
మాధవ్ శింగరాజు
దేశభక్తి మంచి విషయమే. అయితే నేనంటానూ... దేశానికి ఆర్థికంగా చేవనిచ్చే శక్తి కూడా మనలోని ఆ దేశభక్తికి ఉండాలని! శక్తి లేని భక్తి ఉత్త వేస్ట్ వ్యవహారం. దేశానికి వచ్చేదేం లేదు, పోయేదేం లేదు.
గర్వంగా తల పైకెత్తి చూస్తూ గట్టిగా ‘జై హింద్’ అని సెల్యూట్ కొట్టినప్పుడు జాతీయ జెండా నుండి బిలియన్‌ల కొద్దీ ఫారిన్ ఎక్ఛ్సేంజ్ నాణేలు దేశ ప్రజలపై గలగలమని కురిసినప్పుడు మాత్రమే అది ప్రయోజన కరమైన దేశభక్తి అవుతుంది. డబ్బును ఉత్పత్తి చెయ్యలేని దేశభక్తికి నా దృష్టిలో ఒక్క డాలర్ విలువైనా లేదు.
తక్కువ మాట్లాడి ఎక్కువ పని చెయ్యటం దేశభక్తి. జీడీపీని చేతులు మారుతున్న డబ్బుతో కాకుండా, ముక్కలవుతున్న రెక్కల చెమట చుక్కలతో లెక్కేయటం దేశభక్తి.
మన జీడీపీ ఘనంగా ఉన్నందువల్ల దేశంలో ఏం మార్పు వచ్చింది? మన ఎకానమీ ఫోర్త్ లార్జెస్ట్‌కి చేరుకున్నందు వల్ల ప్రపంచం మనల్ని చూసే విధానం ఏం మారింది?
ఇలా మాట్లాడితే, ‘యాంటీ నేషనల్’ అంటారు! నిజాలను చూడటం యాంటీ నేషనల్ అయితే, నిజాలను చూడనివ్వకుండా చేయటం ‘నేషనలిజం’ అవుతుందా?
నేనిక్కడ క్యాలిఫోర్నియాలో కూర్చుని ‘నా దేశం’ అంటూ ఇండియా గురించి మాట్లాడటం హర్ష్ గోయెంకా వంటి దేశభక్త భారతీయ పారిశ్రామికవేత్తలకు బొత్తిగా నచ్చటం లేదు!
‘‘మేము ఇక్కడ జీవిస్తున్నాం. ఇక్కడ ఓటు వేస్తున్నాం. ఇక్కడ పని చేస్తున్నాం. ఇక్కడ పన్నులు కడుతున్నాం. మేము ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాం. కాబట్టి, మా తలనొప్పులేవో మేము పడతాం. అన్నీ సర్దుకుని దేశం వదిలి వెళ్లిన వారు, మా కోసం ఏమీ ధర్మోపదేశాలు చేయనవసరం లేదు’’ అని హర్ష్ గోయెంకా!
ఏం? దేశం లోపల ఉండేవారికి మాత్రమే దేశభక్తి ఉండాలా? దేశం బయట ఉన్నవారికి దేశభక్తి ఉండకూడదా? దేశభక్తి అంటే జయజయధ్వానాలు మాత్రమేనా? నా దేశం గురించి నేను మాట్లాడటం దేశభక్తి అవదా?!
ఇంట్లో బియ్యానికి డబ్బుల్లేవు. దాని గురించి నేను మాట్లాడతాను. బయట అమ్మా, చెల్లి స్వేచ్ఛగా మసల లేరు. ఆ విషయమూ నేను మాట్లాడతాను. నాన్న మా అందర్నీ చదివించటానికి సతమతమౌతున్నారు. అదీ మాట్లాడతాను. ఇది పరువు సమస్య కాదు.
నా దేశపు దాపరికాల సమస్య!
దాపరికము, దీర్ఘాలోచన... రెండూ ఒకటే! మాట్లాడవలసిన చోట మౌనంగా ఉండటం తప్పవుతుంది. నిర్ణయం తీసుకోవలసినప్పుడు ఆలోచిస్తూ కూర్చోవటం అనర్థాన్ని తెస్తుంది.
18 ఏళ్ల వయసులో నేనొక నిర్ణయం తీసుకున్నాను. అలాగే 28 ఏళ్ల వయసులో ఇంకొక నిర్ణయం. ఇప్పుడు నేనేమిటన్నది అప్పటి ఆ రెండు నిర్ణయాలే!
‘‘నా లైఫ్‌ను నాకు వదిలేయండి’’ అని ఇంట్లో చెప్పి, నేను బెంగుళూరు రైల్వే స్టేషన్‌లో ఢిల్లీ రైలెక్కాను. ఢిల్లీ చేరాక, అక్కడి నుంచి ట్యాక్సీలో బిట్స్ పిలానీకి. అది నా మొదటి నిర్ణయం. తర్వాత పదేళ్లకు, నా ‘హాట్ మెయిల్’ను 400 మిలియన్ డాలర్లకు మైక్రోసాఫ్ట్‌కు ఇచ్చేశాను. అది నా రెండో నిర్ణయం.
మరోసారి నేనిప్పుడు నిర్ణయం తీసుకోవా ల్సిన టైమ్ వచ్చింది. అయితే అది తీసుకునే నిర్ణయం కాదు, తీసుకోవాలని చెప్పే నిర్ణయం!
అమెరికా మనపై ట్యారిఫ్‌లు వేస్తోంది. 25 శాతం, 50 శాతం, ఇంకా అంతకుమించి కూడా! మనమూ అమెరికాపై టారిఫ్‌లు వెయ్యాలి. ఇరవై శాతమో, యాభై శాతమో, వంద శాతమో కాదు. ‘0’ శాతం వెయ్యాలి!
అవును. ‘0’ శాతంతో మనమంటే ఏంటో చూపించాలి. ట్యారిఫ్‌లు వెయ్యకపోతే అమెరికా బతకలేదు, ట్యారిఫ్‌లు ఎత్తేసి కూడా ఇండియా నిలబడగలదు అని నిరూపించాలి. ఇది సాహసం. కానీ, ఇదే తగిన సమాధానం!
మనకెంత దేశభక్తి ఉందన్నది కాదు లెక్క, మనమంటే ప్రపంచానికి భయ భక్తులుండటం లెక్క! దేశభక్తికీ ఆర్థిక శక్తి ఉన్నప్పుడే లెక్కలు తేలుతాయి.