
కామెంట్
16 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించాలని యునైటెడ్ కింగ్‌డమ్ నిర్ణయించింది. స్కాట్లాండ్, వేల్స్ పార్లమెంటు ఎన్నికలకు ఇప్పటికే ఈ అర్హత అమలులో ఉంది. వయఃపరిమితి తగ్గింపు నిర్ణయం అనూహ్యమేం కాదు. లేబర్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలోనే ఈ వాగ్దానం చేసింది. దీని ఆమోదానికి అవసరమైన సంఖ్యాబలం ఆ ప్రభుత్వానికి ఉంది.
16 ఏళ్ల బ్రిటిషర్లకు దీంతో సమకూరే ఇతర హక్కులు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. జాతీయ ఎన్నికల్లో ఓటేయడమే కాకుండా, తల్లితండ్రుల అంగీకారం ఉంటే వారు పెళ్లి కూడా చేసుకోవచ్చు. సివిల్ భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చు కొనేందుకు అర్హులు.
ఇంట్లోంచి వెళ్లిపోయి స్వతంత్రంగా జీవించే హక్కు లభిస్తుంది. ట్రేడ్ యూనియన్‌లో చేరే హక్కు వస్తుంది. పన్నులు చెల్లిస్తారు. వెయి టర్‌గా పనిచేసే హక్కుంటుంది. రైళ్లలో ఇక హాఫ్ టికెట్ కుదరదు, ఫుల్ టికెట్ తీసుకోవాలి.
అయితే కొన్ని పనులు చేయడానికి వారికి ఇక మీదట కూడా అనుమతి ఉండదు. ఉదాహరణకు, వారు లాటరీ టికెట్లు కొనడం నిషేధం. తమంతట తాము కారు డ్రైవ్ చేయకూడదు. పబ్బులో కూర్చుని బీరు తాగకూడదు. అన్నింటికంటే ముఖ్యంగా, ఎన్నికల్లో పోటీ చేయడానికి పదహారేళ్ళ వారు అనర్హులు. అంటే తమకు తాము ఓటేసుకునే హక్కు ఉండదు. ఇదంతా సమాజంలో గందర గోళం సృష్టిస్తుంది అనుకుంటున్నారు కదూ? మీరే కాదు, బ్రిటన్ ప్రతిపక్ష మితవాదులు కూడా మీలానే అనుకుంటున్నారు.
దేశాన్ని ఎవరు పాలించాలో నిర్ణయించే అంతటి పరిపక్వత 16 ఏళ్ల వారికి ఉంటుందా అనేది కీలకమైన ప్రశ్న. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, తెలివితేటలతో అనే పదం నేను ఈ ప్రశ్నలో ఉపయోగించ లేదు. 20లు, 30లు, లేదా 50లు, 60ల వయసులో ప్రజలు తెలివితేటలతో నిర్ణయం తీసుకుంటున్నారా? ఉద్వేగంతోనే ఓటేస్తున్నారా? లేదా కేవలం ఆనవాయితీగానో, దురభిప్రాయంతోనో వ్యవహరిస్తున్నారా? ఎలా నిర్ణయం తీసుకున్నా పెద్దవారికి చెల్లుబాటు అయినప్పుడు 16 ఏళ్ల వారికి ఎందుక్కాకూడదు?
అయినా సరే, వారి పరిపక్వత సరిపోతుందా అనేది ప్రశ్నే. ఆ వయసు వారు కొందరికైనా సరే ఓటేసే పరిపక్వత ఉంటుంది. చాలా మంది పెద్దవారి కంటే వారు ఆలోచనాపరులు అని ‘యూకే యూత్ పార్లమెంట్’ చైర్‌పర్సన్ వ్యాఖ్యానించారు.
16 ఏళ్ల వారు ఇంకా మానసికంగా ఎదిగే దశలోనే ఉంటారని యాభై పైబడిన పెద్దవాడిని కాబట్టి నేను అలానే అనుకుంటాను. అనుభవం ద్వారా నేర్చుకునే వయసనీ అంటాను. ఆ నేర్చుకునేది... ఒప్పు లేదా తప్పు ఏదైనా కావచ్చు. 1970ల ప్రారంభంలో నాకది కచ్చితంగా వర్తిస్తుంది. ఇందిరా గాంధీ కాంగ్రెస్, ప్రతిపక్ష మహా కూటమి... రెంటిలో ఒకదాన్ని నేను అప్పట్లో అర్థవంతంగా ఎంచు కునేవాడినా? చాలామంది మాదిరిగానే నా తల్లిదండ్రుల అభిప్రా యాన్నే నా అభిప్రాయం చేసుకుని ఉండేవాడినా?
సొంత నిర్ణయం తీసుకునే చిన్న వాళ్లూ ఉంటారు. నేను కాదనను. కానీ, అధిక సంఖ్యాకులు తమ చుట్టూ ఉండే పెద్దవారి భావాలనే ఆమోదిస్తారు. వారితో ఏకీభవించడం లేదనీ, వారి కంటే ఎదిగిపోయామనీ తెలుసుకొనే వరకైనా అలా చేస్తారు.
ఎవరికి ఓటేయాలనేది మన ముందున్న పలు ప్రత్యామ్నా యాలను జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవలసిన విషయం. మరోసారి ఆలోచించండి. పెద్దవారు నిజంగా అలానే చేస్తున్నారా? 16 ఏళ్ల వారు ఎలా చేస్తారో అలానే మనం కూడా ఇతరుల ప్రభా వానికి లోనవటం వాస్తవం కాదా?
వాస్తవానికి ఇండియా 1989లో 18 ఏళ్ల వారికి ఓటు హక్కు ఇచ్చినప్పుడు ఇవే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. వ్యతిరేకుల సంశ యాలు అన్నీ తప్పని కాలం రుజువు చేసింది. ఇప్పుడూ అదే పున రావృతం అవుతుందా? పెద్దవారికి తేలిగ్గా మింగుడు పడని సత్యం ఏమిటంటే, ఇవ్వాళ్టి చిన్నవారు మనం ఆ వయసులో ఉన్నప్పటికంటే తెలివైనవారు.
ప్రతి తరమూ తన ముందటి తరం కంటే తెలివిగా ఉంటుంది. కావాలంటే స్మార్ట్ ఫోన్ పట్టుకున్న నాలుగేళ్ల పిల్లాడిని గమనించండి. నేను చెప్పేది నిజమని మీకు తెలుస్తుంది. అందుకే నేను బ్రిటిష్ వారిని మెచ్చుకుంటున్నా. మనం కూడా వారిలా అలాంటి నిర్ణయం తీసుకోవాలేమో!
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్