
హిమాలయాల తలమానికం. గౌతమ బుద్ధుని జన్మభూమి. హిందూ – బౌద్ధ సంస్కృతుల కలయిక. రాజకీయంగా పునర్నిర్మాణం. ఇలాంటి నేపాల్‌ను సందర్శించాలన్న ఆలోచన ఎంతో కాలంగా మనసులో ఉంది. ‘నేపాల్ శాంతి సంఘీ భావ సమితి’ ద్వారా ఈ అవకాశం కలిగింది. ‘భారత సాంస్కృతిక స్నేహ సహకార సంఘం’ (ఇస్కఫ్) బృందం 2025 జూన్ 15 నుండి 20 వరకు ఖాట్మండు పర్యటన జరిపింది.
ఈ బృందంలో ఒడిశా, తమిళనాడు, కశ్మీర్, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన 27 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొన్న వారిలో ఈ వ్యాస రచయిత ఉన్నాడు. మా బృందానికి ఇస్కఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి బిజయ్ కుమార్ పదిహారి నాయకత్వం వహించారు. నేపాల్ పర్య టన రాజకీయ, ఆధ్యాత్మిక, విద్యా కోణాల్లో ఎన్నో కొత్త అనుభవాలను అందించింది.
భారత్–నేపాల్ దేశాలు భౌగోళికంగా,సాంస్కృతికంగా, మతపరంగా అత్యంత సమీప సంబంధాలున్న దేశాలు. రామాయణంలో పేర్కొన్న సీతాదేవి జన్మస్థలం జనకపురి నేపాల్ లోనిదే. అంతేగాక, బుద్ధుడు జన్మించిన లుంబిని ఈ దేశంలోనే ఉంది. ఈ విధంగా హిందూ – బౌద్ధ సంప్రదాయాల మధ్య సాంస్కృతిక అను బంధం గాఢంగా ఏర్పడింది.
1947లో భారత్ స్వాతంత్య్రం పొందిన తరువాత, 1950లో భారత్–నేపాల్ మధ్య స్నేహ, శాంతి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, రెండు దేశాల ప్రజలు ఇరు దేశాలకూ స్వేచ్ఛగా ప్రయాణించ గలుగుతారు. వాణిజ్యం, ఉద్యోగం, స్థిరాస్తుల విషయంలో సమాన హక్కులు కలిగి ఉంటారు.
మా తొలి రోజు కార్యక్రమం, ఖాట్మండు పరిసరాల్లోని చారిత్రక ప్రదేశాలను సందర్శించడం. తొలి ఆధ్యాత్మిక ఆరాధన పశుపతి నాథ్ ఆలయంతో మొదలైంది. హిందూ ధర్మంలో ఒక శైవపీఠంగా గుర్తించబడే ఇది మన సాంస్కృతిక బంధానికి మూల స్తంభంగా నిలుస్తోంది.
ఒక విశేష సమావేశంగా మేము నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (యూనిఫైడ్ మార్క్సిస్టు–లెని నిస్టు) సెంట్రల్ కమిటీ సభ్యుడు రాజన్ భట్టా రాయ్‌ని కలిశాం. నేపాల్ రాజ్యాంగ నిర్మాణానికి, రాచరికం అంతానికి, ప్రజాస్వామ్య స్థాపనకు కమ్యూనిస్టు ఉద్యమం ఎలా ఉద్యమించిందో ఆయన వివరించారు. ప్రజలు స్వయం శక్తితో ఎలా ఉద్యమించారో, మావోయిస్టుల హింసా త్మక మార్గం ఎలా విఫలమై, పార్లమెంటరీ పద్ధ తులు ఎలా విజయవంతమయ్యాయో ఆయన తెలియజేశారు.
భారత కమ్యూనిస్టు ఉద్యమానికి ఈ రాజకీయ పరిణామాలు మౌలికంగా పనికి వస్తాయి. నేపాల్ కమ్యూనిస్టు ఉద్యమం అనేది హిమాలయ ప్రజల నిబద్ధత, బలమైన రాజకీయ ఆవేశం, సామాజిక న్యాయం సాధించాలన్న కోరికల ఫలితం. ఇది కేవలం ఒక రాజకీయ ఉద్యమం కాదు – ఒక దేశ ప్రజలను రాజ్యాంగం కలిగిన ప్రజాస్వామ్య దేశంగా మార్చిన విప్లవ గాథ. నేపాల్‌లో వందల ఏళ్లుగా సాగుతున్న రాచరిక పాలనను తుడిచిపెట్టిన ప్రజా ఉద్యమా నికి కమ్యూనిస్టులు కేంద్ర బిందువులయ్యారు.
నేపాల్‌కు భారత్ అతిపెద్ద వాణిజ్య భాగ స్వామి. 2023–24లో నేపాల్ దిగుమతులలో దాదాపు 60% వరకు భారతదేశం నుంచి జరిగి నవే. భారత ప్రభుత్వం నేపాల్‌లో అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులకు సహాయంగా పనిచేస్తోంది. రహదారులు, విద్యుత్, రైల్వే, డ్యామ్‌లు వంటివి ఇందులో ఉన్నాయి. భారత్, నేపాల్ మధ్య రక్షణ సంబంధాలు బలంగా ఉన్నాయి. నేపాల్ గూర్ఖా సైనికులు భారత ఆర్మీలో ప్రత్యేక స్థానం పొందారు.
ప్రస్తుతం భారత సైన్యంలో దాదాపు 32,000 నేపాలీయులు పనిచేస్తున్నారు. ప్రతి సంవత్సరం భారత రక్షణ దళాలు నేపాల్ ఆర్మీకి శిక్షణ, పరికరాలు, సాంకేతిక సహాయం అంది స్తాయి. భారతదేశంలోని విశ్వవిద్యాలయాల్లో వేలాది నేపాలీ విద్యార్థులు ఉన్నారు. ఖాట్మండు విశ్వవిద్యాలయంలో భారత దౌత్య శాఖ సహా యంతో నడుస్తున్న ఇండియా–నేపాల్ ఫ్రెండ్‌షిప్ లైబ్రరీ, విద్యారంగానికి ఒక సంకేతంగా ఉంది. ఇండియన్ ఎంబసీ తరఫున నేపాల్‌కు విద్యా, పర్యావరణ, ఆరోగ్య రంగాల్లో భారీగా స్కాలర్ షిప్‌లు, మద్దతు అందిస్తున్నాయి.
ఈ యాత్ర మాకు ఒక పాఠశాల. రాజకీయ చైతన్యం, మతసామరస్య దృక్పథం, ఆధ్యాత్మి కత, సేవా, విద్యలో సమానత్వం– అన్నింటినీ ఒకే వేదికపై ముందు ఉంచిన అనుభవం.
– కె. రాజశేఖర్
ఇస్కఫ్ ఏపీ శాఖ అధ్యక్షుడు ‘ 99483 17270