
విశ్లేషణ
హిరోషిమా, నాగసాకీలపై అణ్వస్త్ర ప్రయోగాలు జరిగిన 80 సంవత్సరాలకు తిరిగి అణ్వస్త్రాల ప్రస్తావనలు వస్తుండటం ప్రపంచాన్ని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నది. కాకతాళీయంగా ఈసారి కూడా ఆ ప్రస్తావనలు చేస్తున్న అమెరికా... రష్యా సమీపంలోని పసిఫిక్ మహాసముద్ర జలా లలోకి రెండు అణ్వస్త్ర జలాంతర్గాములను తరలించింది. ఈ విషయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొద్ది రోజుల క్రితం స్వయంగా ప్రకటించారు.
అక్కడి నుంచి దక్షిణాన అవే సముద్ర జలాలలో జపాన్ ఎంతో దూరంలో లేదు. ట్రంప్ చర్యలకు ప్రతిగా రష్యన్లు తమవద్ద గల ‘డెడ్ హ్యాండ్’ అణ్వస్త్ర వ్యవస్థ గురించి గుర్తు చేశారు. 1987 నుంచి గల అణ్వాయుధ క్షిపణుల నిరోధక ఒప్పందం నుంచి ఉపసంహరించుకున్నారు. ఇది ఈ 5వ తేదీ నాటి పరిణామం. ఇవన్నీ వెంటవెంటనే వారం రోజులలోపే జరిగిపోయాయి.
ఏమిటీ ‘డెడ్ హ్యాండ్’ వ్యవస్థ?
అమెరికా, రష్యాల మధ్య అణు యుద్ధం రాగల అవకాశం సాధారణ దృష్టికైతే కనిపించటం లేదు. ట్రంప్ ఒకవైపు అణు జలాంతర్గాముల మోహరింపునకు ఆదేశాలిస్తూనే, ‘డెడ్ హ్యాండ్’ ప్రస్తావ నలు చేస్తున్న రష్యా అటువంటి చర్యలకు పాల్పడగలదని భావించటం లేదనీ, అయినా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామనీ అన్నారు.
మరొకవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఈ తరహాలో అణు ప్రస్తావనలు ఎవరికీ మంచిది కాదన్నారు. ఆ విధంగా చూసినపుడు ఎవరికి వారు ఎంతో కొంత జాగ్రత్తలలోనే ఉన్నట్లు భావించాలి. అసలు విషయం ఇంత దూరం ఎందుకు వచ్చింది?
చర్చను ఒక తక్షణ విషయంతో ఆరంభిద్దాము. రష్యా తన ఉక్రెయిన్ యుద్ధాన్ని 10 రోజులలో ఆపివేసి శాంతి ఒప్పందంపై సంతకాలు చేసి తీరాలని అమెరికా అధ్యక్షుడు తనంతట తానే ఒక గడువు విధించారు. ఆ గడువు ఈనెల 9వ తేదీతో ముగుస్తుంది. కొన్ని రోజుల క్రితం ఇలాగే 50 రోజుల గడువు ప్రకటించారు.
బ్రెజిల్ అధ్యక్షుడు లూలా అన్నట్లు ప్రపంచానికి అన్ని విధాలా ఒక చక్రవర్తి వలె వ్యవహరిస్తున్న ట్రంప్, అందరికీ ఆదేశాలు, హెచ్చరికలను ఎడాపెడా జారీ చేస్తున్న తీరును చూస్తూనే ఉన్నాము. ట్రంప్ నుంచి ఇటువంటి ధోరణిని సహించలేని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు, మాజీ దేశాధ్యక్షుడు అయిన మెద్వెదేవ్ ఆయనకు తమ అణ్వస్త్ర శక్తిని, ‘డెడ్ హ్యాండ్’ పేరుతో గల అణు వ్యవస్థను గుర్తు చేశారు.
సాధారణ ప్రచారంలో లేని ‘డెడ్ హ్యాండ్’ వ్యవస్థ ఏమంటే, ఒకవేళ అమెరికా మొదటగా అణ్వస్త్రాలు ప్రయో గించి రష్యా రాజకీయ నాయకత్వాన్ని, సైనిక నాయకత్వాన్ని పూర్తిగా తుడిచి పెట్టినట్లయితే, తదనంతర చర్యలకు వారి నుంచి ఆదేశాలు అందని స్థితిలో, మొదటినుంచే మోహరించి ఉన్న అణ్వ స్త్రాలు అన్నీ వెంటనే తమంతట తాము అమెరికా, యూరప్‌లలోని తమ లక్ష్యాల వైపు క్షణాలలో దూసుకుపోతాయి.
నాయకత్వాల నుంచి ఆదేశాలు ఆగిపోయాయనే సంగతి అల్ట్రా లో ఫ్రీకెన్సీ రేడియో తరంగాల ద్వారా తెలుస్తుంది. ఆ తరంగాలను అమెరికా సహా ఎవరూ పసిగట్టలేరు, విశ్లేషించలేరు, హైజాక్ చేయలేరు, నిరోధించ లేరు. ట్రంప్‌కు మెద్వెదేవ్ ఇచ్చిన సందేశమది. అంతిమార్థం ఏమంటే, ట్రంప్ చర్యలు వినాశనానికి దారితీయవచ్చునని.
ప్రపంచం మొత్తానికీ యుద్ధమే!
అణుయుద్ధం అమెరికా, రష్యాల మధ్య అయితే తక్కిన ప్రపంచానికి సమస్య ఏమిటనే సందేహం కలగవచ్చు. 1945కూ, ఇప్పటికీ తేడాలున్నాయి. అపుడు అమెరికా ఏకైక అణుశక్తి. తర్వాత నాలు గేళ్లకు 1949లో రష్యా అణుశక్తి పరీక్షతో పరిస్థితులు మారసాగాయి. అమెరికా, రష్యాలు పరస్పరం పోటీపడి అణ్వస్త్రాల సంఖ్యను వేలకు వేలుగా పెంచటంతో పాటు అందులో కొత్త రకాలపై పరిశోధనలు నేటికీ జరుపుతున్నాయి.
అందులో, మొదటి విడత విధ్వంసం, దానిని తట్టుకుని రెండవ విడత విధ్వంసం, పరస్పర విధ్వంస శక్తి, యుద్ధ విమానాలు, సముద్ర జలాల నుంచి ప్రయోగాలు (ట్రయాడ్ వ్యవస్థ) అంటూ రెచ్చి పోయారు. ఈమధ్యలో మరొక అర డజన్ అణ్వస్త్ర దేశాలు తయారయ్యాయి. అటువంటి ఆయుధాలు అర డజను ఉన్నా చాలు విధ్వంసానికి అనే వివేకం కలగటంతో అణ్వస్త్ర పరిమితి ఒప్పందాలు, వాటి మోహరింపుల పరిమితిపై ఒప్పందాలు దశలు దశలుగా జరిగాయి.
వాటిలోని లోపాలను అట్లుంచితే, ప్రపంచం కొన్ని దశాబ్దా లుగా ఇతర యుద్ధాలు ఎట్లున్నా అణ్వస్త్ర ప్రయోగాలు లేక ప్రశాంతంగా ఉంది. అందుకు కారణం పరస్పర విధ్వంస శక్తి (మ్యూచు వల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్, లేదా మ్యాడ్) అని, ఆ విధంగా ‘బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్’ అనే స్థితి ఏర్పడిందని అంతా భావించారు. ఆ పరిస్థితు లలోనూ గమనించదగ్గవి కొన్ని జరిగాయి. ఎవరిపైనా అణ్వస్త్ర ప్రయోగపు ఆలోచనలు రష్యా చేయలేదు గానీ, వియత్నాం, ఉత్తర కొరియా, అఫ్గానిస్తాన్‌లు కొరకరాని కొయ్యలుగా మారటంతో అమె రికా అందుకు ఏర్పాట్లు కూడా సిద్ధం చేసి మళ్లీ వెనుకకు తగ్గింది.
అప్రమత్తత కలిగేనా?
ఇటువంటి చరిత్ర ఉన్నందువల్లనే ఇపుడు తిరిగి అమెరికా,అందులోనూ ట్రంప్ వంటి అనాలోచితుడు, చంచలచిత్తుడు, విపరీ తమైన అహంభావి ఆదేశాలతో అణుజలాంతర్గాములను ఇప్పటికే రష్యా సమీపానికి తరలించిందంటే, ప్రపంచవ్యాప్తంగా భయాందో ళనలు కలగటం సహజం. అణుయుద్ధం జరిగితే అది అమెరికా, రష్యాలకు పరిమితం కాదు. అమెరికా మిత్ర దేశాలను, రష్యా మిత్ర దేశాలను అనివార్యంగా అందులోకి లాగుతాయి.
భయంకరమైన స్థాయిలో వెలువడే అణుధార్మిక శక్తి ఇండియా సహా అన్ని దేశాలకూ వ్యాపిస్తుంది. దాని ప్రభావం అన్ని సముద్ర జలాలతో పాటు మొత్తం వాతావరణాన్ని ఎంతకాలంపాటు కలుషితం చేస్తుందో బహుశా నిపుణులు కూడా అంచనా వేయలేరు. 80 ఏళ్ల క్రితం నాటి హిరో షిమా ప్రభావాలు జపాన్‌లో నేటికీ ఉన్నాయి.
ఈ ప్రమాదకర పరిస్థితికి మూల కారణం, అమెరికా నాయ కత్వాన ‘నాటో’ దేశాలు ప్రత్యక్షంగా రష్యాను, పరోక్షంగా చైనాను లొంగదీసుకోవాలని భావించటంలో ఉంది. అందుకోసం చేస్తున్న రకరకాల ప్రయత్నాలలో భాగంగా ఉక్రెయిన్‌ను ఒక పావుగా ఉప యోగించుకుంటున్నారు. అది ఒక తప్పు కాగా, ఆ యుద్ధ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించలేకపోవటం ఒక వైఫల్యం.
రష్యాను ఎన్ని ఆంక్షలు విధించినా బలహీనపరచలేకపోవటం ఇంకొక వైఫల్యం అవుతుండగా, ట్యారిఫ్‌ల పేరిట రష్యా, ఇండియా, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వగైరాలను బెదిరించజూడటం అసమర్థ దుర్జనత్వమవుతున్నది. చివరకు అంతిమ ఆయుధంగా 50 రోజులు, 10 రోజుల గడువులు, అణు జలాంతర్గాముల స్థాయికి పతన మవుతూ యావత్ ప్రపంచాన్నే ప్రమాదంలోకి నెడుతున్నారు.
విచారకరం ఏమంటే, మన దేశంలో ఒకప్పుడు ఉన్నత స్థాయిలో ఉండిన ఈ అప్రమత్తత ఇటీవలి కాలంలో క్రమంగా తగ్గుతున్నది. వారు మళ్లీ అప్రమత్తులు కావటం 80 ఏళ్ల హిరోషిమా విషాదానికి తగిన నివాళి అవుతుంది.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు