
కామెంట్
ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ కోసం జూన్ 24న ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తు న్నాయి. కలవరపరచే పలు ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. ఈ సవరణ ఫలితంగా కోట్ల మంది తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉండదా? వీరిలో అత్యధికులు పేదలు, అణగారిన వర్గాలే ఉంటారా? అసలు ఇప్పటికిప్పుడు ఈ సవరణ కార్యక్రమం చేపట్టడం అవసరమా?
ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం, ఏ సమయంలోనైనా, ఏ తరహాలోనైనా ఓటర్ల జాబితాల్లో ప్రత్యేక సవరణ చేసే అధికారం ఎలక్షన్ కమిషన్‌కు ఉంటుంది. నాకు ఆ విషయం తెలుసు. అయితే, కేవలం నాలుగు నెలల్లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగవలసి ఉన్న తరుణంలో ఈ ఆదేశం ఎంతవరకు సబబు? 2003లో, అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల ముందుగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్– సర్) జరిగింది. అది నాలుగు నెలల ముందు కాదన్నది మనం గమనించవలసిన విషయం.
ఆధారాలు ఎలా తెస్తారు?
రెండోది, ఈ ‘సర్’ను జూన్ 25న ప్రారంభించి, జూలై 25 నాటికి పూర్తి చేయాలి. అంటే కేవలం ఒక నెల రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది. 8 కోట్ల మంది ఓటర్లను ప్రభావితం చేసే ఈ కార్య క్రమాన్ని కేవలం 30 రోజుల్లో పూర్తి చేయడం అసలు సాధ్యపడే పనేనా?
ఇవి సందర్భానికి సమయానికి సంబంధించిన ప్రశ్నలు. అయితే, ఇక్కడ ప్రశ్నార్థకం సమయం ఒక్కటే కాదు; ప్రక్రియ మీదా నీలినీడలు ముసిరాయి. ఎలాగో తెలుసుకోడానికి ఉత్తర్వుల వివ రాల్లోకి వెళ్దాం. కమిషన్ ఆదేశాల ప్రకారం, 1987 జూలైకి ముందు జన్మించిన వ్యక్తులు తమ పుట్టుకకు, పుట్టిన ప్రదేశానికి సంబంధించిన ఆధారాలు సమర్పించి తీరాలి. అయితే, చాలా మందికి జనన ధ్రువీకరణ పత్రాలు ఉండవు. వీరిలో ఎంతో మంది ఆసుపత్రుల్లో కాకుండా ఇళ్లలోనే జన్మించారు.
2000 సంవత్సరం వరకూ కూడా బిహార్‌లో కేవలం 3.7 శాతం జననాలే అధికారికంగా నమోదు అయ్యాయి. 2007 నాటికి ఇది 25 శాతానికి పెరిగింది. ఈ సంవత్సరంలో పుట్టిన వారికి 2025లో 18 ఏళ్లు నిండుతాయి. అంటే ఏమిటి? వీరిలో గణనీయ సంఖ్యాకుల వద్ద జనన ధ్రువీకరణ పత్రాలు లేవు. స్వయంగా రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వెల్లడించిన గణాంకాలే ఈ వాస్తవాన్ని వెల్లడిస్తున్నాయి.
జనన ధ్రువీకరణ పత్రాలు లేని వారు 11 ఇతర ఆధారాల్లో ఏదో ఒకటి చూపించగలిగితే చాలని కమిషన్ చెబుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసే గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు, మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్, అటవీ హక్కు సర్టిఫికెట్ వంటివి వీటిలో ఉన్నాయి. కానీ, సాధారణంగా అందరి దగ్గరా ఉండే ఆధార్, రేషన్ కార్డులను సుప్రీంకోర్టు సూచించినప్పటికీ వీటినుంచి మినహాయించారు. కమిషన్ పేర్కొన్న 11 పత్రాల్లో ఏదో ఒకటి ఎంత మంది బిహారీల వద్ద ఉండి ఉంటుంది? ఆ ఏదో ఒక పత్రంలో జన్మస్థలం నమోదై ఉంటుందా అనేది మరో ముఖ్యమైన ప్రశ్న. చాలా వాటిలో ఉండదు.
దళితులు, ముస్లింలు, అత్యంత వెనుకబడిన కులాలు, ఆది వాసీలు వంటి అట్టడుగు వర్గాల బీద ప్రజలకు ఈ ధ్రువీకరణ పత్రాలు ఉండవు. కాబట్టి వారి ఓటు హక్కు రద్దవుతుంది. ఇది అన్యాయం కాదా?
కమిషన్ మౌనం
మరో అడుగు ముందుకు వెళ్లి పరిశీలిద్దాం. 1987 జూలై తర్వాతి నుంచి 2004 డిసెంబరు వరకు గడచిన కాలంలో పుట్టినవారు జనన, జనన ప్రదేశ ఆధారాలు మాత్రమే ఇస్తే సరిపోదు. తమ తల్లిదండ్రుల్లో ఒకరి జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 2004 డిసెంబరు తర్వాత పుట్టిన వారైతే తల్లిదండ్రుల ఇద్దరి వివరాలు ఆధారాలతో సహా సమర్పించాలి. ఎంతమంది ఇలా చేయగలరు? ఉదాహరణకు, నా తల్లిదండ్రుల జనన ధ్రువపత్రాలు నా వద్ద లేవు. నేను వాటిని సమర్పించలేను. చాలామంది బిహారీల వద్ద వారి తల్లిదండ్రుల జనన ధ్రువీకరణ పత్రాలు ఉండవని నేను కచ్చితంగా చెప్పగలను.
కమిషన్ ఆ తర్వాత చెప్పిన దాని ప్రకారం, బిహార్‌లో 2003 ‘సర్’ జరిగిన తర్వాత 7.9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 4.96 కోట్ల మంది ఓటర్లు ఎలాంటి డాక్యుమెంట్లూ సమర్పించాల్సిన అవసరం లేదు. మరి మిగిలిన 3 కోట్ల మంది మాటేమిటి? హక్కు ఉన్నప్పటికీ 2003 ఎస్‌ఐఆర్‌లో నమోదు కాని వారి సంగతేమిటి? ఈ ప్రశ్నలకు కమిషన్ నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు.
అక్రమం... హాస్యాస్పదం
ఇవి ఇప్పటికే వేధిస్తున్న ప్రశ్నలు కాగా, సవరణ ప్రక్రియముందుకు సాగుతున్న కొద్దీ మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. కమిషన్ కోరుతున్న అన్ని వివరాలూ నెల రోజుల్లోనే సమకూర్చాలి. అలా చేయలేని వారి పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగిస్తారు. అసలే నడి వర్షాకాలం, పైగా ఖరీఫ్ సీజన్ ముమ్మరంగా సాగుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో పనులు మానుకుని ఎంతమంది ఈ అదనపు బరువు నెత్తికి ఎత్తుకుంటారు?
ఇక్కడితో అయిపోలేదు. బిహార్ జనాభాలో 20 శాతం మంది వలసలు పోయే కార్మికులు. ఈ ప్రత్యేక సవరణ జరిగేటప్పుడు వారు స్థానికంగా అందుబాటులో ఉండరు. అలాంటి వారి విషయంలో ఏం జరుగుతుంది? ఓటర్ల జాబితాల నుంచి వారి పేర్లు గల్లంతయ్యే ప్రమాదం లేదా?
చివరిగా, మరో అంశం ప్రస్తావించాలి. ఓటర్ల జాబితాల్లో ఇలా పేర్లు గల్లంతైన వారు పౌరులుగా కూడా గుర్తింపు కోల్పోయే ప్రమాదం లేదా? ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్’ (ఏడీఆర్) వ్యవస్థాపక ట్రస్టీ అయిన జగదీప్ ఛోకర్ అందుకే ఈ ఎస్‌ఐఆర్ ‘‘అక్రమం, హాస్యాస్పదం, అనవసరం’’ అంటున్నారు. నిర్మొహమాటంగా చెబుతున్నాను, నేను ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తాను. మరి మీ సంగతేమిటి?
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్