
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ లేని కాంగ్రెస్ ప్రభుత్వం.. విజయోత్సవాలు చేయడం విడ్డూరంగా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మంగళవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇబ్రహీంనగర్ బస్తీ దవాఖానాను సందర్శించి.. అక్కడి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఫిరాయింపుల వ్యవహారంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డిపైనా ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీకి అసలు నీతి ఉందా?. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్స్ లిస్ట్‌లో దానం నాగేందర్ పేరు చేర్చటం సిగ్గు చేటు. దానం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని ఎవరు చెప్పారు?. పార్టీ మారలేదని స్పీకర్ దగ్గర అబద్దాలు చెప్తున్నారు. పార్టీ మారినోళ్ళకు సిగ్గు లేదు. ఏ పార్టీలో ఉన్నామో చెప్పే దమ్ము లేదు. ఆ దమ్మే ఉంటే స్వయంగా చెప్పొచ్చు కదా అని కేటీఆర్ నిలదీశారు.
AICC అంటే.. ఆల్ ఇండియా కరపర్షన్ కమిటీ. విజయోత్సవాలు ఎందుకు చేయోలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. ప్రజారోగ్యం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెక్కలేదు. రాజకీయాలు కాదు.. ముఖ్యమంత్రి ప్రజల ప్రాణాలను పట్టించుకోవాలి. మున్సిపల్ మంత్రి లేక.. పట్టించుకునే వారు లేక హైదరాబాద్ అనాధగా మారింది. హైదరాబాద్ సిటీ చెత్త చెదారంతో నిండిపోయింది.
పట్టణంలో ఉండే పేదల కోసమే కేసీఆర్ 450 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో బస్తీ దవాఖానలకు సుస్తీ చేసింది. కనీస మందులు కూడా అందుబాటులో లేవు. ఇది ప్రభుత్వానికి గుర్తు చేయటం కోసమే ఆకస్మిక తనిఖీలను చేపట్టాం. బస్తీ దావాఖాన సిబ్బందికి తక్షణమే జీతాలు ఇవ్వాలి. ఆశా వర్కర్లు, అంగన్ వాడీ సిబ్బందికి జీతాలు పెంచాలి. కేసీఆర్ ముందు చూపుతో.. కరోనా సమయంలో కూడా ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులు పడలేదు. వైద్య పరీక్షలు ఉచితంగా చేసే టీ డయాగ్నస్టిక్స్ ను అందుబాటులోకి తీసుకురావాలి నిర్మాణ పనులు పూర్తి చేయకుంటే.. టిమ్స్ ఆసుపత్రుల ముందు వెయ్యి మంది దర్నా చేస్తాం అని కేటీఆర్ హెచ్చరించారు.

అటు శేరిలింగంపల్లి బస్తీ దవాఖానాను పరిశీలించిన తర్వాత హరీష్‌రావు మాట్లాడారు. ‘‘పేదల ఆరోగ్యంపై రేవంత్‌కు శ్రద్ధ లేదు. బస్తీ దవాఖానాల్లో బీపీ మిషన్లు పని చేయడం లేదు. కేసీఆర్‌పై కోపంతో కేసీఆర్ కిట్ పథకం తీసేశారు. జనం మద్యం తాగాలి.. ఖజానా నిండాలి అన్నదే సీఎం ఆలోచనగా కనిపిస్తోంది అని హరీష్ విమర్శించారు.