
అభిప్రాయం
దేశమంతా ఎలా ఉన్నా, కనీసం రాజధాని ఆదర్శప్రాయంగా, ఉదాహరణప్రాయంగా ఉండాలంటారు. రాజధానిలోనే సుప్రీంకోర్టు, పార్లమెంటు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కీలకమైన అధికార యంత్రాంగం వంటి అత్యున్నత అధికార పీఠాలు, విదేశీ రాయబార కార్యాలయాలు, విదేశీ ప్రచార సాధనాల ప్రతినిధులు ఉంటారు. దేశమంతటికీ అది కూడలి. అందరి దృష్టీ రాజధాని మీదనే ఉంటుంది. (కొన్నేళ్ల కిందనైతే జంతర్ మంతర్ (Jantar Mantar) రోడ్డు మీద అరగంట తిరిగితే దేశపు సమస్యలన్నీ తెలిసేవి. ఇప్పుడది మారిందనుకోండి. సమస్యలు పోయాయని కాదు, జంతర్ మంతర్‌ను మార్చేశారు!) మొత్తం మీద రాజధానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందువల్ల ఢిల్లీని పూర్తి స్థాయి రాష్ట్రంగా మార్చకుండా, కేంద్ర పాలిత ప్రాంతంగానే ఉంచి, పోలీసు యంత్రాంగాన్ని స్థానికంగా ఎన్నికైన ప్రభుత్వం చేతిలో కాక, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంచారు. ఢిల్లీ ప్రభుత్వం ఏ పార్టీదైనప్పటికీ, పోలీసు యంత్రాంగం నేరుగా కేంద్ర ప్రభుత్వ హోం శాఖ నిర్వహణలో ఉంటుంది.
అటువంటి మహా ఘనత వహించిన ఢిల్లీ పోలీసుల ఇటీవలి పనులు వారు స్థానిక ప్రభుత్వం కన్న పై స్థాయిలో మాత్రమే కాదు, భారత రాజ్యాంగం కన్న, భారత ప్రజాస్వామిక ఉద్యమాలలో వెల్లువెత్తి, చట్టాలుగా మారిన విలువల కన్న, అసలు మానవత కన్న, నాగరికత కన్న పైన ఎక్కడో అతీతంగా, వాటన్నిటినీ లెక్క చేయనక్కర లేని స్థితిలో ఉన్నారని చూపుతున్నాయి.
దేశంలో పాలనా విధానాల పట్ల, తమ జీవితాలను అతలాకుతలం చేస్తున్న ఆర్థిక, రాజకీయ పరిణామాల పట్ల విద్యార్థి లోకంలో అసంతృప్తి నానాటికీ పెరుగుతున్నది. ఉద్వేగభరితమైన వయసు వల్ల ఆ అసంతృప్తి వ్యక్తీకరణలు తీవ్రంగా ఉండటం కూడా సహజమే. ఢిల్లీలో జేఎన్‌యూ, జామియా మిలియా, అంబేడ్కర్ విశ్వవిద్యాలయాలు అటువంటి అసంతృప్తికి, ఆందోళనలకు కేంద్రాలుగా మారుతున్నాయి. అక్కడి విద్యార్థి లోకాన్ని బెదిరించి, ప్రశ్నను, ఆలోచనను చిదిమేయాలని ఢిల్లీ పోలీసులు (Delhi Police) ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేకంగా అక్కడ విద్యార్థులలో పని చేస్తున్న భగత్ సింగ్ ఛాత్ర ఏకతా మంచ్, దిశ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నజరియా పత్రిక, ఫోరం అగెనెస్ట్ కార్పొరేటైజేషన్ అండ్ మిలిటరైజేషన్ (ఫాకమ్) వంటి సంస్థల సభ్యులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు.
భగత్ సింగ్ ఛాత్ర ఏకతా మంచ్‌కు చెందిన గురుకీరత్ అనే విద్యార్థిని, గౌరవ్, గౌరంగ్ అనే విద్యార్థులు జూలై 9న కనబడకుండా పోయారు. జూలై 11న ఫాకమ్‌కు చెందిన పరిశోధక విద్యార్థి ఎహెతమామ్ ఉల్ హక్, విద్యార్థిని బాదల్‌లను వారి ఇంటి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు తీసుకుపోయారు. జూలై 12న పొరుగున హరియాణా యమునా నగర్‌లో సామాజిక కార్యకర్త, మనస్తత్వ శాస్త్రవేత్త సామ్రాట్ సింగ్‌ను ఢిల్లీ పోలీసులు స్థానిక హరియాణా (Haryana) పోలీసులకు సమాచారం కూడా ఇవ్వకుండా పట్టుకుపోయారు. జూలై 19న విద్యార్థి రుద్రను న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి పట్టుకుపోయారు.
ఇలా నాలుగు దఫాలుగా జరిగిన ఏడుగురు విద్యార్థి, యువజనుల అపహరణలను చట్టబద్ధమైన అరెస్టు అనడానికి వీలులేదు. వారిని పట్టుకుంటున్నప్పుడు పోలీసులు ఎటువంటి వారంట్, నోటీసు చూపలేదు. రాజ్యాంగ అధికరణం 22, చట్టాలు, అనేక కోర్టుల ఆదేశాలు చెపుతున్నట్టుగా ఇరవై నాలుగు గంటల లోపు ఏదైనా కేసు పెట్టి న్యాయస్థానం ముందు హాజరు పరచలేదు. చట్టం నిర్దేశిస్తున్నట్టుగా వారి కుటుంబ సభ్యులకు తెలపలేదు, వారు కోరుకున్న న్యాయవాదిని పిలిపించి వారి ముందే నిర్బంధితులను ప్రశ్నించలేదు. వారందరినీ రోజుల తరబడి ఢిల్లీలో న్యూ ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో భయంకరమైన చిత్రహింసలకు గురిచేశారు. ఏడు రోజుల అక్రమ నిర్బంధం తర్వాత జూలై 16న గురుకీరత్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి పోలీసు స్టేషన్‌కు వచ్చి కూతురిని తీసుకుపోవాలని ఆదేశించారు. తల్లిదండ్రులు చూసేటప్పటికి ఆమె శారీరకంగా, మానసికంగా శిథిలమైన స్థితిలో ఉంది. అదే స్థితిలో జూలై 17న బాదల్, గౌరవ్, గౌరాంగ్‌లను, జూలై 18న ఎహెతమామ్, సామ్రాట్‌లను, జూలై 21న రుద్రను వదిలిపెట్టారు.
ఈ దౌర్జన్యం, అక్రమ నిర్బంధం, చిత్రహింసలు ఇరవైలలో ఉన్న నవయువత మీద కాగా, ఏడు పదులు నిండిన హర్ష్ మందర్, అరవై ఆరేళ్ల జీన్ డ్రీజ్, నందితా నారాయణ్ వంటి సుప్రసిద్ధుల విషయంలో కూడా రాజ్యాంగ అధికరణం 19ని, భావప్రకటనా స్వేచ్ఛను గౌరవించబోమని పోలీసులు చూపారు. వారితోపాటు వంద మంది జూలై 19న నగరం నడిబొడ్డున నెహ్రూ ప్లేస్‌లో జరుపుతున్న శాంతియుత ప్రదర్శన మీద మూకదాడి జరుగుతుంటే దౌర్జన్యకారులను అడ్డుకోవలసిన పోలీసులు చోద్యం చూస్తూ నిలబడ్డారు. హర్ష్ మందర్ ఐఏఎస్ వదులుకుని ప్రజా ఉద్యమాలతో పని చేస్తున్నారు. జీన్ డ్రీజ్ ప్రపంచ ప్రసిద్ధ సామాజిక శాస్త్రవేత్త.
చదవండి: విచారణా లేదు.. విడుదలా లేదు!
నందితా నారాయణ్ ఢిల్లీ విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్. వారితోపాటు పౌర సమాజ ప్రముఖులు, విద్యార్థి యువజనులు గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న మారణహోమానికి నిరసనగా జరుపుతున్న ప్రదర్శన అది. వారి ప్రదర్శన మొదలయిందో లేదో, ఒక పెద్ద మూక చుట్టూ ఉన్న భవనాల మొదటి అంతస్తుల నుంచి ప్రదర్శనకారుల మీద కోడిగుడ్లు, టమాటాలు, పేడ, రాళ్లు విసిరింది. పోలీసులు ఘర్షణను నివారించడానికి ప్రయత్నించలేదు. రాజ్యాంగ హక్కులను, ప్రజాస్వామిక సంప్రదాయాలను, నాగరిక విలువలను, మానవత్వాన్ని తుంగలో తొక్కడంలో కూడా తమది రాజధాని అని ఢిల్లీ పోలీసులు చూపదలిచారా?
- ఎన్ వేణుగోపాల్
‘వీక్షణం’ సంపాదకుడు