
అభిప్రాయం
బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు చదువుకోవడం కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు లేక పిల్లలు నానా ఇబ్బందులు పడు తున్నారు. మారుమూల గ్రామాల్లో ఉండే పిల్లలు ఇళ్ల దగ్గర ఉండి చదువుకోవడానికి కనీస సౌకర్యాలు, ఆర్థిక వనరులూ లేకపోవడం, ఎక్కడో దూరంగా ఉన్న స్కూల్‌కు వెళ్లడం కష్టం కావడంతో కొందరు పిల్లలు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఇలాంటి పరిస్థితుల కారణంగా ఎంతో కొంత ఆదాయం వస్తుందని తమ పిల్లలను కూలీ నాలీ పనులకు పంపి స్తున్నారు. దీంతో ఆయా వర్గాల పిల్లల్ని బడిబాట పట్టించేందుకు ఏర్పాటు చేసినవే సంక్షేమ హాస్టళ్లు. ప్రస్తుతం ఏపీలో ఉన్న హాస్టళ్లకు కొన్నింటికి సొంత భవనాలు ఉండగా, మరి కొన్నింటిని ప్రయివేటు అద్దె గృహాల్లో నిర్వహిస్తున్నారు.
ఇక్కడ చదువుకునే పిల్లలకు వసతితో పాటు, పోషకాహారం అందించాలి. పరిశుభ్రమైన పరిస్థితులు కల్పించాలి. అక్కడే నివాసం ఉండేలా వార్డెన్లను నియమించాలి. పిల్లల ఆరోగ్య అవసరాల కోసం వైద్య సౌకర్యాలు కల్పించాలి. ఈ హాస్టళ్లలో ఎక్కువగా ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన పిల్లలే ఉంటారు కనుక ఆయా వర్గాలకు చెందిన సంక్షేమ శాఖల నుంచే నిధులు కేటాయిస్తారు. గిరిజన బిడ్డల కోసం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) నుంచి ప్రత్యేక నిధులు కేటాయిస్తారు. ఇదంతా కాగితాల మీద స్పష్టంగా కనిపిస్తుంది. కానీ వాస్తవ పరిస్థితులు అలా లేవని ఇటీవల ఏపీ హైకోర్టు (AP High Court) తీవ్రంగా ఆక్షేపించింది.
ఆంధ్రప్రదేశ్‌లో బడుగు బలహీన వర్గాల పిల్లలకు చెందిన హాస్టళ్ల నిర్వహణ అత్యంత దయనీయంగా మారిందనీ, ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని హాస్టళ్లలో కంటే వారి ఇళ్ళల్లోనే పిల్లలు సురక్షితంగా ఉండగలరనీ హైకోర్టు అభిప్రాయపడడం పరిస్థితి తీవ్రతను తెలియచేస్తోంది. సంక్షేమ హాస్టళ్లలోని ఘోరమైన పరిస్థితుల గురించి దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యం నేపథ్యంలో జిల్లా న్యాయ సేవాధి కారులు హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో అనేక వాస్తవాలు వెల్లడయ్యాయి.
చదవండి: విద్యారంగం బతికే భరోసా ఏదీ?
నర్సీపట్నం (Narsipatnam) సంక్షేమ హాస్టల్‌లో 228 మంది విద్యార్థినులు ఉండగా వారికి కేవలం ఒకే ఒక మరుగుదొడ్డి ఉంది. అలాగే విజయనగరంలోని అంధుల ఆశ్రమ పాఠశాలలో 33 మంది విద్యార్థులు ఉండగా ఒక్క సహాయకుడు కూడా లేడు. వారు ఎలా మనగలుగుతున్నారో అర్థం కాదు. అదే జిల్లాకు చెందిన మరో సంక్షేమ హాస్టల్‌లో కేవలం పదిగదుల్లో 168 మంది విద్యార్థినులను కుక్కేశారు. కొన్నిచోట్ల పైకప్పు పెచ్చులూడి పిల్లలు గాయాల పాలైన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఆహారంలో పురుగులు, కలుషిత తాగునీరు వల్ల విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. ఇక వార్డెన్ల లైంగిక వేధింపులు, సొంత పనులను విద్యార్థినీ, విద్యార్థులకు పురమాయించడం మామూలే. ఇవన్నీ వెలుగులోకి రాకుండా నిర్వాహకులు కప్పిపుచ్చుతున్నారు.
- ప్రొఫెసర్ పీటా బాబీ వర్ధన్
ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం పూర్వ విభాగాధిపతి