
విశ్లేషణ
స్వాతంత్య్రానంతరం 1950వ దశకం మొదటి అర్ధ భాగంలో ఆహార ధాన్యాలు, హెవీ ఇంజినీరింగ్ వస్తువులు, రవాణా పరికరాలు, యంత్రాలు, మెషిన్ టూల్స్, ఇతర మూలధన వస్తువుల దిగుమతులపై భారత్ అధికంగా ఆధారపడింది. స్వావ లంబన, స్వీయ ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా ప్రారంభమైన మూడవ పంచ వర్ష ప్రణాళిక, ఆ తర్వాతి హరిత విప్లవం, మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర భారత్‌లు సరైన ఫలితాలను అందించలేక పోయాయి. 2024–25లో వస్తు వాణిజ్య లోటు 282.3 బిలియన్ డాలర్లు కాగా, కరెంటు ఖాతా లోటు 23.3 బిలియన్ డాలర్లుగా నమోదవడాన్ని బట్టి, భారత్ వస్తు దిగుమతులపై అధికంగా ఆధారపడటం తేటతెల్లమవుతున్నది.
తయారీకి దిగుమతులే ఆధారం
తయారీ రంగాన్ని పటిష్ఠపరచడంతోపాటు భారత్‌ను ప్రపంచంలో ‘తయారీ, డిజైన్ హబ్’గా రూపొందించడానికి 2014 సెప్టెంబర్‌లో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ప్రారంభమైంది. నియంత్రణ–విధానపరమైన అడ్డంకులు, లాజిస్టిక్స్–సప్లయ్ చెయిన్ వ్యవస్థ సమర్థంగా లేకపోవడం, ప్రైవేటు–విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో తక్కువ వృద్ధి, నైపుణ్యం గల శ్రామిక శక్తి లభ్యత తక్కువగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక పోటీ కారణంగా మేక్ ఇన్ ఇండియా తన లక్ష్య సాధనలో వెనుకబడింది.
సెమీ కండక్టర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో మొబైల్ ఫోన్ తయారీదారులు అధికంగా దిగుమతులపై ఆధార పడుతున్నారు. భారత్‌లో ఫోన్ల అసెంబ్లింగ్‌లో నిమగ్నమైన ఆపిల్, శామ్‌సంగ్, షావోమీ కంపెనీలు చైనా, తైవాన్, దక్షిణ కొరియా నుండి చిప్‌సెట్స్, డిస్‌ప్లే ప్యానల్స్, కెమెరా మాడ్యూల్స్‌ను దిగుమతి చేసు కుంటున్నాయి. కార్ల తయారీలో నిమగ్నమయిన టాటా,హ్యుండాయ్, మారుతి సుజుకీలు ఎలక్ట్రానిక్స్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ, ఇంజిన్ కంట్రోల్ యూనిట్లను దిగుమతి చేసుకుంటున్నాయి.
చైనా నుండి సోలార్ సెల్స్, మాడ్యూల్స్‌ను పెద్ద సోలార్ పార్క్‌లు దిగు మతి చేసుకుంటున్నాయి. భారత్‌లో అవసరమైన ఆరోగ్య సంరక్షణ సాధనాలు 90 శాతం చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నవే. ప్రపంచ మార్కెట్‌లో టెక్స్‌టైల్స్‌కు సంబంధించి భారత్ అతి పెద్ద ఎగుమతిదారునిగా నిలిచినప్పటికీ వీటి తయారీలో ఉపయోగించే సింథటిక్ ఫైబర్, ముఖ్య యంత్రాల కొరకు భారత్ దిగుమతులపై ఆధారపడుతోంది. టీవీ, లాప్‌టాప్స్, వాషింగ్ మెషిన్ ఉత్పత్తుల అసెంబ్లింగ్‌కు అవసరమైన చిప్స్, సెన్సార్స్, డిస్‌ప్లేలు కూడా దిగుమతి చేసుకుంటున్నవే.
ఎరువుల ఉత్పత్తిని పెంచడమెలా?
79వ స్వాతంత్య్ర దినోత్సవాలలో భాగంగా ప్రధాని ‘స్వయం సమృద్ధ భారత్’ను ప్రస్తావించారు. 2047 నాటికి అన్ని రంగాలలో ఆత్మనిర్భర్, వికసిత్ భారత్ విజన్‌ను పేర్కొన్నారు. అయితే, దేశీయంగా వ్యవసాయ డిమాండ్ నేపథ్యంలో ఎరువులు ప్రధాన దిగుమతులుగా నిలిచాయి. 2024–25లో ఎరువు లకు డిమాండ్ 650 లక్షల టన్నులు కాగా, దేశీయంగా ఉత్పత్తి తక్కు వగా ఉండటంతో 170 లక్షల టన్నులకు పైగా దిగుమతి చేసు కున్నట్లు అంచనా.
అధిక దిగుమతులపై ఆధారపడటాన్ని భారత్ తగ్గించుకున్నప్పుడు వాణిజ్య లోటు తగ్గుతుంది. యూరియా, ఫాస్పటిక్, పొటాసిక్ ఎరువుల దిగుమతులను తగ్గించుకోవడానికి గ్యాస్ ఫీల్డ్స్ అధికంగా ఉన్న ప్రాంతాలలో నూతన ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. ఇప్పటికే మూసివేసిన ఎరువుల కర్మాగారాలను తిరిగి ప్రారంభించడంతో పాటు నానో– ఫెర్టిలైజర్ టెక్నాలజీని ప్రోత్సహించాలి.
బయో ఆధారిత, ఆర్గానిక్ ఎరువుల వినియోగం పట్ల రైతులలో అవగాహన పెంపొందించినట్లయితే రసాయన ఎరు వుల వినియోగం తగ్గుతుంది. ఎరువుల ఉత్పత్తిని పెంచడానికి విదే శాలలో జాయింట్ వెంచర్స్ ఏర్పాటుతో పాటు ప్రపంచ ఎరువుల మార్కెట్‌లో ప్రధాన దేశాలుగా ఉన్న రష్యా, జోర్డాన్, కెనడాలతో దీర్ఘకాలిక ఒప్పందాలు అవసరం.
‘పునరుత్పాదక’ సమస్యలు
జనాభా పెరుగుదల, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ నేపథ్యంలో 2040 నాటికి భారత్ శక్తి వినియోగం రెట్టింపు కాగలదని ‘ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ’ అంచనా. భారత్ అవస్థాపిత విద్యుత్ సామర్థ్యం 2025 జూన్ నాటికి 476 గిగావాట్లకు చేరుకుంది. 2013 –14తో పోల్చినప్పుడు 2024–25లో విద్యుత్ కొరత తగ్గినప్పటికీ తలసరి వినియోగంలో 45.8 శాతం పెరుగుదల ఏర్పడింది. భారత్ మొత్తం విద్యుత్ సామర్థ్యంలో థర్మల్ విద్యుత్ వాటా 50.52 శాతం కాగా, శిలాజేతర ఇంధనాల వాటా 49 శాతం. 2014–15లో భారత్ మొత్తం ఎనర్జీ వినియోగంలో దిగుమతి వాటా 26 శాతం కాగా, 2025 జనవరి నాటికి 19.60 శాతానికి తగ్గింది.
‘వాణిజ్య బొగ్గు మైనింగ్’, ‘మిషన్ కోకింగ్ కోల్’ వంటి ప్రభుత్వ చర్యల వల్ల స్వదేశీ బొగ్గు ఉత్పత్తి పెరిగి, దిగుమతులపై ఆధారపడటం తగ్గింది. కానీ 2030–2035 మధ్య బొగ్గుకు డిమాండ్ అధికంగా ఉంటుందని నీతి ఆయోగ్ అంచనా. రాబోయే కాలంలో శక్తికి బొగ్గు ప్రధాన ఆధారంగా నిలిచే అవకాశం ఉన్నందువలన సౌర, పవన, జల విద్యుత్తు లాంటి పునరుత్పాదక శక్తి వనరులపై దృష్టి సారించాలి. శిలాజేతర ఇంధన ఆధారిత శక్తి సామర్థ్యం 2030 నాటికి 500 గిగావాట్లకు చేరుకోవాలని లక్ష్యం.
అవస్థాపనా సౌకర్యాల కల్పన, గ్రీన్ ఫైనాన్సింగ్, ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యా లను ప్రోత్సహించినప్పుడు ఆయా ఉత్పత్తులు పెరిగి శక్తి సప్లయ్ పెరుగుతుంది. పునరుత్పాదక శక్తి ఆధారాలు ఎదుర్కొంటున్న సమస్యలైన ట్రాన్స్‌మిషన్ మౌలిక వసతులు సరిపోయినంతగా లేకపోవడం, నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం, వాతావరణ మార్పులు, సౌర, పవన క్షేత్రాలు నిర్మించడానికి అవసరమైన భూసేకరణ లాంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలి.
అవసరమైన సంస్కరణలు
రక్షణ ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి ఇటీవల ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రక్షణ రంగ ఉత్పత్తులకు సంబంధించి ఎఫ్‌డీఐ పరిమితిని సరళీకరించడంతోపాటు దేశీయ ఉత్పత్తికి ప్రాధాన్యమి స్తోంది. 2020–24 మధ్య ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆయుధాల దిగుమతిలో భారత్ వాటా 8.3 శాతం. మందుగుండు సామగ్రిలో భారత్ 88 శాతం స్వయంసమృద్ధి సాధించింది.
రక్షణ రంగంలో భవిష్యత్ ఒప్పందాలు, ప్రాజెక్టులకు సంబంధించిన ‘డిఫెన్స్ ఆర్డర్ పైప్‌లైన్’ స్వదేశీ రక్షణ ఉత్పత్తుల పెరుగుదలకు దోహదపడగలదు. రక్షణ రంగంలో స్వావలంబన సాధన దిశగా ‘మిలిటరీ–ఇండ స్ట్రియల్ కాంప్లెక్స్’ను అభివృద్ధి పరచాలి.
ముఖ్య రంగాలలో నైపుణ్యం, పోటీతత్వం, స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యం, కార్మిక సంస్కరణలు, కీలక పరిశ్రమలలో ప్రైవేటు కంపె నీలను అనుమతించడం లాంటి చర్యలు తీసుకున్నప్పుడే స్వావలంబన లక్ష్యం నెరవేరగలదు.
డా‘‘ తమ్మా కోటిరెడ్డి
వ్యాసకర్త వైస్ ఛాన్స్‌లర్ (ఇన్‌ఛార్జ్), ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్