
పత్రికా స్వేచ్ఛకు సంబంధించి భారత రాజ్యాంగంలో ప్రత్యేకించి ప్రస్తావించక పోయినప్పటికీ, 19(1)(ఎ) అధికరణం ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛను పొందుపరిచారు. తద్వారా పాత్రికేయులు, రచ యితలు, కవులు, కళాకారులు, సృజనాత్మక నిపుణులు తమ భావా లను నిర్ద్వంద్వంగా స్పష్టం చేసే హక్కులు పొందారు.
ప్రభుత్వాన్ని ఏ పార్టీ నడిపిస్తున్నప్పటికీ సహేతుకమైన విమర్శ లను సాదరంగా ఆహ్వానించాల్సిందే. అర్థవంతమైన సూచనలను పరిగణనలోకి తీసుకోవాల్సిందే. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీతనం వహించాలి. పత్రికలు సామాజిక బాధ్యతగా ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య వారధిగా నిలబడాలి. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేర వేయాలి. మీడియా ప్రచురించిన వార్తల్లో వాస్తవాలను గ్రహించి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పాలనలో దిద్దుబాట్లకు శ్రీకారం చుట్టాలి. అంతేగానీ తాము చేసేదంతా మంచేననీ, దాన్నెవరూ ప్రశ్నించకూడదనీ ప్రభుత్వాలు భావిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది.
ఈ మధ్యకాలంలో జరిగిన ఒక సంఘటన విస్తుగొలిపేలా ఉంది. ‘ఫలానా ప్రమోషన్లలో అవినీతి జరిగిందని’ ఎవరో మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ‘సాక్షి’ పత్రిక రాసిన వార్త మీద పోలీసులు కేసు నమోదు చేయడం; ఎడిటర్, రిపోర్టర్లకు పోలీసులు నోటీసులు జారీ చేసి పోలీసు స్టేషన్‌లో ప్రశ్నించడం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనడానికి సహేతుకమైన సంకేతం.
ఎడిటర్ ఇంట్లో సోదాలు నిర్వహించడం నిర్ద్వంద్వంగా నియంతృత్వ పోకడే. ప్రతిష్ఠాత్మక ‘ఇండియా టుడే’ మీడియా గ్రూపు కన్సల్టెంట్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్ సైతం ఈ చర్యల పట్ల ధర్మాగ్రహం వ్యక్తం చేశారంటే సమస్య తీవ్రత ఎంతటిదో అర్థమ వుతుంది. ‘పీ4 పథకం ముఖ్య నేత పిచ్చికి పరాకాష్ట’ అనీ, ‘ఎమ్మెల్యేలు అందరూ అవినీతి పరులే’ననీ రాసిన పత్రిక మీద మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే సదరు పత్రిక రాసి నవి వాస్తవాలని ప్రభుత్వం ఒప్పుకున్నట్టేనా? మరెందుకు కొన్ని పత్రికల పట్ల పక్షపాత వైఖరి?
నిస్సందేహంగా మీడియాకు ‘లక్ష్మణ రేఖ‘ అవసరమే. అయితే ఇది స్వీయ నియంత్రణ రేఖ కావాలే కానీ, భావప్రకటన కుత్తుక మీద కత్తిలా ఉండకూడదు. మీడియాను బందిఖానాలో ఉంచాలను కుంటే రౌడీలు రాజ్యమేలతారు. అది మరింత ప్రమాదకరం!
– ప్రొ‘‘ పీటా బాబీవర్ధన్
జర్నలిజం విభాగ పూర్వాధిపతి, ఆంధ్ర విశ్వవిద్యాలయం