా, మీ అంతు చూస్తాం, ఖబడ్దార్‌!’’ అంటూ ఇండియా పంపిన హెచ్చరిక ఇప్పటికే టెర్రరిస్టులకు అందేవుంటుంది. అత్యంత శక్తిమంతమైన రష్యా, అమెరికాల నుంచి, సౌదీ అరేబియా సహా మనకు విస్పష్టమైన మద్దతు లభించింది. ఇది ఈ సందేశానికి మరింత బలం చేకూర్చింది. సాధారణ పరిస్థితుల్లో ఎన్ని భేదాభిప్రాయాలున్నా, కష్టకాలంలో అన్నీ మరచి ఒక్క తాటి మీద నిలవటం భారత ప్రజల విశిష్టత. ప్రస్తుత బాధకర సమయంలోనూ కోపంతో రగిలిపోతూ అందరం ఒక్కటయ్యాం. 

ఒక్కుమ్మడిగా మన ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించాం. భౌతికంగానూ బయటికొచ్చాం. మనం భాగ్యవంతులం కాకపోవచ్చు, కాని ఆపదలో అండగా నిలిచే సహజగుణ సంపన్నులం. కేంద్ర ప్రభుత్వం, జమ్ము కశ్మీర్‌ ప్రభుత్వం ఈ తరుణంలో ఏ చర్యలు తీసుకున్నా ఇండియా యావత్తూ వాటికి వెన్నుదన్నుగా నిలిచి ఉంటుంది. ఇండియా జాతీయ భద్రతకు పౌర సమాజం ఎప్పుడూ చేయూత ఇస్తుంది. ఇది కాలపరీక్షలో నిగ్గుదేలిన వాస్తవం.

యుద్ధం వస్తే సిద్ధమే!
రెండు దేశాల నడుమ యుద్ధం వస్తుందా?  పహల్‌గామ్‌లో పాక్‌ అంతటి దుస్సాహసానికి పాల్పడితే మనం చేతులు ముడుచుకుని కూర్చోలేం. కానీ ఇవి మాత్రమే యుద్ధానికి దారి తీసే కారణాలు కావు. పాకిస్తాన్‌ మనకు వ్యతిరేకంగా అల్లుతున్న కథనాలు కూడా ఇందుకు పురిగొల్పుతున్నాయి. పహల్‌గామ్‌లో ఉగ్రదాడి పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెల్లుబికిన తర్వాత పాకిస్తాన్‌ తన ఆత్మరక్షణ కోసం ఎంతటి దుందుడుకు విమర్శలకూ వెనుకాడటం లేదు. 

ఇండియా సైనికపరంగా ఎలాంటి చర్య తీసుకున్నా, యుద్ధానికి ‘మ్యాచ్‌’ అయ్యే ప్రతిచర్యలు ఎదురవుతాయి. పరిస్థితి అంతదాకా వస్తే, ‘‘అయితే సరే, అయితే సరే. మేం కూడా ఆ ‘మ్యాచ్‌’ను ఎదుర్కుంటాం. ఘోర కృత్యాలకు తెగబడుతున్న ఉగ్రవాదాన్ని మా దేశంలో ఎట్టి పరిస్థితిల్లోనూ అనుమతించం’’ అని మనం చెప్పి తీరాలి.

ఈ సన్నద్ధతలో మనం గుర్తు పెట్టుకోవలసిన అంశం: యుద్ధానికి సిద్ధంగా ఉండటం వేరు, యుద్ధం కోసం ఉవ్విళ్లూరడం వేరు. యుద్ధం తాలూకు నిర్బంధాలు, ఫలితాలు ఎప్పుడూ బాధాకరంగానే ఉంటాయి. అదీ అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం అంటే, దాని పరిణామాలు ప్రళయ సమానంగా ఉండగలవు. అణ్వస్త్రాలపై ఇండియా విధానాలు వివేకంతో కూడుకుని ఉంటాయి. అణ్వస్త్ర నిగ్రహం మన విధానం. పాకిస్తాన్‌ ఇదే బాటలో పయనిస్తోందా? అది అణ్వస్త్రం సమకూర్చుకున్న చరిత్రే దాని ఉద్దేశాలను వెల్లడిస్తుంది.

‘ఒక్క దేశం’గా నిలబడదాం!
ఇండియా తన సైనిక వ్యూహాలను విజ్ఞతతో బేరీజు వేసుకుని ఏది సరైన మార్గమో నిర్ణయించుకోగలదు. మనం ప్రభుత్వాన్ని సంపూర్ణంగా, బేషరతుగా విశ్వాసంలోకి తీసుకోవాలి. ఇక, దేశంలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేవారు కొందరు ఉంటారు. వారికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వానికి మనం సహకరించాలి. 

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారికి మనం ఇలా చెప్పాలి: ‘‘ద్విజాతి సిద్ధాంతం ప్రతిపాదించి మీరు వేరే దేశాన్ని సాధించుకున్నారు. మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టి మా ‘వన్‌ నేషన్‌’ను విభజించాలని చేసే ప్రయత్నాలు మేం  సహించేది లేదు. హిందువులు, ముస్లిములు, సిక్కులు... వీరందరికీ మా ‘వన్‌ నేషన్‌’ మాతృభూమి. ‘ఇండియా దటీజ్‌ భారత్‌’ విలువలకు నిలయం. మీ క్రూరాతి క్రూరమైన వక్రబుద్ధికి ఇవి అర్థం కావు.’’

1948 జనవరి 30న ‘తీస్‌ జనవరి మార్గ్‌’లో మంచు కప్పిన గడ్డి మీద రక్తం చిందినట్లే, ఈ ఏప్రిల్‌ 22న పహల్‌గామ్‌ అందమైన కొండ లోయల మీద చిందిన రక్తం... మానవత్వం మీద బుల్లెట్ల దౌష్ట్యానికి నిదర్శనం. అయినప్పటికీ మానవత్వం మీద మన విశ్వాసాన్ని అది చాటి చెబుతోంది.  

మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా తీసుకురావాలని చూస్తున్న ‘ఉగ్రవాదపు రెండో దశ’ను నిరోధించి, మన మన మధ్య ఒక్క నెత్తుటి బొట్టు చిందనీయకుండా సాయుధ బలగాలకు పౌరదళాలుగా మన సమైక్య సంఘీభావం ప్రకటించాలి. టెర్రరిస్టులకు, టెర్రరిజానికి పురిటిగడ్డ అయున పాకిస్తాన్‌లోనూ హింసాద్వేషాలను వ్యతిరేకించే విజ్ఞులు ఉన్నారు. 

పహల్‌గామ్‌ ఘటన పట్ల కలత చెందినవారు, మేధావులు అక్కడ కొద్దిమంది కాదు... ఎక్కువగానే ఉంటారు. వారెవరో మనకు తెలియాల్సినంతగా తెలియడం లేదు. అలాంటివారు ఈ సమయంలో మతతత్వ గుంపులను, వ్యక్తులను గట్టిగా వ్యతిరేకిస్తారని ఆశిద్దాం. 

గొప్ప భారతీయుడైన లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఇచ్చిన పిలుపును గుర్తు చేసుకుంటూ, భారత దేశం ఈ సవాలును విజయవంతంగా తిప్పికొట్టాలని ఆశిద్దాం. ఆయన ఇచ్చిన ‘జై జవాన్, జై కిసాన్‌’ నినాదానికి ‘జై ఇన్సాన్‌’ (ఇన్సాన్‌ అంటే మానవ్‌) కూడా చేర్చుదాం. మన మతం మానవత్వం అనీ, దుష్టత్వం కాదనీ పహల్‌గామ్‌ సాయుధ దుండగులకు చెప్పి తీరాలి. ‘‘ఖబడ్దార్, ఇండియాతో, ఇండియా మానవత్వంతో ఆటలొద్దు’’ అని మరోసారి చెబుదాం!

గోపాలకృష్ణ గాంధీ
వ్యాసకర్త పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌
(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement