
తెలంగాణకు పదేళ్లు తానే ముఖ్యమంత్రినంటూ ఎనుముల రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన సహజంగానే కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. చర్చోపచర్చలకు దారితీసింది. అది కాంగ్రెస్ పార్టీ విధానం కాదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్‌ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరని కూడా అన్నారు. ఇది కాస్తా తెలంగాణ అధికార పార్టీ రాజకీయాలలో కొత్త వివాదానికి తెరదీసింది.
నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ '2034 వరకు అంటే.. పదేళ్లపాటు పాలమూరు బిడ్డ సీఎంగా ఉంటాడు. కేసీఆర్.. ఈ విషయాన్ని డైరీలోనో.. నీ గుండెలపైనో రాసుకో" అని సవాల్ విసిరారు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతానని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ప్రజలకు, ఒక ప్రాంతానికి ఇచ్చిన హామీలను నెరవేర్చుతానని చెప్పడం వరకు ఓకే. వచ్చే తొమ్మిదేళ్లు కూడా తానే సీఎం అని చెప్పడం తనపై తనకు ఉన్న నమ్మకం కావచ్చు. కానీ కాంగ్రెస్‌లో అలా బహిరంగంగా చెప్పడానికి పార్టీ అధిష్టానం కాని, ఇతర నేతలు కాని ఇష్టపడరు. రాజగోపాలరెడ్డి అభిప్రాయం కూడా అదే.
కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం నిర్ణయం ప్రకారం ప్రజాస్వామ్యయుతంగా సీఎంను నిర్ణయిస్తారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో ఈ విధానం ఉన్న మాట నిజమే కాని, కేంద్రంలో అధికారం లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అధిష్టానం పెద్దలు కూడా సీఎంల మార్పుపై సంచలన నిర్ణయాలు చేసే పరిస్థితి పెద్దగా కనబడదు. కర్ణాటక వ్యవహారమే దీనికి ఉదాహరణ. అక్కడ ముఖ్యమంత్రి సిద్దరామయ్యను మార్చాలని, తనను సీఎంను చేయాలని ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ డి.కె.శివకుమార్ కోరుకుంటున్నారు. అయినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలు ఇందుకు సాహసించడం లేదు. పైగా ఈ ఐదేళ్లు సిద్దరామయ్య కొనసాగవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. దానికి అక్కడ ఉండే రాజకీయ, సామాజిక అంశాలు కారణాలు కావచ్చు. అయితే..
సిద్దరామయ్య కూడా వచ్చే ఎన్నికల తర్వాత కూడా తానే సీఎం అని చెప్పుకోవడం లేదు. కానీ రేవంత్ ధైర్యంగా 2028 ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, తిరిగి తానే సీఎం అవుతానని చెబుతున్నారు. తన వర్గంలో విశ్వాసం పెంచడానికి ఇది ఉపయోగపడవచ్చు కానీ, పార్టీలోని ఇతర వర్గాలలో ఇది అసహనానికి కారణం అవుతుంది.
కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న అభ్యర్ధులు ఎక్కువే. 2014లో అయితే డజను మంది తామే అభ్యర్థులమంటూ ప్రచారం చేసుకున్నారు. అందుకే కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్(బీఆర్‌ఎస్) విలీనం కాకుండా అడ్డుపడ్డారు. కేసీఆర్ తనకు సీఎం పదవి ఇస్తే విలీనం చేస్తానని కండిషన్ పెట్టారు. చివరికి ఒంటరిగా పోటీచేసి విజయం సాధించడంతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. పదేళ్లు ఆ పరిస్థితి కొనసాగడంతో కాంగ్రెస్ నేతలు నిరాశలో మునిగిపోయారు.
2018 ఎన్నికలకు కొద్దికాలం ముందు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. తదుపరి వర్కింగ్ అధ్యక్షుడుగా, అనంతరం పీసీసీ అధ్యక్షుడుగా నియమితులయ్యారు. ఎమ్మెల్యే ఎన్నికలలో ఓటమి పాలైనా, మల్కాజిగిరి ఎంపీగా గెలవడం ఆయనకు కలిసి వచ్చింది. ఢిల్లీ స్థాయిలో పార్టీ నాయకత్వంతో సంబంధాలు పెట్టుకోగలిగారు. పార్టీ సీనియర్ నేతలు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, తదితరులు తొలుత రేవంత్ నాయకత్వానికి సుముఖత చూపలేదు. తప్పని స్థితిలో ఒప్పుకున్నారు. రేవంత్ నియామకంపై కోమటి రెడ్డి వెంకట రెడ్డి వంటివారు గట్టి విమర్శలే చేసేవారు. ఆయన సోదరుడు రాజగోపాల రెడ్డితో కలిసి తమకు పీసీసీ బాధ్యతలు అప్పగిస్తే అధికారం సాధిస్తామని చెప్పినా అధిష్టానం వారివైపు మొగ్గు చూపలేదు. ఒక దశలో కాంగ్రెస్ నాయకత్వం అప్పటి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ఎదుర్కోవడానికి సరైన చర్య తీసుకోవడం లేదంటూ రాజగోపాల రెడ్డి పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఇందుకోసం ఆయన తన ఎమ్మెల్యే పదవి కూడా వదలుకున్నారు. తదుపరి ఉప ఎన్నికలో ఆయన ఓటమి చెందారు.
ఆ తర్వాత మళ్లీ 2023 జనరల్ ఎన్నికలు వచ్చేసరికి తిరిగి కాంగ్రెస్‌లో చేరిపోయి మునుగోడు నుంచే పోటీచసి విజయం సాధించారు. ఈయన సోదరుడు, సీనియర్ నేత వెంకట రెడ్డి నల్గొండ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. రాజగోపాలరెడ్డి కూడా మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు. అధిష్టానం కూడా ఆయనను బుజ్జగించే యత్నం చేసింది. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారన్న భావనతో ఆయనకే సీఎం పదవి అప్పగించింది. మల్లు భట్టి సీఎం రేసులో నిలిచినా ఉప ముఖ్యమంత్రి పదవితో సర్దుకోక తప్పలేదు. అలాగే ఉత్తంకుమార్ రెడ్డి, వెంకట రెడ్డి తదితర ఆశావహులు కూడా రాజీపడి రేవంత్ కేబినెట్లో మంత్రులుగా చేరిపోయారు. అయినా వీరిలో కొందరు రేవంత్ పై ఎప్పటికప్పుడు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారట. రేవంత్ ప్రభుత్వం చేసే తప్పులను, వచ్చే ఆరోపణలను తెలియ చేస్తున్నారట. రేవంత్ కూడా అంతకన్నా తెలివిగా అధిష్టానంతో సంబంధాలు కొనసాగిస్తున్నందున ఇప్పటికైతే ఆయనను కదలించే శక్తి ఇతర కాంగ్రెస్ నేతలకు ఉన్నట్లు కనిపించదు.
కాంగ్రెస్ రాజకీయాలలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. అది వేరే సంగతి. కాంగ్రెస్ రాజకీయాలు చూస్తే ఉమ్మడి ఏపీలో పూర్తి టర్మ్ పదవి కాలంలో ఉన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే కావడం విశేషం. 2004లో ఆయన నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా కొందరు ఇతర నేతలు సీఎం పదవి కోసం పోటీ పడకపోలేదు. కానీ అధిష్టానం వైఎస్ నాయకత్వానికి అంగీకరించక తప్పలేదు. అలాగే 2009లో రెండోసారి గెలిచిన పిమ్మట అప్పటి పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కూడా తనకు సీఎం పదవి కావాలని ప్రకటన చేశారు. అయినా వైఎస్సార్‌కే సీఎం సీటు తిరిగి దక్కింది.
1956 లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవరెడ్డి దాదాపు మూడేళ్ల తర్వాత కేంద్ర రాజకీయాలకు వెళ్లారు. దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యారు. 1962లో నీలం సంజీవరెడ్డి మళ్లీ సీఎం అయ్యారు కాని పూర్తి టర్మ్ ఉండలేదు. 1964లో ముఖ్యమంత్రైన కాసు బ్రహ్మానందరెడ్డి 1967 ఎన్నికల తర్వాత తిరిగి ఆ పదవి చేపట్టినా, పూర్తి కాలం కొనసాగలేకపోయారు. తరువాత పీవీ నరసింహారావు ముఖ్యమంత్రి అయ్యారు. జై ఆంధ్ర ఉద్యమం కారణంగా ఆయన 1972లో పదవి వదలు కోవల్సి వచ్చింది. కొంతకాలం రాష్ట్రపతి పాలన తర్వాత సీఎం అయిన జలగం వెంగళరావు 1978 వరకు కొనసాగారు. ఆ తరుణంలో పార్టీలో వచ్చిన చీలికలో 1978లో మర్రి చెన్నారెడ్డి ఇందిరా కాంగ్రెస్ పక్షాన సీఎం అయ్యారు. 1978-83 మధ్య చెన్నారెడ్డి, అంజయ్య, భవనం వెంకటరామి రెడ్డి, కోట్ల విజయ భాస్కరరెడ్డిలు సీఎం పదవులు నిర్వహించారు. 1983లో ఎన్టీఆర్ స్థాపించినన టీడీపీ అధికారంలోకి వచ్చింది. తిరిగి 1989లో కాంగ్రెస్ గెలుపొందడంతో 1989-94 మధ్య చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రులయ్యారు. 1994 లో ఓటమి పాలైన కాంగ్రెస్ మళ్లీ 2004లో అధికారంలోకి వచ్చాక వై ఎస్ సీఎం అయ్యారు. 2009లో తిరిగి ఆయన ముఖ్యమంత్రయ్యాక అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రులు అయ్యారు. అంటే వైఎస్సార్ తప్ప ఏ ఒక్క కాంగ్రెస్ సీఎం కూడా పూర్తి టర్మ్ పాలించలేదన్నమాట.
2014లో రాష్ట్ర విభజన జరగడంతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా దెబ్బతినిపోగా, తెలంగాణలో పదేళ్లపాటు అధికాంలోకి రాలేదు. 2023లో రేవంత్ సీఎం అయిన తర్వాత కొంత స్వతంత్రంగా ప్రభుత్వాన్ని, పార్టీని నడపడానికి యత్నిస్తున్నారు. తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తి అవడంతో మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న వ్యక్తులు రేవంత్‌ను ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడుగానే చూస్తుంటారు. ఆయన కూడా అప్పడప్పుడు చంద్రబాబును ప్రశంసించినట్లు మాట్లాడుతుంటారు. నాగర్ కర్నూల్ సభలోనూ చంద్రబాబు ప్రస్తావన తెచ్చి మహబూబ్ నగర్ జిల్లాలో వివిధ ప్రాజెక్టులు చేపట్టినట్లు మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించలేదు. అప్పుడప్పుడూ వైఎస్ పేరును ప్రస్తావిస్తున్నా, కాంగ్రెస్ వర్గాలకు అంత సంతృప్తి కలిగించే రీతిలో మాట్లాడడం లేదన్న భావన ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి తన వ్యాఖ్యలో నిఖార్సైన కాంగ్రెస్ నేతలు సీఎం చేసిన వ్యాఖ్యలను అంగీకరించరని అన్నారు.
సాధారణంగా.. జాతీయ పార్టీలలో హై కమాండ్ దే తుది నిర్ణయం అనే సంగతి తెలిసిందే. అయితే ఇది పరిస్థితులను బట్టి, రాజకీయ పరిణామాలను బట్టి, ఆయా వ్యక్తుల బలాబలాలను బట్టి ఉంటుంది. ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ బలంపై కూడా ఆధారపడి ఉంటుంది. రేవంత్ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో తనకు ఎక్కువ మద్దతు ఉండేలా చూసుకుంటున్నారు. అందువల్ల అధిష్టానం కూడా తొందరపడే పరిస్థితి ఉండదు. ఆ ధైర్యంతోనే రేవంత్ భవిష్యత్తులో కూడా తానే సీఎం అని చెప్పుకుని ఉండవచ్చు. రేవంత్ పై అసహనం వ్యక్తం చేయడం మినహా, అసమ్మతి ఉన్న కాంగ్రెస్ నేతలు ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేకపోవచ్చు.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.