
అభిప్రాయం
ప్రభుత్వ విద్యా సంస్థల్లో నమోదు పెంచడానికి ఎవరికి తోచిన విధంగా వారు ఉచిత సలహాలు ఇస్తున్నప్పటికీ ఆచరణలో అవేవీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచలేకపోతున్నాయి. ప్రభుత్వ విద్యారంగ గతం, వర్తమానం, భవిష్యత్తును ఒకసారి పరిశీలన చేస్తే... 1990వ దశకం వరకు మన దేశంలో ప్రభుత్వ విద్యా రంగం పటిష్ఠంగా ఉండేది. నూటికి తొంభై ఐదు మంది విద్యార్థులు ప్రభుత్వ బడులలోనే చదివేవారు. బడులన్నీ విద్యార్థులతో కళకళలాడేవి.
ఆంక్షలు లేని స్వేచ్ఛాయుత ప్రపంచ వాణిజ్యం కొరకు ‘ప్రపంచ వాణిజ్య ఒప్పందం (గాట్)–1994’లో మన దేశం చేరిన నాటినుండి విద్యారంగంలో ప్రయివేటు పెట్టుబడులు విపరీతంగా పెరిగి, విద్య కుడా లాభాలను ఆర్జించిపెట్టే ఒక సరుకుగా మారింది. దీంతో ప్రభుత్వ విద్యా సంస్థలు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా నేడు వాటి ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో గత ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ‘జగనన్న విద్యాకానుక’, ‘జగనన్న గోరుముద్ద’, ‘విద్యాకానుక కిట్’ లాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవు. వెఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనా కాలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన ప్రవేశపెట్టారు. ‘నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించి, అధునీకరించి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు భరోసా కల్పించారు.
ఇంతటితో సరిపెట్టుకోక, ఇప్పటి వరకు ప్రయివేటు పాఠశాలల్లో ధనవంతుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే ఇంటర్నేషనల్ బాకలారియేట్ (ఐబీ) సిలబస్‌ను ప్రభుత్వ బడుల్లో అమలుకు ఆదేశాలు ఇచ్చి, దేశానికే ఆదర్శంగా నిలిచారు. ప్రపంచంలో అత్యుత్తమ బోధనకు పేరొందిన ఐబీ విద్యా విధానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడుల్లో అమలుచేయడానికి ఏపీ స్టేట్ కౌన్సిల్ అఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్‌తో ఒప్పందం చేసుకోవడం ఊహకు కూడా అందని చారిత్రక ఘట్టం.
అయితే, ఆ ప్రభుత్వం మారగానే ‘అమ్మ ఒడి’ భరోసాను భంగపాటుకు గురిచేసి రద్దుచేశారు. ‘తల్లికి వందనం’ అని పథకం పేరు మార్చినా పాఠశాలల్లో నమోదు శాతం పెరగడం లేదు. జూన్ నెల ముగింపు నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభత్వ బడుల్లో ఒకటో తగతిలో విద్యార్థుల తక్కువ నమోదు వెక్కిరిస్తున్నది. ప్రస్తుత కూటమి ప్రభుత్వ తీరుతెన్నులే ఇందుకు కారణం.
దేశంలోనే సంపద సృష్టిలో, జీఎస్‌టీ వసూళ్లలో మొదటి వరుసలో ఉన్నామని చెప్పుకొంటున్న రెండు తెలుగు రాష్ట్రాలు... విద్యా ప్రగతి సూచికలో మాత్రం కింది స్థానానికి దిగజారాయి. ఉచిత భోజన వసతితో కూడిన గురుకులాలలో కూడా పిల్లలు అంతగా చేరడం లేదంటే కారణం ప్రభుత్వం సరైన సౌకర్యాలు ఏర్పరచక పోవడం, బోధన, బోధనేతర సిబ్బందిని నియమించకపోవడమే అని చెప్పక తప్పదు.
తెలంగాణలో పాఠశాల విద్యను, ఇంటర్ విద్యను కలపాలనే ప్రయత్నం జరుగుతోంది. ఇది మరో సంక్షోభానికి దారితీయవచ్చు. పాఠశాల విద్యాశాఖ ఆరేడు ఎన్జీఓలతో ‘సీఎస్సార్’ పథకం కింద ఎంఓయూ కుదుర్చుకోవడం చూస్తే... రెగ్యులర్ క్లాసుల బోధనకు కలిగే ఆటంకాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు కడబడటం లేదు.
ప్రభుత్వాలు మారగానే విద్యారంగం తీవ్రమైన ఒడుదొడుకులకు గురవుతోంది. గత ప్రభుత్వాల బ్రాండ్ కొనసాగింపుకన్నా తమ ప్రభుత్వ బ్రాండ్ ఉండాలనే తలంపు నేడు విద్యారంగానికి శాపంగా పరిణమిస్తున్నది. వెరసి చూస్తే విద్యారంగం ఒక విషవలయంలో చిక్కుకున్నట్లు గోచరిస్తున్నది.
అడ్మిషన్ల లేమితో ప్రాభవం కోల్పోతున్న ప్రభుత్వ పాఠశాలలకు... పరిశ్రమలకు కల్పించే ఉద్దీపన చర్యలు తక్షణ అవసరం. ఒకవైపు ప్రయివేటు పాఠశాలల్లో కృత్రిమ మేధ సహాయంతో పాఠాల బోధన, మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా సరళీకృత ఆర్థిక, వ్యాపార, సాంకేతిక విధానాలు విస్తృతమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో నేటి సమాజంలో పేద పిల్లల భవిష్యత్తును నిర్ణయించే ఇంగ్లీష్ విద్యతో పాటు, ఒకటవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులకు ప్రభుత్వ వృత్తి విద్యా సంస్థల కోర్సుల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% ప్రత్యేక రిజర్వేషన్‌కు భరోసా ఇచ్చే చట్టం చేయాలి.
మామిడి నారాయణ
వ్యాసకర్త ‘సెంటర్ ఫర్ బెటర్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్’ వ్యవస్థాపక చైర్మన్ ‘ 94410 66032