
నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం
సందర్భం
ఆరోగ్య రక్షణ రంగంలో గడచిన దశాబ్దంలో భారతదేశం మెచ్చుకోదగిన విధంగా ముందంజ వేసింది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను పటిష్ఠపరచింది. మాతా, శిశు మరణాల రేటును తగ్గించింది. ప్రమాణాలతో కూడిన ఆరోగ్య రక్షణను అందరికీ అందుబాటులోకి తేవడంలో పురోగతి సాధించింది. అయినా, అవయవాల మార్పిడికి వచ్చేసరికి, దురదృష్టవశాత్తు, ఒక మౌన సంక్షోభం వేలాది మంది జీవితాలను బలి తీసుకుంటూనే ఉంది.
విస్తృత స్థాయిలో అవయవ దానం అవసరం గురించి చాటి చెప్పేందుకు ‘ప్రపంచ అవయవదాన దినోత్సవం’ మనకొక అవకాశం కల్పిస్తోంది. అవయవ మార్పిడికి అవకాశం లేక ఒక వ్యక్తి ప్రాణాలను కోల్పోవడం కన్నా పెను విషాదం మరొకటి ఉండదు. ప్రాణాలను కాపాడగల అవయవం కోసం ఎదురు చూస్తూ ఏటా దాదాపు ఐదు లక్షల మంది భారతీయులు కన్ను మూస్తున్నారు.
మార్పిడికి అవయవం కొరవడటం వల్ల ఒక తోటి భారతీయుడిని లేదా భారతీయురాలిని కోల్పోవడం ఎంతమాత్రం అంగీకరించదగిన విషయం కాదు. ఎందుకంటే, మనం ఆ మరణాలను నివారించగలిగిన స్థితిలో ఉన్నాం. మనకు వైద్యపర మైన నైపుణ్యం ఉంది. కావాల్సిందల్లా అవయవాల సరఫరాకు, డిమాండ్‌కు మధ్యనున్న వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు జాతీయ స్థాయి సమష్టి సంకల్పమే!
అత్యవసరం – చేదు వాస్తవం
మూత్రపిండాల వ్యాధి చివరి దశలో ఉన్న రోగులు దాదాపు 2,00,000 మంది ఉన్నారు. తీవ్ర కాలేయ వైఫల్యంతో బాధపడు తున్నవారు 50,000 మంది ఉన్నారు. తీవ్ర గుండె జబ్బుతో బాధ పడుతున్నవారు మరో 50,000 మంది ఉంటారు. వారి ప్రాణాలు కాపాడేందుకు అవయవ మార్పిడి అవసరం. దీనికి భిన్నంగా, ప్రతి ఏటా దేశంలో సుమారు 1,600 మూత్రపిండాలు, 700 కాలేయాలు, 300 గుండెల మార్పిడి చికిత్సలు మాత్రమే చోటుచేసుకుంటున్నాయి.
అవసరమైన అవయవం దొరక్క వేచి చూస్తూనే ప్రతి రోజూ కనీసం 15 మంది చనిపోతున్నారు. అవయవ మార్పిడి కోసం ఎదురు చూసేవారి జాబితాలో, ప్రతి 10 నిమిషాలకు, ఒక కొత్త పేరు వచ్చి చేరుతోంది. వారందరి జీవితాలు కొనప్రాణాలతో ఉన్నట్లే లెక్క. చివరి దశ కిడ్నీ సమస్యతో ఉన్నవారిలో 5 శాతం కన్నా తక్కువ మందికే ప్రాణాలు కాపాడగల కిడ్నీ మార్పిడి జరుగుతోంది. గుండె, ఊపిరితిత్తుల పేషెంట్ల పరిస్థితి మరింత హృదయ విదారకం.
ప్రపంచ స్థాయి ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లు మనకి అందుబాటులో ఉన్నా, భారతదేశంలో అవయవ దానం రేటు ప్రపంచంలోనే అతి తక్కువగా (ప్రతి పది లక్షల మంది జనాభాకు కేవలం 0.65 దాతల చొప్పున) ఉంది. దీనికి భిన్నంగా, స్పెయిన్, క్రొయేషియా వంటి చిన్న దేశాల్లో కూడా ప్రతి పది లక్షల మందికి 30కి పైగా దాతలు అందుబాటులో ఉంటున్నారు. ఈ వ్యత్యాసం... భారతదేశంలో అవయ వాల కొరత వైద్యానికి పరిమితమైన అంశం కాదనీ, సామా జిక, విధానపరమైన సవాల్‌గా పరిణమించిందనీ వెల్లడిస్తోంది.
ఒక దాత–ఎనిమిది జీవితాలు!
అవయవ దానం కేవలం ఒక క్లినికల్ ప్రొసీజర్ కాదు. అంతకన్నా మానవతకు అంతిమ ప్రతిచిహ్నం మరొకటి ఉండదు. ఒక దాత దేహం నుంచి గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు, ప్యాంక్రియాస్, కణజాలం వంటివి తీసుకుంటే ఎనమండుగురి ప్రాణాలను కాపాడవచ్చు. ఒక వ్యక్తి అవయవాలను దానం చేస్తే, ఒకరికి మించిన వ్యక్తులకు ప్రాణం పోసినవాళ్ళం అవుతాం. ఇంత కన్నా గొప్ప వారసత్వాన్ని మించి ఎవరైనా ఏమి విడిచి వెళ్ళగలరు?
మనం ఎంత చేయడానికి వీలుందో తెలుసుకునేందుకు సంజయ్ కందసామి కథనమే నిదర్శనం. అతను 1998లో, 20 నెలల శిశువుగా ఉన్నప్పుడు కాలేయ వైఫల్యం చివరి దశతో బాధపడుతూ, ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌లో కాలేయ మార్పిడి చేయించుకున్నాడు. కందసామి తండ్రే తన కాలేయంలో చిన్న ముక్కను దానం చేశాడు. ఈరోజు సంజయ్ డాక్టరుగా ప్రాక్టీసు చేస్తూ అనేక మంది ప్రాణాలను నిలుపుతున్నాడు.
ఇది సైన్స్ గురించిన కథ కాదు. ప్రాణం దక్కించుకునేందుకు ఉన్న రెండవ అవకాశాల గురించిన కథనం. జీవితంపై ఆశలు చిగురింపజేయగల కథనం. ఒక రకంగా జీవితం గురించిన కథే!
ఊహాత్మక అనుమతి – జాతీయోద్యమం
స్థిరంగా ఎదురవుతున్న సవాల్ ఏమిటంటే, ఎవరన్నా తమ అవయవాలను దానం చేయాలని చెప్పి గతించినా కూడా సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు అందుకు అనుమతించేందుకు తిరస్కరిస్తు న్నారు. చైతన్యాన్ని పెంచే ప్రచారాలు, విధానపరమైన మార్పుల ద్వారా ఆ యా కుటుంబాల వైఖరిలో మార్పు తేవాలి. దానం చేయడానికి యోగ్యత ఉన్న వ్యక్తి కుటుంబంతో కరుణామయమైన కమ్యూనికేషన్ నెరపడం చాలా కీలకం.
‘ఊహాత్మక అనుమతి’ భావనను స్వీకరించడం ద్వారా అవయవ దాన వ్యవస్థను నెలకొల్పే విధంగా సాహసోపేతమైన విధాన నిర్ణయం తీసుకోవడం మరొకటి. సింగపూర్, క్రొయేషియా, స్పెయిన్, యూరప్‌లోని ఇతర దేశాలు ఈ విధానాన్ని అనుసరిస్తు న్నాయి. ‘ఊహాత్మక అనుమతి’ కింద, మరణానంతరం ప్రతి వయోజనుడినీ, అతని బంధువుల నిర్ణయంతో సంబంధం లేకుండా, అవయవ దాత కిందే పరిగణిస్తారు.
తన మరణానంతరం కూడా తన అవయవాలను తీసుకోవడానికి లేదని సదరు వ్యక్తి బాహాటంగా నమోదు చేసుకుంటే తప్పించి, ఆ విధానం అమలవు తుంది. యూరప్‌లో ఈ ఊహాత్మక భావన, అవయవ దానాల పెరుగుదలపై సానుకూల ప్రభావం చూపింది. అవయవ దానాలు పెరిగాయి. అవయవ దానాల పట్ల సుముఖతా పెరిగింది.
సాహసోపేతమైన ఆలోచనలను అక్కున చేర్చుకోవడంలో భారతదేశం ఎల్లప్పుడూ ముందుంది. అవయవం దొరకక, మన ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోవడాన్ని మనం ఎంత మాత్రం సహించకూడని సమయం వచ్చేసింది.
ఒక ప్రాణాన్ని నిలబెట్టే కానుకనివ్వడం జాతీయ ప్రాధాన్యంగా మారాలి. సరైన సమష్టి కార్యాచరణతోనే, అవయవ మార్పిడి అవసరమైన ప్రతి భారతీయునికీ అది లభించగల భవిష్యత్తులోకి మనం అడుగు పెట్టవచ్చు.
డా‘‘ ప్రతాప్ సి. రెడ్డి
వ్యాసకర్త అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్