
విశ్లేషణ
వైఎస్సార్ మన నుంచి దూరమై నేటికి 16 సంవత్సరాలు. సంక్షేమం, అభివృద్ధి, దూరదృష్టి, విలువలు, విశ్వసనీయత, ఆదర్శ రాజకీయాలు వంటి మాటలు విన్నప్పుడల్లా ఆయనే గుర్తొస్తారు. ఆయన దూరదృష్టితో తీసుకున్న అనేక నిర్ణయాలు అద్భుత ఫలితాలనిచ్చాయి. జలయజ్ఞం అందుకు ఒక మంచి ఉదాహరణ. పోల వరం ప్రాజెక్టుకు నేడు జాతీయ హోదా రావడానికి నాడు అన్ని అనుమతులూ సాధించడం, కుడి– ఎడమ కాల్వల నిర్మాణం ప్రారంభించడం వల్లనే సాధ్యమయ్యింది.
నేటి ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనే పట్టిసీమ కూడా వైఎస్ కుడి కాలువను సింహభాగం పూర్తి చేసినందు వల్లే సాధ్యం అయ్యింది. దక్షిణ తెలంగాణ కోసం పాలమూరు– రంగారెడ్డి, దిండి; రాయల సీమ కోసం శంకుస్థాపనకి మాత్రమే పరిమితం అయిన గాలేరు– నగరి, హంద్రీ–నీవా, పోతిరెడ్డి పాడు వెడల్పు; ప్రకాశం జిల్లా కోసం వెలుగొండ; కృష్ణా డెల్టా కోసం పులిచింతల; హైదరాబాద్ శాశ్వత నీటి సమస్య పరిష్కారం కోసం గోదావరి నీటి సరఫరా; ఉత్తరాంధ్ర కోసం ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’ ప్రాజెక్టులు రూపకల్పన చేశారు కాబట్టే నేడు ప్రభుత్వాలు వాటి కోసం నిధులు ఖర్చు చేయడం, ప్రజలు అడగడం సాధ్యమవుతోంది.
సంక్షేమం – అభివృద్ధి
వైఎస్సార్ అనగానే గుర్తుకు వచ్చేది సంక్షేమ పథకాలు. వాటిని రాజకీయ ప్రత్యర్థులు ఎన్నికల తాయిలాలని విమర్శించారు. కానీ వైఎస్సార్ అమలు చేసిన ప్రతి సంక్షేమ పథకానికీ ఒక శాస్త్రీయ పరిశీలన, హేతుబద్ధమైన కారణం కనిపిస్తుంది. తాను ముఖ్యమంత్రి అయిన తరువాత రైతుల ఆత్మహత్యలకు కారణాలు, నివా రణ చర్యలు సిఫార్సు చెయ్యమని ‘ఆచార్య జయతీ ఘోష్ కమిషన్’ను నియమించారు.
రైతుల ఆత్మహత్యలకు వ్యవసాయ సమస్యలే కారణం కాదనీ, విద్య, వైద్యం వంటివి కార్పొరేట్‌ల చేతుల లోకి వెళ్లడం వల్ల రైతులు మరిన్ని అప్పులు చేయవలసివచ్చి ఆత్మ హత్యలకు పాల్పడ్డారనీ కమిషన్ పేర్కొంది. దీంతో వైఎస్సార్ ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’, ‘ఆరోగ్య శ్రీ’ పథకాలను ప్రవేశపెట్టారు.
వైఎస్సార్ తరహాలోనే జగన్‌మోహన్ రెడ్డి కూడా ‘రైతు భరోసా’, ‘అమ్మ ఒడి’, ‘నాడు–నేడు’ వంటి పథకాలు అమలు చేశారు. ఇవి చూడటానికి సంక్షేమ పథకాలు అనిపిస్తున్నా, ఈ పథ కాల వల్ల రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి.
వైఎస్సార్ ఐదు సంవత్సరాల (స్వల్ప కాలపు) పాలనలోనే అనేక దీర్ఘకాలిక ఆలోచనలు మనకు ప్రతి అంశంలోనూ కనిపి స్తాయి. భవిష్యత్తు మొత్తం నగరాల చుట్టూ ఉంటుందని నాడే ఆయన గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ విశాఖ, గుంటూరు – విజయవాడ, గ్రేటర్ వరంగల్, గ్రేటర్ తిరుపతి ఏర్పాటు ఆలోచన వైఎస్సార్‌దే!
ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పారిశ్రామిక మార్పులను గమనంలో ఉంచుకుని ‘సెజ్’లకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. విదేశాలకు మనం వెళ్ళడం కాదు, మనం తగిన వాతావరణం సృష్టిస్తే విదేశీ కంపెనీలు మన దగ్గరకు వస్తాయని భావించి పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేశారు. ‘శ్రీ సిటీ’ ఆయన కలకు ప్రతిరూపమే!
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని జగన్‌మోహన్ రెడ్డి కూడా తన పాలనలో ప్రజలకు అత్యంత కీలకమైన విద్య, వైద్యాలకు ప్రాధాన్యం ఇచ్చారు. విద్యారంగంలో ‘నాడు–నేడు’ పేరుతో వేల కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభుత్వ విద్యకు నాణ్యతా ప్రమాణాలు కల్పించారు. ఆంగ్ల మాధ్యమాల్లో చదువులు ఏర్పాటు చేస్తే అంతర్జాతీయ అవకాశాలను మన యువత అందుకుంటారని జగన్ భావించారు.
వైద్యం పేదలకు అందుబాటులోకి రావాలంటే వైద్యశాలలను మెరుగు పరచడంతో పాటు, డాక్టర్ల నియామకం అత్యంత కీలకం అని గుర్తించారు. ప్రతి జిల్లాకూ ఒక మెడికల్ కళాశాల, దానికి అనుబంధంగా హాస్పిటల్ ఏర్పాటు జరిగితే డాక్టర్ల కొరత తీరి ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించవచ్చని భావించారు. ఆ దిశగానే నాడు వైఎస్సార్, నేడు జగన్ అడుగులు వేశారు. ప్రజలకు ఎనలేని సేవ చేశారు.
మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి
వ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరం
సమన్వయ కర్త