నిర్లక్ష్యం వద్దు: కీలెంచి మేలెంచండి! | Expansion of Surgery for Joint Pains | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం వద్దు: కీలెంచి మేలెంచండి!

Sep 21 2025 12:52 AM | Updated on Sep 21 2025 12:52 AM

Expansion of Surgery for Joint Pains

కీళ్ల దగ్గర నొప్పి సమస్యను మొదట్లోనే తుంచేయాలి. తగిన పరీక్షలు చేయించుకొని, వాటిల్లో వచ్చిన రి పోర్టులను బట్టి త్వరగా చికిత్స తీసుకుంటే చాలు. ‘ఆ... ఎప్పుడో ఓసారి నొప్పి రావడంగానీ లేదా కీళ్ల దగ్గర ఇబ్బందిగా (డిస్‌కంఫ్టర్ట్‌గా) ఉండటం మామూలే కదా’ అంటూ నిర్లక్ష్యం చేస్తే... కేవలం టాబ్లెట్ల వంటి మందులతో  పోయేదానికి శస్త్రచికిత్స వరకూ వెళ్లే అవకాశముందని హెచ్చరిస్తున్నారు ఆర్థోపెడిక్‌ నిపుణులు.  ఇలా మోకాలూ లేదా ఇతరత్రా కీళ్లలో (జాయింట్స్‌లో) నొప్పిగానీ ఇబ్బందిగానీ వచ్చేందుకు కారణాలూ, అలా సమస్య కనిపించినప్పుడు ఏం చేయాలన్న అంశంపై అవగాహన కలిగించేందుకు డాక్టర్లు చెబుతున్న అంశాలేమిటో చూద్దాం.

మీరు ఎప్పుడైనా జాయింట్‌ నొప్పిని ‘‘అదే తగ్గి పోతుందని’’ అని నిర్లక్ష్యం చేశారా? చాలా మందికి ఇది సాధారణంగా అనిపించవచ్చు. కానీ జాయింట్‌ నొప్పిని నిర్లక్ష్యం చేయడం శరీరానికి మెల్లగా నష్టం కలిగిస్తూ, భవిష్యత్తులో తప్పనిసరిగా శస్త్రచికిత్స వరకు తీసుకెళ్లే ప్రమాదం ఉంది.

మన దేశవాసుల్లో కీళ్లనొప్పులు వస్తుండటం చాలా సాధారణం. ఇలాంటి నొప్పులు దాదాపుగా విస్తృతంగా మధ్య వయసు దాటిన అందరిలోనూ కనిపిస్తుంటాయి. ఒక అంచనా ప్రకారం మన దేశజనాభాలో సుమారు 15% మందిలో అంటే... 21 కోట్ల మందిలో ఆర్థరైటిస్‌ తాలూకు బాధలు కనిపిస్తుంటాయి. మధుమేహం (డయాబెటిస్‌), ఎయిడ్స్, క్యాన్సర్‌ల కంటే కూడా ఆర్థరైటిస్‌ నొప్పులతో బాధపడేవారి సంఖ్యే ఎక్కువ. మరీ ముఖ్యంగా మహిళల్లో కీళ్లనొప్పులూ, ఆర్థరైటిస్‌ కారణంగా కనిపించే బాధలు ఇంకా ఎక్కువ. దాదాపు 45 ఏళ్లకు పైబడిన వయసు మహిళల్లో ఇలా ఈ తరహా బాధలు కనిపించడం చాలా సాధారణం. వీటికి వీలైనంత త్వరగా... అంటే తగిన సమయంలో చికిత్స అందించక పోతే అవి ఎలా పరిణమిస్తాయో తెలుసుకుందాం.  

కీళ్ల (జాయింట్‌) నొప్పులను నిర్లక్ష్యం చేస్తే... 
కీళ్ల నొప్పులు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌కు చూపించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ కింద పేర్కొన్న నష్టాలు జరిగే అవకాశముంది. అవి...  

→ చిగురు ఎముకకు (కార్టిలేజ్‌) నష్టం: కీళ్లు కలిసే చోట ప్రతి ఎముకకూ చివరన ఉండే మెత్తటి చిగురు ఎముక (కార్టిలేజ్‌) స్వాభావికంగా కుషన్‌లా పనిచేసే గుణం తగ్గుతుంది. దాంతో అది స్టిఫ్‌గా మారి (గట్టిపడి పోయి) అది ఆస్టియోఆర్థరైటిస్‌ అనే కండిషన్‌కు దారితీస్తుంది. 

→ కీలు ఉండాల్సిన తీరులో లేక పోతే (డిఫార్మిటీ) : నేచురల్‌గా ఉండాల్సిన విధంగా ఉండకుండా కీళ్లలో ఉండాల్సిన  స్థిరత్వం తగ్గడంతో కీళ్ల కదలికలూ మందగిస్తాయి. 

→ కండరాల బలహీనత (మజిల్‌ వీక్‌నెస్‌) : కీళ్ల దగ్గర నొప్పి కారణంగా మనం కీళ్లను కదిలించక పోవడంతో కీళ్లలో కదలికలు తగ్గుతాయి. ఫలితంగా కండరాలూ బలహీనమవుతాయి. 

→ దీర్ఘకాలిక (క్రానిక్‌) ఇన్‌ఫ్లమైషన్‌ : కీళ్ల దగ్గర వచ్చే సమస్యతో అక్కడ ఎర్రబారడం, తీవ్రమైన వాపు, మంట, నొప్పి వంటి లక్షణాలు సుదీర్ఘకాలం పాటు కనిపించడాన్ని క్రానిక్‌ ఇన్‌ఫ్లమేషన్‌ అంటారు. ఇలా సుదీర్ఘంగా ఇన్‌ఫ్లమేషన్‌ రావడం వల్ల ఆ ప్రాంతంలోనూ, అలాగే ఆ చుట్టుపక్కల ఉండే కణజాలానికి (టిష్యూలకు) నష్టం జరుగుతుంది. 

→ జీవన నాణ్యత (క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌) తగ్గి పోవడం: ప్రతిరోజూ కీళ్లనొప్పి కారణంగా మనం చేయాల్సిన పనులు చేయలేక పోవడం, నార్మల్‌గా ఉండలే పోవడంతో మన జీవన నాణ్యత (క్వాలిటీ ఆఫ్‌ ల్గైఈ) తగ్గుతుంది. 

డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలంటే...
ఈ కింద పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్‌ను తప్పనిసరిగా కలవాలి. 
→ కీళ్లు లేదా ఆ ప్రాంతాల్లో కనిపించే నొప్పి దానంతట అదే తగ్గకుండా చాలాకాలం పాటు  కొనసాగడం. (కొన్నిసందర్భాల్లో నెలల తరబడి లేదా ఏళ్ల తరబడి). 
→ నడక, మెట్లు ఎక్కడం, చేతులు పైకి ఎత్తడానికి కష్టంగా ఉంటే. 
→ కూర్చున్నవారు లేవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే.  
→ కర్ర లేదా వాకర్‌ సాయంతోనే నడవగలగడం. 
→ నొప్పి తగ్గడానికి తరచూ నొప్పి నివారణ మందులపైనే ఆధారపడుతుంటే. 
→ కీళ్ల ఆకృతి మారడం లేదా కీలు కలిసేచోట ఎముకలు కుదురుగా లేక పోతే (అలైన్‌మెంట్‌  మారితే). 

చికిత్స ఆలస్యం అయిన కొద్దీ...  
→ నొప్పి, కీళ్ల దగ్గర గట్టితనం (స్టిఫ్‌నెస్‌) పెరగడం; కదలికలు మందగించడం. 
→ కీళ్ల దగ్గర ఎముకల చివరన ఎముకలు అరగడంతో (ఆర్థరైటిస్‌ సమస్యతో) నొప్పులు లేదా జాయింట్‌ దగ్గర వ్యాధులు తీవ్రతరం కావడం. 
→ పడి పోయి గాయపడే ముప్పు పెరగడం. 
→ కోతపెట్టి చేయాల్సిన శస్త్రచికిత్స (ఇన్వేసివ్‌ సర్జరీ) చేయాల్సి రావడం. 
→ కోలుకోవడానికి పట్టే సమయం పెరగడం. 

మీ కీళ్ల ఆరోగ్యాన్ని చిరకాలం కాపాడుకోవాలంటే... 
→ తక్షణ వైద్య సలహా : వీలైనంత త్వరగా డాక్టర్‌ను కలిసి, తగిన నిర్ధారణ పరీక్షలు చేయించుకుని, దానికి తగినట్లుగా చికిత్స తీసుకోవడం. 

→ బరువును అదుపులో పెట్టుకోవడం: బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం. 

→ వ్యాయామం: శరీర బరువు పెరుగుతున్న కొద్దీ జాయింట్స్‌పై పడే ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి దాన్ని అదుపులో పెట్టుకోడానికి స్విమ్మింగ్, సైక్లింగ్‌ వంటి వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయడం. 

→ చురుగ్గా ఉండటం : కీళ్లకు తగినన్ని  పోషకాలు అందడంతో పాటు కండరాల  ఆరోగ్యం బాగా ఉండటానికి ఎప్పుడూ ఒకేచోట కూర్చుని ఉండకుండా నిత్యం చురుగ్గా కదులుతూ ఉండటం. 

→ ఫిజియోథెరపీ వంటి చికిత్సలు : ఎడతెరిపి లేకుండా వచ్చే నొప్పి నివారణ కోసం అవసరాన్ని బట్టి ఫిజియో వంటి చికిత్సలు తీసుకోవడం. 

→ సమస్య తగ్గడానికి అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను తెలుసుకోవడం: ఈ సమస్య తగ్గడానికి అందుబాటులో ఉన్న చికిత్స ప్రక్రియలు... ఉదాహరణకు మందులూ, ఇంజెక్షన్లతో; జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వంటి చర్యలతో శస్త్రచికిత్స నివారించుకోవడానికీ... ఇక తప్పదు అనుకున్నప్పుడు చేయాల్సిన శస్త్రచికిత్సను వీలైనంత ఆలస్యంగా జరిగేలా చూసుకోవడం. 

చివరగా... ఈ సమస్యపై తగినంత అవగాహన పెంచుకోవడం వల్ల... ఇవాళ్ల  జీవనశైలిలో మార్పులు (లైఫ్‌స్టైల్‌ మాడిఫికేషన్స్‌)తోనే తగ్గేవీ; లేదా కొద్దిపాటి మందులతోనే తగ్గేలా తేలికపాటి చికిత్సలతోనే తగ్గే సమస్య... భవిష్యత్తులో శస్త్రచికిత్స వరకూ వెళ్లవచ్చు. అందుకే ఈ తరహా కీళ్లనొప్పుల విషయం వీలైనంతలో త్వరగా డాక్టర్‌ను కలవడం అవసరం. 
డా.  నీలం వి. రమణారెడ్డి,
సీనియర్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement