వైఎస్‌ ఏం చేయలేదనీ... | Sakshi Guest Column On YS Rajasekhara Reddy Vardhanthi | Sakshi
Sakshi News home page

వైఎస్‌ ఏం చేయలేదనీ...

Sep 2 2025 6:07 AM | Updated on Sep 2 2025 6:07 AM

Sakshi Guest Column On YS Rajasekhara Reddy Vardhanthi

అభిప్రాయం

ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ, సోనియా గాంధీ వంటి వారు ఎంత కృషి చేసినా 2003 ఆరంభం నాటికి కూడా ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ చావు బతుకుల్లోనే ఉండేది. తొమ్మిదేండ్ల చంద్రబాబు పాలనతో రాష్ట్రం ఆత్మహత్యల రాష్ట్రంగా మారిపోయింది. 

ఆ స్థితిలో ‘పాదయాత్ర’ అనే ప్రజాసమస్యల అవగాహనా యాత్రతో, ‘జైత్ర యాత్ర’ అనే పార్టీ చైతన్య యాత్రతో జనంలో నమ్మకాన్ని కలిగించి, కాంగ్రెస్‌ పార్టీకి ప్రాణం పోసి, బలం చేకూర్చారు వైఎస్‌ రాజశేఖర రెడ్డి. ఇక, 2004లో అత్యధిక మెజారిటీతో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారం పొందేట్లు చేశారు; సీఎం కూడా అయ్యారు. 2009 నాటి జనరల్‌ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్‌ పార్టీ విజయఢంకా మోగించేటట్లు చేశారు.

‘పల్లెబాట’, ‘నగర బాట’, ‘రైతు బాట’, ‘ప్రాజెక్టుల బాట’ వంటి కార్యక్రమాలతో ఎల్లప్పుడూ జనంలో ఉంటూ, పార్టీని మరింత బలోపేతం చేస్తూ అన్ని వర్గాల ప్రజల అవస రాల్ని తీర్చడానికి కృషి చేశారు. సీఎం కావడంతోటే వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇచ్చారు. రైతుల విద్యుత్‌ బకాయిలు రద్దు చేశారు. సబ్సిడీపై పంట విత్తనాలు, గడ్డి విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల్ని ఇచ్చారు. 

విత్తనాల కోసం ‘సీడ్‌ విలేజ్‌’లను ఏర్పరచారు. పంటల బీమా పథకం ప్రవేశపెట్టారు. పంట నిల్వలకు ‘రైతు బంధు’ పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతుల శిక్షణకై ‘పొలం బడి’ కార్యక్రమం చేపట్టారు. వ్యవసాయాభివృద్ధికై ‘వ్యవసాయ టెక్నాలజీ మిషన్‌’ ఏర్పరచారు. ‘పని గ్యారంటీ’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి పేదలకు జీవన సమస్య లేకుండా చేయడానికి కృషి చేశారు. మధ్యతరగతి గృహ అవసరాల్ని ‘రాజీవ్‌ గృహ కల్ప’ ద్వారా తీర్చ డానికి ప్రయత్నించారు.

డ్వాక్రా సభ్యులైన మహిళలందరికీ పావలా వడ్డీకే రుణాలిచ్చి వారి కుటుంబాల ఆర్థిక అభివృద్ధికై కృషి చేశారు. ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీ, ఐటీఐ లను నెలకొల్పారు. హైదరాబాద్‌లో బిట్స్‌ క్యాంపస్‌ ఏర్పాటు చేశారు. ‘జవహర్‌ నాలెడ్జ్‌ సెంట ర్‌’లు, ఇరవై ఒకటవ శతాబ్ది గురుకులాలు, పలు మెడికల్, డెంటల్, ఇంజినీరింగ్‌ కాలేజీల్ని ఏర్పరచారు. భారీ, మధ్యతరహా, చిన్నతరహా పరిశ్రమల స్థాపనకు కృషి చేశారు. 

వ్యవసాయేతర అవసరాలకు ఛార్జీలు పెంచకుండానే విద్యుత్‌ సరఫరా చేశారు. వ్యాపార, వాణిజ్యాల అభివృద్ధికై రోడ్ల సౌకర్యాల్ని పెంచారు. తీర జిల్లాల్లో ఓడరేవుల నిర్మాణానికై కృషి చేశారు. నగరాల్లో ‘108’ అంబులెన్సుల్ని, పల్లెల్లో ‘104’ అంబులెన్సుల్ని ఏర్పరచారు. 

ఇలా, పలు అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్ర రాజకీయాల్లో రాకెట్టులా దూసుకెళ్ళారు వైఎస్సార్‌. ఇంతటి అవగాహనతో ప్రజా సమస్యల పరిష్కారం జరిపి సామాన్య జనం కూడా మేమూ సంతోషంగా బతకగలం అనే ధీమా కల్పించిన వైఎస్‌ లేకపోవడం దురదృష్టకరం. అయితే, జనంలో ఆయనపై అభిమానం సడలస లేదనేది సుస్పష్టం. ఆయనపై గల విశ్వాసం, నమ్మకం, అభిమానం ఇప్పుడు జనం జగన్‌పై చూపుతున్నారు. 

డా‘‘ దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి 
వ్యాసకర్త రిటైర్డ్‌ ప్రొఫెసర్, చరిత్ర శాఖ, ఎస్వీ యూనివర్సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement