
ప్రపంచాన్ని కొన్ని వందల సంవత్సరా లుగా పాలించి శాసిస్తున్న పాశ్చాత్య దేశా లను తట్టుకుని నిలవాలని, వాటితో సమాన స్థాయికి ఎదగాలని భావిస్తున్న చైనా... ఆ లక్ష్యం వైపు ముందుకు సాగుతున్నట్లుగానే కనిపిస్తోంది. అయితే తన లక్ష్య సాధన కోసం చైనా వ్యూహం ఏమిటి? ఆ వ్యూహంలోని బలమెంత? అనే ఆలోచనలు– చైనా గురించి కొంత తెలిసి ఉండి, కొన్నాళ్లు అక్కడికి వెళ్లి గమనించిన మీదట కలుగుతాయి. అవమానాల శతాబ్దం (1839 –1949) నుంచి పునరుజ్జీవన శతాబ్దం (1949–2049) లోకి ప్రవేశించదలచిన చైనా, అందుకు అవసరమైన విధంగా వరుసగా కొన్ని పాఠాలను చరిత్ర నుంచి, వర్తమానం నుంచి తీసుకుంటూ వస్తున్నది. చైనా వ్యూహానికి పునాదులు వేసినది ఆ పాఠాలే!
మావో ప్రయోగాల ప్రభావం
చైనాకు మొదట అవమానాల శతాబ్ది ఎదురు కావటానికి ప్రధాన కారణం... చివరిదైన ఛింగ్ రాజ వంశ కాలంలో ఫ్యూడల్ వ్యవస్థాపరమైన అభివృద్ధి నిజంగానే గొప్పగా ఉండినా, ఆ కాలపు యూరప్, జపాన్‌లలో వలె పరిశ్రమలు, సైన్స్, టెక్నాలజీ, సైన్యం, చైనాలో ఆధునికం కాకపోవటం. ఇక రెండవ కారణం... సువిశాల దేశమైన చైనాలోని వేర్వేరు ప్రాంతాలు, ప్రజల మధ్య తగిన ఐక్యత లేకపోవటం. కనుక, కమ్యూనిస్టు విప్లవం తర్వాత పునరుజ్జీవన కాలంలో ఈ రెండూ సాధించటం చైనా ప్రాధాన్య లక్ష్యం అయింది.
అయితే, మావో ఒక సోషలిస్టు స్వాప్నికుడు అయినందున, ఆర్థికా భివృద్ధిని కోరుకుంటూనే సామాజిక సమానత్వానికి అంతకన్న పెద్ద పీట వేయాలని భావించటంతో 1976 వరకు ఆయన జీవిత కాలంలో పలు ప్రయోగాల వల్ల చైనా ఒడుదొడుకులకు లోనైంది. మరొకవైపు, అవమానాల శతాబ్ది నాటి సైనిక పరాజయాలు గుర్తున్నందున కొరియా యుద్ధంలో, ఇతరత్రా కూడా తమ సైన్యం బలహీన మైనదయినప్పటికీ అమెరికా, రష్యా, జపాన్‌లను ధిక్కరించి చైనా నిలిచింది తప్ప గతంలో వలె లొంగిపోలేదు. అది చైనా ప్రజలకు స్ఫూర్తిదాయకమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది.
‘తియానన్మెన్’ తిరుగుబాటు
మావో అనంతరం డెంగ్ శియాగో పింగ్ కాలం మొదలుకొని చైనా, ప్రపంచాన్ని చూసి ఆధునీకరణ పాఠాలు నేర్చుకోవటం ఆరంభించింది. ఆర్థికంగా, సైనికంగా, విద్యా–వైజ్ఞానికపరంగా. ఆర్థికసంస్కరణలు అందుకు తొలి అడుగయ్యాయి. అదే సమయంలో – పేదరికం, నిరుద్యోగం వల్ల విద్యార్థులు, యువకుల నుంచి సామా జికంగా ఒక పెద్ద కుదుపు మొదలై 1989లో తియానన్మెన్ స్క్వేర్ తిరుగుబాటు తలెత్తింది. తియానన్మెన్ తిరుగుబాటు... సామాజికాభి వృద్ధితో పాటు, ఆర్థికాభివృద్ధి కూడా వేగంగా జరిగి, అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకూ చేరాలన్న పాఠాన్ని చైనాకు నేర్పింది.
ఇరాక్ –అమెరికా కూటమి మధ్య జరిగిన గల్ఫ్ యుద్ధం (1991), సైనికంగా ఇరాక్ వంటి స్థితిలోనే గల తమపై ఒకవేళ అమెరికా దాడి జరిపితే ఏమి కావచ్చునో అర్థం చేయించింది. తర్వాత అదే సంవ త్సరం (1991) చివరలో సాటి సోషలిస్టు దేశమైన సోవియెట్ యూనియన్ పతనం చైనాకు అనేక పాఠాలను నేర్పింది. ఒక విధంగా ఈ మూడు పరిణామాలు లేదా పాఠాలు చైనా నాయకత్వపు ఆలోచ నలకు, భవిష్యత్ వ్యూహానికి పదును పెట్టాయి.
వ్యూహాత్మకంగా ‘డబ్ల్యూటీ వో’లోకి!
భవిష్యత్తులో ఏమి సాధించాలన్నా ఆర్థికాభివృద్ధి అందుకు ప్రాతిపదిక కాగలదని బోధపడటంతో, ఒకవైపు అంతర్గతంగాసంస్కరణలను కొనసాగిస్తూనే మరొకవైపు విదేశీ సాయాలు, పెట్టు బడులు, వాణిజ్యం కోసం డబ్ల్యూటీవోలో చేరటం తప్పనిసరి అనే నిర్ణయానికి చైనా వచ్చింది. అందుకు అమెరికా అంగీకారం అవసరం గనుక, ‘ఎంత ఎదిగినా ఒదిగి ఉండు’ అనే వ్యూహాన్ని పాటిస్తూ అమెరికాను మెప్పించి 2001లో ఆ సంస్థలో సభ్యత్వం సంపాదించింది. అప్పటినుంచి చైనా ఇక వెనుదిరిగి చూడలేదు.
అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. కమ్యూనిస్టు రష్యా కూలిన తర్వాత కమ్యూనిస్టు చైనా బలహీనపడాలని అమెరికా కోరుకోవాలి గానీ, డబ్ల్యూటీవోలో చేరి బలపడాలని ఎందుకు భావిస్తుంది? దీనికి స్వయంగా అమెరికన్లు ఇచ్చే వివరణను బట్టి అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్, చైనా ఆర్థికంగా అభివృద్ధి చెందే కొద్దీ వారి సంపదలు, కోరికలు, సమాజం, సంస్కృతి వంటివి మారి క్రమంగా పాశ్చాత్య సమాజం వలె మారుతుందని, దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కోరుకున్న తియానన్మెన్ నాటి ధోరణి బలపడుతుందని, ఆ విధంగా కమ్యూనిజం అంతర్ధానమై పెట్టుబడిదారీ వ్యవస్థ, పశ్చిమ దేశాల తరహా ప్రజాస్వామ్యం రాగలవని అంచనా వేశారు. కానీ, అది గ్రహించిన చైనా నాయకత్వం తన తరహా వ్యవస్థను తాను నిర్మించు కుంటూ ముందుకు సాగింది. బుష్ ఆలోచన నెరవేరలేదు.
కేంద్రీకృత మార్క్సియన్ పాలన
ఇప్పుడు వెనుదిరిగి సమీక్షిస్తే చైనాకు తన తరహా వ్యవస్థ అంటే ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం మనకు కనిపిస్తున్నవి. అవి : దేశ అవసరాలు, ప్రజల అవసరాలు, రక్షణ అవసరాలు, విద్యా వైజ్ఞానిక అవసరాలు తీరటంతో పాటు; తమ అంతర్గత పెట్టుబడు లకు, విదేశాలలో పెట్టుబడులకు, అమెరికా కూటమి ఒత్తిళ్లను తట్టు కునేందుకు చాలినంతగా సంపదలు వృద్ధి చెందటం.
ప్రజల అవస రాలు తీరి, తలసరి ఆదాయాలు పెరుగుతూ, పేదరికం వేగంగా తొల గిపోతూ తియానన్మెన్ వంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా ఉండ టం. ఈ తరహా వృద్ధి అన్నదే చైనీస్ సోషలిజంగా స్థిరపడి క్లాసికల్ సోషలిజం భావన మరుగున పడటం. అదే సమయంలో ఈ నమూ నాకు ఆటంకాలు అంతర్గతంగా కానీ, బయటి నుంచి గానీ ఎదురవ కుండా, కేంద్రీకృత మార్క్సియన్ పాలనా వ్యవస్థ అమలు అవటం. అసలు వ్యవస్థనే వ్యతిరేకించని మేరకు ప్రజలు స్వేచ్ఛగా ఉండటం.
‘బహుళ ధ్రువ’ నినాదం
ఈ క్రమంలో, తమ నమూనా సరైనదని చైనా నాయకత్వానికి గల నమ్మకాన్ని మరింత పెంచిన పరిణామాలు మరొక రెండు చోటు చేసుకున్నాయి. మొదటిది, 2008లో పాశ్చాత్య ప్రపంచం ఆర్థికసంక్షోభంలో చిక్కుకుని 1930ల నాటి ఆర్థిక మాంద్యాన్ని గుర్తు చేయగా, చైనాలో వృద్ధి రేటు మరింత పెరిగింది. ఆ తర్వాత 2019లో కోవిడ్ సమస్యను అమెరికా ఎదుర్కొనలేకపోగా, చైనా సమర్థవంతంగా బయటపడింది. ఇదే 21వ శతాబ్దంలో మరో స్థాయిలోఇంకొకటి కూడా జరిగింది.
తమ పలుకుబడిని ప్రపంచవ్యాప్తం చేసుకుంటూ పోతేగానీ అమెరికాను తట్టుకుంటూ, క్రమంగా అమె రికాను బలహీనపరచలేమని భావించిన చైనా నాయకత్వం అందుకు తగిన వ్యూహం తయారు చేసింది. ఆ ప్రకారం 2009 నుంచి బ్రిక్స్‌ను, 2013 నుంచి బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్‌ను బలోపేతం చేస్తూ, ఏకధ్రువ ప్రపంచం స్థానంలో బహుళ ధ్రువ ప్రపంచమే వాంఛనీయ మన్న నినాదాన్ని ముందుకు తెచ్చింది. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందం, ప్రపంచ ఆరోగ్యసంస్థ, అంతర్జాతీయ న్యాయస్థానం, యునిసెఫ్ మొదలైన వాటిని అమెరికా తన స్వార్థం కోసం బలహీనపరుస్తున్నందున, వాటిని ప్రపంచ దేశాలు పరిరక్షించుకోవాలని వాదిస్తున్నది.
ఈ క్రమంలో తాజాగా తలెత్తిన సమస్య... డబ్ల్యూటీవో నిబంధనలకు పూర్తి విరుద్ధంగా అమెరికా అన్ని దేశాలపై ఏకపక్షంగా సుంకాలు పెంచి, వారిని ఒత్తిడి చేసి, తమకు అనుకూలంగా ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోవటానికి ప్రయత్నించటం. ఆ తీరును చైనా తీవ్రంగా వ్యతి రేకించటం మిగతా సభ్యదేశాలను ఆకర్షిస్తున్నది. ఈ విధమైన ఆంతరంగిక, ప్రాపంచిక విధానాలు, వ్యూహాలూ కలిసి చైనా సమగ్ర, దీర్ఘకాలిక వ్యూహానికి బలంగా మారుతున్నట్లు కనిపిస్తున్నది. 2049 నాటికి పునరుజ్జీవనం పూర్తయి, తైవాన్ విలీనంతో ప్రపంచంలో ఆర్థి కంగా చైనా మొదటి స్థానానికి చేరటం జరుగుతుందా? వేచి చూడాలి.
-వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు
- టంకశాల అశోక్