
అభిప్రాయం
‘‘అన్యాయం ఏ ఒక్కరికి జరిగినా అందరికీ హెచ్చరికే, ఏ ఒక్కచోట జరిగినా అంతటా న్యాయానికి ప్రమాద హెచ్చరికే’’ అని మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ 1963లో బర్మింగ్ హామ్ జైలు నుంచి రాసిన లేఖలో అన్నాడు. మానవ హక్కుల ఉల్లంఘనల విషయంలో వందల, వేలసార్లు ఉటంకించబడిన వాక్యం అది. కానీ అదే సమయంలో లక్షలసార్లు మరచిపోతున్న వాక్యం కూడా. ముఖ్యంగా భారత ప్రభుత్వం ఎడాపెడా అమలు చేస్తున్న అక్రమ జైలు నిర్బంధం అనే అన్యాయపు సందర్భంలో ఈ వాక్యం గుర్తుకు రాకుండా ఉండదు.
దేశంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇస్తున్న అధికారిక గణాంకాల ప్రకారం, 2022 డిసెంబర్ 31 నాటికి దేశంలోని జైళ్లలో ఉన్న 5,73,220 మంది ఖైదీలలో 4,34,302 మంది విచారణలో ఉన్న ఖైదీలే. అంటే జైళ్లలో ఉన్న వారిలో నూటికి 76 మంది తమ నేరం రుజువై శిక్ష అనుభవిస్తున్న వాళ్లు కాదు, కేవలం విచారణలో ఉన్న వాళ్లన్నమాట! సాధారణంగా భారత న్యాయ తత్వశాస్త్రంలో ‘బెయిల్ సాధారణం, జైలు మినహాయింపు’ అని జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ 1977లో ప్రకటించిన సూత్రాన్ని పాటించడం దశాబ్దాలుగా కొనసాగుతున్నది. కానీ చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం (అన్‌లాఫుల్ ఆక్టివిటీస్ ప్రివెన్షన్ ఆక్ట్ – యూఏపీఏ) కింద నమోదైన కేసులలో బెయిల్ ఇవ్వడానికి నిబంధనలను కఠినతరం చేశారు. దేశవ్యాప్తంగా వేలాది మందిని ఆ చట్టం కింద కేసులలోనే నిర్బంధిస్తున్నారు. అందువల్ల ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నా ఆ కేసులు విచారణకూ రావు, ఈలోగా ఖైదీలు బెయిల్ మీద విడుదలయ్యే అవకాశమూ లేదు.
యూఏపీఏ నేరాలను ఎంత అస్పష్టంగా, ఎంత విశా లంగా నిర్వచించిందంటే... ప్రభుత్వం, పోలీసు అధికా రులు తలచుకుంటే ఎవరినైనా, ఏ పని చేసినందుకైనా, చేయనందుకైనా ఆ చట్టం కింద నిందితులుగా చూప వచ్చు. విచారణంటూ జరిగితే, ఆ కాలంలో బెయిల్ మీద విడుదల చేయకుండా ఉండవచ్చు. విచారణను తాత్సారం చేసి ఏళ్ల తరబడి జైలులో ఉంచవచ్చు. ఆ అస్పష్ట నేరం కింద ఏడెనిమిదేళ్లుగా విచారణ లేకుండా, బెయిల్‌పై విడు దల లేకుండా వందలాది మంది జైళ్లలో మగ్గిపోతున్నారు. ఆ చట్టం కింద 23 ఏళ్లు జైలులో ఉండి, చివరికి నిర్దోషిగా విడుదలైన వారు కూడా ఉన్నారు.
ఇలాంటి అక్రమ కేసుల నుంచి వేలాది ఆదివాసులకు విముక్తి కలిగించిన వారు నాగపూర్‌కు చెందిన న్యాయవాది సురేంద్ర గడ్లింగ్. అటువంటిది ఆయనే స్వయంగా ఏడేళ్లకు పైగా భీమా కోరేగాం కేసులో విచారణ లేకుండా, బెయిల్ రాకుండా జైలులో ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ రీసర్చ్ ఫెలోషిప్ కింద ఆదివాసి ప్రాంతాలలో క్షేత్ర పరిశోధన చేస్తున్న పరిశోధక విద్యార్థి మహేష్ రౌత్ కూడా అదే కేసులో 2018 జూన్ 6 నుంచి జైలులో ఉన్నారు. యూఏపీఏ కేసులలో కఠిన తరమైన బెయిల్ నిబంధనలు ఉన్నప్పటికీ, ఏపీ, తెలంగాణలలో న్యాయమూర్తులు బెయిల్ ఇస్తున్నారనీ, అరెస్టు వంటి నిర్బంధ చర్యలకు పాల్పడగూడదని ఆదేశాలు ఇస్తున్నారనీ, ఆగ్రహించిన కేంద్ర దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ రెండు రాష్ట్రాల కార్యకర్తలను పొరుగు రాష్ట్రాల అక్రమ కేసుల్లో నిందితులుగా చూపుతున్నది.
ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ జిల్లా నాగర్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలో తిరియా గ్రామం దగ్గర 2019 జూలైలో నమోదైన కేసు ఒకటి ఉంది. అడవిలో సీఆర్పీ, డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలకూ – మావోయిస్టులకూ జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులూ, ఒక గ్రామస్థుడూ చనిపోయారనీ, ఘట నాస్థలిలో దొరికిన డైరీలో కొందరి పేర్లు ఉన్నాయనీ పోలీసులు ప్రకటించారు. అలా చనిపోయిన మావోయిస్టులనూ, పారిపోయారంటున్న మావోయిస్టులనూ, డైరీల్లో ఉన్నాయని చెపుతున్న తెలుగువారి పేర్లనూ కలిపి 2019 జూలై 28న కేసు పెట్టారు. రెండేళ్ల తర్వాత 2021 మార్చిలో ఈ కేసును ఎన్‌ఐఏ తన అధీనంలోకి తీసుకుంది.
ఈ కేసులో భాగంగా డొంగరి దేవేంద్ర, చుక్క శిల్ప లను 2022 జూన్‌లో అరెస్టు చేసి మరెన్నో కేసుల్లో నింది తులుగా చూపారు. పద్మ అంతకు ముందు ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నో అక్రమ కేసుల్లో పదేళ్లు జైలు జీవితం గడిపి, అన్ని కేసులలోనూ నిర్దోషిగా విడుదలై, హైదరాబాద్ (Hyderabad) వచ్చి ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసి న్యాయవాదిగా ఉండగా, 2023 జూన్‌లో అరెస్టు చేసి ఈ ఛత్తీస్‌గఢ్ కేసులో జైలుకు పంపారు. అలాగే 2021లో మరణించిన మావోయిస్టు పార్టీ నాయకుడు రామకృష్ణ సహచరి, ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో సాధారణ జీవితంలో ఉన్న కందుల శిరీషను, ఆంధ్రప్రదేశ్ కుల నిర్మూలనా పోరాట సమితి అధ్యక్షుడు దుడ్డు ప్రభా కర్‌ను 2023 జూలై 21న అరెస్టు చేసి ఈ కేసులో నిందితులుగా ఛత్తీస్‌గఢ్‌లో జైలులో నిర్బంధించారు. రెండేళ్లు గడిచినా విచారణా లేదు, బెయిలూ లేదు.
చదవండి: నస్ బందీ, నోట్ బందీ దారిలో ఓట్ బందీ!
దుడ్డు ప్రభాకర్ 1985 కారంచేడు నరమేధం నాటికి చీరాలలో పీజీ విద్యార్థిగా ఉంటూ, ఆ నరమేధానికి వ్యతి రేకంగా జరిగిన ఆందోళనతో కుల నిర్మూలన రాజకీయాలలో ప్రవేశించారు. దళితులపై దాడులు జరిగిన చీమకుర్తి, వై చెర్లోపల్లి, వేంపెంట, రాజుపాలెం, చుండూరు, లక్షింపేట తదితర ఎన్నోచోట్ల ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎన్నో అక్రమ కేసులను ఎదుర్కొన్నారు. ‘కుల నిర్మూలన’ మాసపత్రికకు సంపాదకులుగా పనిచేశారు. ఆయన గొంతు వినిపించకుండా చేయాలని, బెయిల్ ఇవ్వకుండా సుదీర్ఘకాలం జైలులో ఉంచాలని ఈ కేసులో నిందితులుగా చూపారు. చార్జిషీట్ ప్రకారమే చూసినా ఈ కేసులో ఉన్న తెలుగు వారెవరికీ ఎటువంటి నేరంతో, ఘటనతో, ప్రాణ నష్టంతో, ఆస్తి నష్టంతో సంబంధం లేదు. అది ఎవరిదో తెలియని, అసలు ఉందో లేదో తెలియని ఒక డైరీలో వీళ్ల పేర్లు ఉన్నాయనేది మాత్రమే ఆరోపణ. ఆ ఆరోపణ మీద విచారణ కూడా జరపకుండా రెండేళ్లకు పైగా జైలులో మగ్గిపోయేలా చేసిన ఘనమైన చట్టబద్ధ పాలన మనది!
- ఎన్. వేణుగోపాల్
‘వీక్షణం’ సంపాదకుడు