
విశ్లేషణ
ఇండియాకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నోరుపారేసు కోవడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఆయన అక్కసు వెనుక ప్రతిసారీ ఒక భూ స్వామ్య పెత్తందారీ విధానం కనిపిస్తుంది. సుంకాలు, జరిమానాలను రక్షణ కవచంగా ధరించి ఆయన విమర్శలకు, బెదిరింపులకు దిగుతూంటారు. అమెరికా అధ్యక్షుడి వదరుబోతుదనంలో ఒక సామ్రాజ్య వాదిలో ఉండే దురహంకారం ప్రతిబింబిస్తూ ఉంటుంది.
రష్యా చమురును ఒక బూచిగా చూపిస్తున్నారంతే. అలనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ ధోరణి ఇప్పుడు అమెరికా వ్యవహార శైలిలో కనిపిస్తోంది. వ్యవసాయం, పాడి, మత్స్య పరిశ్రమ పట్ల భారత దేశం అనుసరిస్తున్నట్లు చెబుతున్న సంరక్షణ విధానంపై నిజంగానే అమెరికా విభేదిస్తోందని మనకు ఎక్కడైనా మనసు పొరల్లో చిన్న సందేహం మిగిలి ఉంటే, ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఉపయోగించిన భాషతో అది కాస్తా పటాపంచలైపోతుంది.
‘మహారాజా సుంకాలు’ అనే పద బంధాన్ని గమనిస్తే, భారత దేశాన్ని ప్రాచ్యవాద, పురాతన జాతివాద కళ్ళద్దాలతోనే నవారో చూస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఈసారి ఆయన ‘పాములు ఆడించే వాళ్ళ’ ఉపమానాన్ని ఉపయోగిస్తారేమో! ఏదో ఒక పక్షం వైపు రావలసిందిగా భారతదేశాన్ని నేరుగానే హెచ్చరించారాయన. కొత్తగా ఉపయోగించిన మాటలతో భారతీయుల మనసును నవారో మరింత గాయపరచారు. క్రెమ్లిన్‌కి ‘లాండ్రోమాట్’గా ఆయన భారతదేశాన్ని అభివర్ణించారు. నిజానికి, అప్ప టికి కొద్ది రోజుల క్రితమే అలాస్కాలో వ్లాదిమీర్ పుతిన్‌కి ట్రంప్ అక్షరాలా ఎర్ర తివాచీ పరచి స్వాగతం పలికిన సంగతిని ఆయన సమయానుకూలంగా మరచినట్లుంది.
అమెరికా ఆత్మవంచన
మనం రష్యా ముడి చమురు కొని, శుద్ధి చేసిన తర్వాత, ఆ చమురును యూరప్ దేశాలు కూడా కొనుగోలు చేశాయి. అలా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం ద్వారా మనం ‘లాభాలు గడిస్తున్నా’మని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ ఆరోపించారు. కానీ, ఉక్రెయిన్ యుద్ధం వల్ల నిజంగా లబ్ధి పొందు తున్నది వారే! ఐరోపా దేశాలు అమెరికా నుంచి ఆయుధాలు కొని ఉక్రెయిన్‌కు లాభాలకు అమ్ముతున్నాయి.
అందుకే అవి విక్రయిస్తున్న అన్ని ఆయుధాలపైనా (అదనపు వ్యయాలు, లాభం కింద) ట్రంప్ ప్రభుత్వం 10% మొత్తాన్ని తీసుకుంటోందని బిసెంట్ మరో ఇంటర్వ్యూలో స్వయంగా అంగీకరించారు. ఇండియా మాత్రం రష్యా చమురు కొనడం తమ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని చెబుతూంటే... అదే వ్యక్తులు, పుతిన్ యుద్ధాన్ని మనం బలో పేతం చేస్తున్నట్లుగా నిందిస్తున్నారు. ఇక్కడ అమెరికా ఆత్మ వంచన కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కపటత్వానికీ స్థిరమైన వాదన అవసరం.
ఎవరో ఒక అధ్యక్షుడి చపలచిత్త ధోరణిని పట్టించుకోనక్కర లేదని, భారత–అమెరికా స్నేహ సంబంధాలు సుదీర్ఘమైనవి, గాఢ మైనవని వాదించేవారితో నేనూ ఏకీభవిస్తాను. కానీ, ట్రంప్‌కు అర్థ మయ్యే భాషలోనే ఆయనకు వ్యతిరేకంగా స్వల్పకాలిక చర్యనైనా తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా నేను అర్థం చేసుకోగలను. అలా గని వాషింగ్టన్ ఇవ్వనిది చైనా మనకేదో దోచిపెడుతుందని కూడా నేను అనుకోవడం లేదు.
చైనాను నమ్మవచ్చా?
ట్రంప్‌ది దూకుడు తత్త్వం. చైనా సైనికంగా మనకి ప్రత్యర్థి. ట్రంప్‌వి అవాకులో చవాకులో బహిరంగంగానే ఉంటాయి. జిన్‌పింగ్‌వి పారదర్శకం కాని తెరవెనుక చర్యలు. పాకిస్తాన్ పట్ల ట్రంప్ మెతక వైఖరిని అర్థం చేసుకోవచ్చు. దాని పొగడ్తలకు ఆయన ఉబ్బి పోయాడు, లేదా అది ఇవ్వజూపిన ప్రయోజనాలకు ప్రలోభపడ్డాడు అనుకుందాం. కానీ, ఇటీవలి ‘ఆపరేషన్ సిందూర్’లో కూడా పాకి స్తాన్‌తో చైనా చెట్టపట్టాలేసుకుని తిరిగింది.
కనుక, ట్రంప్‌ను, ప్రస్తుత లోటుపాట్లను పక్కనపెట్టి అమెరికా – భారత్ స్నేహ సంబంధాన్ని కాపాడుకోవాలని కోరుకోవడంలో ఔచిత్యం ఉంది. ఇప్పటి అమెరికా స్పందన ఒకటే పాఠం నేర్పుతోంది. అది: ప్రపంచంలో ఓ మూలనున్న ప్రాంతంపై లేదా ఒకే దేశంపై ఆశలన్నీ పెట్టుకోవద్దు. అది ప్రమాదకరం.
మనవాళ్లు ఏం చేస్తున్నట్టు?
ట్రంప్‌ను భారత్ ఎందుకు దారికి తెచ్చుకోలేకపోయింది అనే దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆపరేషన్ సిందూర్ ఆగి పోవడంలో ట్రంప్ స్వోత్కర్షను సమర్థించనందుకా? ఆయన ‘ఇగో’ దెబ్బతిందా? ట్రంప్ మాజీ అంగరక్షకుడు ఒకరిని పాకిస్తాన్ తన లాబీయిస్టులలో ఒకడిగా చేర్చుకుందని చెబుతున్నారు. మనం అలా కాకుండా, లాంఛన పూర్వకంగా, సంయమనంతో దౌత్యం నెరప డమా? కానీ, నాకొకటే సందేహం. అమెరికాలో ఉంటున్న భారత సంతతికి చెందిన గొప్ప వ్యక్తులు ఏమైపోయినట్లు?
యాభై లక్షల మంది ఇండియన్–అమెరికన్ సమూహాన్ని ఒక చక్కని వలస వర్గానికి నమూనాగా తరచూ అభినందిస్తూ ఉంటారు. ఆ వర్గం నాయకులు పెద్ద టెక్, ఫినాన్షియల్ సంస్థలను నడుపు తున్నారు. విద్యా, విధాన నిర్ణాయక సంస్థల్లో కీలక పదవుల్లో ఉన్నారు. ఇండియా పట్ల అమెరికా వ్యవహరిస్తున్న తీరు చూసి వారికి ఒళ్ళు మండటం లేదా? స్వీయ నిర్ణయాలు తీసుకోవడం భారతదేశానికున్న సార్వభౌమాధికారమనే సంగతిని ట్రంప్ ప్రభుత్వం అర్థం చేసుకోలేకపోతే, ఆయన శ్వేత సౌధం నుంచి నిష్క్ర మించే నాటికి కాపాడుకోవాల్సినవి పెద్దగా ఏమీ మిగలవు.
బర్ఖా దత్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)