
కామెంట్
బిహార్ ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – ఎస్‌ఐఆర్–సర్)లో భాగంగా ఎంత మంది పేర్లు గల్లంతయ్యాయి? దానికంటే ముఖ్యంగా, ఎంతమంది పేర్లు ఈ తాజా జాబితాల్లో నమోదు కాలేదు? ఈ సంఖ్యలు చాలా ముఖ్యం. వీటిని బట్టే ‘సర్’ పట్ల నా అభిప్రాయం ఉంటుంది. నేననుకోవడం, మనకు చెప్పిన దానికంటే వాస్తవ సంఖ్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. వివరాల్లోకి వెళ్దాం.
ఎన్నికల కమిషన్ ఒకటో తేదీన ముసాయిదా జాబితా విడుదల చేసింది. దీని ప్రకారం, 65.6 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించారు. సవరణ ప్రక్రియ ప్రారంభించడానికి ముందున్న మొత్తం ఓటర్లలో వీరు దాదాపు 9 శాతం ఉంటారు. ఈ తాత్కాలిక సంఖ్య చిన్నదేం కాదు. ఇప్పటికే ఇది ఆందోళన కలిగిస్తోంది.
పెరగాల్సింది పోయి...
మరొక విషయం ఏమిటంటే – 2024 సాధారణ ఎన్నికలతో, 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చినట్లయితే ఈ దఫా నమోదైన ఓటర్లు తక్కువగా ఉన్నారు. 2005లో రెండు సార్లు వచ్చిన అసెంబ్లీ ఎన్నికలు మినహా, 1977 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎన్నికలకూ మొత్తం ఓటర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే, ఈ ఏడాది జరగనున్న ఎన్నికల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది.
బిహార్ రాష్ట్ర అధిక సంతానోత్పత్తి రేటు (ఫెర్టిలిటీ రేట్)ను దృష్టిలో పెట్టుకుంటే, ఇది మరింత కలవరపెడుతోంది. 2001, 2011 మధ్య కాలంలో వయోజనులు 28.5 శాతం పెరిగారు. అయినా 2025లో మొత్తం రిజిస్ట్టర్డ్ ఓటర్ల సంఖ్య పెరగటానికి బదులు తగ్గటం వింతే!
కొద్ది రోజుల క్రితం ప్రకటించిన దానికంటే అంతిమంగా ప్రకటించే వాస్తవ తొలగింపులు పెరిగే అవకాశం ఉంది. ‘భారత్ జోడో అభియాన్’ నేషనల్ కన్వీనర్ యోగేంద్ర యాదవ్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 65.6 లక్షలు అనే సంఖ్య ఇంకా పెరుగుతుందన డానికి ఆయన మూడు కారణాలు చెబుతున్నారు. ఒకటి – బూత్ లెవెల్ ఆఫీసర్స్ ముసాయిదాలోని పలు పేర్లను తిరస్కరించే అవ కాశం ఉంది. వారికా అధికారం ఉంది.
రెండు – తమ దరఖాస్తు ఫారాలను అప్‌లోడ్ చేసిన అనేక మంది వాటిలో పొందుపరచిన వివరాలకు సరైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించి ఉండరు. అలాంటి వారి పేర్లను మలి విడతలో తొలగిస్తారు. మూడు – ఎల క్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు స్థానికంగా విచారణ చేసి మరికొన్ని పేర్లను కొట్టేసే వీలుంది. ఈ మూడు కారణాల ప్రకారం, 65.6 లక్షలు అనేది ఆరంభ సంఖ్య మాత్రమే. చివరి లెక్కల్లో ఇది తప్పనిసరిగా చాలా ఎక్కువ ఉంటుంది.
నమోదు కానివారి మాటో?
ఓటర్ల జాబితాలపై, అంతిమంగా బిహార్ ఎన్నికలపై ఈ పేర్ల తొలగింపు ప్రభావం గురించి మాత్రమే విశ్లేషణ జరిగింది. మరి, జాబితాల్లో కొత్త ఓటర్ల నమోదు మాటేమిటి? ఈ అంశానికి దక్కా ల్సినంత ప్రాధాన్యం దక్కలేదు.
యోగేంద్ర యాదవ్ దీనిపై అధ్యయనం చేశారు. ప్రభుత్వ అధికారిక జనాభా అంచనాలనే ఆయన తన అధ్యయనానికి ఆధా రంగా తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ సైతం ఓటరు జాబితాలను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయడానికి, ధ్రువీకరించుకోవడానికి వీటినే ప్రాతిపదికగా తీసుకుంటోంది.
బిహార్ ఓటర్ల జాబితాల్లో నమోదైన వయోజన జనాభా (18 ఏళ్ల లేదా అంతకు మించిన వయసు ఉన్నవారు) శాతం వారి వాస్తవ జనాభాలో ఎంత ఉందో యోగేంద్ర యాదవ్ లెక్కగట్టారు. ‘సర్’కు ముందు, జూన్ 24న ఇది 97 శాతం. ‘సర్’ తర్వాత, ఇప్పుడు 88 శాతం! అంటే, 9 శాతం తగ్గింది. ఇది 94 లక్షలకు సమానం. జాబితాల నుంచి తొలగించిన 65.6 లక్షల పేర్ల కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ. మరో విధంగా చెప్పాలంటే, 30 లక్షల మంది వయోజనులు అర్హత ఉండీ ఓటర్లుగా నమోదు కాలేదు.
యోగేంద్ర యాదవ్ తన అధ్యయన ఫలితాలు ప్రచురించి పది రోజులు దాటింది. ఎన్నికల కమిషన్ వీటిని ఖండించలేదు, ప్రశ్నించలేదు. ఈ నిశ్శబ్దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
దేశమే అదృశ్యం?
యోగేంద్ర యాదవ్ తన అధ్యయనంలో రెండు నిర్ధారణలకు వచ్చారు. బిహార్ ఓటర్ల జాబితాల్లో పేర్లు అదృశ్యమైన వారూ, పేర్లు నమోదు కాని వారూ కలిసి 1.5 కోట్ల మంది ఉంటారని ఆయన అంచనా. ఇది నిజం కాకపోతే బాగుండని అనుకోవడం తప్ప మనం చేయగలిగింది లేదు. ఇక రెండో నిర్ధారణ మనందరికీ ఆందో ళన కలిగించక మానదు.
అధికారిక ప్రకటన ప్రకారం, 9 శాతం పేర్ల తొలగింపునే పరిగణనలోకి తీసుకున్నా సరే, ఇప్పటికిప్పుడు దేశ వ్యాప్తంగా ‘సర్’ నిర్వహిస్తే ఈ లెక్కన 9 కోట్ల మంది పేర్లు అదృశ్యమవుతాయి. వీరి సంఖ్య బ్రిటన్ లేదా ఫ్రాన్స్ జనాభాకు ఒకటి న్నర రెట్లు! బిహార్ ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ గురించి ఒక అభిప్రాయానికి వచ్చేందుకు ప్రధానంగా ఈ వివరాలు సరిపోతాయని అనుకుంటున్నాను. మీరేమంటారు?
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్