బ్రిక్స్‌... ట్రంప్‌... కాగితం పులి కథ! | Sakshi Guest Column On BRICS countries and Donald Trump | Sakshi
Sakshi News home page

బ్రిక్స్‌... ట్రంప్‌... కాగితం పులి కథ!

Jul 16 2025 12:37 AM | Updated on Jul 16 2025 12:37 AM

Sakshi Guest Column On BRICS countries and Donald Trump

బ్రెజిల్‌లో జరిగిన ‘బ్రిక్స్‌’ సదస్సులో వివిధ దేశాల నేతలు

విశ్లేషణ

బ్రెజిల్‌లోని రియో డి జనేరో నగరంలో ఈ నెల 6–7 తేదీలలో జరిగిన ‘బ్రిక్స్‌’ 17వ శిఖరాగ్ర సమావేశాలను ఒకవైపు, దానిపై మొదటినుంచే కత్తులు దూసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను మరొకవైపు గమనించగా కాగితం పులి కథ గుర్తుకు వస్తుంది. బ్రిక్స్‌... తన సభ్య దేశాల అభివృద్ధికి, పరస్పర సహకారానికి ఏర్పడినటువంటిది. 2009లో స్థాపించినప్పటి నుంచి గత 16 సంవత్సరాలలో అందుకు అనుగుణంగా వ్యవహరిస్తూ వచ్చింది తప్ప, అమెరికాకు గానీ, మరొకరికిగానీ వ్యతిరేకంగా ఎప్పుడు ఏ చర్యలూ తీసుకోలేదు. 

అయినప్పటికీ, అమెరికా అధ్యక్షులందరికి భిన్నమైన రీతిలో ట్రంప్‌ మాత్రం బ్రిక్స్‌ను తమకు వ్యతిరేకమైన కూటమి అంటున్నారు. అధికారానికి వచ్చిన కొత్తలో బ్రిక్స్‌ దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఇపుడు బ్రెజిల్‌ సమావేశాలకు ముందు రోజున 10 శాతం అన్నారు. బ్రిక్స్‌లో చేర రాదంటూ ప్రపంచ దేశాలను కొన్ని నెలలుగా ఒత్తిడి చేస్తున్నారు. కానీ, ఈసారి సమావేశాలు ముగిసే నాటికి, ట్రంప్‌ను అమెరికా సన్నిహిత దేశాలు సహా ఎవరూ ఖాతరు చేయనట్లు స్పష్టమైంది. 

జనాభా... జీడీపీ... 40 శాతం వాటా!
2009లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలలో బ్రిక్‌గా మొదలైన సంస్థ, దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్‌గా మారటం తెలిసిందే. ట్రంప్‌ హెచ్చరికలు చేసిన మరునాడే ఇండోనేషియా పూర్తి సభ్య దేశంగా చేరింది. ఇపుడు బ్రెజిల్‌లో బేలారూస్, బొలీవియా, కజకిస్థాన్, క్యూబా, నైజీరియా, మలేషియా, థాయ్‌లాండ్, వియత్నాం,ఉగాండా, ఉబ్జెకిస్తాన్‌ భాగస్వామ్య దేశాలుగా కొత్తగా చేరాయి. బ్రెజిల్‌ సమావేశాల కన్న ముందు మాసాలలో ఈజిప్టు, ఇథియో పియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ పార్ట్‌నర్‌ దేశాలయ్యాయి. 

ఈ జాబితాను విశ్లేషించినట్లయితే నాలుగు విషయాలు దృష్టికి వస్తాయి. ఒకటి, సంఖ్య రీత్యా ఇపుడవి మొత్తం 21 దేశాలు. రెండు, అమెరికా, యూరప్‌తో కూడిన పాశ్చాత్య ప్రపంచానికి బయటగల ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా ఖండాలన్నింటికి అందులో ప్రాతినిధ్యం ఉంది. మూడు, వాటిలో అనేకం ఆర్థికంగా శక్తిమంతమై నవి. నాలుగు, బహుశా అంతకన్న విశేషంగా పలు దేశాలకు అమెరి కాకు అనుకూలమైనవనే పేరున్నది. అటువంటి పేరే గల ఆసియన్‌ కూటమి దేశాలు కూడా బ్రిక్స్‌కు తోడుకావటం మరొక విశేషం.

తాజా విస్తరణ తర్వాత బ్రిక్స్‌ దేశాల జనాభా మొత్తం ప్రపంచ జనాభాలో 41 శాతానికి చేరింది. వీటి జీడీపీ ప్రపంచ జీడీపీలో 40 శాతం అయింది. ఇవన్నీ అభివృద్ధి చెందిన దేశాల కూటమి అయిన జి–7కు మించిపోయిన లెక్కలు. బ్రిక్స్‌ నెలకొల్పిన న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డిబి) రుణ సహాయాలతో 40 బిలియన్‌ డాలర్ల విలువ గల 120 అభివృద్ధి పథకాలను వర్ధమాన దేశాలలో అమలుపరుస్తున్నారు. అమెరికా చెప్పు చేతలలో గల ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ తరహా షరతులుగానీ, ఆయా దేశాల ఆర్థిక విధా నాలలో జోక్యం గానీ బ్రిక్స్‌ బ్యాంక్‌ నుంచి ఉండవు.

అమెరికాకు ఎందుకు కలవరం?
అమెరికా తన డాలర్‌ను ఒక ఆయుధంగా ఉపయోగిస్తూ ప్రపంచ దేశాల కరెన్సీ విలువలను, మార్కెట్లను, బ్యాంక్‌ చెల్లింపులను, రిజర్వ్‌లను నియంత్రిస్తున్నందున, తమకు సరిపడని దేశాల డాలర్‌ అకౌంట్లను స్తంభింపజేస్తున్నందున, డాలర్‌ మారకం నుంచి విముక్తి అవసరమని బ్రిక్స్‌ దేశాలు కొంతకాలం క్రితమే నిర్ణయించుకున్నాయి. 

ముఖ్యంగా నిరుడు అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌ నగరంలో జరిగిన 16వ సమావేశాలలో ఇందుకు మరింత కదలిక వచ్చింది. ఆ ప్రకారం బ్రిక్స్‌ దేశాలు డాలర్‌తో సంబంధాలను ఒకే సారి పూర్తిగా తెంచుకోవటంగాక, తమ మధ్య వాణిజ్యానికి పరస్పర చెల్లింపులు డాలర్‌లో గాక వీలైనంత మేర తమ సొంత కరెన్సీలలో జరుపుకోవాలనీ, ఆ స్థాయిని క్రమంగా పెంచుకోవాలనీ నిర్ణయించుకున్నాయి. ఈ పని బ్రిక్స్‌ దేశాల మధ్యనే గాక, ఇతర దేశాలతోనూ జరిగేందుకు ప్రయత్నించాలని భావించాయి. అనగా డాలర్‌ పాత్రను, ఆధిపత్యాన్ని తగ్గించటమన్నమాట!

నిజానికి స్థానిక కరెన్సీలలో చెల్లింపుల పద్ధతి స్వల్ప స్థాయిలో గతంలోనూ ఉండేది. కానీ బ్రిక్స్‌ నిర్ణయాలతో అది గణనీయంగా పెరిగి ప్రస్తుతం ప్రపంచ వాణిజ్యంలో 30 శాతానికి మించినట్లు అంచనా. బ్రెజిల్‌ విస్తరణతో ఈ ధోరణి పెరిగినట్లయితే, త్వరలో 50 శాతానికి చేరే అవకాశం ఉంది. బ్రిక్స్‌ అంటే అమెరికా అధ్యక్షుడు ఎందుకింత కలవరపడుతున్నారో, దీన్ని బట్టి తేలికగా అర్థం చేసు కోవచ్చు. 

ప్రపంచంపై అమెరికా సామ్రాజ్యవాదపు ఆధిపత్యం వెంటనే అంతం కాక పోయినా క్రమంగా బలహీనపడుతుంది. మారిన పరిస్థితులలో ఒకప్పటివలె బ్రిక్స్‌ వంటి దేశాలపై ప్రత్యక్ష యుద్ధాలు చేయలేరు గనుక, టారిఫ్‌ల హెచ్చింపు, ఇతర వాణిజ్య ఆంక్షల రూపంలో ఆర్థిక యుద్ధాలు ప్రకటిస్తున్నారు. 

వాస్తవానికి, అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, ఇతరుల నుంచి వస్తున్న పోటీలను తట్టుకునేందుకు ఆయన స్వపర భేదాలు లేకుండా అన్ని దేశాలపై ఎడాపెడా టారిఫ్‌ల యుద్ధం ఆరంభించారు. అయితే, బ్రిక్స్‌తో వైరం భిన్నమైనది. ఆ సంస్థ వర్ధమాన దేశాల కోసం భిన్న మైన, దీర్ఘకాలిక, ప్రత్యామ్నాయ వ్యవస్థను సృష్టించే అజెండాతో పని చేస్తున్నది. ఆర్థికంగానే కాదు. అభివృద్ధి నమూనా దృష్ట్యా కూడా. 

వాణిజ్యంలో ‘స్వేచ్ఛ’ కోసం...
మరొక కీలకమైన అంశం స్వేచ్ఛా వాణిజ్యం. ఈ భావనను ముందుకు తెచ్చి డబ్ల్యూటీవోను నెలకొల్పిన అమెరికా కూటమి, దానిని తమ ప్రయోజనాలకు అనుకూలమైనంత కాలం ఉపయోగించుకుని, ఇటీవల ఇతర దేశాలు కూడా లాభపడుతుండటంతో ఆ నియమాలను భంగపరచజూస్తున్నది. 

స్వేచ్ఛా వాణిజ్యం యథా తథంగా కొనసాగటమే గాక, ఆ సంస్థలో వర్ధమాన దేశాల గొంతుకలు వినవస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలన్నది బ్రిక్స్‌ వాదనలలోని ముఖ్యాంశాలలో ఒకటి. ఆ పని జరిగితే వర్ధమాన దేశాల వనరులకు, ఉత్పత్తులకు తగిన ధరలు లభిస్తాయి. ధనిక రాజ్యాలు ఇతరులను ఒత్తిడి చేసి తక్కువ ధరలకు కొనుగోలు చేయటం, తమ ఉత్పత్తులను మాత్రం అధిక ధరలకు విక్రయించటం వంటి పరిస్థితి పోతుంది. 

మరొక స్థాయిలో బ్రిక్స్‌ దేశాలు అమెరికా ఏకధ్రువ ప్రపంచం ఆమోదయోగ్యం కాదనీ, బహుళ ధ్రువ ప్రపంచం తమ లక్ష్యమనీ స్పష్టంగానే చెప్తున్నాయి. బ్రిక్స్‌ గురించి యూరోపియన్‌ దేశాలు ఇంతవరకైతే వ్యతిరేకంగా మాట్లాడలేదుగానీ, అమెరికా వైపు చూస్తు న్నాయి. కజాన్, రియో డి జనేరో సమావేశాల దరిమిలా ట్రంప్‌పై ఒత్తిడి పెరిగింది. 

ఈ పరిణామాల తక్షణ ప్రభావాల గురించి కూడా కొంత చెప్పు కోవాలి. ఇండియాను టారిఫ్‌లతో లొంగదీసి ఒప్పందాలు చేసుకో జూడగా, దానిపై ఒకవైపు చర్చలు సాగిస్తూనే, తాము కూడా 25 శాతం ఎదురు సుంకాలు విధించగలమని భారత ప్రభుత్వం డబ్ల్యూటీవోలో స్పష్టం చేసింది. తామూ అదే పని చేయగలమని బ్రెజిల్, వియత్నాం, ‘ఆసియాన్‌’, దక్షిణాఫ్రికా మొదలైనవి హెచ్చరించాయి. 

చైనా, రష్యా సరేసరి. టారిఫ్‌లు ప్రకటించినపుడు ట్రంప్‌ మాట్లాడుతూ 90 రోజులలో 90 ఒప్పందాలు చేసుకోగలమని,అందరూ క్యూలు కడుతున్నారని ఆట్టహాసంగా అన్నారు. 90 రోజులు గడిచేసరికి జరిగినవి ఇంగ్లండ్, వియత్నాంలలో మాత్రమే. కెనడా, యూరప్‌ సైతం ధిక్కార స్వరంలోనే ఉన్నాయి. ఈ పరిణా మాల మధ్య బ్రిక్స్‌ను ఢీకొంటున్న ట్రంప్, కాగితం పులిగా మిగలటం తప్ప గత్యంతరం కనిపించదు.

టంకశాల అశోక్‌ 
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement