
బిహార్‌లో ఓటర్ల జాబితాలపై ప్రత్యేక సునిశిత సవరణ (ఎస్.ఐ.ఆర్.–సర్) నిర్వ హించాలన్న భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన వివిధ పిటిషన్లపై సుప్రీంకోర్టు వాదోపవాదాలను వింటోంది. ఈలోగా, ఆ తతంగానికి సంబంధించిన మొదటి దశ ఇటీవలే పూర్తయింది.రాష్ట్రంలో రాబోయే ఎన్నికల లోగా జాబితా లను మెరుగుపరచాలని ‘సర్’ లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశ పూర్తయ్యేనాటికి జాబితాలో చేర్చాలని కోరుతూ 7.24 కోట్ల దర ఖాస్తులు వచ్చాయని కమిషన్ వెల్లడించింది. జాబితాల సవరణ మొదలుపెట్టిన జూన్ 24 నాటికి రాష్ట్రంలో నమోదై ఉన్న ఓటర్లసంఖ్య కన్నా అది 65 లక్షలు తక్కువ.
పిటిషనర్ల ఆగ్రహానికి కారణాలు
1950 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 21వ సెక్షన్ కింద ఓటర్ల జాబితాలను సవరించే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉంది. కానీ, రెండు ముఖ్యమైన అంశాలు పిటిషనర్లకు కోపం తెప్పించాయి. ఒకటి – 2003 తర్వాత నమోదైన ఓటర్లు అందరూ తిరిగి తమ పేర్లను నమోదు చేసుకోవాలనీ, అందుకు తగిన అర్హతను చూపాలనీ కోరడం. రెండు – వారు ఆ పని చేయడానికి ఒక నెల వ్యవధి మాత్రమే ఇవ్వడం. తిరిగి పేరు నమోదు చేసుకునేందుకు తక్కువ వ్యవధినివ్వడం, వేగంగా సవరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చూడటం వల్ల ఈ విధానం అపారదర్శకంగా తయారైంది.
మూకుమ్మడిగా పేర్లు తొల గింపునకు గురవుతాయనే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అయినా, ఈ కార్యక్రమాన్ని నిలిపివేసేందుకు కోర్టు తిరస్కరించింది. ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డులను కూడా ‘పరిగణన’లోకి తీసుకోవలసిందని మాత్రమే కోర్టు కోరింది. ఆ విధంగా చాలా మందిని అనర్హులుగా చేయనున్నారనే విమర్శలకు తావు ఇవ్వకుండా ప్రయత్నించింది.
ఓటర్ల జాబితా ఎందుకు కీలకం?
భారతదేశంలో ప్రజాస్వామ్య హృదయాన్ని పదిలపరచేది ఓటు హక్కేనని, దాన్ని వినియోగించుకోవడంలోని ప్రాధాన్యాన్ని వివరిస్తూ గతంలో కొన్ని తీర్పులు వెలువడ్డాయి. అయితే, ఓటు హక్కు చట్ట పరమైన హక్కుగానే మిగిలిపోయింది. దాని అస్తిత్వం ఒక ప్రత్యేక శాసనంతో ముడిపడి ఉంది. దానివల్ల వచ్చిన చిక్కేమిటంటే, ఆ హక్కు విషయంలో జోక్యం చేసుకోవచ్చు లేదా అది కొన్ని షరతులకు లోబడి ఉండేటట్లు చేయవచ్చు.
నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నవారికి మాత్రమే ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని 1951 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 62వ సెక్షన్ పేర్కోంటోంది. ఫలితంగా, అర్హులైన ఓటర్లను గుర్తించడంలో ఓటర్ల జాబితాలను రూపొందించడం లేదా సవరించడం ముఖ్యమైన ప్రక్రియగా మారింది. గడువు ముగిసిన తర్వాత ఓటర్ల జాబితాలను సవరించడానికి అనుమతించబోమని ఒకసారి బిహార్ విషయంలోనే బైద్యనాథ్ పంజియార్ వర్సెస్ సీతారామ్ మహతో (1969) కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
నమోదుకు కడపటి తేదీ ముగిసిన తర్వాత, ఓటర్ల జాబితా లకు సవరణ తేవడం, చేర్చడం లేదా తొలగించడం, ఒకచోటు నుంచి ఇంకో చోటుకు మార్చడం చేయకుండా 1960 నాటి నిబంధనలు నివారిస్తున్నాయి. జాబితాల సవరణపై స్టే విధించడానికి సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించడం బట్టి, ప్రస్తుత కేసులో పిటిషనర్లకు అనుకూలంగా ఫలితం వస్తుందని ఆశించడానికి అటువంటి పూర్వ ప్రమాణాలు, నిబంధనలు స్ఫూర్తినిచ్చేవిగా లేవు.
పైగా, సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను రెండు కారణాల రీత్యా తోసిపుచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకటి– అటువంటి కేసులను సమీక్షించడానికి సుప్రీంకోర్టుకు ఉన్న పరిధులు పరిమితం. రెండు– ఎన్నికలను జాప్యం చేసేందుకే అలాంటి కేసులు పెట్టే ఎత్తుగడ అనుసరిస్తూ ఉంటారని సుప్రీంకోర్టుకు ఎప్పుడూ ఒక సందేహం ఉంటుంది.
ఫిర్యాదులు చేయడం సాధ్యమేనా?
ఫిర్యాదులు చేసేందుకు లేదా సమస్యలు పరిష్కరించాలని కోరేందుకు వీలుగా ఒక ఆంతరంగిక సమీక్షా యంత్రాంగాన్ని 1950 నాటి చట్టం సమకూరుస్తోంది. ఎన్నికల అధికారులపై ఎవరైనా అభ్యంతరాలు లేవనెత్తవచ్చు. తదుపరి ఆదేశాలు జారీ చేయవలసిందిగా కమిషన్‌ను కోరవచ్చు. కోర్టులను ఆశ్రయించడానికి ముందు ఆ మార్గాలను అనుసరించవలసిందిగా కోర్టు గతంలో పలుమార్లు స్పష్టం చేసింది.
ఉత్తర ప్రదేశ్‌కు సంబంధించి ఎన్నికల జాబితాలను రూపొందించడం, మార్పు చేర్పులు చేయడంలో అవకతవకలు జరిగాయని, జోక్యం చేసుకోవలసిందని కోరుతూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం (1996)పై అనురాగ్ నారాయణ్ సింగ్ పెట్టిన కేసులో తలదూర్చేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. బిహార్ సవరణ ప్రక్రియలోని న్యాయ బద్ధతను విశ్లేషించేటపుడు కోర్టు ఈసారి కూడా అదే రీతిలో, ఫిర్యాదు దారులందరినీ ఆ యా చట్టపరమైన ప్రక్రియల వైపు మళ్ళవలసిందిగా సూచించి చేతులు దులుపుకోవచ్చు.
ఈ ఆంతరంగిక పరిష్కార యంత్రాంగాలలో వేళ్ళూనుకు పోయిన సమస్యలు చాలా ఉన్నాయని గతంలో వచ్చిన కేసులు చెబు తున్నాయి. ఫిర్యాదులతో వెళ్ళడం అధికారులకు రుచించకపోవడం వల్ల, వారు తమ అభ్యంతరాలను చెవికెక్కించుకున్నది లేదనికొందరు వాపోయిన సందర్భాలున్నాయి. పైగా, మురికివాడనివాసుల వంటి బలహీన వర్గాల పౌరులలో కొన్ని వర్గాలకు ఈ ప్రక్రియ అందని మావిపండుగానే ఉంది.
ఓటరుగా అనర్హుడవని వచ్చిన నోటీసులను చదువు సంధ్యలు లేనివారు అర్థం చేసుకోగలరా? ఎన్నికల అధికారి ముందుకు వెళ్ళడం కోసమని దినసరి వేతన కార్మికుడు ఒక రోజు పనిని వదులు కోగలడా? న్యాయ పరిరక్షణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత బిహార్ ‘సర్’ కేసులో సుప్రీంకోర్టు గణనీయంగా కల్పించుకుని సరైన తీర్పరిగా వ్యవహరించవలసి ఉంది.
ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో...
లక్ష్మీ చంద్రసేన్ వర్సెస్ ఏ.కె.ఎం. హసన్ (1985) కేసులో ఓటర్ల జాబితాలను సవరించాలని ఆదేశించడానికి సుప్రీంకోర్టు వెనుకాడింది. అది ఎన్నికలపై న్యాయవ్యవస్థ అవాంఛనీయ జోక్యానికి కార ణమవుతుందనీ, ఒక్కోసారి ఎన్నికల నిరవధిక వాయిదాకు దారి తీస్తుందనీ కోర్టు కలవరపడింది. ఎన్నికలు ఎంత ఎక్కువగా అనివా ర్యమైతే, దానిలో జోక్యం చేసుకునేందుకు కోర్టు అంత ఎక్కువగా విముఖత చూపుతుందన్న అప్రకటిత సూత్రం ఒకటి ఉంది.
ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు, అక్రమాలు చోటుచేసుకుంటే మాత్రం, అది మొత్తం ఎన్నికలను విషపూరితం చేసే అవకాశం ఉంటుంది కనుక కోర్టు ఆ బాధ్యతను భుజాలకు ఎత్తుకుంటుంది. దాన్ని పరిష్క రించేందుకు తదనంతరం, కోర్టు ఒక ప్రత్యేక ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్లు అవుతుందనే సాకుతో బిహార్ విషయంలో తలదూర్చేందుకు కోర్టు మొదట తిరస్కరించవచ్చు.
ఓటర్ల జాబితాల సవరణ అక్రమమని ఒకవేళ కోర్టు భావించినా కూడా ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడం కానీ, అనర్హులుగా చేసే విధానాన్ని నివారించడం కానీ చేయకపోవచ్చు. భారతీయ ప్రజాస్వామ్యానికి కించిత్తు హాని జరుగుతుందని తలచినా అప్రమ త్తంగా ఉండే కాపలాదారు పాత్రనే సుప్రీంకోర్టు చాలా సందర్భాలలో నిర్వహిస్తూ వచ్చింది. ఓటు వేసేందుకు ప్రజలకు ఉన్న హక్కు ప్రజా స్వామ్యానికి ప్రాథమిక పునాది కనుక ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను సుప్రీం కోర్టు చేపట్టడం ఇప్పుడు చాలా ముఖ్యం.
-వ్యాసకర్త ‘విధి సెంటర్ ఫర్ లీగల్ స్టడీస్’ రిసెర్చ్ ఫెలో(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
-అంశుల్ డాల్మియా