
విశ్లేషణ
దేశవ్యాప్త వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ)ని ఎనిమిదేళ్ళ క్రితం అట్టహాసంగా ప్రారంభించారు. ఆ సందర్భంగా అర్ధరాత్రి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని కూడా నిర్వహించారు. దేశాన్ని ఉమ్మడి ఆర్థిక మార్కెట్‌గా ఏకీకృతం చేసే చారిత్రక సంస్కరణగా దాన్ని కొనియాడారు. పరోక్ష పన్నులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెస్తున్నామన్నారు. ఘర్షణలు, ఎగవేతలను నిర్మూలిస్తుందని చెప్పారు.
ఎక్సైజ్, సర్వీసు పన్నులను విధించే హక్కును కేంద్ర ప్రభుత్వం వదులుకోవడంతో సాయలాపాయలాగా కుదుర్చుకున్న వ్యవహారంగా జీఎస్టీ సంస్కరణ ఆమోదం ఖ్యాతికెక్కింది. దానికి తగ్గట్లుగానే అన్ని రాష్ట్రాలూ రాష్ట్ర స్థాయిలో విధించే అమ్మకం పన్నులు, విలువ–జోడింపు పన్ను, ఆక్ట్రాయ్ వంటి ఇతర చిన్నా చితకా పన్నులను విధించే హక్కును కేంద్రానికి దత్తం చేశాయి.
రాష్ట్రాలకు పన్నుల రాబడులలో ఏర్పడే లోటును తాము భర్తీ చేస్తామని కేంద్రం వాగ్దానం చేయడం వల్ల ఆ రాజీ బేరం కుదిరింది. రాష్ట్రాలు పన్నుల విధింపులో ఉన్న స్వయం ప్రతిపత్తిని త్యాగం చేశాయి. దీన్ని 2017 నాటి తొలి చట్టంలో జీఎస్టీ పరిహార క్లాజుగా చేర్చారు. ఆ క్లాజు గడువు 2022తో పూర్తయింది. ఇపుడు జీఎస్టీలో తమ వాటా ఒక్కసారిగా బాగా తగ్గిపోయే ప్రమాదం ఉందని రాష్ట్రాలు భయపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ‘దీపావళి కానుక’గా జీఎస్టీలో పెద్ద సంస్కరణనే తీసుకురానున్నట్లు ప్రకటించడం హర్షణీయం. తదుపరి సంస్కరణలు సాధారణ ప్రజానీకంపై, ముఖ్యంగా మధ్యతరగతి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలపై పన్ను భారాన్ని తగ్గించేవిగా ఉంటాయని ఆయన వాగ్దానం చేశారు. సంస్థాగత సంస్కరణలు, రేటు హేతుబద్ధీకరణ, బతుకు తెరువును సులభతరం చేయడమనే మూడు అంశాలను ప్రభుత్వం పరిగణించవచ్చు.
పుట్టుకలోనే లోపాలు
రూపకల్పన, అమలులో కూడా ఏకీకృత, దేశవ్యాప్త, పరోక్ష పన్నుగా జీఎస్టీ పుట్టుకలోనే కొన్ని లోపాలున్నాయని చెప్పక తప్పదు. రూపకల్పనలోని లోపం ఏమిటంటే, జీఎస్టీ వంటి పరోక్ష పన్ను అంతర్గతంగానే తిరోగమనమైనది. ఒక వ్యక్తి చెల్లించే పన్ను ఆ వ్యక్తి ఆదాయంపైన కాక, కొనే వస్తువు విలువపై ఆధారపడి ఉంటుంది. కనుక, జీఎస్టీ మంట ధనికుల కన్నా పేదలకు ఎక్కువ తెలుస్తుంది. ఆదాయ పన్ను, సంపద పన్ను వంటి ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నుల కన్నా ఔచిత్యంతో కూడినవిగా ఉంటాయి. మీ పన్ను ఆదాయంతోపాటే పెరుగుతుంది. ఆదాయం తగ్గితే పన్ను ఉండదు.
జీఎస్టీలోని అసమంజసత్వాన్ని తగ్గించేందుకు బహుళ శ్లాబులు పెట్టారు. పేదలు కొనే వస్తువులను సున్నా లేదా 5 శాతం శ్లాబులో పెట్టారు. ధనికులు కొనే వస్తువులను హెచ్చు శ్లాబులో పెట్టారు. ఇది ఒక రకంగా పేదలు ఏ వస్తువులను వాడాలో శాసించడమవుతుంది.
సాధారణంగా ఆహారం, ఔషధాలను పన్నుల నుంచి మినహా యించే విధానం ప్రపంచ వ్యాప్తంగా అమలులో ఉంది. అన్ని వస్తు వులు, సేవలకు ఒకే రేటు ఉండటం హేతుబద్ధమైన, సమర్థమైన వ్యవస్థ అనిపించుకుంటుంది. యూరోపియన్ యూనియన్ దేశాలు, సింగపూర్, ఆస్ట్రేలియాలలో అది కనిపిస్తుంది. మధ్యస్థ రేటు ఉండా లన్నది స్థూలంగా అంగీకరించే సూత్రం. (ఆహారం, ఔషధాలు వంటి) అత్యవసర వస్తువులపై చాలా తక్కువగా, (పొగాకు, మద్యం వంటి) వ్యసన, విలాస వస్తువులపై చాలా ఎక్కువగా ఉంటుంది.
సులభతర శ్లాబులు మేలు
ఇక అమలులో లోపాల గురించి ముచ్చటించుకుందాం. జీఎస్టీ బహుళ పన్ను శ్లాబుల (0 శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం, పాప కార్యాల కింద వచ్చే వాటిపై వేసే పన్ను, వివిధ సెస్సులు)తో కూడిన సంక్లిష్ట వ్యవస్థ. ఈ సంక్లిష్టత, వస్తువులు, సేవల వర్గీకరణ, పన్ను చెల్లింపుదారులలో అయోమయం, వ్యాజ్యాలు వంటి వివాదాలకు దారితీస్తోంది. అంతిమ వస్తువుల పైన కన్నా ఆ యా వస్తువులను తయారు చేసేందుకు ఉపయోగించే వస్తువులపై పన్ను రేట్లు అధికంగా ఉన్న దృష్టాంతాలు కూడా ఉన్నాయి. ఇది దేశంలో వస్తూత్పత్తిని నీరుగారుస్తోంది.
వ్యవసాయం, పెట్రోలు ఉత్పత్తులు, విద్యుచ్ఛక్తి, ఆల్కహాల్, స్థిరాస్తుల రంగం వంటి జీడీపీలోని పెద్ద భాగాలు... జీఎస్టీ పరిధికి బయటనే కొనసాగుతున్నాయి. కొన్నింటికి మినహాయింపు ఇవ్వడం వల్ల రెవెన్యూ తగ్గుతుంది. జీఎస్టీ సంస్కరణలోని స్ఫూర్తి దెబ్బతింటోంది. చిన్న వ్యాపారాల వారు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల వారిపై భారం పడుతోంది. కారణం– వారు వెంటనే జీఎస్టీ చెల్లించాల్సి రావడం, వారి ఖాతాదారులు చెల్లింపులలో జాప్యం చేయటం! రిఫండులలో జాప్యాలు ఉండనే ఉన్నాయి. ఇవి వ్యాపారు లకు చేతిలో నగదు ఆడకుండా చేస్తున్నాయి.
ప్రధాని ప్రకటించిన ప్రతిపాదిత సంస్కరణల్లో ఒకటి గణ నీయమైన మార్పు తీసుకురాగల ఆశ రేపుతోంది. అది ప్రస్తుత బహుళ శ్లాబుల పద్ధతిని రద్దు చేసి, రెండు (స్టాండర్డ్, మెరిట్ ) రేట్ల శ్లాబుల సులభతర విధానానికి మళ్ళడం! కొన్ని ఎంపిక చేసిన వస్తువులపైన మాత్రం ప్రత్యేక రేట్లు ఉంటాయి. వ్యాజ్యాలతోపాటు, వర్గీకరణకు సంబంధించిన వివాదాలు తగ్గుతాయి. దైనందిన వాడుక వస్తువులు, జనం సమకూర్చుకోవాలని ఆశపడే వాటిపై పన్ను రేటు తగ్గుతుందని భావిస్తున్నారు.
వినిమయం పెరగడం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ రేట్లు తగ్గించడం వల్ల భారతదేశపు ఎగుమతుల పోటీ సామర్థ్యం పెరుగుతుంది. దేశంలో ఉద్యోగాల కల్పనకూ సాయపడుతుంది. మధ్యస్థ రేటును మరీ భారం మోపేదిగా ఉన్న 18 శాతంగా కాక 15 శాతంగా నిర్ణయించవచ్చు. పన్నుల సంస్కరణలపై ఏర్పాటు చేసిన కేల్కర్ సత్వర కార్యాచరణ బృందం సిఫార్సు చేసినట్లుగా దాన్ని 15 శాతంకన్నా తక్కువగా 12 శాతంగా నిర్ణయిస్తే ఇంకా బాగుంటుంది.
రాష్ట్రాలకు చేయి తిరిగేలా...
చివరగా, ఫెడరలిజంలో (ఆరోగ్యం, విద్య వంటివాటిపై) వ్యయాల బాధ్యతలను రాజ్యాంగం రాష్ట్రాల పైనే మోపింది. కానీ, స్వతంత్ర ఆదాయ వనరులను మాత్రం కొద్దిగానే కల్పించింది. ఈ అసమతౌల్యాన్ని జీఎస్టీ ఇంకా పెంచి, కేంద్ర బదలాయింపులపైనే రాష్ట్రాలు ఎక్కువగా ఆధారపడక తప్పని స్థితి కల్పించింది. స్థానిక అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి నిధుల సమీకరణకు రాష్ట్రాలకు పన్నులు విధించే అధికారం కొంత కావాలి. జీఎస్టీ భారతదేశపు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసిందనే అభిప్రాయం ఒకటి ఉంది.
రాష్ట్రాలకు కోశాగారాన్ని విస్తరించుకునే, స్వయం ప్రతిపత్తిని కల్పించే అవకాశాన్ని పునరుద్ధరించేందుకు అన్వేషించవలసిన అవసరం ఉంది. ఫలితంగా, రాష్ట్రాలు వాటి నిర్దిష్ట ఆర్థిక, సామా జిక, ప్రాంతీయ అవసరాలకు తగ్గట్లుగా విధానాలు రూపొందించు కోగలుగుతాయి. అసమానతలను తగ్గించేందుకు, ప్రస్తుతం పరోక్ష పన్నుల వైపు తూగిన తక్కెడను ప్రత్యక్ష పన్నుల వైపు మొగ్గే విధంగా చేయాల్సిన అవసరం కూడా ఉంది.
అజీత్ రానాడే
వ్యాసకర్త ఆర్థికవేత్త
(‘దక్కన్ హెరాల్డ్’ సౌజన్యంతో)