
‘అవతార్–3’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాం. సన్నగా మళ్లీ కడుపునొప్పి మొదలైంది! డైవర్టిక్యులిటిస్!! డాక్టర్లు ఈ నొప్పికి పేరైతే పెట్టారు కానీ, నయమవటం మాత్రం నా చేతుల్లోనే ఉందంటారు. నా చేతుల్లో అంటే – నేను తినే వాటిల్లో! ‘‘మిస్టర్ కామెరన్! ఇలా నొప్పి వచ్చినప్పుడు మీరు కొద్ది రోజుల పాటు కూరగాయల రసం మాత్రమే తాగండి. అలాగే గుజ్జు లేని పండ్ల రసాలు...’’ అంటారు వైద్యులు. ఈ మందు చీటీ నా దగ్గర ‘అవతార్–1’ ముందు నుంచే ఉంది.
పొత్తి కడుపు కింద, ఎడమవైపు సన్నగా మొదలైన నొప్పి... కాసేపు మెలిపెడుతోంది, కాసేపు కత్తితో పొడిచినట్లుగా ఉంటోంది. ఆత్మశక్తిని కూడదీసుకుని పని చేస్తున్నాను. ‘‘ఏంటి మళ్లీనా?’’ అన్నారు, నా పక్కనే ఉన్న స్టీఫెన్ ఇలియెట్. ఫిల్మ్ ఎడిటర్ తను. అతడికి నా డైవర్టిక్యులిటిస్ గురించి తెలుసు.‘‘లేదు, లేదు... స్టీఫెన్, ఏదో కొద్దిగా! అంతే’’ అన్నాను, నవ్వే ప్రయత్నం చేస్తూ.
పెయిన్ కన్నా కూడా పని ఆగి పోవటం ఎక్కువ పెయిన్ నాకు. డిసెంబర్‌లో ‘అవతార్–3’ రిలీజ్ పెట్టుకున్నాం. ఆ లోపే నేను అన్నీ సర్దేసుకుని న్యూజిలాండ్ వెళ్లిపోవాలి. ఇప్పటికి రెండుసార్లు యూఎస్ సిటిజెన్‌షిప్‌కు అప్లికేషన్ పెట్టి కూడా వెనక్కు తీసుకున్నాను. మొదటిసారి 2004లో జార్జి బుష్ అమెరికా ప్రెసిడెంటుగా రీ–ఎలెక్ట్ అయినప్పుడు. ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ డోనాల్డ్ ట్రంప్ రీ–ఎలెక్ట్ అయినప్పుడు.
హారిఫిక్ ప్రెసిడెంట్లు ఇద్దరూ! ఇలాంటి వాళ్లు మళ్లీ గెలవటం అంటే ఒకే కారుకు పదే పదే రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉండటం.
అమెరికాను వదిలి, న్యూజిలాండ్ వెళ్లటం అంటే కేవలం ఇల్లు మారటం కాదు. ఒక మంచి ఇంట్లోకి మారటం! న్యూజిలాండ్ అందర్నీ సమానంగా చూస్తుంది. కెనడా నుంచి వెళ్లిన వారినైనా, వేరే ఖండం వారే అయినా అక్కడ ప్రశాంతంగా జీవించవచ్చు.
ప్రశాంతంగా జీవించటం అంటే, జీవితమంతా ఇష్టంగా చేస్తూ వచ్చిన పనిని జీవితాంతమూ కొనసాగిస్తూ ఉండటం. నేనైతే ఎనభై ఏళ్లకీ, తొంభై ఏళ్లకీ ఎన్ని ‘అవతార్’లు తీయగలిగితే అన్నీ తీస్తూనే ఉంటాను. ఇక తీయలేనప్పుడు, సినిమా తియ్యటం ఎంత తేలికో పిల్లలకు చెబుతూ ఉండిపోతాను.
న్యూజిలాండ్ వెళ్లినప్పుడు నన్నొక పట్టభద్రుడు కలిశాడు. ‘‘సర్! నేను సినిమా డైరెక్టర్‌ని అవ్వాలనుకుంటున్నాను. అవగలనా?’’ అని అడిగాడు.
‘అవగలనా?’ అనుకుంటే ఎవరూ అవలేరు.‘‘అవలేనా!’ అనుకుంటే ఎవరైనా అవగలరు అన్నాను.
అతడి కళ్లు మెరిశాయి.
‘‘ఒక కెమెరా తీసుకో. ఒక కథ అనుకో. చిన్న కథా, చెత్త కథా అని చూడకు. నీ ఫ్రెండ్స్ చేత యాక్ట్ చేయించు. నీకు సిస్టర్ ఉంటే తనకూ ఒక పాత్ర ఇవ్వు. షూటింగ్ అయ్యాక టైటిల్స్‌లో డైరెక్టర్‌గా నీ పేరు పెట్టుకో. ఇక అప్పట్నుంచీ నువ్వు సినిమా డైరెక్టర్! నువ్వెంత బడ్జెట్‌లో తీస్తావో, నీకెంత ఇవ్వాలో నిర్మాతలతో బేరం కుదుర్చుకో’’ అని చెప్పాను.
మెరుస్తున్న అతడి కళ్లలో నాకు ‘జెనోజెనిసిస్’ సినిమా కనిపించింది. నా 24 ఏళ్ల వయసులో మా టీమ్ తీసిన తొలి సినిమా అది. 12 నిమిషాల సైన్స్ ఫిక్షన్ షార్ట్ ఫిల్మ్!
‘‘కామెరన్... కామెరన్... మళ్లీ మీరు న్యూజిలాండ్ వెళ్లిపోయారా?’’ అని, నా భుజం ఊపుతూ పండ్ల రసం అందించారు స్టీఫెన్.
‘‘థ్యాంక్యూ స్టీఫెన్’’ అన్నాను, అతడి చేతిలోని గ్లాసును తీసుకుంటూ.
స్టీఫెన్ నా భుజం ఊపినప్పుడు ఏ యాంగిల్‌లోనో నా కడుపు నొప్పి కాస్త తగ్గినట్లుగా అనిపించింది.
కదలిక వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తోందీ అంటే నాకెందుకో నమ్మకం కలుగుతోంది – నేను ముందసలు అమెరికా నుంచి కదిలితే, ఈ డైవర్టిక్యులిటిస్ నన్నొదిలేస్తుందని!