
విశ్వ గురు
అవి మా ముత్తాత పోయిన కొత్తలు. ఆయన ఒక సన్నకారు రైతు. ఆయన పోవడంతో మా ముత్తవ్వ యువ వితంతువుగా మారింది. అప్పటికే ఆమెకు ఇద్దరు కుమారులు. ఆదాయ వనరు సున్నా. ఇద్దరు పిల్లలను చదివించి, వారికి మంచి భవిష్యత్తు కల్పించాలనే ఉద్దేశంతో దగ్గరలోని ఓ పట్టణానికి మకాం మార్చారు. ఓ ఇంట్లో పని మనిషిగా చేరారు. చాలీచాలని ఆదాయం ఇద్దరు పిల్లల్లో ఒకరిని చదివించేందుకే సరిపోతుంది.
ఇద్దరు పిల్లల మధ్య వయసులో పెద్ద తేడా లేదు. ఆ ఇద్దరిలో ఒక పిల్లాడు బాధ్యతతో మెలిగేవాడుగా కనిపించాడు. రెండవవాడు కాస్త పేచీకోరు. పరిస్థితులకు అనుగుణంగా మసలుకునే పిల్లాడిని, ఆమె పనిలోకి దింపారు. అతను భవన నిర్మాణ పనుల్లో దినసరి కూలీగా మారాడు. కొత్త నైపుణ్యాలను గడించుకుని, ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని అందుకొనే అవకాశం ఎన్నడూ లభించలేదు.
మరో పిల్లాడిని స్థానికంగా ఉన్న పాఠశాలకి పంపించగలిగారు. ఆ పిల్లాడే మా తాతయ్య. తక్కువ బాధ్యతతో వ్యవహరించే పిల్లాడిగా ముద్రపడినా, స్కూలు చదువును కొనసాగించగలిగాడు. పోలీసు అధికారి అయ్యాడు. అతని సోదరుడు నాలుగు రాళ్ళు సంపాదించడం ప్రారంభించిన పదేళ్ళ తర్వాత ఉద్యోగంలో చేరినా, ప్రారంభంలోనే ఎక్కువ జీతభత్యాలు తీసుకోగలిగాడు. మా తాత చదువుకోవడం, ఉద్యోగ జీవితం వల్ల, మా నాన్నకు చదువుకొనే అవకాశం లభించింది.
ఫలితంగా, నేను నాకు ఇష్టమైన బాటలో అడుగులు వేసేందుకు అవకాశం చిక్కింది. మా తాతకు లభించిన అవకాశం వల్ల, ఆ తరువాత తరాలు కూడా బాగుపడే వీలు చిక్కింది. ప్రతిభావంతులు ప్రతిచోటా ఉన్నారు. కానీ, వారు వెలుగులోకి వచ్చే అవకాశమే ఉండటం లేదు అనే దానికి ఈ వ్యక్తిగత జీవిత వివరాలే ఉదాహరణ.
టెక్నాలజీ ఉపకరణం మాత్రమే!
ఈ రోజు కార్యక్రమం విద్య, టెక్నాలజీ గురించి! సూటిగా చెప్పాలంటే, రేపటి ప్రపంచాన్ని సృష్టించేవారిగా నేటి విద్యార్థులను తీర్చిదిద్దడానికి సంబంధించినది. సాంకేతికంగా అబ్బురపరచే ప్రగతిని సాధిస్తున్న కాలంలో మనం జీవిస్తున్నాం. మన జీవితాలలో ప్రతి పార్శ్వాన్ని, ఆర్థిక వ్యవస్థలను, సమాజాలను డిజిటల్ టెక్నాలజీలు రూపుదిద్దుతున్నాయి. అయితే, టెక్నాలజీ అంతరాయా లను కూడా సృష్టిస్తోంది.
టెక్నాలజీ ఏ కొద్ది మందికోకాక, అందరికీ అవకాశాలను అందివ్వగలదా? అన్నదే అసలైన ప్రశ్న. ఇతరులు సాధించే విజయంపైనే మన విజయం గణనకు వస్తుంది. చదువుకునే అవకాశాన్ని అందరికీ కల్పించడం మన ధ్యేయం కావాలి. నేటి సమాజం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్ళలో అది ఒకటి. ‘మైక్రోసాఫ్ట్’ మాజీ పరిశోధకుడు, ‘గీక్ హేర్సే’ పుస్తక రచయిత కెంటరో టొయోమ ఆ అంశాన్ని బాగా పట్టుకున్నారు.
టెక్నాలజీలో కన్నా ముందుగా సమాజంలో మార్పు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. టెక్నోక్రాట్లు సాధారణంగా టెక్నాలజీ గుణగణాల గురించి గొప్పగా చెప్పేందుకు మొగ్గు చూపుతూంటారు. వ్యవస్థలోని అన్ని రుగ్మతలకూ దానినే విరుగుడుగా భావిస్తూంటారు. దానితో విభేదం ఉన్నవాడిగానే నేనిక్కడికి వచ్చాను.
విద్యను రూపాంతరీకరించడానికి టెక్నాలజీ ఒక్కటే సమాధానమనే భ్రమల్లో మనం లేము. విద్యా రంగంలో మార్పు తీసుకొచ్చేందుకు అంకిత భావం కలిగిన పాలకులు, గొప్ప ఉపాధ్యాయులు, ప్రేరణ పొందిన విద్యార్థులు, పాలుపంచుకునే తల్లితండ్రులు, సమాజాలు అవసరం. టెక్నాలజీ వారి సృజనాత్మకతకు, చాతుర్యానికి సాధికారత కల్పించగల ఒక ఉపకరణం మాత్రమే.
ప్రపంచం నలుమూలల ఉన్న విద్యార్థులను చూడగలగడం, వారి నుంచి నేర్చుకోగలగడం నా ఉద్యోగ బాధ్యతల్లో నేను ఇష్టపడే అంశాల్లో ఒకటి. గత రెండేళ్ళుగా, నేను 20కి పైగా దేశాలలో విద్యార్థులను కలుసుకునే అవకాశం లభించింది. సియాటిల్‌లో నా కూతుళ్ళు ఏ ఆఫీసు టూల్స్‌ని ఉపయోగిస్తున్నారో అవే టూల్స్‌ని జకార్తా, టెల్ అవీవ్‌లలోని విద్యార్థులు కూడా ఉపయోగిస్తున్నారు. ఆ యా తరగతి గదుల్లో కొంత సమయాన్ని వెచ్చించినప్పుడల్లా, ప్రతిసారీ నాలో కొన్ని అంశాలు ముసురుకుంటూ వచ్చాయి.
పిల్లలను ఎలా తీర్చిదిద్దాలి?
ఒకటి– తరగతి గదిలో టీచర్ పనికి టెక్నాలజీ సాయపడాలే గానీ, అవరోధం కాకూడదు. సమయాన్ని వెచ్చించడంలో టీచర్లపై చాలా డిమాండ్లు ఉంటాయి. వారు పాఠ్యాంశాలను ఎంపిక చేయాలి. పరీక్షలు పెట్టాలి. పేపర్లు దిద్దాలి. తరగతుల్లో విద్యార్థు లను అదుపాజ్ఞలలో ఉంచాలి. క్రమశిక్షణ నేర్పాలి. టెక్నాలజీ టీచర్ల జీవితాలను సులభతరం చేసి, విద్యార్థులలో సృజనాత్మకతను రేకెత్తించేదిగా ఉండాలిగానీ, వాటి నుంచి దృష్టి మళ్ళించేదిగా ఉండకూడదు.
రెండు– పని స్వరూప స్వభావాలలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒక సమస్యను పరిష్కరించేందుకు సమష్టిగా పనిచేస్తున్నారు. సమస్యను విభజించి చూడటంకన్నా ఏక మొత్తంగా చూస్తున్న ధోరణి కనిపిస్తోంది. ఈ రకమైన భవిష్యత్తుకి మనం విద్యార్థులను తయారు చేయాల్సిన అవసరం ఉంది.
తరగతి గదిలో కూడా టీమ్‌ల వారీగా పనిచేయడాన్ని ప్రోత్సహించాలి. సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా నేర్చుకో వడం తరగతి గదిలోనే మొదలవ్వాలి. టీమ్ వర్క్‌కి అవి కేంద్రాలు కావాలి. అప్పుడే దేన్నైనా కలసి సృష్టించగల సామర్థ్యం సొంత మవుతుంది. విద్యార్థులను కలసిమెలసి నేర్చుకునేటట్లుగా చేస్తే, వారి విద్యావకాశాలు కూడా మెరుగుపడతాయి.
మూడు– రేపటికి తగినట్లుగా మన విద్యార్థులను తయారు చేసి తీరాలి. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ నివేదికను, అది రూపొందించిన ఉద్యోగాల నివేదికను పరిశీలించండి. నేడు పాఠశాలల్లో అడుగు పెడుతున్న విద్యార్థుల్లో 65 శాతం మందికి లభించబోయే ఉద్యో గాలు, ఇపుడు ఉనికిలో ఉన్నవి కావట! ‘కాంపుటేషనల్ థింకింగ్’, సమస్యను పరిష్కరించగల నైపుణ్యాలు భవిష్యత్తుకు కీలకమని టీచర్లకు తెలుసు.
‘స్టెమ్’ పాఠ్య ప్రణాళికను విస్తృతంగా వీక్షించవలసిన అవసరం ఉందని కూడా వారికి తెలుసు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితాన్ని కలిపి పొందికతో కూడిన అధ్యయన నమూనాగా చేయడాన్ని ‘స్టెమ్’గా పిలుస్తున్నారు. చదవడం, రాయడం, డిజైన్, కళలకు తోడు, ‘స్టెమ్’ పాఠ్య ప్రణాళికను కూడా తీసుకువస్తే, భవిష్యత్తులో ఈ విద్యార్థులు విజయం సాధించడానికి రంగం సిద్ధం చేసినవాళ్ళం అవుతాం.
చివరగా– మా తాతకు లభించిన అవకాశం, మా కుటుంబ గతిని మార్చివేసింది. ఇపుడు నాకు స్ఫూర్తినిస్తున్న అంశం ఈ తరంలోనూ, రాబోయే తరాలలోనూ ప్రతి విద్యార్థికి విద్యావకాశాన్ని ప్రజాస్వామ్యీకరణ చేసేందుకు మనందరం కలసి మెలసి ఎలా ఒకటవాలన్నదే! అందరికీ కృతజ్ఞతలు.