
సందర్భం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన బృందంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై భారత్ నాలుగు నెలలు చర్చలు జరిపినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. భారతదేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నవాటిపై 26 శాతం సుంకం విధిస్తామని ఏప్రిల్ 2న బెదిరించిన ట్రంప్ ఆగస్టు 30న 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు.
చర్చలు మొదలైనప్పటి నాటికన్నా పరిస్థితి ఇపుడు మరింత దారుణంగా తయారైంది. రష్యా నుంచి చమురు, రక్షణ సామగ్రి కొనుగోళ్ళను నిలిపివేయకపోతే జరిమానా కింద మరికొంత సుంకాన్ని విధిస్తామని కూడా ట్రంప్ హెచ్చరించారు. అయితే, ఆ సుంకం శాతాన్ని నిర్దిష్టంగా ప్రకటించలేదు. భారత్ సుంకాలు ప్రపంచం మొత్తంమీద చాలా ఎక్కువగా ఉన్నాయని, ద్రవ్యేతర వాణిజ్య చర్యలు ‘‘అత్యంత శ్రమ పెట్టేవిగా, అప్రియమైనవిగా’’ ఉన్నాయని ఆయన అన్నారు.
ట్రంప్ కోరుతున్నదేమిటి?
అమెరికాతో వాణిజ్యం విషయంలో, ట్రంప్ కుయుక్తులను, మనం ఎలా అర్థం చేసుకోవాలి? అన్ని రకాల చర్చలనూ విరమించుకోవాలా లేక లొంగిపోవాలా? ద్వైపాక్షిక వాణిజ్య లోటును నిర్మూలించే పేరుతో ట్రంప్ మొదలెట్టిన జూదం దాని భాగస్వామ్య దేశాలకు ఎంత రుచించని దైనా, ఆయన లక్ష్యాలు మాత్రం స్పష్టం. అమెరికాతో వాణిజ్యంలో మిగులులో ఉన్న దేశాలు, ఆ వాణిజ్య లోటును భర్తీ చేసేందుకు నాలుగు చర్యలు తీసుకోవాలని ట్రంప్ కోరుతున్నారు.
1. సుంకం పైసా కూడా లేకుండా అన్ని అమెరికా ఉత్పత్తులకూ సంపూర్ణ మార్కెట్ సౌలభ్యం కల్పించడం; 2. అమెరికాకు ఎగుమతి చేసే వాటిపై 15–25 శాతం సుంకం విధించడానికి అంగీకరించడం; 3. వాణిజ్య లోటును భర్తీ చేసేందుకు వీలుగా అమెరికా నుంచి ఇపుడు కొంటున్నవాటికి తోడుగా విమానాలు, ఇంధనం వంటివాటిని కొనడం; 4. అమెరికాలో వస్తూత్పత్తికి పెట్టుబడులు పెట్టడం.
చాలా దేశాలు రెండు కారణాలతో అమెరికాకు ఎగుమతులు ఇష్టపడతాయి. ఒకటి– అది చాలా పెద్ద మార్కెట్ (మొత్తం ప్రపంచం ఎగుమతుల్లో సుమారుగా 15 శాతం దానికే వెళుతున్నాయి), రెండు – ఎగుమతిదారులకు లాభాలు సమకూరుతాయి. కానీ అద నపు సుంకాల భారాన్ని నెత్తికెత్తుకుని అనిష్టంగానైనా ఎగుమతులు చేస్తే వారికొచ్చే లాభాలు ఏమీ ఉండవు.
అదనపు సుంకాల భారాన్ని భరించినా ఎంతో కొంత లాభాన్ని మిగుల్చుకోగలిగిన అవకాశం భారతీయ ఎగుమతిదారులకు లేదు. కనుక, అదనపు 25 శాతం సుంకానికీ, జరిమానా సుంకానికీ భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు.
తీర్చలేని డిమాండ్లు
జన్యుపరంగా సవరించిన గింజలతో తీసిన వంటనూనె దిగు మతులను (జీఎం నూనె మనుషుల ఆరోగ్యానికి మంచిది కాదని నిరూపించే శాస్త్రీయ అధ్యయనాలు ఏవీ జరగలేదు), పాడి పరిశ్రమ ఉత్పత్తులను, పౌల్ట్రీ ఉత్పత్తులను (అమెరికన్ చికెన్ లెగ్స్ వినియోగదారుల సంక్షేమాన్ని మెరుగుపరుస్తాయి) అనుమతించడం అంటే... వ్యావసాయిక వాణిజ్యాన్ని భారత్ సరళీకృతం చేయడం.
ఇది వివేకవంతమైన చర్యగానే తోస్తుంది. కానీ, దేశీయ రైతులను సంరక్షించవలసిన బాధ్యత వల్ల, ఈ విషయంలో భారత దేశం పాలుపోని స్థితిలో ఉంది. వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికాకు ఎలాంటి రాయితీలూ ఇవ్వగలిగిన స్థితిలో ఇండియా లేదు.
భారతదేశ రక్షణ అవసరాలకు ఒదగని లేదా మరీ ఖరీదుతో కూడిన ఎఫ్–35 విమానాలను లేదా ముడి చమురును కొనాలని అమెరికా బలవంతపెట్టడం బ్లాక్ మెయిల్ చేయడమే! దానికి లొంగి పోతే భారత్ బలహీనమైనదనే ముద్రపడుతుంది.
ఇక భారత్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను స్వీకరించడమేకానీ, ఇవ్వడం చాలా అరుదు. విదేశాల్లో భారత్ పెట్టుబడులు కొద్దిగానే ఉన్నాయి. రానున్న 5–10 ఏళ్ళలో, అమెరికాలో 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడం కూడా మనకు కష్టమే. ట్రంప్ అడుగుతున్న నాలుగింటిలో దేన్నీ తీర్చగల స్థితిలో ఇండియా లేదు.
ట్రంప్ నాలుగు డిమాండ్లకూ వియత్నాం, జపాన్, ఇండో నేషియా, యూరోపియన్ యూనియన్ మాత్రమే అంగీకరించాయి. అమెరికా అదనపు సుంకాలను దిగమింగుకుని ఈ దేశాల ఎగుమతిదారులు తమ వస్తువుల ధరలను తగ్గిస్తారా లేక అమెరికా వినియోగదారులకు ఆ భారాన్ని బదలీ చేస్తారా? లేక రెండింటి మిశ్రమంతో ముందుకు సాగుతారా? ఆ యా ఎగుమతి దేశాలు అదనపు సుంకాలను తామే భరించడంలో లేదా అమెరికా వినియోగ దారులకు బదిలీ చేయడంలో విఫలమైతే నష్టపోయేది అమెరికా, దాని వినియోగదారులే!
ఇచ్చిన వాగ్దానం మేరకు, ఆ యా దేశాలు, నిజంగా చెప్పినంత సంఖ్యలో విమానాలను, ఇంధన ఉత్పత్తులను, రక్షణ పరికరాలను కొనుగోలు చేయగలుగుతాయా? దానికి చాలా కాలం పడుతుంది. పైగా, వాటి ధరలు తగ్గించాలని అవి అమెరికాను డిమాండ్ చేయవచ్చు. తాము దిగుమతి చేసుకుంటున్న వస్తువులు ఇలా ఉండాలి, అలా ఉండాలని చర్చలతో సుదీర్ఘ కాలయాపన చేయ వచ్చు. ఈ తతంగం ద్వారా ట్రంప్ ఏ ప్రయోజనాన్ని ఆశిస్తున్నారో అది నెరవేరకపోవచ్చు. లేదా ఆశించింది కొండంత, లభించింది ఆవగింజంతగా పరిణమించవచ్చు.
ఇండియా ముందున్న మార్గం
భారత్ ఎదుట రెండు అవకాశాలున్నాయి. ఒకటి– జపాన్, వియత్నాం, ఇండోనేషియా, యూరోపియన్ యూనియన్‌ల మాదిరిగా తలొగ్గి ఒప్పందం కుదుర్చుకోవడం. తర్వాత, భారత్ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఎగువ పేర్కొన్న ఎత్తుగడలను అనుసరించడం. రెండు– ట్రంప్ వాణిజ్య బృందంతో అన్ని చర్చలకూ స్వస్తి పలికి, ఏ సుంకాలు విధించుకుంటావో విధించుకో అనడం.
అదనపు సుంకాల భారాన్ని నెత్తిన రుద్దుకోకుండా, వస్తువులను వాటి సాధారణ ధరలకే విక్రయించవలసిందని ఎగుమతిదారులకు నచ్చజెప్పడం. అమెరికాలోని దిగుమతిదారులు కొంటే మంచిదే. లేదంటే, ఆ వస్తువులను, అటువంటి అసంబద్ధ సుంకాలు లేని ఇతర దేశాలకు విక్రయిచడం.
దేశీయ మార్కెట్ లోనూ అమ్ముకునేటట్లు చూసుకోవడం. కొన్ని ఎంపిక చేసుకున్న వాటికి అంగీకరించి, మధ్యే మార్గాన్ని అనుసరించడం వల్ల భారత దేశానికి పెద్దగా ఒనగూడేది ఏమీ ఉండదు. అంతకంటే, రెండవ దారిని ఎంచుకుని ముందుకు సాగడమే మంచిది.
ట్రంప్ పాలనా యంత్రాంగం తలతిక్కతో తీసుకుంటున్న సుంకాల చర్యల ప్రతికూల పర్యవసానాలను త్వరలోనే (మహా అయితే 3–6 నెలల్లో) చవిచూడవలసి రావచ్చు. అమెరికా దిగు మతులు మందగిస్తాయి (ఏప్రిల్–జూన్ త్రైమాసిక గణాంక వివ రాలు దాన్ని ధ్రువపరుస్తున్నాయి). సుంకాల రాబడి కింద అమెరికాకు కొద్ది వందల బిలియన్ల డాలర్లు లభించవచ్చు.
కానీ, దానిలో చాలా భాగాన్ని అమెరికాలోని దిగుమతిదారులు, వినియోగదారులే చెల్లించవలసి ఉంటుంది. ధరలు మంట పుట్టించడంతో వినియోగ దారుల తిరుగుబాటుకు ఎంతో కాలం పట్టదు. పరిస్థితులు తేటతెల్లమవుతున్నకొద్దీ, ట్రంప్ తాను విధించిన చాలా సుంకాలను వెనక్కి తీసుకోక తప్పదు. అందుకే ఇండియా వేచి చూడటమే మంచిది. దానివల్ల పెద్దగా ఖర్చయ్యేదేమీ ఉండదు.
సుభాష్ చంద్ర గర్గ్
వ్యాసకర్త ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)