
అభిప్రాయం
మహారాష్ట్రలోని మాలెగావ్‌లో 2008 సెప్టెంబర్ 29న జరిగిన బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా పదిహేడేళ్లుగా విచారణను ఎదుర్కొంటున్న ఏడుగురు నింది తులు నేరం చేశారని ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయిందని ముంబైలోని ప్రత్యేక ఎన్‌ఐఏ న్యాయస్థానం న్యాయమూర్తి ఏకే లాహోటీ ఈ ఏడాది జూలై 31న తీర్పు ప్రకటించారు. ఆరుగురి మరణానికీ, వంద మంది దాకా గాయపడటానికీ కారణమైన ఆ నేరం ఎవరు చేశారో ఇప్పటికీ బయటపడలేదు! ఈ కేసు గురించీ, విచారణ క్రమం గురించీ, తీర్పు గురించీ ఆలోచించవలసిన అంశాలెన్నో!
ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే మాలెగావ్‌లో ఒక మసీదు సమీపంలో మోటార్ సైకిల్‌కు అమర్చిన బాంబులు పేలి, ఆరుగురు మరణించిన ఆ కేసు దర్యాప్తును అప్పటి ప్రభుత్వం మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటి ఎస్)కు అప్పగించింది. అప్పటి ఏటిఎస్ అధిపతి హేమంత్ కర్కరే నాయకత్వంలో ఆ దర్యాప్తు జరిగి అక్టోబర్–నవంబర్‌లలో 11 మంది అనుమానితులను అరెస్టు చేశారు.
అరెస్టయిన వారిలో అఖిల భారత విద్యార్థి పరిషత్ మాజీ నాయ కురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, మతాచార్యులు దయా నంద పాండే అలియాస్ స్వామి అమృతానంద, రిటైర్డ్ సైనికాధికారి మేజర్ రమేశ్ ఉపాధ్యాయ, అప్పటికి సైన్యంలో పని చేస్తున్న అధికారి లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ ఉన్నారు.
వారిలో అత్యధికులు ‘అభినవ భారత్’ అనే సంస్థ సభ్యులనీ, ఆ సంస్థ హిందూ రాజ్య స్థాపన లక్ష్యంతో విధ్వంసాలకు పూనుకుంటున్నదనీ ఏటిఎస్ అధి కారి హేమంత్ కర్కరే చెప్పారు. ఈ సంస్థకు, అనుబంధ సంస్థలకు దేశంలో 19 చోట్ల జరిగిన పేలుళ్లతో సంబంధం ఉందని తేలిందని కూడా కర్కరే అన్నారు.
అప్పటికి రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉండిన భారతీయ జనతా పార్టీ, శివసేనలు ఇదంతా కాంగ్రెస్ పన్నాగమనీ, కేసు దర్యాప్తు ఇలా సాగించిన హేమంత్ కర్కరే ‘దేశద్రోహి’ అనీ ప్రకటించారు. అప్పటి గుజరాత్ సీఎం మోదీ ఏటిఎస్ దర్యాప్తు మన సైనిక బలగాల నైతిక ధృతిని కించపరిచేలా ఉందని విమర్శించారు.
ఈ దర్యాప్తు వివరాలు బయటపెట్టి, నిందితులను అరెస్టు చేసిన నెల రోజుల తర్వాత ముంబా యిపై తీవ్రవాద దాడిలో హేమంత్ కర్కరేను గురిచూసి కాల్చి చంపారు. ఆయన తీవ్రవాదుల కాల్పుల్లో చనిపోయా రనే అభిప్రాయం ఎంత ఉందో, ఆయన హత్య వెనుక కుట్ర ఉందనే అభిప్రాయం అంత ఉంది. ఆయన చనిపోగానే తన ‘శాపం వల్లనే చనిపోయాడ’ని సాధ్వి అన్న మాటలు ఆ అనుమానాలకు ఆజ్యం పోశాయి.
మరొకవైపు, ఏటిఎస్ 2009 జనవరి 20న పదకొండు మంది నిందితుల మీద చార్జిషీట్ దాఖలు చేసింది. అప్పటికి ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పింది. 2011 ఏప్రిల్‌లో ఈ కేసును ఎన్‌ఐఏ తన పరిధిలోకి తీసుకుని, 2012లో మరొక ఇద్దరిని అరెస్టు చేసి నిందితుల సంఖ్యను 14కు చేర్చింది. 2016 మేలో ఎన్‌ఐఏ కొత్త ఛార్జిషీట్ తయారు చేసింది.
‘ఉపా’ చట్టం కింద ఆరోపణలున్నప్పటికీ, 2017లో నిందితులందరూ బెయిల్‌మీద బయటికి వచ్చారు. 2018లో విచారణ ప్రారంభమయింది. 323 మంది ప్రాసిక్యూషన్ సాక్షులను, 8 మంది డిఫెన్స్ సాక్షులను విచారించిన తర్వాత, ప్రాసిక్యూషన్ నేర నిర్ధారణకు తగినంత విశ్వసనీయంగా సాక్ష్యాధారాలను సమర్పించలేదని తీర్పు వెలువడింది.
ఆ తీర్పులోనే న్యాయమూర్తి కొందరు కీలకమైన సాక్షులను ఎన్‌ఐఏ ఉపసంహరించుకోవడం ప్రాసిక్యూషన్ ఉద్దేశాల గురించి ప్రతికూల నిర్ధారణలకు అవకాశం ఇచ్చిందని అన్నారు. ఆ సాక్షులను ప్రవేశపెట్టి ఉంటే, ఆరోపణలను రుజువు చేయడంలో చాలా ఖాళీలు పూరింపబడేవని అన్నారు. కేసు విచారణకు, నేర నిరూపణకు ఉపయోగపడే సాక్షులను ప్రాసిక్యూషన్ తనంతట తానే ఎలా పక్కన పెట్టిందో తీర్పులో వివరంగా రాశారు.
అలాగే, సీఆర్పీసీ సెక్షన్ 164 కింద మేజిస్ట్రేట్ దగ్గర నమోదు చేసిన పద ముగ్గురు సాక్షుల వాంఙ్మూలాలు మాయమై పోయాయని ఎన్‌ఐఏ కోర్టుకు చెప్పింది. ఆ పత్రాలు మాయమైనప్పుడు, అవి ఏ మేజిస్ట్రేట్ ముందర నమోదయ్యాయో ఆ మేజి స్ట్రేట్‌ను విచారించవలసి ఉంటుంది.
కాని ప్రాసిక్యూషన్ వ్యతిరేకించింది. అయితే ఇలా ప్రాసిక్యూషన్ తప్పులన్నిటినీ జాగ్రత్తగా నమోదు చేసిన న్యాయమూర్తి, ప్రాసిక్యూషన్ వ్యతిరేకించినా అవసరమైన సాక్షులను పిలవడానికి తన కున్న హక్కును మాత్రం వాడుకోలేదు!
విచారణలో మరొకమలుపు కూడా ఉంది. కేసు మొద లయిన నాటి నుంచీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉండిన రోహిణి సాలియాన్ ఈ కేసు విచారణలో వేగంగా సాగవద్దని ఎన్‌ఐఏ నుంచి తనకు ఆదేశాలు వచ్చాయని 2015లో బయట పెట్టారు. ఆ తర్వాత ఆమెను ఎన్‌ఐఏ ప్రాసిక్యూటర్ల జాబితా నుంచి తొలగించారు.
ఏటిఎస్ నేతృత్వంలో తాము చాలా బలమైన సాక్ష్యాధారాలు తయారు చేశామని, ప్రస్తుత కేసు ఓటమి సాక్ష్యాధారాల లేమి వల్ల జరగలేదనీ, సంస్థా గత, రాజకీయ నిజాయతీ కుప్పకూలడం వల్ల జరిగిందనీ ఆమె అన్నారు. ‘చట్టాన్ని అమలు చేయ వలసినవారే అధికా రంలో ఉన్నవారిని సంతృప్తి పరచడం కోసం దురుద్దేశాలతో పని చేస్తే న్యాయం పట్టాలు తప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు’ అన్నారామె. ఇదీ మన దర్యాప్తు వ్యవస్థల పని తీరు!!
ఎన్. వేణుగోపాల్
వ్యాసకర్త ‘వీక్షణం’ సంపాదకుడు