
గతంలో రాజకీయాలు అంటే దేశ సేవ, ప్రజల కోసం పని చేయడం, న్యాయం కోసం పోరాటం అనే భావనలతో నిండిపోయిఉండేది. లాల్ బహదూర్ శాస్త్రి, గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభభాయ్ పటేల్, అంబే డ్కర్ వంటి చాలామంది నాయకులు రాజ కీయాలను దేశ పునర్నిర్మాణానికి వేదికగా మలచారు. పదవులను ప్రజలు తమపై
ఉంచిన అతి విలువైన బాధ్యతగా భావించి వారు. కానీ కాలం మారింది. ఆ ఆలోచనలు మరుగున పడి పోయాయి. ఇప్పుడు రాజకీయాలు అంటే, అధికారం కోసం పోటీ, డబ్బు సంపాదించేందుకు మార్గం, వ్యక్తిగత స్వప్రయోజనాల వేదికగా మారిపోయాయి. ఈ పరిణామం కేవలం మన దేశానికే కాదు, అనేక ప్రజాస్వామ్య దేశాలలోనూ కనిపిస్తోంది. మన దేశంలో, ఇది మరింత తీవ్రమవుతోంది.
ప్రజాస్వామ్య సూత్రాలకు వ్యతిరేకం
ఒకసారి రాజకీయ నాయకుడు అయిన తర్వాత, వారి ఆర్థిక బలం అమాంతం పెరిగిపోతుంది. పదవిలో ఉన్నవారికి లభించే వన రులు, అధికారాలు స్వార్థ ఆలోచనలకు దారి తీయడానికి ఉపయోగ పడుతున్నాయి.ఎన్నికల్లో విజయం సాధించడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఆ ఖర్చును తిరిగి సంపాదించేందుకు కాంట్రాక్టులు, కమీషన్లు, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరుగుతోంది. వారి వ్యక్తిగత వ్యాపారాలకు పదవిని వాడుకుంటున్నారు. ప్రజల బదు లుగా తమ లాభాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య మూల సూత్రాలకు వ్యతిరేకం.
ఎక్కువ మంది చెడు ఆలోచనలతో రాజకీయాలలోకి వస్తున్న కారణంగా, ఎవరైనా మంచి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినా, సమాజం అతడిని అనుమానంగా చూస్తోంది. ‘ఇతను డబ్బు, అధికారం కోసం వచ్చాడేమో’, ‘తన ఉద్దేశాలు నిజమా?’ అనే ప్రశ్నలు వస్తున్నాయి. దానితో సామర్థ్యం, యోగ్యత గల నాయకులూ రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోతున్నారు.
మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి ఎందుకు రావడం లేదు? ఎన్నికల్లో పోటీ చేయాలంటే కోట్ల రూపాయలు ఖర్చవుతుందని భావన. ఈ మధ్య పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు పదుల లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఇది భరించలేరు. 2019 లోక్‌సభ ఎన్నికలో – మొత్తం దేశవ్యాప్తంగా సుమారు 60,000 కోట్ల రూపాయలు ఖర్చయినట్టు అంచనా. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రజాస్వామ్య ఎన్నికగా గుర్తించబడింది. రాష్ట్ర స్థాయిలో, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని నియోజక వర్గాల్లో ఒక్కో అభ్యర్థి 10 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు సమాచారం. దీనివల్ల సామాన్యులకు, నిష్కల్మషమైన వారికి ఎదగడానికి అవకాశాలు రావడం లేదు.
నాయకులు ఎదిగేలా...
రాజకీయాలు దేశ అభివృద్ధికి మూలం. పాలనలో తగిన మార్గదర్శకత్వం ఉంటేనే ప్రజలకు మంచి విద్య, మెరుగైన వైద్యం, ఉద్యోగ అవకాశాలు, మహిళల భద్రత, రైతుల సంక్షేమం వంటివి అందుతాయి. పాలన బాగుండాలి అంటే నాయకులు బాగుండాలి. మరి మంచి వ్యక్తులను రాజకీయాల్లోకి తేవడం ఎలా సాధ్యం? ప్రభుత్వమే కొంతవరకు ఖర్చును భరించాలి. ఎన్నికల్లో ఖర్చు అదుపులో ఉంటే, సామాన్యులూ పోటీ చేయగలుగుతారు. చిన్ననాటి నుంచే ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు గురించి విద్యార్థులకు బోధించాలి.
యువత సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి. నాయకత్వ లక్షణాలను ఎదగనివ్వాలి. ఆసక్తి గల యువతకు తగిన శిక్షణ ఇప్పించాలి. నిజాయితీ గల నాయకులను ఆదర్శంగా చూపించడం ద్వారా మరిన్ని మంచి వ్యక్తులు ప్రేరణ పొందుతారు. వ్యక్తిగత, పార్టీల దూషణలకు పోకుండా సమాజంలోని సమస్యలు, వాటి పరిష్కా రాలకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రచారం చేయాలి. మంచి వ్యక్తులు రాజకీయ పార్టీలకు చెందకపోయినా, స్వతంత్ర అభ్య ర్థులుగా పోటీ చేస్తే, ప్రజలు వారికి మద్దతివ్వాలి.
ప్రజాస్వామ్యంలో అధికారం ఓటర్లదే. కానీ ఓటుతో పాటు బాధ్యత కూడా మనదే. దేశ పాలన మెరుగవ్వాలంటే మంచి నాయ కులకు మద్దతు ఇవ్వాలి. మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించాలి. మనం తీసుకునే ఒక నిర్ణయం దేశ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. అందుకే పౌరుడిగా దేశ భవిష్యత్తును మెరుగు పరచే బాధ్యత మనపై ఉంది.
నాయకత్వం అంటే పదవి కాదు, అది బాధ్యత. ఒక నిజమైన నాయకుడు ప్రజల సమస్యలను విని, వాటికి పరిష్కారం చూపే విధంగా పనిచేయాలి. ప్రజల పట్ల బాధ్యతతో, నిస్వార్థంగా, నిజా యితీతో ఉండే వ్యక్తులే మంచి నాయకులవుతారు. దేశానికి అవసరం అయినది – సేవాభావంతో పనిచేసే నాయకులు. అలాంటి నైపుణ్యం ఉన్నవారు ఎక్కడైనా ఉండవచ్చు – డాక్టర్లు, ఇంజినీర్లు, ఉపాధ్యా యులు, రైతులు, ఉద్యోగులు. వీరి అనుభవం సమాజానికి ఎంతో మేలు చేస్తుంది. పాలన అనేది కేవలం రాజకీయ నాయకుల పని కాదు. అది చైతన్యవంతులైన ప్రతి పౌరుడి బాధ్యత. సమాజానికి ఉపయోగపడాలనే సంకల్పంతో ముందుకు వచ్చేవారు మాత్రమే ప్రజలకు నిజమైన మార్గదర్శకులవుతారు. అలాంటి వారికి మద్దతు ఇవ్వాలి. అప్పుడే దేశం నిజమైన అభివృద్ధి దిశగా నడుస్తుంది.
నిలదీతే మార్గం
మంచి రాజకీయం కోసం పౌరులుగా మన మొదటి బాధ్యత ఓటు హక్కు వినియోగం. ఓటు వేయడం కేవలం హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా. మన సమాజానికి శ్రేయస్కరంగా పనిచేసే నాయకులను ఎంచుకోవాలి. ఓటు వేయకపోవడం లేదా ప్రలోభా లకు లొంగి ఓటు వేయడం మన భవిష్యత్తుకే ప్రమాదం.రాజకీయాలలో అవినీతి పెరిగిపోతున్నదంటే, దానికి కారణం సరైన నాయకులను ఎన్నుకోకపోవడమే. వారు ఎవరైనా సరే – వారి వర్గం, కులం, పార్టీని పక్కన పెట్టి, వారి సేవా దృక్పథాన్ని పరిశీలించి ఓటు వేయాలి. ప్రశ్నించే ధైర్యంకూడా మన బాధ్యతలలో ఒకటి. అధికారంలో ఉన్నవారు ప్రజల సేవకు వచ్చారు... వాళ్ల పని తీరును ప్రశ్నించాలి, తప్పుంటే నిలదీయాలి. ప్రజలు నిశ్శబ్దంగాఉంటే, పాలకులు తప్పుడు దారిలో వెళ్తారు.
అంతేకాక, యువత రాజకీయాల్లోకి రావాలి. విద్యావంతులు, విలువలతో కూడిన వ్యక్తులు రాజకీయాల్లోకి అడుగుపెడితేనే మార్పు వస్తుంది. దేశం ఎలా ఉండాలన్నది మన చేతుల్లో ఉంది. మంచి రాజకీయ వాతావరణం కోసం ప్రతి పౌరుడు చైతన్యంతో, నైతికంగా, బాధ్యతగా ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే, పౌరుల భాగస్వామ్యం అత్యంత అవసరం. ఒక మంచి దేశం కోసం, మంచి నాయకత్వం అవసరం. ఒక మంచి నాయకత్వం కోసం, మనం ముందడుగు వేయాలి.
-వ్యాసకర్త ‘ఏకలవ్య ఫౌండేషన్’ ఛైర్మన్ pvg2020@gmail.com
-పి. వేణుగోపాల్‌రెడ్డి