
సందర్భం
‘మొత్తం గాజాను ఇజ్రాయెల్ తన అదుపులోకి తీసుకుంటుంది –నెతన్యాహు ప్రకటన’, ‘గాజా నగరం మొత్తాన్ని గుప్పిట్లోకి తీసుకోనున్న ఇజ్రాయెల్’– గత రెండు రోజుల్లో పత్రికల్లో కనిపించిన ఈ శీర్షికలు చూసిన ఎవరైనా అడగవలసిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. అవి: ఆ మాట అనడానికి ఆయనకు ఎంత ధైర్యం? ఆ పని చేసేందుకు ఇజ్రాయెల్‌కు ఉన్న హక్కే మిటి? కానీ, ఈ ప్రశ్నలను ఎవరూ అడిగినట్లు లేదు.
కానీ, నేడు ప్రపంచంలో రాజ్యమేలుతున్న నైతిక పరిస్థితులు అలాంటి ప్రశ్నలు లేవనెత్తగల పరిధిని కుంచించివేశాయి. దాదాపు రెండేళ్ళ నుంచి పాలస్తీనా పౌరుల్ని ఇజ్రాయెల్ భయంకర హింసకు గురి చేస్తున్నా, సైనికంగా, ఆర్థికంగా శక్తిమంతమైన పాశ్చాత్య దేశాలు నిరోధించ లేదు. పరిస్థితులు ఇంతవరకు రావడానికి అవే ప్రధాన కారణం.
ఇజ్రాయెల్ చేతిలో 60,000 మందికి పైగా పాలస్తీనియన్లు హతమైనా, అంతకు రెండింతల కన్నా ఎక్కువ మంది గాయపడినా ఉదార ప్రజాస్వామిక ఆదర్శాలను వల్లెవేసే ఈ దేశాలు చోద్యం చూశాయి. లేదా ఇజ్రాయెల్ చర్యలను ప్రోత్సహించాయి. అంతర్జా తీయంగా దేశాలు నాగరిక ప్రవర్తనను గాలి కొదిలేస్తే, ఆ యా దేశాలలోని సమాజాలలో ప్రజాస్వామిక విలువలే దెబ్బతింటాయి.
గాజాపై సైనికచర్యలో వినియోగించడానికి అవకాశమున్న ఆయుధాలను ఇజ్రాయెల్‌కు ఇవ్వడాన్ని నిలిపివేస్తామని జర్మనీ ప్రకటించింది. ఈ ఘర్షణలో జోక్యం చేసుకోకూడదని అమెరికా నిర్ణయించుకుంది. గాజా నగరంపై దాడికి దిగాలన్న ఇజ్రాయెల్ నిర్ణయంపై వివిధ దేశాల, అంతర్జాతీయ ఏజన్సీల స్పందనలు అలా రకరకాల స్థాయుల్లో వ్యక్తమయ్యాయి.
సైనిక హింసను వెంటనే నిలువరించేందుకు ఒక జీ7 లానో, జీ20 మాదిరిగానో ఏర్పడకుండా ఈ దేశాలకు అడ్డుపడిన అంశం ఏమిటి? పాలస్తీనా ప్రయోజనాలకు ఇండియా కొన్ని దశాబ్దాలుగా మద్దతు ఇస్తూ వస్తోంది. కానీ, మన దేశం కూడా ఇప్పటికీ అధికారిక స్పందనను వెల్లడించలేదు.
హమాస్ 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్ పై దాడులకు దిగింది. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ 15 నెలలపాటు ఏకధాటిన పాలస్తీనాను పిండి చేసిన తర్వాత అమెరికా, ఖతార్, ఈజిప్టుల మధ్య వర్తిత్వంతో మూడు దశల కాల్పుల విరమణకు జనవరిలో ఇజ్రా యెల్, హమాస్ అంగీకరించాయి. కానీ, రెండు నెలలు గడిచాయో లేదో గాజా నగరంపై రాత్రిపూట వైమానిక దాడులకు ఇజ్రాయెల్ తెగబడింది. వాటిలో 400 మంది పాలస్తీనియన్లు మరణించారు.
గాజాలో హింసకు తాత్కాలికంగానైనా అడ్డుకట్టపడుతుందనే ఆశను కాల్పుల విరమణ ఒప్పందం కల్పించింది. ఆరు వారాల మొదటి దశలో – బందీలుగా పట్టుకున్న ఇజ్రాయలీలను హమాస్ వదిలేయాలి. ప్రతిగా ఇజ్రాయెల్ జైళ్ళలో ఉన్న పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ సేనల ఉప సంహరణ మొదలవ్వాలి.
నానా అగచాట్లు పడుతున్న పాలస్తీనియ న్లకు మానవతా సహాయం పెరగాలి. రెండవ దశలో– ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపడంతో యువ బందీలు, ఖైదీల మార్పిడి సాఫీగా సాగాలి. మూడవ దశలో– బందీలు, ఖైదీల మృతదేహాల అప్పగింత అమలవ్వాలి. గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ సేనల ఉపసంహ రణతోపాటు, గాజాలో పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలి.
కానీ, కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కనపెట్టిన ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూ, పాలస్తీనియన్లను చంపుతూనే ఉంది. గాజాకు ఆహారం, దుస్తులు, ఆస్పత్రి సామగ్రితో సహా మానవతా దృష్టితో సాగుతున్న అంతర్జాతీయ సాయానికీ అడ్డుపడింది.
గాజా నగరాన్ని హస్తగతం చేసుకోవాలన్న ఇజ్రాయెల్ నిర్ణయాన్ని హమాస్ చేతిలో ఇప్పటికీ బందీలుగా ఉన్నవారి కుటుంబాల వారు వ్యతిరే కిస్తున్నారు. దాడికి సంబంధించి ఇజ్రాయెల్ సైనిక ప్రణాళికలను ఈ ప్రతిఘటన ఆపుతుందో లేదో రాబోయే రోజుల్లో చూడాలి.
ఇజ్రాయెల్ సైనిక దాడులు మొదలైన తొలి నెలల్లో లక్షలాది మంది పాలస్తీనియన్లు గాజాను విడిచి వెళ్ళిపోయారు. వివిధ ప్రాంతాల్లో నిస్సహాయ పరిస్థితుల్లో తలదాచుకున్న పాలస్తీనియన్లు కాల్పుల విరమణ తర్వాత తిరిగి వచ్చారు. అప్పటికే వారి గృహాలు, వాడలు చాలా వరకు ధ్వంసమయ్యాయి.
గాజాలో నివసిస్తున్న పది లక్షల మంది పాలస్తీనియన్లను, రానున్న వారాల్లో ఇజ్రాయెల్ సేనలు తరిమేస్తే, ఆ తర్వాత వారు తిరిగి వచ్చేందుకు, ఆ మాత్రం నగరం కూడా మిగిలి ఉండదు. రఫాకు పట్టిన గతే గాజాకూ పడుతుంది. హమాస్ సేనలను పట్టుకునేందుకు రఫాలో ఉన్న పది లక్షల మంది పౌరులను ఇజ్రాయెల్ ఖాళీ చేయించేసింది. ఇపుడు రఫా ఏ మాత్రం నివాసయోగ్యం కాని విధంగా నేలమట్టమై ఉంది.
గాజాలో పాలస్తీనియన్లు ఎదుర్కొంటున్న భీతావహ పరిస్థి తుల్ని ఊహించుకోవచ్చు. అస్తిత్త్వానికే ముప్పు ఎదురవుతున్న ఈ సమయంలో వారి పట్ల మనం సానుభూతితో వ్యవహరించాలి.
జాతిని తుదముట్టించే ప్రణాళికలు నిర్వహించకుండా ఇజ్రాయెలీలను ఆపే బాధ్యతను శక్తిమంతమైన దేశాలు భుజానికెత్తుకుంటాయా? అలా చేస్తే, అంతర్జాతీయ వ్యవస్థపై మళ్ళీ నమ్మకం నెలకొంటుంది. తాత్కాలిక విధానాలతోనే అన్నింటిని సద్దుపుచ్చే తత్వం నేడు ప్రపంచమంతటా కనిపిస్తోంది. ఆ జాడ్యం నుంచి దూరం జరిగేందుకు కూడా అది తోడ్పడవచ్చునని ఓ చిగురాశ!
ప్రొ‘‘ చందన గౌడ
వ్యాసకర్త డీన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, విద్యాశిల్ప్ యూనివర్సిటీ
(‘దక్కన్ హెరాల్డ్’ సౌజన్యంతో)