తెలివి కన్నా ఎంపిక ముఖ్యం | Sakshi Guest Column On Jeff Bezos Speech On Princeton University Graduates | Sakshi
Sakshi News home page

తెలివి కన్నా ఎంపిక ముఖ్యం

Jul 29 2025 12:21 AM | Updated on Jul 29 2025 5:46 AM

Sakshi Guest Column On Jeff Bezos Speech On Princeton University Graduates

విశ్వ గురు

ప్రిన్స్‌టన్‌! ప్రతిష్ఠాత్మకమైన ప్రైవేట్‌ ఐవీ లీగ్‌ రిసెర్చ్‌ యూనివర్శిటీ! యూఎస్‌లోని న్యూజెర్సీలో ఉన్న 278 ఏళ్ల నాటి ఈ ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయ 2010 సంవత్సరపు పట్టభద్రుల బ్యాచ్‌ని ఉద్దేశించి ఆ ఏడాది మే నెలలో అమెజాన్‌ సంస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ ఉత్తేజ పూరితమైన ప్రసంగం చేశారు. పుట్టుకతో మనకున్న వరాలతోనా, లేక మనం ఎంచుకునే మార్గాలతోనా ఎలా ముందుకు సాగటం?... అనే ఆలోచనను తన ప్రసంగం ద్వారా – జీవితంలోకి ప్రవేశించ బోతున్న ఆ గ్రాడ్యుయేట్‌లలో – రేకెత్తించారు జెఫ్‌ బెజోస్‌. ఏనాటికీ పాత పడని ఆనాటి ఆయన ప్రసంగం... సంక్షిప్తంగా! 

చిన్నప్పుడు వేసవి సెలవులకు తాతయ్య, నానమ్మ దగ్గరకి టెక్సాస్‌ వెళ్లేవాడిని. వారికక్కడ పెద్ద కమతం ఉంది. గాలి మరలు బిగించడంలో, పశువులకు టీకాలు వేయటంలో, ఆ వ్యవసాయ క్షేత్రంలో ఇతర చిన్నా చితక పనులు చేయడంలో సాయపడేవాడిని. మా తాతయ్య, నానమ్మ ఒక సేవా కార్యక్రమాల కారవాన్‌ క్లబ్‌లో సభ్యులుగా ఉండేవారు. 

వారికో చైతన్య రథం లాంటిది ఉండేది. దానిలో అన్నపానాలకు, స్నానానికి, విశ్రమించేందుకు సదుపాయా లుండేవి. మా తాతయ్య కారుకి దాన్ని తగిలించేవాళ్లం. అందరూ కలసి దానిలో అమెరికా, కెనడాలలో పర్యటిస్తూ ఉండేవాళ్లం. సాధార ణంగా వేసవిలో నేను వారితో కలిసేవాడిని. తాతయ్య, నానమ్మ అంటే నాకు ప్రేమ. ఒక రకమైన ఆరాధన. వారితో కలసి తిరిగేందుకు ఆశగా ఎదురు చూస్తూండే వాడిని. 

ప్రతిదీ నాకు లెక్కే!
నాకు పదేళ్లప్పుడు చేసిన ఒక  ప్రయాణం బాగా గుర్తుంది. తాతయ్య కారు నడుపుతూంటే, నానమ్మ ఆయన పక్క సీట్లో కూర్చుంది. నేను వెనక సీట్లో దొర్లుతున్నా. ఈ ప్రయాణాల్లో ఆమె ఒకటే దమ్ము కొడుతూ ఉండేది. నాకు ఆ సిగరెట్ల వాసన గిట్టేది కాదు. అప్పట్లో నోటితో లెక్కలు కట్టేందుకు వచ్చిన ఏ అవకాశాన్నీ నేను వదులు కునేవాడిని కాను. పెట్రోల్‌ ఎన్ని కిలోమీటర్లకు సరిపోతుందో లెక్కవేయడం నుంచి సరుకులపై ఖర్చులను అంచనా వేయడం వరకు... పనికొచ్చేవీ, పనికిరానివీ అన్నీ లెక్కలు కడుతూండేవాడిని. 

ధూమపానం చేయగల హాని గురించి అంతకు ముందు నేనొక అడ్వర్టయిజ్‌మెంట్‌ చూశాను. ఇపుడు పూర్తి వివరాలు గుర్తు లేవు కానీ, ‘‘సిగరెట్‌ పొగ లోపలికి పీల్చినప్పుడల్లా మీ ఆయుర్దాయంలో కొన్ని నిమిషాలు హరించుకు పోతాయి’’ అని ఆ అడ్వర్టయిజ్‌మెంట్‌లో పేర్కొన్నట్లు మాత్రం గుర్తుంది. పొగ పీల్చి నప్పుడల్లా రెండు నిమిషాల ఆయుర్దాయం తగ్గిపోతుందని చెప్పారనుకుంటా. 

నానమ్మ కళ్లు చెమర్చాయి!
నానమ్మ రోజుకు ఎన్ని సిగరెట్లు కాలుస్తుందో అంచనా వేశా. ప్రతి సిగరెట్టుకు ఎన్నిసార్లు పొగని లోపలికి పీలుస్తారో లెక్కగట్టా. నేను సహేతుకమైన అంచనాకే వచ్చానని అనిపించిన తర్వాత,ముందుకు వంగి నానమ్మ భుజాన్ని తట్టి చాలా గొప్పగా ‘‘ప్రతి రెండు నిమిషాలకి ఒకసారి పొగని పీల్చావనుకుంటే, నీ ఆయు ర్ధాయంలో తొమ్మిదేళ్లు తగ్గిపోయినట్లు లెక్క’’ అన్నాను. 

దానిపై, నానమ్మ స్పందన నాకు బాగా గుర్తుంది. నా తెలివితేటలకి, అంక గణిత సామర్థ్యానికి నన్ను అభినందిస్తారనుకున్నా. ‘‘జెఫ్‌ నీ బుర్ర అసామాన్యం. కొన్ని క్లిష్టమైన లెక్కలు వేశావు. ఏడాదిలో ఎన్ని నిమి షాలుంటాయో గణించి, కొన్ని భాగహారాలు చేసి భలే అంచనాకు వచ్చావు’’ అని తాతయ్య నా భుజం తడతారు అనుకున్నా. 

అలాంటి దేమీ జరగలేదు. మా నానమ్మ కళ్లు చెమర్చాయి. కన్నీటి చుక్కలు రాలుతున్నాయి. నానమ్మ ఏడుస్తూంటే, వెనక సీట్లో కూర్చున్న నాకు ఏం చేయాలో తెలియలేదు. అంతవరకు మౌనంగా డ్రైవ్‌ చేస్తున్న తాతయ్య, కారుని నెమ్మదిగా రోడ్డు పక్కగా ఆపి, దిగి, వెనక డోర్‌ తెరిచారు. నేనూ దిగి ఆయనతో అడుగులు వేయాలన్నట్లు ఆయన నుంచి ఓ చూపు. 

‘‘జెఫ్‌! దయగా ఉండు!’’ 
కారు వెనుక తగిలించిన రథం పక్క నుంచున్న నా వంక ఓ క్షణం మౌనంగా చూసి తాతయ్య ‘‘జెఫ్‌! ఏదో ఒకరోజు, తెలివితేటలు చూప డంకన్నా, దయతో మసలడం చాలా కష్టమని గ్రహిస్తావు’’ అన్నారు! 

వరాలు ముఖ్యం కాదు!
ఈరోజు నేను వరాలు–ఎంపికల మధ్యనున్న తేడా గురించి మీకు చెప్పాలనుకుంటున్నా. తెలివి తేటలు మనిషికి ఒక వరం. దయను మాత్రం ఎంచుకోవలసిన విషయం. వరా లను తీసుకోవడం తేలిక. వాటిని ఎవరైనా ఇస్తారు. ఎంపికల విషయం వచ్చినప్పుడే కష్టమవుతుంది. మనం జాగ్రత్తగా లేకపోతే ఎవరైనా వరాలతో మనల్ని మభ్య పెట్ట వచ్చు. 

అలాంటి ప్రలోభాలకు లోనైతే, బహుశా, అది ఎంపికల విషయం వచ్చేసరికి మనకు విఘాతంగా పరిణమిస్తుంది. మీరంతా అనేక వరాలతో నిండిన బృందం. యుక్తితో, సామర్థ్యంతో కూడిన మెదడు మీ అందరికీ ఉండడం వాటిలో ఒకటి. అందులో నాకెలాంటి సందేహం లేదు. ఎందుకంటే, అడ్మిషన్‌ సంపాదించడానికే మిగిలిన వారితో మీరు పోటీపడి తీరాలి. మీలో తెలివితేటలున్నట్టు కనిపించ కపోతే అడ్మిషన్ల డీన్‌ మిమ్మల్ని లోపలకు అడుగుపెట్టనివ్వరు. 

‘ఎంపిక’లోనే... మీ శక్తి! 
వింతలు విశేషాల గడ్డపై తిరుగాడే మీకు మీ శక్తి యుక్తులు బాగా ఉపయోగపడతాయి. మనుషులమైన మనం, మనల్నే ఆశ్చర్యపరచే పనులు చేస్తూంటాం. కాలుష్య రహిత ఎనర్జీ ఉత్పాదక మార్గాల లాంటి వాటిని కనుగొంటాం. కణాల గోడల లోపలకి ప్రవేశించి, మరమ్మతులు చేయగల మెషీన్లను పరమాణువుల లాంటి చిన్న వాటితో కూర్పు చేస్తాం. 

మానవాళి చేస్తున్న పరిశోధనల ఫలితంగా ఇటువంటి వార్తలు వెలువడటం ఆశించదగ్గదే కావచ్చు కానీ, ఈ నెలలో మనం నిజంగానే, ఒక అసాధారణమైన వార్తను విన్నాం. జీవన వనరులను, ఆలోచనలను సమ్మిళితం సాధించాం. రానున్న కాలంలో లైఫ్‌ని ఇలా సింథసైజ్‌ చేయడమే కాదు, కోరుకున్న ప్రత్యే కాంశాలతో దాన్ని ఇంజనీర్‌ చేయగలుగుతాం. 

మానవ మెదడును అర్థం చేసుకోగల స్థితిని కూడా మీరు చూడగలుగుతారని నాకు నమ్మకం ఉంది. ఇపుడు మనలో చాలా మంది భావిస్తున్నట్లుగానే, గతించిన కాలాలకు చెందిన జ్యూల్స్‌ వర్న్, మార్క్‌ ట్వైన్, గెలీలియో, న్యూటన్‌ వంటి ఉత్సుకత కలిగిన వ్యక్తులు సజీవంగా ఉండాలని కోరుకుని ఉంటారు. 

ఒక నాగరికతగా మనకు అనేక శక్తి యుక్తులు న్నాయి. ఇపుడు నా ముందు కూర్చున్న మీలో కూడా అనేక మందికి గొప్ప శక్తి సామర్థ్యాలుండవచ్చు. ఈ వరాలను మీరు ఎలా విని యోగించుకుంటారు? ఉన్నవాటిని చూసుకుని గర్వపడతారా లేక మీరు ఎంచుకున్న వాటిపట్ల గర్వపడతారా? 

సక్సెస్‌ కావచ్చు, కాకపోవచ్చు!
అమెజాన్‌ ప్రారంభించాలనే ఆలోచన నాకు కొన్నేళ్ల క్రితం తట్టింది. వెబ్‌ వినియోగం ఏటా 2300 శాతం చొప్పున వృద్ధిచెందు తోందనే వాస్తవాన్ని గమనించాను. అంత వేగంగా మరోటి వృద్ధి చెందడాన్ని నేను కనలేదు. వినలేదు. లక్షలాది పుస్త కాలతో భౌతిక ప్రపంచంలో ఒక పుస్తక భాండా గారాన్ని నిర్వహించడం సాధ్యం కానిపని. అటు వంటిది అసంఖ్యాక పుస్తకా లతో ఒక ఆన్‌లైన్‌ బుక్‌ స్టోర్‌ను నిర్మించడమన్న ఆలోచనే నాలో ఎంతో ఉత్సుకత రేపింది. అప్పటికి నాకు 30 ఏళ్లు నిండాయి. పెళ్లయి ఏడాది అయింది. 

ఉద్యోగం వదిలేద్దా మనుకుంటున్నానని, ఈ కొత్త వ్యాపారం చేపడతానని నా భార్య మెకంజీకి చెప్పాను. అది ఫలించవచ్చు, ఫలించకపోవచ్చునని కూడా చెప్పేశా. ఎందుకంటే, చాలా భాగం అంకుర సంస్థల తీరు అలానే ఉంది. తర్వాత ఏమవుతుందో నాకూ తెలియదు. ఈ ప్రిన్స్‌టన్‌ విద్యాలయం నుంచే పట్టభద్రురా లైన మెకంజీ ఇప్పుడిక్కడ రెండవ వరుసలో కూర్చొనుంది. ధైర్యంగా అడుగు ముందుకు వేయాల్సిందిగా ఆమె నా వెన్ను తట్టింది. 

టైమ్‌ తీసుకుని ఆలోచించాలి!
నూనూగు మీసాల బాలుడిగా ఉన్నప్పుడే సిమెంట్‌ నిండిన టైర్లతో ఆటోమేటిక్‌ గేట్‌ క్లోజర్‌ కనిపెట్టా. సోలార్‌ కుక్కర్‌ తయారు చేశా. అది గొప్పగా ఏమీ పనిచేయలేదనుకోండి. అల్యూమినియం ఫాయిల్‌ రూపొందించా. వంటగదిలో వాడే బేకింగ్‌ అలారమ్‌లు తయారు చేశా. ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తది కనిపెట్టాలని నా అభి లాష. మెకంజీ దానికి అడ్డు చెప్పకుండా ప్రోత్సహిస్తూ వచ్చింది. 

అప్పటికి, న్యూయార్క్‌ నగరంలో ఒక ఫైనాన్షియల్‌ సంస్థలో కొందరు మెరికలతో కలసి, ఒక ప్రతిభావంతుడైన బాస్‌ కింద పనిచేస్తున్నా. ఆ బాస్‌ అంటే నాకు చాలా ఆరాధనా భావం. ఆయన వద్దకు వెళ్లి,ఇంటర్‌నెట్‌లో పుస్తకాలు అమ్మే కంపెనీని ప్రారంభించాలని అను కుంటున్నట్లు చెప్పా. ఇద్దరం మాట్లాడుకుంటూ సెంట్రల్‌ పార్క్‌లో చాలాసేపు నడిచాం. నా మాటలు శ్రద్ధగా ఆలకించిన ఆయన ‘‘అది గొప్ప ఐడియాగానే కనిపిస్తోంది. కానీ, గొప్ప ఉద్యోగం లేని ఎవరి కైనా అది మరింత గొప్ప ఐడియాగా భాసిస్తుందేమో చూడు’’ అన్నారు. 

ఆలోచించుకుని తుది నిర్ణయం తీసుకునేందుకు 48 గంటల గడువు నిచ్చారు. ఆయన మాటల్లోనూ వాస్తవం ఉందనిపించింది. కానీ, కష్టమని తోచినా, అడుగు ముందుకేయడానికే నిర్ణయించుకున్నా. ఏదైనా ప్రయత్నించి, విఫలమైతే బాధపడడం అన్నది నాకెప్పుడూ లేదు. అసలు, ప్రయత్నించి చూడకపోతేనే, అది నన్ను వెంటాడుతూ ఉంటుంది! ఎంతో ఆలోచించిన మీదట, అంత సురక్షితం కాని మార్గాన్నే ఎంచుకున్నా. కానీ, దానికి నేను గర్వపడుతూనే ఉంటా.

మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి!
రేపు మీరు నిజంగానే కొత్త జీవితానికి శ్రీకారం చుట్టబోతు న్నారు. మీ భవితవ్యాన్ని మీరే రాసుకో బోతున్నారు. మీకున్న ప్రతిభా సంపత్తులను మీరు ఎలా వినియోగించుకుంటారు? ఎటు వంటి మార్గాన్ని ఎంచుకుంటారు? స్తబ్ధుగా ఉంటూ ఎలా జరిగితే అలా జరుగుతుంది అనుకుంటారా? లేక దేనిమీద ప్రీతి ఉందో ఆ పనులు చేస్తారా? ఉన్నవాటిని పట్టుకుని వేలాడ తారా? లేక కొత్తదనం చూపేందుకు ప్రయత్ని స్తారా? సాఫీగా సాగిపోయే జీవితాన్ని ఎంచుకుంటారా? లేక సేవ, సాహసాలతో నిండినదాన్నా? మిమ్మల్ని విమర్శించినపుడు నీరసించిపోతారా?  లేక మీరు నమ్మినదాన్ని అనుసరించి ముందుకు సాగుతారా? తప్పు చేస్తే ఊకదంపుడుతో సమర్థించుకుంటారా? లేక క్షమాపణ కోరతారా? ప్రేమలో పడినపుడు ఎవరన్నా నిరాకరించినా మీ హృదయాన్ని కాపాడుకుంటారా? లేక భావోద్రేకాలతో వ్యవహరిస్తారా? సురక్షితంగా వ్యవహరించడం మంచిదనుకుంటారా? లేక కొద్దిగా సాహసంతో వ్యవహరిస్తారా? కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు విరమించుకుంటారా? లేక విడువ కుండా శ్రమిస్తారా? మీరు నిరాశా వాదా? లేక నిర్మాతా? ఇతరులను పణంగా పెట్టి తెలివి తేటలు ప్రదర్శిస్తారా? లేక దయతో వ్యవహరిస్తారా?
నేనొక జోస్యం చెప్పే సాహసం చేస్తా. 

80 ఏళ్ల వయసులో మీరు ప్రశాంత జీవితం గడుపుతూ ఒకసారి సింహావలోకనం చేసుకున్న ప్పుడు, అర్థవంతమైన మీ ఎంపికలే మీ జీవిత సంగ్రహం అవుతా యని మరచిపోకండి. మన ఎంపికలే మనల్ని రూపుకట్టిస్తాయి.మీ జీవితాన్ని ఒక విజయవంతమైన గాథగా మీరే తీర్చిదిద్దుకోండి. థ్యాంక్యూ అండ్‌ గుడ్‌ లక్‌! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement