
విశ్లేషణ
ప్రభుత్వం గత పదేళ్ళుగా పెట్టుబడి వ్యయాన్ని రక్షణతోపాటు మరో రెండు రంగాలపై కేంద్రీకరించింది. ఆ రెండూ రోడ్లు, రైల్వేలు. తిరిగి రైల్వేలలో కూడా వేగంగా వెళ్ళే అధునాతన రైళ్ళను ప్రవేశ పెట్టడం, నూతన మార్గాలను జోడించడం, మెట్రో వ్యవస్థలను అభివృద్ధి చేయడంపైన చాలా వరకు దృష్టి పెట్టారు. రైల్వేలపై ప్రభుత్వ వ్యయం కొనసాగే అవకాశం ఉంది. రైళ్ళ విషయంలో ఆదర్శంగా తీసుకోదగిన ఇతర దేశాలలోని సేవలను మన దేశంలో కూడా అందించే విధంగా సంస్కరణలపై దృష్టి పెట్టడానికి ఇదే అనువైన సమయం.
ముఖ్యంగా రెండు విభాగాలు ఈ సందర్భంగా మదిలో మెదు లుతాయి. రైల్వేల పనితీరుకు సంబంధించి నిర్దిష్ట కోణాలలో మొత్తంగా వ్యవస్థలను సంస్కరించవలసి ఉంది. ఇది మొదటగా చేయాల్సిన పని. దీనివల్ల ప్రయాణికులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన సేవలందుతాయి. భద్రతా పెరుగుతుంది. రెండు: రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ. ఫలితంగా, రైల్వేలకు కొంత రాబడి దక్కుతుంది. నూతన రాబడి మార్గాలను సృష్టించుకునేందుకు ఉన్న ఆస్తులను వినియోగించుకునే కేటగిరీలోకి ఇది వస్తుంది.
తీసుకోవాల్సిన భద్రతా చర్యలు
గత ఏడాది నుంచి చోటుచేసుకుంటున్న వివిధ సంఘటనల పాఠాలు భద్రతపైన కూడా దృష్టి పెట్టాలని హెచ్చరిస్తున్నాయి.
అందుకే: 1. సబర్బన్ రైళ్ళ బోగీలకు ఆటోమేటిక్ తలుపులను అమర్చాలి. దీనివల్ల రైళ్ళలో వెళుతున్నప్పుడు ప్రయాణికులు గాయపడే అవకాశాలు తగ్గుతాయి. 2. సుదూరాలకు పయనించే రైళ్ళలో జనరల్ బోగీలు వాటి సామర్థ్యానికి మించి కిటకిటలాడుతూ ఉంటాయి.
ఇది ప్రయాణికుల మధ్య సిగపట్లకు, కొండొకచో ప్రమాదాలకు కారణమవుతోంది. అన్ని టికెట్లనూ రిజర్వేషన్ల ప్రాతిపదికనే విక్రయించాలి. 3. పట్టాలు, సిగ్నలింగ్ వంటివాటిలో లోపాల వల్ల సంభవిస్తూ వచ్చిన ప్రమాదాలను నివారించేందుకు భద్రతా పరిక రాలను ప్రథమ శ్రేణికి చెందిన వాటినే వినియోగించాలి.
4. విసర్జించినవి సాఫీగా వెళ్ళిపోయేందుకు వీలుగా మరుగుదొడ్ల వ్యవస్థలను ఆధునీకరించేందుకు బోగీలను పూర్తిగా మార్చాలి లేదా తగిన మార్పులు చేపట్టాలి. 5. విమానాశ్రయాల మాదిరిగానే అన్ని రైల్వే స్టేషన్ల చుట్టూ పూర్తిగా కంచెను ఏర్పాటు చేయాలి. ప్రహరీని దాటి ప్రయాణికులు మాత్రమే లోపలికి ప్రవేశించే వీలుండాలి. 6. చివ రగా, ప్రభుత్వం మూలధన వ్యయంలో కొంత భాగాన్ని ప్లాట్ ఫారాల నిడివిని, ఎత్తును పెంచేందుకు వినియోగించాలి. దీంతో ప్రయాణికులు చాలా బోగీలున్న రైళ్ళను కూడా సురక్షితంగా ఎక్కగలుగుతారు, దిగగలుగుతారు.
ఇవన్నీ ప్రాథమిక పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించుకునేందుకు ఉపయోగపడే సూచనలు. బడ్జెట్‌లో తగు కేటాయింపులతో సులభంగా ఈ సదుపాయాలు కల్పించుకోవచ్చు.
చేయాల్సిన కొన్ని సంస్కరణలు
రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ మరో పార్శ్వం. విమానాశ్రయాల విషయంలో అనుసరించిన పద్ధతినే వీటికీ వర్తింపజేయవచ్చు. సదు పాయాలు పెంచి యూజర్ చార్జీలు వసూలు చేసుకోవచ్చు. చార్జీలు పెంచినా, అవి ప్రయాణికుల సంఖ్యపై అరుదుగానే ప్రభావం చూపడం మన దేశంలో గమనించవచ్చు. దేశంలోని చాలా ప్రాంతా లను రైల్వేలే అనుసంధానపరుస్తూండటం దానికి కారణం.
1. ప్రయాణికులకు మాత్రమే స్టేషన్ల లోపలికి ప్రవేశం ఉండాలి. టికెట్ కోడ్ చూపిస్తేనే తలుపులు తెరచుకునేటట్లు చేయవచ్చు. విజిటర్ల సంఖ్యను వీలైనంత పరిమితం చేయాలి. ప్రయాణికులలో అన్ని వయసులవారు ఉంటారు కాబట్టి, వారికి తోడుగా వచ్చేవారిని నివారించడం సాధ్యం కాకపోవచ్చు. ప్లాట్ ఫారమ్ టికెట్ ధరను పెంచితే, వీడ్కోలు పలకడానికి వచ్చేవారి సంఖ్య దానంతట అదే తగ్గుతుంది. 2. పోర్టర్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. నిర్ణయించిన ధరలను పోర్టర్లకు తప్పనిసరి చేయాలి.
అదే సమయంలో, లిఫ్టులు, ఎస్కలేటర్లను ప్రవేశపెడితే, ప్రయాణికులు వారి లగేజీని వారే తీసుకెళ్ళగలుగుతారు. 3. స్టేషన్ల వద్ద దోపిడీకి వీలు కల్పిస్తున్న మరో అంశం ట్యాక్సీలు. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌తో ్రíపీ–పెయిడ్ సౌకర్యాన్ని అన్ని స్టేషన్ల వద్ద కల్పించాలి. ఫలితంగా, ఎంత వసూలు చేస్తున్నారో తక్షణం తెలిసిపోతుంది. 4. రుచికి, శుచికి పూచీవహించే విధంగా అల్పాహార శాలలను పునర్వ్యవస్థీకరించాలి.
దుకాణాల సంఖ్య, ధరల విషయాన్ని స్టేషన్ డెవలపర్‌కు విడిచి పెట్టవచ్చు. ప్రయాణికులలో అత్యధిక సంఖ్యాకుల ఆర్థిక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తినుబండారాల ధరలను తక్కువ స్థాయిలో నిర్ణయించడం సముచితంగా ఉంటుంది. కావాలంటే, ఉన్నత తరగ తుల బోగీల్లో ప్రయాణించేవారికి వేరే దుకాణాలు పెట్టవచ్చు.
కనులకు ఇంపుగా, అనుభవానికి పసందుగా ఉండే ఈ ప్రధాన రూపాంతరీకరణకు డబ్బులు ఖర్చయ్యే మాట నిజమే. విమానయాన సంస్థల మాదిరిగానే యూజర్ చార్జీల ద్వారా ఆ డబ్బును తిరిగి రాబట్టుకోవచ్చు. స్థూలంగా చెప్పాలంటే, ఈ ఏడాది దాదాపు 350 కోట్లమంది సుదూరాలకు వెళ్ళే రైళ్లలో ప్రయాణిస్తున్నారు అనుకుందాం.
వారిలో 300 కోట్ల మంది ద్వితీయ తరగతిలో, 50 కోట్ల మంది అప్పర్ క్లాస్‌లో ప్రయాణిస్తారని భావిద్దాం. హయ్యర్ క్లాసుల వారి నుంచి సగటున రూ. 200, సెకండ్ క్లాస్ వారి నుంచి రూ. 50 చొప్పున వసూలు చేసినా ఏడాదికి రూ. 25,000 కోట్ల ఆదాయం అదనంగా లభిస్తుంది.
ఈ విషయంలో రకరకాల సమీకరణాలు రూపొందించు కోవచ్చు. ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామి మధ్య వాటిని పంచు కోవచ్చు. ఒకవేళ రైల్వే స్టేషన్లను ప్రైవేటు వ్యక్తులకు వేలం వేస్తే వారే ఆ లెక్కలు చూసుకుంటారు. ఈ రెండు ఐడియాలను వచ్చే పదేళ్ళలో దేశవ్యాప్తంగా అమలుపరచే దిశగా కృషి చేయాలి. అది తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుంది.
మదన్ సబ్నవీస్
వ్యాసకర్త ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’లో చీఫ్ ఎకనామిస్ట్, ‘కార్పొరేట్ క్విర్క్స్: ద డార్కర్ సైడ్ ఆఫ్ ద సన్’ పుస్తక రచయిత (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో)