
సైన్స్ టుడే
భూమ్యాకర్షణ శక్తి కారణంగానే మొక్కలు ఎదుగుతున్నాయి. మనం నేల మీద నడవ గల్గుతున్నాం. ఈ శక్తి వలననే సమస్త జంతు జాలానికి ఒక భౌతిక రూపం ఏర్పడుతోంది. కానీ ఈ శక్తి ఎలా ఏర్ప డుతున్నది? ఈ విషయంపై ఇంతవరకు ఎవరికీ సంతృప్తికరమైన జవాబు దొరకలేదు.
ఈ శక్తి ఎలా ఏర్పడుతున్నదో తెలిస్తే దానిని అదుపు చేయడం సాధ్యమౌతుంది. న్యూటన్ దీనిని గుర్తించి 300 ఏళ్ళు దాటినా ఇది ఇంకా పరిశోధన అంశంగానే ఉంది.
కాంతికి, వేడికి శక్తి కల్గించే ‘విద్యుదయస్కాంతత్వం’, ‘పరమాణు కేంద్రకాలను ఏకం చేసే కేంద్రక బలాలు’, ‘ రేడియో ధార్మికతను’ బల హీనపరిచే శక్తుల గురించిన సమాచారం శాస్త్రవేత్తలు తెలుసు కోగలిగారు. ఇన్ని విజ యాలు సాధించిన శాస్త్రవేత్తలు భూమ్యాకర్షణ శక్తి రహస్యాలు తెలుసు కోవడంలో ఎటువంటి ప్రగతీ సాధించలేకపోయారు.
ఏ వస్తువునైనా సరే భూమి ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణ బలమే ఆ వస్తువు బరువు. ఈ ఆక ర్షణ ఒక్క భూమికే కాదు, ప్రతి గ్రహానికీ ఉంది. ఈ ‘గురుత్వాకర్షణ శక్తి’ అనేది ప్రతి చోటా కనిపిస్తుంది. దీనినుండి ఎవరూ తప్పించు కోలేరు. ఇదొక ప్రకృతి శక్తి. భూమికి బాగా ఎత్తుగా అంతరిక్షంలోకి వెళ్ళినపుడు ఈ భూమ్యాకర్షణ శక్తి బాగా తగ్గిపోయి మనిషికి భార రహిత స్థితి వస్తుంది.
పదార్థ నిర్మాణంలో ఉన్న అస్థిరత వల్ల రేడియో ధార్మిక పదార్థాలలో రేడియో ధార్మిక లక్షణం క్షీణిస్తుంది. అయితే భూమ్యాకర్షణ శక్తి అనేది భూమి అస్థిరత వల్ల వచ్చినది కాదు. భూమికి ద్రవ్యరాశి ఉన్నంత కాలం భూమ్యాకర్షణ శక్తి ఉంటుంది.
భూమి ద్రవ్యరాశి స్థిరంగా ఉండి దాని వ్యాసార్ధం తగ్గితే, అప్పుడు భూమి మీద ఉన్న వస్తువుకు, భూకేంద్రానికి మధ్యన ఉన్న దూరం తగ్గిపోతుంది. వీటి మధ్య దూరం తగ్గితే భూమ్యాకర్షణ బలం పెరుగుతుంది. భూ కేంద్రం వద్ద వస్తువును ఉంచితే దీనికి ఒక వైపున గల భూద్రవ్యరాశి దానిపై కలిగించే ఆకర్షణ బలాన్ని, రెండవ వైపుగల భూద్రవ్య రాశి దానిపై కలిగించే ఆకర్షణ బలాన్ని రద్దు చేస్తుంది. అందువల్ల భూకేంద్రం వద్ద ఉంచిన వస్తువుపై ఎటువంటి భూమ్యాకర్షణ బలమూ ఉండదు.
మన శరీరంలో రక్త ప్రసరణ నిరంతరం జరిగేందుకు రక్తాన్ని గుండె పంపు చేస్తూ ఉంటుంది. ఇది భూమ్యాకర్షణ బలానికి వ్యతి రేకంగా పని చేయాలి. భూమ్యాకర్షణ బలం తగ్గితే గుండె పని తగ్గుతుంది, ఫలితంగా శరీరంలో రక్త పోటు తగ్గుతుంది.
ఐన్‌స్టీన్ ఉద్దేశంలో భూమ్యాకర్షణ లేదా గురుత్వాకర్షణ ఒక శక్తి కాదు. దీనిని ‘అంత రిక్షంలో ఉండే పెద్ద గొయ్యి’తో పోల్చి చెప్పాడు. గొయ్యి చుట్టుపక్కల ఉండే వస్తువులన్నీ అటువైపు దొర్లుతూ అందులో పడిపోతాయి. ఆదేవిధంగా వస్తువులు గురుత్వాకర్షణ కారణంగా అటువైపు పడిపోతు న్నాయని ఆయన వాదన. ఐన్‌స్టీన్ సైద్ధాంతిక శాస్త్రవేత్త మాత్రమేననీ, ప్రాయోగిక శాస్త్రవేత్త కాదనీ ఇతర శాస్త్రవేత్తలు ఆయన సిద్ధాంతాన్ని ఆమోదించలేదు.
అంతరిక్ష ప్రయోగాలు ఎన్నో విజయాలు సాధిస్తున్న ఈ తరుణంలో భూమ్యాకర్షణ రహస్యాలు బట్టబయలైతే దానిని అదుపు చేసే విధానాలు తెలుస్తాయి. అప్పుడు నీటిలో చేప పిల్లలు ఈదినట్లు మనం కూడా భూవాతా వరణంలో తేలుతూ ఎక్కడకి కావాలంటే అక్కడికి వెళ్లవచ్చు.
డా‘‘ సి.వి. సర్వేశ్వర శర్మ
వ్యాసకర్త పాపులర్ సైన్స్ రచయిత