
విశ్లేషణ
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ నెల 15న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో, 18 నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో పాటు యూరోపియన్ నాయ కులతో జరిపిన చర్చలు ఆశాభావాన్ని కలిగిస్తున్నాయి. అందుకు సంబంధించి ఉండిన చివరి అనుమానాలు 18 నాటి వైట్ హౌస్ సమావేశంతో తీరిపోయాయి. అంతకుముందు 15న అలాస్కాలో ట్రంప్, పుతిన్‌ల మధ్య జరిగిన చర్చలలో కనిపించిన సానుకూలతను జెలెన్‌స్కీతో పాటు యూరోపియన్ నాయకులు వైట్‌హౌస్ సమావేశంలో భంగపరచవచ్చుననే సందేహా లుండేవి.
శాంతి ప్రయత్నాలకు ముందు కాల్పుల విరమణ జరిగి తీరాలనే పట్టుదలతో ఉండిన ఆ బృందం, ట్రంప్ ఆలోచనను తిరిగి మార్చవచ్చుననే భావన చాలా మందికి కలిగింది. కానీ, అది గ్రహించి కావచ్చు 18 నాటి చర్చలకు ముందు రాత్రే ట్రంప్, కేవలం కాల్పుల విరమణ వల్ల ఉపయోగం లేదనీ, పూర్తి స్థాయిలో శాంతి కోసం ప్రయత్నం జరగాలనీ స్పష్టం చేశారు.
పుతిన్ వాదనను అంగీకరించిన ట్రంప్
అంతిమంగా అలాస్కా, వైట్ హౌస్ భేటీల సారాంశం ఏమిటి? మూడేళ్లుగా సాగుతున్న యుద్ధంపై అమెరికా, రష్యా అధ్యక్షులు మొదటిసారి సమావేశమయ్యారు. వెంటనే కాల్పుల విరమణకు పుతిన్‌ను ఒత్తిడి చేయగలనని, అందుకు సమ్మతించని పక్షంలో తీవ్ర మైన చర్యలు తీసుకోగలనంటూ వెళ్లారు ట్రంప్. అక్కడ మూడు గంటల చర్చలలో పుతిన్ ఇచ్చిన సుదీర్ఘమైన వివరణలతో పూర్తిగా సంతృప్తి చెంది, కాల్పుల విరమణ వల్ల ప్రయోజనం లేదని,సంపూర్ణ స్థాయిలో శాంతి సాధనే సరైన మార్గమనే వాదనతో అంగీ కరించారు.
చంచల స్వభావిగా పేరున్న ఆయన అటువంటి అభిప్రా యంపై స్థిరపడటం ఈ కథాక్రమంలోని కీలకమైన మలుపు. పుతిన్ వాదన నచ్చినప్పటికీ అట్లా స్థిరపడక పోయి ఉంటే, యూరోపియన్ల సమావేశంలో తన ఆలోచనను తిరిగి మార్చుకునే వారేమో! అపుడు విషయం మళ్లీ మొదటికి వచ్చేది. జర్మనీ ఛాన్స్‌లర్ ఫ్రెడరిక్ షుల్జ్, యూరోపియన్ నాయకుల తరఫున మాట్లాడుతూ, శాంతి చర్చల కన్నా ముందు కాల్పుల విరమణ తప్పనిసరియని వాదించారు. కానీ ట్రంప్ జర్మనీ ఛాన్స్‌లర్ మాటను తోసిపుచ్చారు.
ఈ ఒక్క విషయమే ఇంతగా చెప్పుకోవటం ఎందుకంటే, ఈ దశలో మొత్తం విషయమంతా అమెరికా అధ్యక్షుడు ఎవరి వాదనను అంగీకరించి ముందుకు పోగలరన్న దానిపైనే ఆధారపడి ఉంది. ఇపుడు రెండు చర్చల అనంతరం అందుకు స్పష్టత వచ్చినందున ఇతర విషయాలను చూద్దాము. అవి ప్రధానంగా మూడు. ఒకటి– రష్యా కోరుతున్న భూభాగాలను ఉక్రెయిన్ వదలుకోవటం; రెండు– ఉక్రెయిన్ ‘నాటో’లో చేరకపోవటం; మూడు– ఉక్రెయిన్‌కు భవిష్యత్తులో భద్రత కోసం రక్షణ హామీలు లభించటం.
ఈ మూడు అంశాలు కూడా అలాస్కాలో, వైట్ హౌస్‌లో ప్రస్తావనకు వచ్చాయి. రష్యా తాను ఇప్పటికే పూర్తిగానో, పాక్షికంగానో ఆక్రమించిన క్రిమియా, డొనెటెస్క్, జపోరిజిజియా, ఖేర్సాన్, లుహాన్‌స్క్, ఖార్కివ్ ప్రాంతాలను తమకు అప్పగించటం, ఆ యా నియంత్రణ రేఖలను అదే స్థాయిలో స్తంభింపజేయటం జరగాలని కోరుతున్నది. అవి అన్నీ కాకపోయినా ఏదో ఒక మేరకు వదులుకోవాలని ట్రంప్ మొదటినుంచి అంటున్నారు.
యూరోపియన్ నాయకుల వైఖరి ఇంచుమించు అదే! వైట్ హౌస్ చర్చల సందర్భంలో అవుననక, కాదనక... అది జెలెన్‌స్కీ తేల్చుకోవలసిన విషయమని వదలి వేశారు. భూభాగాలను వదలుకొనే ప్రసక్తి లేదని జెలెన్‌స్కీ అంటూనే, అది తనకు, పుతిన్‌కు, ట్రంప్‌కు మధ్య త్రైపాక్షిక చర్చ లలో తేలుతుందని మరొకవైపు సూచిస్తున్నారు. ఈ పరిణామాల న్నింటినీ పరిగణనలోకి తీసుకున్నపుడు, రష్యా డిమాండ్లలో ఒకటి కొలిక్కి రాగల అవకాశాలు సూత్రరీత్యా కనిపిస్తున్నాయి.
ఉక్రెయిన్ ‘నాటో’లో చేరకూడదు...
‘నాటో’లో ఉక్రెయిన్ సభ్యత్వం విషయానికి వస్తే, రష్యా డిమాండ్‌కు అమెరికా అధ్యక్షుడు మొదటి నుంచీ సానుకూలంగా ఉన్నారు. అసలు ఉక్రెయిన్ ఆ సంస్థలో చేరాలనుకోవటమే రష్యా అభద్రతా భావానికి, ఈ దాడికి మూల కారణమని కూడా అన్నారు. అటువంటి వైఖరి తీసుకున్న తర్వాత ఇక ఉక్రెయిన్ ఆ సైనిక కూట మిలో చేరగల అవకాశం ఉండదు. వాస్తవానికి అందులో చేరాలనే మాట ఉక్రెయిన్ రాజ్యాంగంలో లాంఛనంగా ఉన్నప్పటికీ, ఆ పట్టుదల యూరోపియన్ దేశాలదే! రష్యాను క్రమంగా చుట్టుముట్టి, ఛిన్నాభిన్నం చేయాలన్నది వారికి గతం నుంచి గల దీర్ఘకాలిక ప్రణాళిక.
అయితే, ఈ ఒప్పందాల క్రమంలో ఉక్రెయిన్ తామిక ‘నాటో’లో చేరబోమంటూ రాజ్యాంగపరంగా ప్రకటించవలసి ఉంటుందన్నది రష్యా డిమాండ్. అది జరగాలని ట్రంప్ కూడా ఒత్తిడి చేయవచ్చు. అదే జరిగితే యూరోపియన్ నాయకులు చేయ గలిగింది ఉండదు. ఆ విధంగా శాంతి సాధనకు మరొక అడ్డంకి తొలగిపోతుంది. ఉక్రెయిన్‌లోని రష్యన్ జాతీయుల హక్కుల పరి రక్షణ వంటి మరికొన్ని అంశాలు ఉన్నాయి గానీ, ఇతరత్రా గల ప్రధాన సమస్యలు పరిష్కారమైనపుడు అవీ కావచ్చు.
ఉక్రెయిన్‌కు ఆందోళనకరంగా ఉన్న ప్రధానాంశం తమ రక్షణ. చర్చలలో రష్యా అధ్యక్షుడు మొట్టమొదటిసారిగా అందుకు కొన్ని సడలింపులు చూపటం శాంతి సాధనకు మార్గాన్ని సుగమం చేసింది. అక్కడ ట్రంప్‌తో పుతిన్ మాట్లాడుతూ, ఉక్రెయిన్‌కు భద్రత ఏర్పడటం తప్పనిసరి అవసరమని, అక్కడి ప్రజల మూలాలూ తమ ప్రజల మూలాలూ ఒకటేనని, కనుక వారికి రక్షణ ఏర్పాట్లకు ఎటు వంటి అభ్యంతరమూ లేదని అన్నారు. ఆ భద్రత ఏ రూపంలోన న్నది ప్రశ్న. ‘నాటో’లో చేరేందుకు వీలు లేదన్న పుతిన్ డిమాండ్‌ను ట్రంప్ అంగీకరించారు.
అట్లా చేరకపోయినా 5వ ఆర్టికల్‌ను పోలిన రక్షణలు కల్పించగలమని ట్రంప్ సూచించగా అందుకు పుతిన్ సమ్మతించారు. ఆర్టికల్ 5 అనే మాట ప్రచారంలోకి వచ్చినట్లు అందులోని వివరాలు ప్రచారంలోకి రాలేదు గానీ, అవి గమనించ దగ్గవి. నాటోలోని ఏ దేశంపై అయినా బయటి దేశం దాడి జరిపితే అది మొత్తం నాటో కూటమిపై జరిగిన దాడిగా పరిగణించి అందరూ ఆ దేశానికి మద్దతుగా కదలివస్తారు.
కానీ దాని అర్థం అందరూ యుద్ధంలో ప్రవేశిస్తారని కాదు. ఎవరు ఏ రూపంలో పాల్గొంటారన్నది వారి నిర్ణయం. ఉక్రెయిన్ నాటోలో లేకపోయినా అమెరికా సహా అందరూ తమ తమ సహాయాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో గుర్తించవలసింది మరొకటి ఏమంటే, ఉక్రెయిన్‌కు అంద జేసే ఆయుధాలన్నీ ఖరీదుకేగానీ ఉచితంగా కాదు.
వైట్‌హౌస్ చర్చలు సానుకూలంగా ఉన్నట్లు భావించిన ట్రంప్ ఆ వెంటనే పుతిన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఇక ఇరుపక్షాలూ సన్నద్ధమైతే మొదట రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య ద్వైపాక్షికంగా, తర్వాత అమెరికా అధ్యక్షుని చేరికతో త్రైపాక్షికంగా చర్చలు జరుగు తాయి. శాంతి దిశగా అడుగులైతే పడుతున్నాయి. ఇందుకు తిరిగి ఏ భంగమూ కలగదని ఆశించాలి.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు