
విశ్లేషణ
భారత ప్రభుత్వం పలు దేశాలతో సంబంధాల అభివృద్ధికి శీఘ్రగతిన చేస్తున్న ప్రయత్నాలు, చూపుతున్న స్వతంత్ర ధోరణి అమెరికాతో తలెత్తిన సమస్యల వల్ల తాత్కాలికమా? లేక దీర్ఘ కాలంలో ‘బ్రిక్స్’ వేదికగా బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థే సరైన ప్రత్యామ్నాయమనే గుర్తింపు మౌలికమైన రీతిలో కలిగి నందువలనా? ఈ కీలకమైన ప్రశ్నపై స్పష్టత అవసరం. ఎన్నెన్ని లోపాలు ఉన్నా వర్ధమాన ప్రపంచంలోని అగ్ర దేశాలలో భారతదేశం ఒకటి.
ప్రపంచం ఆర్థికంగా, రాజకీయంగా, వ్యూహాత్మకంగా కూడా ఒక చౌరస్తా వంటి పరిస్థితిలోకి వచ్చి చేరింది. ప్రపంచాన్ని అన్ని విధాలుగా కొన్ని శతాబ్దాల పాటు శాసించిన పాశ్చాత్య దేశాలు బలహీనపడు తుండటం ఒకవైపు కనిపిస్తున్నది. నెమ్మదిగా బలపడుతూ, స్వతంత్ర ధోరణిలో ముందుకు పోజూస్తున్న వర్ధమాన దేశాల ధోరణి మరో వైపు ఆవిష్కృతమవుతున్నది. అటువంటపుడు భారతదేశం ఎక్కడ నిలిచి ఏ పాత్ర వహించగలదన్నది చరిత్రాత్మక నిర్ణయం కానున్నది.
తాత్కాలికమా? దీర్ఘ కాలికమా?
భారతదేశం వివిధ కారణాల వల్ల గత పాతిక సంవత్సరాలుగా అమెరికన్ శిబిరానికి సన్నిహితంగా ఉంటూ వచ్చింది. ఇటీవలి కాలంలో బలహీనపడుతున్న అమెరికాకు తన పట్ల, ప్రపంచం పట్ల దృష్టి మారి గతం కన్నా భిన్నమైన విధానాలను రూపొందించుకుంటున్నది. ఈ కొత్త పరిస్థితి భారతదేశానికి ఒక పరీక్షగా మారిందన్నది గుర్తించవలసిన విషయం.
అమెరికా విధానాలలోని మార్పుల వల్ల వాణిజ్య సుంకాల రూపంలో, వాణిజ్య ఒప్పందపు చర్చల రూపంలో, ఇతరత్రా కూడా ఎదురవుతున్న ఆర్థిక రంగ సమస్యలు కనిపిస్తున్నవే! ఇవి గాక, ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల ప్రభావాలు భారతదేశంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉండ బోతున్నాయి. ఉదాహరణకు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ), ఐసీజే, ఐసీసీ, యూఎన్‌ఓ, డబ్ల్యూహెచ్‌ఓ, యునిసెఫ్ మొదలైన సంస్థలను బలహీనపరచటమో, వాటి నుంచి ఉపసంహరించుకోవ టమో అమెరికాకు నిత్యకృత్యంగా మారింది.
అటువంటపుడు ప్రభుత్వం అమెరికాతో ఏర్పడిన సమస్యలు తాత్కాలికమని, క్రమంగా వెనుకటి స్థితి ఏర్పడగలదనే అవగాహ నతో ముందుకు పోతుందా అన్నది ఒక ప్రశ్న. దీని అర్థం అమెరికాతో మైత్రికి బదులు వైరం ఏర్పడాలని ఎంతమాత్రమూ కాదు. కానీ, తగిన స్పృహ, జాగ్రత్తలు లేని మైత్రికీ, అవి ఉండే మైత్రికీ తేడా ఉంటుంది. అదే సమయంలో రెండు దేశాల మధ్య ఇటీవల తలెత్తిన సమస్యలు పరిష్కారం కావటం అవసరం. అందువల్ల కలిగే మేలు చాలానే ఉంటుంది. అందులో వ్యూహాత్మకమైనవి, దేశ రక్షణకు సంబంధించినవి కూడా ఉంటాయి.
అయితే, స్వల్పకాలిక, మధ్యకాలిక ప్రయోజనాల కోసం అమె రికా వైపు చూడవలసి రావటం ఎంత అవసరమో, దీర్ఘకాలిక దృష్టితో ‘బ్రిక్స్’ వంటి ప్రత్యామ్నాయాలు, బహుళ ధ్రువ ప్రపంచా లను లక్ష్యంగా పెట్టుకోవటం కూడా అంతే అవసరం. ఏక కాలంలో ఈ రెండింటితో ఎట్లా వ్యవహరిస్తారన్నది దౌత్యనీతిపై ఆధారపడి ఉంటుంది.
వాస్తవానికి అటువంటి సంతులనం అవసరమని జైశంకర్ విదేశాంగ మంత్రి అయిన కొత్తలోనే ‘ది ఇండియా వే’ పుస్తకంలో సూచించారు. కానీ, అప్పటికన్నా పాశ్చాత్య ప్రపంచపు బలహీనతలు పెరిగాయి. ముఖ్యంగా ట్రంప్ విధానాలతో పరి స్థితులు గణనీయంగా మారుతున్నాయి. అందువల్ల, ప్రత్యామ్నా యాల వైపు లోగడకన్నా మరింత ఎక్కువ దృష్టి పెట్టవలసిన అవసరం ఏర్పడుతున్నది.
బ్రిక్స్ కరెన్సీ అనకుండానే...
పోతే, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు కొన్నింటిని చూద్దాము. అవి – ట్రంప్ సుంకాలు, జిన్‌పింగ్‌తో జైశంకర్ సమా వేశం, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఢిల్లీకి రావడం, ఈ నెలాఖరున బీజింగ్‌లో జరిగే ‘షాంఘై సహకార సంస్థ’ శిఖరాగ్ర సమావేశానికి మోదీ వెళ్లనున్నట్లు ప్రకటన, ట్యారిఫ్‌లకు జంకబోమంటూ దేశ స్వావలంబనకు పిలుపునిచ్చి జీఎస్టీ స్లాబ్‌లను నాలుగు నుంచి రెండింటికి ప్రభుత్వం తగ్గించటం వంటివి. ఇవన్నీ జాబితా వలె రాసుకోవటం ఎందుకంటే, ఈ పరిణామాలు కొద్ది కాలంలోనే అమెరికా చర్యలకు స్పందనగా జరిగినటువంటివి. వాటన్నిటికి తగు ప్రాముఖ్యం ఉంది.
వీటిమధ్య చాలా ముఖ్యమైనది ఒకటి జరిగింది. అది – అంతర్జాతీయ వాణిజ్యంలో రూపాయి మారకపు చెల్లింపులకు సంబంధించిన నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ సడలించటం. ప్రైవేట్ కంపెనీలు ఇతర దేశాలతో జరిపే లావాదేవీలలో రూపాయి కరెన్సీ వినియో గానికి ప్రత్యేకంగా వోస్ట్రో అకౌంట్లు తెరవాలి. అందుకు స్థానిక బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి అవసరమయేది.
ఆ నిబంధనను రిజర్వ్ బ్యాంక్ ఇపుడు ఎత్తివేసింది. అందువల్ల వాణిజ్యం సులభతరం అవుతుందనేది సరేసరి. కానీ, అంతకుమించిన విశేషం ఉంది. ఇంతకుముందు వలె డాలర్‌పై ఆధారపడనక్కర లేక పోవటం! డాలర్‌కు బదులు ‘బ్రిక్స్’ దేశాలు పరస్పరం గానీ, ఇతర దేశాలతో గానీ తమ సొంత కరెన్సీలలో చెల్లింపులు చేసుకోవాలని, ఆ విధంగా డాలర్ బలహీన పడుతుందన్నది ఆ సంస్థ తీర్మానం.
డాలర్‌కు ప్రత్యామ్నాయంగా ‘బ్రిక్స్’ కరెన్సీ అనకుండానే వారు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నారు. ఇండియా కూడా అటువంటి చెల్లింపులు కొన్ని చేస్తున్నా, డాలర్‌కు తాము వ్యతిరేకం కాదంటూ వచ్చింది. ధోరణి ఇదే విధంగా కొనసాగితే, కొందరు విమర్శకులు ఎత్తి చూపుతున్నట్లు బ్రెజిల్, చైనాల వలె భారత్ కూడా అమెరికాపై ఎదురు సుంకాలు విధించటం, డబ్ల్యూటీఓకు ఫిర్యాదు చేయటం వంటి చర్యలు తీసుకోగలదేమో చూడవలసి ఉంటుంది.
వచ్చే సంవత్సరం ఒక ముఖ్యమైన పరిణామం చోటు చేసుకో నుంది. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం 2026లో ఢిల్లీలో జరిగి, ఆ సంస్థకు భారతదేశం అధ్యక్షత వహించనుంది. అందువల్ల ఈ దేశంపై ఎటువంటి బాధ్యతలు ఏర్పడతాయో ఊహించవచ్చు. ఇప్పటికే ఒక కొత్త ధోరణిలో ముందుకు వెళ్లవలసి వస్తున్న భారత ప్రభుత్వం ఆ మార్పును స్వల్పకాలికానికి పరిమితం చేయగలదా, లేక దీర్ఘకాలికం, మౌలికం చేయవచ్చునా అన్నది పెద్ద ప్రశ్న అవు తున్నది.
ఈ పరిణామాలకు కొసమెరుపు 23వ తేదీ నాటి జైశంకర్ వ్యాఖ్యలు. తన జీవితంలో ట్రంప్ వంటి అధ్యక్షుడిని చూడలేదని, ఇండియా ఉత్పత్తులను వారికి కావాలంటే కొనవచ్చు, లేదా మాన వచ్చునని, మాకు వేరే మార్కెట్లు ఉన్నాయని అన్నారాయన. ఆత్మ విశ్వాసం కలిగి స్వతంత్రంగా వ్యవహరిస్తే ఇట్లాగే ఉంటుంది.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు