breaking news
N.Venugopal
-
ఢిల్లీ ఉల్లంఘనల రాజధాని కూడానా?!
దేశమంతా ఎలా ఉన్నా, కనీసం రాజధాని ఆదర్శప్రాయంగా, ఉదాహరణప్రాయంగా ఉండాలంటారు. రాజధానిలోనే సుప్రీంకోర్టు, పార్లమెంటు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కీలకమైన అధికార యంత్రాంగం వంటి అత్యున్నత అధికార పీఠాలు, విదేశీ రాయబార కార్యాలయాలు, విదేశీ ప్రచార సాధనాల ప్రతినిధులు ఉంటారు. దేశమంతటికీ అది కూడలి. అందరి దృష్టీ రాజధాని మీదనే ఉంటుంది. (కొన్నేళ్ల కిందనైతే జంతర్ మంతర్ (Jantar Mantar) రోడ్డు మీద అరగంట తిరిగితే దేశపు సమస్యలన్నీ తెలిసేవి. ఇప్పుడది మారిందనుకోండి. సమస్యలు పోయాయని కాదు, జంతర్ మంతర్‌ను మార్చేశారు!) మొత్తం మీద రాజధానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందువల్ల ఢిల్లీని పూర్తి స్థాయి రాష్ట్రంగా మార్చకుండా, కేంద్ర పాలిత ప్రాంతంగానే ఉంచి, పోలీసు యంత్రాంగాన్ని స్థానికంగా ఎన్నికైన ప్రభుత్వం చేతిలో కాక, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంచారు. ఢిల్లీ ప్రభుత్వం ఏ పార్టీదైనప్పటికీ, పోలీసు యంత్రాంగం నేరుగా కేంద్ర ప్రభుత్వ హోం శాఖ నిర్వహణలో ఉంటుంది.అటువంటి మహా ఘనత వహించిన ఢిల్లీ పోలీసుల ఇటీవలి పనులు వారు స్థానిక ప్రభుత్వం కన్న పై స్థాయిలో మాత్రమే కాదు, భారత రాజ్యాంగం కన్న, భారత ప్రజాస్వామిక ఉద్యమాలలో వెల్లువెత్తి, చట్టాలుగా మారిన విలువల కన్న, అసలు మానవత కన్న, నాగరికత కన్న పైన ఎక్కడో అతీతంగా, వాటన్నిటినీ లెక్క చేయనక్కర లేని స్థితిలో ఉన్నారని చూపుతున్నాయి. దేశంలో పాలనా విధానాల పట్ల, తమ జీవితాలను అతలాకుతలం చేస్తున్న ఆర్థిక, రాజకీయ పరిణామాల పట్ల విద్యార్థి లోకంలో అసంతృప్తి నానాటికీ పెరుగుతున్నది. ఉద్వేగభరితమైన వయసు వల్ల ఆ అసంతృప్తి వ్యక్తీకరణలు తీవ్రంగా ఉండటం కూడా సహజమే. ఢిల్లీలో జేఎన్‌యూ, జామియా మిలియా, అంబేడ్కర్ విశ్వవిద్యాలయాలు అటువంటి అసంతృప్తికి, ఆందోళనలకు కేంద్రాలుగా మారుతున్నాయి. అక్కడి విద్యార్థి లోకాన్ని బెదిరించి, ప్రశ్నను, ఆలోచనను చిదిమేయాలని ఢిల్లీ పోలీసులు (Delhi Police) ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేకంగా అక్కడ విద్యార్థులలో పని చేస్తున్న భగత్ సింగ్ ఛాత్ర ఏకతా మంచ్, దిశ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నజరియా పత్రిక, ఫోరం అగెనెస్ట్ కార్పొరేటైజేషన్ అండ్ మిలిటరైజేషన్ (ఫాకమ్) వంటి సంస్థల సభ్యులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు.భగత్ సింగ్ ఛాత్ర ఏకతా మంచ్‌కు చెందిన గురుకీరత్ అనే విద్యార్థిని, గౌరవ్, గౌరంగ్ అనే విద్యార్థులు జూలై 9న కనబడకుండా పోయారు. జూలై 11న ఫాకమ్కు చెందిన పరిశోధక విద్యార్థి ఎహెతమామ్ ఉల్ హక్, విద్యార్థిని బాదల్‌లను వారి ఇంటి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు తీసుకుపోయారు. జూలై 12న పొరుగున హరియాణా యమునా నగర్లో సామాజిక కార్యకర్త, మనస్తత్వ శాస్త్రవేత్త సామ్రాట్ సింగ్‌ను ఢిల్లీ పోలీసులు స్థానిక హరియాణా (Haryana) పోలీసులకు సమాచారం కూడా ఇవ్వకుండా పట్టుకుపోయారు. జూలై 19న విద్యార్థి రుద్రను న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి పట్టుకుపోయారు. ఇలా నాలుగు దఫాలుగా జరిగిన ఏడుగురు విద్యార్థి, యువజనుల అపహరణలను చట్టబద్ధమైన అరెస్టు అనడానికి వీలులేదు. వారిని పట్టుకుంటున్నప్పుడు పోలీసులు ఎటువంటి వారంట్, నోటీసు చూపలేదు. రాజ్యాంగ అధికరణం 22, చట్టాలు, అనేక కోర్టుల ఆదేశాలు చెపుతున్నట్టుగా ఇరవై నాలుగు గంటల లోపు ఏదైనా కేసు పెట్టి న్యాయస్థానం ముందు హాజరు పరచలేదు. చట్టం నిర్దేశిస్తున్నట్టుగా వారి కుటుంబ సభ్యులకు తెలపలేదు, వారు కోరుకున్న న్యాయవాదిని పిలిపించి వారి ముందే నిర్బంధితులను ప్రశ్నించలేదు. వారందరినీ రోజుల తరబడి ఢిల్లీలో న్యూ ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో భయంకరమైన చిత్రహింసలకు గురిచేశారు. ఏడు రోజుల అక్రమ నిర్బంధం తర్వాత జూలై 16న గురుకీరత్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి పోలీసు స్టేషన్‌కు వచ్చి కూతురిని తీసుకుపోవాలని ఆదేశించారు. తల్లిదండ్రులు చూసేటప్పటికి ఆమె శారీరకంగా, మానసికంగా శిథిలమైన స్థితిలో ఉంది. అదే స్థితిలో జూలై 17న బాదల్, గౌరవ్, గౌరాంగ్‌లను, జూలై 18న ఎహెతమామ్, సామ్రాట్‌లను, జూలై 21న రుద్రను వదిలిపెట్టారు.ఈ దౌర్జన్యం, అక్రమ నిర్బంధం, చిత్రహింసలు ఇరవైలలో ఉన్న నవయువత మీద కాగా, ఏడు పదులు నిండిన హర్ష్ మందర్, అరవై ఆరేళ్ల జీన్ డ్రీజ్, నందితా నారాయణ్ వంటి సుప్రసిద్ధుల విషయంలో కూడా రాజ్యాంగ అధికరణం 19ని, భావప్రకటనా స్వేచ్ఛను గౌరవించబోమని పోలీసులు చూపారు. వారితోపాటు వంద మంది జూలై 19న నగరం నడిబొడ్డున నెహ్రూ ప్లేస్‌లో జరుపుతున్న శాంతియుత ప్రదర్శన మీద మూకదాడి జరుగుతుంటే దౌర్జన్యకారులను అడ్డుకోవలసిన పోలీసులు చోద్యం చూస్తూ నిలబడ్డారు. హర్ష్ మందర్ ఐఏఎస్ వదులుకుని ప్రజా ఉద్యమాలతో పని చేస్తున్నారు. జీన్ డ్రీజ్ ప్రపంచ ప్రసిద్ధ సామాజిక శాస్త్రవేత్త. చదవండి: విచారణా లేదు.. విడుదలా లేదు!నందితా నారాయణ్ ఢిల్లీ విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్. వారితోపాటు పౌర సమాజ ప్రముఖులు, విద్యార్థి యువజనులు గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న మారణహోమానికి నిరసనగా జరుపుతున్న ప్రదర్శన అది. వారి ప్రదర్శన మొదలయిందో లేదో, ఒక పెద్ద మూక చుట్టూ ఉన్న భవనాల మొదటి అంతస్తుల నుంచి ప్రదర్శనకారుల మీద కోడిగుడ్లు, టమాటాలు, పేడ, రాళ్లు విసిరింది. పోలీసులు ఘర్షణను నివారించడానికి ప్రయత్నించలేదు. రాజ్యాంగ హక్కులను, ప్రజాస్వామిక సంప్రదాయాలను, నాగరిక విలువలను, మానవత్వాన్ని తుంగలో తొక్కడంలో కూడా తమది రాజధాని అని ఢిల్లీ పోలీసులు చూపదలిచారా?- ఎన్ వేణుగోపాల్ ‘వీక్షణం’ సంపాదకుడు -
విచారణా లేదు... విడుదలా లేదు!
‘‘అన్యాయం ఏ ఒక్కరికి జరిగినా అందరికీ హెచ్చరికే, ఏ ఒక్కచోట జరిగినా అంతటా న్యాయానికి ప్రమాద హెచ్చరికే’’ అని మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ 1963లో బర్మింగ్ హామ్ జైలు నుంచి రాసిన లేఖలో అన్నాడు. మానవ హక్కుల ఉల్లంఘనల విషయంలో వందల, వేలసార్లు ఉటంకించబడిన వాక్యం అది. కానీ అదే సమయంలో లక్షలసార్లు మరచిపోతున్న వాక్యం కూడా. ముఖ్యంగా భారత ప్రభుత్వం ఎడాపెడా అమలు చేస్తున్న అక్రమ జైలు నిర్బంధం అనే అన్యాయపు సందర్భంలో ఈ వాక్యం గుర్తుకు రాకుండా ఉండదు.దేశంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇస్తున్న అధికారిక గణాంకాల ప్రకారం, 2022 డిసెంబర్ 31 నాటికి దేశంలోని జైళ్లలో ఉన్న 5,73,220 మంది ఖైదీలలో 4,34,302 మంది విచారణలో ఉన్న ఖైదీలే. అంటే జైళ్లలో ఉన్న వారిలో నూటికి 76 మంది తమ నేరం రుజువై శిక్ష అనుభవిస్తున్న వాళ్లు కాదు, కేవలం విచారణలో ఉన్న వాళ్లన్నమాట! సాధారణంగా భారత న్యాయ తత్వశాస్త్రంలో ‘బెయిల్ సాధారణం, జైలు మినహాయింపు’ అని జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ 1977లో ప్రకటించిన సూత్రాన్ని పాటించడం దశాబ్దాలుగా కొనసాగుతున్నది. కానీ చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం (అన్‌లాఫుల్ ఆక్టివిటీస్ ప్రివెన్షన్ ఆక్ట్ – యూఏపీఏ) కింద నమోదైన కేసులలో బెయిల్ ఇవ్వడానికి నిబంధనలను కఠినతరం చేశారు. దేశవ్యాప్తంగా వేలాది మందిని ఆ చట్టం కింద కేసులలోనే నిర్బంధిస్తున్నారు. అందువల్ల ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నా ఆ కేసులు విచారణకూ రావు, ఈలోగా ఖైదీలు బెయిల్ మీద విడుదలయ్యే అవకాశమూ లేదు. యూఏపీఏ నేరాలను ఎంత అస్పష్టంగా, ఎంత విశా లంగా నిర్వచించిందంటే... ప్రభుత్వం, పోలీసు అధికా రులు తలచుకుంటే ఎవరినైనా, ఏ పని చేసినందుకైనా, చేయనందుకైనా ఆ చట్టం కింద నిందితులుగా చూప వచ్చు. విచారణంటూ జరిగితే, ఆ కాలంలో బెయిల్ మీద విడుదల చేయకుండా ఉండవచ్చు. విచారణను తాత్సారం చేసి ఏళ్ల తరబడి జైలులో ఉంచవచ్చు. ఆ అస్పష్ట నేరం కింద ఏడెనిమిదేళ్లుగా విచారణ లేకుండా, బెయిల్‌పై విడు దల లేకుండా వందలాది మంది జైళ్లలో మగ్గిపోతున్నారు. ఆ చట్టం కింద 23 ఏళ్లు జైలులో ఉండి, చివరికి నిర్దోషిగా విడుదలైన వారు కూడా ఉన్నారు. ఇలాంటి అక్రమ కేసుల నుంచి వేలాది ఆదివాసులకు విముక్తి కలిగించిన వారు నాగపూర్‌కు చెందిన న్యాయవాది సురేంద్ర గడ్లింగ్. అటువంటిది ఆయనే స్వయంగా ఏడేళ్లకు పైగా భీమా కోరేగాం కేసులో విచారణ లేకుండా, బెయిల్ రాకుండా జైలులో ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ రీసర్చ్ ఫెలోషిప్ కింద ఆదివాసి ప్రాంతాలలో క్షేత్ర పరిశోధన చేస్తున్న పరిశోధక విద్యార్థి మహేష్ రౌత్ కూడా అదే కేసులో 2018 జూన్ 6 నుంచి జైలులో ఉన్నారు. యూఏపీఏ కేసులలో కఠిన తరమైన బెయిల్ నిబంధనలు ఉన్నప్పటికీ, ఏపీ, తెలంగాణలలో న్యాయమూర్తులు బెయిల్ ఇస్తున్నారనీ, అరెస్టు వంటి నిర్బంధ చర్యలకు పాల్పడగూడదని ఆదేశాలు ఇస్తున్నారనీ, ఆగ్రహించిన కేంద్ర దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ రెండు రాష్ట్రాల కార్యకర్తలను పొరుగు రాష్ట్రాల అక్రమ కేసుల్లో నిందితులుగా చూపుతున్నది.ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్ జిల్లా నాగర్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలో తిరియా గ్రామం దగ్గర 2019 జూలైలో నమోదైన కేసు ఒకటి ఉంది. అడవిలో సీఆర్పీ, డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలకూ – మావోయిస్టులకూ జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులూ, ఒక గ్రామస్థుడూ చనిపోయారనీ, ఘట నాస్థలిలో దొరికిన డైరీలో కొందరి పేర్లు ఉన్నాయనీ పోలీసులు ప్రకటించారు. అలా చనిపోయిన మావోయిస్టులనూ, పారిపోయారంటున్న మావోయిస్టులనూ, డైరీల్లో ఉన్నాయని చెపుతున్న తెలుగువారి పేర్లనూ కలిపి 2019 జూలై 28న కేసు పెట్టారు. రెండేళ్ల తర్వాత 2021 మార్చిలో ఈ కేసును ఎన్ఐఏ తన అధీనంలోకి తీసుకుంది.ఈ కేసులో భాగంగా డొంగరి దేవేంద్ర, చుక్క శిల్ప లను 2022 జూన్‌లో అరెస్టు చేసి మరెన్నో కేసుల్లో నింది తులుగా చూపారు. పద్మ అంతకు ముందు ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నో అక్రమ కేసుల్లో పదేళ్లు జైలు జీవితం గడిపి, అన్ని కేసులలోనూ నిర్దోషిగా విడుదలై, హైదరాబాద్ (Hyderabad) వచ్చి ఎల్ఎల్బీ పూర్తిచేసి న్యాయవాదిగా ఉండగా, 2023 జూన్‌లో అరెస్టు చేసి ఈ ఛత్తీస్‌గఢ్ కేసులో జైలుకు పంపారు. అలాగే 2021లో మరణించిన మావోయిస్టు పార్టీ నాయకుడు రామకృష్ణ సహచరి, ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో సాధారణ జీవితంలో ఉన్న కందుల శిరీషను, ఆంధ్రప్రదేశ్ కుల నిర్మూలనా పోరాట సమితి అధ్యక్షుడు దుడ్డు ప్రభా కర్ను 2023 జూలై 21న అరెస్టు చేసి ఈ కేసులో నిందితులుగా ఛత్తీస్‌గఢ్‌లో జైలులో నిర్బంధించారు. రెండేళ్లు గడిచినా విచారణా లేదు, బెయిలూ లేదు.చదవండి: నస్ బందీ, నోట్ బందీ దారిలో ఓట్ బందీ!దుడ్డు ప్రభాకర్ 1985 కారంచేడు నరమేధం నాటికి చీరాలలో పీజీ విద్యార్థిగా ఉంటూ, ఆ నరమేధానికి వ్యతి రేకంగా జరిగిన ఆందోళనతో కుల నిర్మూలన రాజకీయాలలో ప్రవేశించారు. దళితులపై దాడులు జరిగిన చీమకుర్తి, వై చెర్లోపల్లి, వేంపెంట, రాజుపాలెం, చుండూరు, లక్షింపేట తదితర ఎన్నోచోట్ల ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎన్నో అక్రమ కేసులను ఎదుర్కొన్నారు. ‘కుల నిర్మూలన’ మాసపత్రికకు సంపాదకులుగా పనిచేశారు. ఆయన గొంతు వినిపించకుండా చేయాలని, బెయిల్ ఇవ్వకుండా సుదీర్ఘకాలం జైలులో ఉంచాలని ఈ కేసులో నిందితులుగా చూపారు. చార్జిషీట్ ప్రకారమే చూసినా ఈ కేసులో ఉన్న తెలుగు వారెవరికీ ఎటువంటి నేరంతో, ఘటనతో, ప్రాణ నష్టంతో, ఆస్తి నష్టంతో సంబంధం లేదు. అది ఎవరిదో తెలియని, అసలు ఉందో లేదో తెలియని ఒక డైరీలో వీళ్ల పేర్లు ఉన్నాయనేది మాత్రమే ఆరోపణ. ఆ ఆరోపణ మీద విచారణ కూడా జరపకుండా రెండేళ్లకు పైగా జైలులో మగ్గిపోయేలా చేసిన ఘనమైన చట్టబద్ధ పాలన మనది! - ఎన్. వేణుగోపాల్‘వీక్షణం’ సంపాదకుడు -
చట్టం పట్ల న్యాయమూర్తులకే శ్రద్ధ లేదా?!
ఒక కీలకమైన కేసు సందర్భంగా ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ సిన్హా, జస్టిస్ అరవింద్ కుమార్ వర్మల ద్విసభ్య ధర్మాసనం ఇటీవల (2025 మే 5న) చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన తీర్పు మన ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులకు కూడా చట్ట బద్ధ పాలన పట్ల శ్రద్ధాసక్తులు లేవా అనే అనుమానాన్ని బలోపేతం చేస్తున్నాయి. ఈ కేసు ‘మూలవాసి బచావో మంచ్’ (ఎంబీఎం) అనే ఆదివాసీ సంస్థ మీద ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం విధించిన నిషేధపు నోటిఫికేషన్ చెల్లదని, దాన్ని కొట్టివేయాలనీ కోరుతూ దాఖలైన పిటిషన్‌కు సంబంధించినది.‘ఛత్తీస్‌గఢ్ విశేష్ జన సురక్షా అధినియమ్ – 2005’ (ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక ప్రజా భద్రతా చట్టం–2005) అనే చట్టం ప్రకారం అక్టోబర్ 30న ఆ నోటిఫికేషన్ విడుదలయింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్య క్రమాలకు వ్యతిరేకంగా ఎంబీఎం నిరంతరంగా ప్రజలను రెచ్చగొడుతున్నదని, ప్రజలలో శాసనోల్లంఘనను ప్రోత్సహిస్తూ, సామాజిక శాంతిని భగ్నం చేస్తూ, రాజ్య భద్రతకు ప్రమాదంగా మారిందని, అందువల్ల నిషేధం విధిస్తున్నామని ఆ నోటిఫికేషన్లో ప్రభుత్వం చెప్పింది. ఆ చట్టం ప్రకారం ప్రభుత్వం ఏదైనా ఒక సంస్థను చట్టవ్యతిరేకమైనదిగా భావిస్తే, ఆ సంస్థపై నిషేధం విధించవచ్చు. ఈ ‘భావిస్తే’ అనే మాట చాలా అస్పష్టమైనదని, ఎవరి మీదనైనా చట్టాన్ని నిష్కారణంగా ప్రయోగించే అవకాశం ఉందని, అందువల్ల ఈ చట్టమే అన్యాయమైనదని, కొట్టివేయాలని సుప్రీం కోర్టులో వేసిన వ్యాజ్యం ఇరవై ఏళ్లు కావస్తున్నా విచార ణకే రాలేదు!ఆ చట్టంలోని సెక్షన్ 2 ‘చట్టవ్యతిరేక కార్య కలాపాలు’ అనే మాటకు ఇచ్చిన నిర్వచనం ఎంత విశాలమైనదంటే అన్ని ప్రజాస్వామిక నిరసనలనూ ఆ మాట కింద చేర్చవచ్చు. సెక్షన్ 3 (2)లో నోటిఫికేషన్లో నిషేధానికి కారణాలు స్పష్టీకరించాలి అంటూనే, తర్వాత వాక్యంలో ‘ఆ వాస్తవం బైట పెట్టడం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమని భావిస్తే, ప్రభుత్వం ఆ కారణాలను బైటపెట్టకుండా ఉండవచ్చు’ అని రాశారు. అంటే ఏ కారణమూ చెప్పకుండానే ఒక సంస్థను ‘చట్టవ్యతిరేకమైనద’ని ముద్ర వేసి నిషేధించే అధికారాన్ని ప్రభుత్వం తనకు తానే ఇచ్చుకుంది. ఈ నిరంకుశ, ప్రశ్నాతీత అధికారాన్ని తనకు తాను ఇచ్చుకున్న ప్రభుత్వ చర్యే నిజానికి చట్టవ్యతిరేకమైనది, న్యాయ వ్యతిరేకమైనది. ఈ మితిమీరిన అధికారాన్ని కొట్టివేయ వలసిన న్యాయస్థానాలు దాని వైపే చూడడం లేదు. ఈ చట్టం కింద వందలాది కేసులు పెట్టి, వేలాది మంది ఆదివాసులను సంవత్సరాల తరబడి జైళ్లలో మగ్గి పోయేలా చేస్తుంటే మన న్యాయవ్యవస్థకు చీమ కుట్టిన ట్టయినా లేదు. అంతేకాదు, న్యాయస్థానాలలో ఇంకా విచిత్రా లున్నాయి. అనుచితంగా నిషేధపుటుత్తర్వులు జారీ చేస్తే అడ్డుకోవడానికి చట్టమే రెండు మూడు పరిమితులు విధించింది. ఆ పరిమితులను న్యాయబద్ధంగా అమలయ్యేలా చూడాలని కూడా న్యాయస్థానాలు అనుకోవడం లేదు. నోటిఫికేషన్ వెలువడినప్పటినుంచి పదిహేను రోజుల్లోగా బాధిత సంస్థ తన అభ్యంతరాలు చెప్పుకోవచ్చునని, నోటిఫికేషన్ జారీ అయిన ఆరు వారాలలోగా ప్రభుత్వం హైకోర్టు న్యాయ మూర్తుల స్థాయికి తగ్గని ముగ్గురితో సలహా మండలిని నియమించాలని, బాధిత సంస్థ అభ్యంతరాలను విచారించిన సలహా మండలి మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని, ఆ నివేదికను బట్టి నిషేధం అమలులోకి రావడం గాని, ఉపసంహరించడం గాని జరుగుతుందని సెక్షన్ 5, 6, 7 చెబుతాయి.మూలవాసి బచావ్ మంచ్ విషయంలో ఈ చట్ట నిబంధనలన్నిటినీ తుంగలో తొక్కారు. అక్టోబర్ 30 నోటిఫికేషన్‌ను నవంబర్ 8న గెజిట్ విడుదల చేసి, నవంబర్ 18న బహిరంగంగా ప్రకటించారు. అంటే సాంకే తికంగా బాధిత సంస్థ అభ్యంతరాలు చెప్పే హక్కును కొల్లగొట్టారు. అయినా సరే ఎంబీఎం తన అభ్యంతరాలను నవంబర్‌లో ప్రభుత్వానికి అందజేసింది. తాము అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటు న్నామనేది అబద్ధమని, నిజానికి తాము ఆదివాసీప్రాంతాలలో విద్య, వైద్యం, తాగునీరు వంటి అభివృద్ధి సౌకర్యాలు కల్పించమని కోరుతున్నామని వాదించింది. తాము చట్టవ్యతిరేకంగా ప్రవర్తించడం లేదని, శాసనోల్లంఘనను ప్రోత్సహించడం లేదని, వాస్తవానికి రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్‌ను, ‘పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ చట్టం – 1996’ను, ‘అటవీ హక్కుల చట్టం–2006’ను ప్రభుత్వం ఉల్లంఘిస్తుండగా, వాటిని పాటించమని కోరుతున్నామని వాదించింది. సలహా మండలి మరిన్ని వివరాలు కావాలని తాత్సారం చేస్తూ, తనకు చట్టం ఇచ్చిన మూడు నెలల కాలం దాటి, మరొక మూడు నెలలు గడిచినా కిమ్మనకుండా ఉన్నది. ఈలోగా నిషేధం పేరిట ఎడాపెడా అరెస్టులు జరిగిపోతున్నాయి. అసలు ఎంబీఎం స్థాపనే ప్రభుత్వ బలగాల చట్టవ్యతిరేక ఆక్రమణలకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన శాంతియుత నిరసనల క్రమంలో జరిగింది. 2021 మే 12 ఉదయానికల్లా ‘సిల్గేర్’ అనే గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న పది ఎకరాల పంట భూమిని ఆక్రమించి సీఆర్పీఎఫ్ క్యాంపు నిర్మాణాలు చేశారు. తెల్లవారిన తరువాత వాటిని చూసి ఆ గ్రామస్థులు... ఐదవ షెడ్యూల్, పీసా, అటవీ హక్కుల చట్టాల ద్వారా తమ ప్రాంతంలో ప్రభుత్వమైనా సరే ఏ నిర్మాణం చేయా లన్నా గ్రామసభ ముందస్తు అనుమతి పొందాలి కదా, తమ భూమిని ఎలా ఆక్రమించారని క్యాంపు అధికారులను అడిగారు. పోలీసులు తమకు తెలిసిన ఏకైక భాషలో ఆదివాసుల మీద లాఠీచార్జీ జవాబు ఇచ్చారు. మూడు రోజుల తర్వాత పరిసర గ్రామాల ఆదివాసులందరూ దాదాపు ఇరవై వేల మంది ఆ క్యాంపు ముందు నిరసన ప్రదర్శనకు వచ్చారు. పోలీసులు వారి మీద కాల్పులు జరిపి అక్కడికక్కడే ముగ్గురు ఆదివాసులను చంపేశారు. కాల్పులకు బాధ్యుల మీద చర్య తీసుకునే వరకూ మృతదేహాలను అక్కడి నుంచి కదిలించబోమని ఆదివాసులు చేసిన ఆందోళన నుంచి మూలవాసి బచావో మంచ్ పుట్టింది. సల్వా జుడుమ్ కాలంలో పోలీసు క్యాంపుల్లో తమ కుటుంబాల మీద జరిగిన హత్యాకాండను, అత్యాచా రాలను చూసిన బాల బాలికలు ఇప్పుడు యువతగా ఎదిగి, ఈ నిరాయుధ, శాంతియుత ఆందోళనా రూపాన్ని చేపట్టి ఎంబీఎంను స్థాపించారు.ఆ సంస్థ సిల్గేర్ లో నాలుగు సంవత్సరాలుగా నిరసన శిబిరాన్ని నడుపుతున్నది. మరొక ముప్పై చోట్ల క్యాంపుల పట్ల నిరసన తెలుపుతున్నది. ఈ శాంతి యుత ప్రజా నిరసనలను అడ్డుకోవడానికే ప్రస్తుత నిషేధం. ‘సంస్థ అభ్యంతరాల మీద సలహా మండలి ఇంకా మాట్లాడలేదు గనుక మేం దీనిలో జోక్యం చేసుకోలేం’ అంటూ ధర్మాసనం... సారాంశంలో నిషేధానికీ, నిర్బంధానికీ ఆమోదముద్ర వేసింది. ప్రాసిక్యూటర్ల అబద్ధాలకు, ప్రభుత్వపు చట్ట ఉల్లంఘనలకు, రాజ్యపు దౌర్జన్యా లకు వత్తాసు పలకడమే తమ విధి అని కొందరు న్యాయమూర్తులు అను కోవడమే విషాదం!- ఎన్. వేణుగోపాల్‘వీక్షణం’ ఎడిటర్ -
ప్రజలు భయపడే పరిస్థితి కల్పిస్తే దిక్కెవరు?
ఢిల్లీ హైకోర్టు ‘న్యాయమూర్తి’ జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరగగా, ఆ మంటలను చల్లార్చడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి ఒక గదిలో తగలబడిపోయిన నోట్ల కట్టల బస్తాలు కనిపించాయి. ఆ సమయానికి న్యాయ మూర్తి, ఆయన భార్య ఇంట్లో లేరు. వారి కూతురు, న్యాయమూర్తి తల్లి మాత్రమే ఉన్నారు. విషయం ఢిల్లీ పోలీసులకు చేరింది. ఢిల్లీ పోలీసు కమిషనర్ ఆ వీడియోలను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపారు. కొన్ని రోజులు ఆలస్యంగానైనా ఆ ఉదంతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దాకా చేరి, మరొక రకం అగ్నిమాపక చర్యలు ప్రారంభమయ్యాయి. కొలీజియం (Collegium) సూచనపై వివాదాస్పద న్యాయమూర్తిని వెంటనే అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ ఈ బదిలీని తాము వ్యతిరేకిస్తున్నామని, అవినీతిపరులకు ఆశ్రయం కలిగించడానికి మా హైకోర్టు చెత్తబుట్ట కాదని తీవ్రమైన పదజాలంతో స్పందించింది. కొలీజియం నిర్ణయానికి వ్యతిరేకంగా నిరవధిక సమ్మె ప్రారంభించింది.ఈలోగా సుప్రీంకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మతో (Justice Yashwant Varma) ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి, ఆ ఉత్తరాలు, వీడి యోలు, ఫొటోలు అన్నీ తన వెబ్ సైట్ మీద బహిరంగంగా పెట్టింది. ఆ డబ్బు 15 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయల వరకు ఉంటుందని వదంతులున్నాయి. కార్పొరేట్ కంపెనీల ఆదాయపు పన్ను, జీఎస్టీ వగైరా కేసులను విచారించే కీలకమైన బాధ్యతలలో ఉన్నారు గనుక అది ఆ కంపెనీల నుంచి అందిన అవినీతి సొమ్ము కావచ్చుననే అనుమానాలున్నాయి. కొన్ని వేల రూపాయలో, లక్షల రూపాయలో లెక్క చూపని ధనం ఉన్నందుకే ముప్పు తిప్పలు పెట్టే ఐటీ, ఈడీ, సీబీఐ (CBI) వంటి సంస్థలున్న చోట ఇంత పెద్ద మొత్తం డబ్బు గురించి కఠినమైన శిక్షలకు దారి తీసే విచారణ జరగవలసే ఉంటుంది.తొలగింపు ‘సాధ్యమే’నా?భారత రాజ్యాంగం అధికరణాలు 124, 218, న్యాయమూర్తుల విచారణ చట్టం, 1968 ప్రకారం ఒక న్యాయమూర్తి మీద విచారణ జరపడం, తొల గించడం అసాధ్యం కాదు గాని కష్టసాధ్యం. ఆరో పణలు (చట్టం ‘దుష్ప్రవర్తన, అసమర్థత’లను మాత్రమే గుర్తించింది, అవినీతి అనే మాటే లేదు!) ఎదుర్కొంటున్న న్యాయమూర్తిని తొలగించాలని 100 మంది లోక్‌సభ సభ్యులు గాని, 50 మంది రాజ్యసభ సభ్యులు గాని పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టాలి. ఆ తీర్మానాన్ని అనుమతిస్తే ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని నియమిస్తారు. ఆ కమిటీ ఆ ఆరోపణలు నిజమని తేల్చితే తొలగింపు తీర్మానం ముందుకు కదులుతుంది. సభలోని మొత్తం సభ్యులలో సగం కన్న ఎక్కువ మంది, లేదా హాజరైన వారిలో మూడింట రెండు వంతుల మంది ఆమోదిస్తేనే ఆ తీర్మానం నెగ్గి, రాష్ట్రపతి దగ్గరికి వెళుతుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయ మూర్తులను తొలగించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంది.ఈ ప్రక్రియ అంతా చూస్తే, సాధారణ పౌరులకు వర్తించే నిబంధనలు న్యాయమూర్తులకు వర్తించవని తేలుతుంది. భారత పౌరులమైన మనందరమూ రాజ్యాంగం ఎదుట సమానులమే గాని, న్యాయమూర్తులు మాత్రం ఎక్కువ సమానం! ఒకే రకమైన నేరం చేసినా కులాన్ని బట్టి శిక్ష లేక పోవడమో, తీవ్రమైన శిక్ష ఉండటమో నిర్దేశించిన మనుస్మృతి (Manusmriti) లాగానే, భారత న్యాయమూర్తులకు కూడా మినహాయింపులు ఉన్నాయి! భావజాలాల మీద చర్చ వద్దా?ఈ దొరికిపోయిన అవినీతి వ్యవహారం మీదనైనా కాస్త చర్చ మొదలయింది గాని, న్యాయమూర్తులలో ఉన్న తప్పుడు భావజాలాల మీద, అందువల్ల వెలువడుతున్న తీర్పుల మీద చర్చ కూడా లేదు. ఇటీవల అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ ఒక మతతత్త్వ సంస్థ సభకు హాజరై ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేష ఉపన్యాసం చేశారు. న్యాయవ్యవస్థలోని ఉన్నతాధికార పీఠం అయిన కొలీజియం సంజాయిషీ అడిగితే, తన ఉపన్యాసానికి కట్టుబడి ఉన్నానని నొక్కి చెప్పారు. మరొక అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా తన ముందుకు ఒక మైనర్ బాలికపై అత్యాచారయత్నం కేసు వస్తే, దుండగులు ఆ బాలిక రొమ్ములను పిసికారని, ఆ బాలిక పైజామా బొందు తెంచివేశారని ప్రాసిక్యూషన్ సాక్ష్యాధారాలు చూపినప్పటికీ, దాన్ని అత్యాచారయత్న నేరంగా చూడలేమని ప్రకటించారు. ఆ అన్యాయమైన తీర్పు మీద సమీక్ష జరపాలని దాఖలైన పిటి షన్ను వినడానికే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేదీ సోమవారం నాడు నిరాకరించారు. ఆ అనుచిత ప్రవర్తనను, సుప్రీంకోర్టే మంగళవారం నాడు సవరించుకుంది. అలహాబాద్ హైకోర్టు తీర్పును సమీక్షించాలని సుమోటో నిర్ణయం తీసుకుని, జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ ఎ.జి.మసీహ్ ధర్మాసనానికి అప్పగించింది.చదవండి: న్యాయమూర్తులకు భిన్న న్యాయమా?శాసన నిర్మాణ వ్యవస్థ, అధికార వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అనే మూడు అంగాలలో న్యాయవ్యవస్థ రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర అధికారంతో మిగిలిన రెండు అంగాల పనితీరును కూడా సమీక్షించే ఉన్నతాధికారం కలిగి ఉంటుందని రాజనీతిశాస్త్రం పాఠాలు చెపుతుంది. రాజ్యాంగాన్ని, చట్టాలను వివరించే, వ్యాఖ్యానించే, సవరించే విస్తృతాధికారం ఉన్న న్యాయ వ్యవస్థకు సమాజం మొత్తం మీద, ప్రత్యే కించి శాసన నిర్మాణ, అధికార వ్యవస్థల మీద అదుపు ఉండటం సదుద్దేశంతోనే కావచ్చు. కాని కంచే చేను మేసినట్టు, ఆ న్యాయ వ్యవస్థే అన్యాయ, అవినీతి వ్యవస్థగా మారిపోతే, దాన్ని అదుపులో పెట్టేదెవరు? సమీక్షకులను సమీక్షించే వారెవరు? రాజ్యాంగమూ, చట్టమూ ఇచ్చిన ప్రత్యేక రక్షణలు, సబ్ జుడిస్ (న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగా ఆ వ్యాజ్యం మీద మాట్లాడగూడదు), కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ (న్యాయస్థానం పట్ల ధిక్కార భావన) వంటి అవరోధాలతో, న్యాయస్థానాల మీద నోరెత్తడానికి ప్రజలు భయపడే పరిస్థితి కల్పిస్తే దిక్కెవరు? న్యాయస్థానాలను మించినది సమాజం. న్యాయవ్యవస్థ తప్పులను నిలదీయ వలసిందీ, న్యాయ వ్యవస్థను కూడా సాధారణ పౌరుల లాగే ప్రజాక్షేత్రంలో చర్చకూ విచారణకూ గురిచేసి, జవాబుదారీ తనాన్ని స్థాపించవలసిందీ సమాజమే!- ఎన్. వేణుగోపాల్సీనియర్ జర్నలిస్ట్ -
మెస్సయ్య దాటిపోయాక...
ఆస్పత్రి ప్రారంభోత్సవానికి పెద్దాయన వచ్చాడు. ఆయన రాకముందే రంగస్థలాన్ని చాలా శ్రద్ధగా సిద్ధం చేశారు. ఎంతగానంటే రెండు గంటల ముందు నుంచే ఫొటోగ్రా ఫర్లు మండుటెండలో ఎదురు చూసేట్లు. తీరా ఆయనొచ్చాక ఎడమ వైపు ఫొటోగ్రాఫర్ల బృందాన్ని చూసి చీదరించుకున్నాడు. ఎందుకంటే అక్కడనుంచి ఫొటోలు తీస్తే ఆయన ముఖం కనపడదు. నీడలు మాత్రమే వస్తాయి. ఆగమేఘాల మీద అది కూడా సరి చేశారు. అపుడు తీరిగ్గా ‘ప్రాచీన భాష లిపిలో, లోహపు కడ్డీకి చుట్టుకున్న పాములాగా కనిపించే మతచిహ్నం’ ఉన్న శిలాఫలకానికి మొక్కి, లేచి నిలబడి హటాత్తుగా చెట్టు కూలినట్లు నేల మీద పడిపోయాడు. ఆ పడిపోవడం ఉద్దేశపూర్వకంగా చేశాడేమో అన్నట్లు చేతులు రెండూ రెండు వైపులా కచ్చితంగా పెట్టినట్లు పడి పోయాయి. ఆయన ఆస్పత్రికి ప్రణామం చేస్తున్నాడేమో, కొత్త తంతు రిహార్సల్ ఏమో అనుకున్నారు. కానీ పెద్దా యన చచ్చిపోయాడు. మెస్సయ్య దాటిపోయాడు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయిన పెద్దాయన అంతమై పోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది?2023లో ఆకార్ పటేల్ ఇంగ్లిష్‌లో ‘ఆఫ్టర్ మెస్సయ్య’ (after messiah) నవల రాశారు. దాన్ని తెలుగులోకి ‘నియంత అంతం’ పేరుతో ఎన్. వేణుగోపాల్ అనువాదం చేస్తే ‘మలుపు’సంస్థ ప్రచురించింది. ఈ నవల అంతా కల్పనే. కానీ వాస్తవ భ్రాంతిని కలిగించే కల్పన. ‘జరుగుతున్నది ఇదే కదా!’ అని విస్తుపరిచే సంభావ్యత ఉన్న కల్పన. నియంత పాలించే కాలంలో ఆయన వైభవ కాంతి ముందు మిగతా లోకమంతా మసకలు కమ్ముతుంది. దేశభక్తి, మత రాజకీయాలు వినా ప్రజలకి గత్యంతరం ఉండదు. అభివృద్ధికి నిర్వచనాలు మారిపోతాయి. ప్రభుత్వాలను, వ్యవస్థలను, ప్రజలను తోలుబొమ్మలు చేసి ఆడించిన సూత్రగాడి తాళ్ళు పుటుక్కున తెగి దేశమంతా సంక్షోభపు చీకట్లలో మునిగి నపుడు, ‘ఆయన తర్వాత ఎవరు?’ అన్న ప్రశ్న పుట్టిన చోట కొత్త రాజకీయాలు మొదలవుతాయి.రాజకీయ పార్టీలలో నియంతృత్వ ధోరణుల వల్ల నాయకుల మరణం తర్వాత ప్రత్యామ్నాయం అంత తొందరగా తేలదు. దానికోసం కుమ్ములాటలు దేశానికి కొత్త కాదు. నియంతకి కుడిభుజంగా ఉండే జయేష్ భాయి, మత రాజకీయాల ద్వారా నూతనశక్తిగా ఎదిగే స్వామీజీల మధ్య పదవి కోసం జరిగే పోరు భారత రాజకీయ చరిత్ర పొడుగూతా జరిగిన అక్రమాలను స్ఫురింపజేస్తుంది. రిసార్టు డ్రామాలూ, కార్పొరేట్లతో లావాదేవీలూ, తమ ప్రయోజనాలకి అనుగుణమైన వాస్తవాలను నిర్మించే మీడియాల ‘పెనవేత రాజకీయాలూ’ అన్ని వ్యవస్థలనూ ప్రభావితం చేసి చట్టాన్నీ, న్యాయాన్నీ తమకి అను గుణంగా ఎలా మలుచుకుంటాయో చదివినపుడు దేశపౌరులుగా అభద్ర తకి లోనవుతాము. రాజ్యం ఎపుడూ తన మీద ఎవరో దాడి చేయ బోతున్నారనీ, తను బలహీనమైనదనీ ఊహించుకుంటుంది. అందుకోసం తన సమస్త శక్తులతో ఆ దాడిని ముందుగానే నిర్మూలించాలని అనుకుంటుంది. స్వతహాగా క్రూరమైన బలం ఉండడం వల్ల రాజ్యస్వభావం హింసతో కూడినదనీ, ప్రభుత్వాల హృదయమూ, ఆత్మా హింసేననీ నవల మొత్తం చెబుతుంది. అంతేకాదు ‘రాజ్యం అనేది ఒక హింసాత్మక రాజకీయ జంతువు’. ఈ జంతువుని చెడ్డవారు అధిరోహించినా అది హింసే. మంచివారు అధిరోహించినా హింసేనని తెలిసినపుడు కొంత వెలుగు మన ఆలోచనల మీద ప్రసరించి ఎరుక, దిగులూ కలుగుతాయి.ఆదివాసుల హక్కుల కోసం పనిచేసే మీరా – పార్టీలో ఒక సీనియర్ నాయకుని కూతురు. అనివార్య పరిస్థితుల్లో ఆపద్ధర్మ ప్రధాని అవుతుంది. పీడిత ప్రజలకోసం పనిచేసే మంచి వ్యక్తి ప్రధాని అయినా రాజ్యస్వభావం మారదు. ఆదివాసీ హక్కులను పరిరక్షించే ఒక చిన్న చట్టం అమలు లోకి తేవడానికి మీరా, అనేక అడ్డంకులను ఎదుర్కుని, తన విలువలను పణంగా పెట్టాల్సి వచ్చినపుడు అంబేడ్కర్ గుర్తుకు వస్తారు. రాజ్యాంగం... హింస నుంచి పీడితులకు రక్షణ కల్పిస్తుందని నమ్మి, ఆ సాధనలోనూ, హిందూ కోడ్ బిల్లుని ఆమోదింపజేసే సందర్భంలోనూ అంబేడ్కర్ రాజ్యం పెట్టిన ఒత్తిడికీ, హింసకూ లోనయ్యి కూడా ఎంత గట్టిగా నిలబడ్డారో, దానికోసం ఎంత త్యాగం చేశారో, ఎంత రాజీపడ్డారో చరిత్ర చెబుతుంది.ఆ ఒక్క చట్టం కోసం ప్రత్యర్థి ముఠాలకి మీరా ప్రయోజనాలు సమకూర్చాల్సి వస్తుంది. ఆదివాసీల మేలు కోసం చట్టం చేయడానికి మీరా రాజ్య హింసకు లోబడి పని చేసిందని తెలుసు కున్న ఆదివాసీ ప్రతినిధి బృందంవారు ఆమె ప్రతిపాదనలను తిరస్కరిస్తూ ఒక మాట అంటారు. ‘పీడనకు గురయ్యాము కనుక పీడనను తిరస్కరించడం కాదు, అసలు పీడన అనేదే చెడ్డది కనుక దాన్ని మొత్తంగా తిరస్కరించాలని, ఒక పీడనను తొలగించడం కోసం మరో చోట మరో సమూహాన్ని పీడనకు గురి చేయడం భావ్యం కాదని’ చెబుతారు. చివరికి పదవి నుంచి దిగిపోయి ఆదివాసీ పోరాటాలలో భాగం కావాలని కోరుకుంటుంది మీరా.చదవండి: ప్రధాని మోదీ పేరిట గణాంక విన్యాసం.. అసలు కథ ఇదే!ఉనికిలో ఉన్న రాజ్య వ్యవస్థే హింసాత్మకం అయినపుడు, ఎంత మంచి వ్యక్తీ దాన్ని మార్చలేనపుడు, మరి ఎటువంటి పరిపాలనా ప్రత్యామ్నాయాన్ని ఈ నవల సూచించింది! బహుశా ఈ చర్చ పాఠకులలో జరగాలని రచయిత కోరుకుని ఉండొచ్చు. లేదా మీరా ఎంచుకున్న మార్గాన్ని మనకు సూచనప్రాయంగా అందించి ఉండొచ్చు. ‘ఏ రాయి అయి తేనేమి’ అన్న నిర్లిప్తత పెరిగిపోయిన వర్తమానంలో భిన్న రాజకీయ శ్రేణుల మధ్య ప్రత్యామ్నాయ రాజకీయాల మీద చర్చ జరగాలి. ‘గమ్యమే మార్గాన్ని సమర్థిస్తుంది’ అన్న సూత్రాన్ని డీ కోడ్ చేయాలి.- కె.ఎన్. మల్లీశ్వరి‘ప్రరవే’ ఏపీ కార్యదర్శిmalleswari.kn2008@gmail.com -
సుతిమెత్తని హృదయపు మేరునగధీరుడు
అస్తమయం తొమ్మిదో తరగతి విద్యార్థిగా, 1947 మార్చి నవయుగలో 'ఓ విద్యార్థి సోదరుడా, సమ్మెయే మన ఆఖరాయుధమోయ్' అని రాసి, ఇతరులకు ఇచ్చిన ఉద్యమ జీవిత పిలుపును ఆయన ఆ తర్వాత డెబ్భై సంవత్సరాల పాటు ఒక్క క్షణం కూడ మరిచిపోకుండా పాటించారు. నిత్యవర్తమానమూ నిరంతర చలనశీలీ చలసాని ప్రసాద్ గురించి గతం అన్నట్టుగా రాయడమంటే విశాఖ సముద్రపు విషాదఘోష వినిపించడం తప్ప మరేమీ కాదు. ఆయనలోని ఎన్నెన్నో కోణాలను ఆయన బహుముఖ ప్రజ్ఞను చూసిన నాలుగున్నర దశాబ్దాల పరిచయంలో, స్నేహంలో, ప్రేమలో, వాత్సల్యంలో, ఆలోచనాచరణల సాహచర్యంలో ఏ శకలాన్ని తీసి చూపితే ఆయనను అర్థం చేయించగలను? విశాఖ సముద్రంలో ఏ ఒక్క అలను చూపి కడలిని రూపుకట్టించగలను? నలభై ఐదేళ్లుగా నన్నాయన పేరు పెట్టి పిలవడం కూడ దూరమే అనుకుని బాబూ అని పిలిచేవాడు. అంతరాంతర రహస్యాల్నీ, దుఃఖాల్నీ, ఆలోచనల్నీ, ఆనందాల్నీ ఎన్నిటినో పంచుకున్న ఆయనను ప్రసాద్‌గారూ అని పిలిచినా, చివరి రోజుల్లో చాదస్తం వస్తున్నదని విసుక్కున్నా ఆయన నా హృదయంలోని ఒక అవిభాజ్యమైన భాగం. ఇది నా ఒక్కడి అనుభవం మాత్రమే కాదు. బహుశా ఆయన గురించి అలా అనుకోగలిగినవాళ్లు తెలుగు సమాజంలో కొన్ని వేలమంది ఉండి ఉంటారు. ఈ కాలంలో అజాతశత్రువులూ, అందరికీ కావలసినవాళ్లూ ఉండే అవకాశం లేదు గాని, బహుశా ఆయన అటువంటి అసాధారణ జీవి. లోకమంతా తప్పుడు మనిషని విమర్శించే మనిషిని కూడ ఆయన ‘మంచాడే’ అనగలిగేవాడు. నాకు తెలిసి ఇద్దరే ఇద్దరి పేర్లు వింటేనే అసహ్యించుకునేవాడు తప్ప ఆయన తప్పుపట్టిన మూడో మనిషి పేరు నేను వినలేదు. తనకు ద్రోహం చేసినవాళ్లను కూడ ఆ ద్రోహం ఆనవాలు కూడ తాను చూడలేదన్నంతగా ప్రేమించాడు. కృష్ణా జిల్లా దివి తాలూకా నాదెళ్లవారిపాలెంలో 1932 డిసెంబర్ 8న పుట్టిన చలసాని ప్రసాద్ తన ప్రాంతాన్నీ కులాన్నీ వయసునూ కూడ అధిగమించి వేలాది మందికి స్నేహం పంచాడు. వేలాది మంది ప్రేమను చూరగొన్నాడు. ఒకవైపు తండ్రి చల్లపల్లి జమీందారు దగ్గర పనిచేస్తుండినా, 1930లలోనే కుటుంబంలోకి కమ్యూనిస్టు భావజాలం ప్రవేశించింది. అందుకే తానే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నట్టు, తన ఐదో ఏట, 1937 ఎన్నికల్లో భూస్వాముల జస్టిస్ పార్టీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు బలపరచిన కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచార ఊరేగింపులలో పాల్గొనడం తన తొలి జ్ఞాపకం. ఆ తర్వాత దశాబ్దం కృష్ణాతీరంలో మరిన్ని విప్లవ ప్రభంజనాలు వీచాయి. ఆయన కుటుంబమంతా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలై, జమీందారీ వ్యతిరేక పోరాటాల్లో, తెలంగాణ సాయుధ పోరాటంలో భాగమయ్యారు. ఆ ఉద్యమాల మీద కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్బంధంలో భాగంగా ఆయన పినతండ్రి జగన్నాథరావు, అన్న వాసుదేవరావు, బావ పాపారావు ముగ్గురినీ 1940 దశకం చివరిలో పోలీసులు కాల్చిచంపారు. అంటే ఆయన సరిగ్గా యవ్వన దశలో ప్రవేశిస్తున్న సమయానికే ఆయన ఏ మార్గంలో నడవవలసి ఉన్నదో నిర్ణయమైపోయింది. తొమ్మిదో తరగతి విద్యార్థిగా, స్టూడెంట్స్ ఫెడరేషన్ సభ్యుడిగా, 1947 మార్చి సంచిక నవయుగలో ‘ఓ విద్యార్థి సోదరుడా, సమ్మెయే మన ఆఖరాయుధమోయ్’ అని రాసి, ఇతరులకు ఇచ్చిన ఉద్యమ జీవిత పిలుపును ఆయన ఆ తర్వాత డెబ్భై సంవత్సరాల పాటు ఒక్క క్షణం కూడ మరిచిపోకుండా పాటించారు. ఆ ఉద్యమ జీవితమే ఆయనను సహజంగా సాహిత్యాభిమానంలోకి, సాహిత్యంలోకి నడిపించింది. 1955 ఎన్నికల ప్రచారంలో శ్రీశ్రీని వెన్నంటి ఉన్న సహచరుడిగా ఆయన శ్రీశ్రీకి అత్యంత సన్నిహితుడయ్యారు. శ్రీశ్రీ స్వయంగా ‘నా ఏకైక కైక’ అని సంబోధిస్తూ ప్రసాద్‌కు ఉత్తరాలు రాసేవారంటే, వాళ్లిద్దరి అవినాభావ సంబంధం అర్థమవుతుంది. ఈ ఉద్యమ జీవితం వల్ల నియతమైన చదువు సాగకపోయినా ప్రాచీన, ఆధునిక సాహిత్యమంతా ఆయనకు మేధలో మాత్రమే కాదు, హృదయమంతా నిండింది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు నోటిమీద పలికే ధారణాశక్తీ వచ్చింది. ఆయన సొంత గ్రంథాలయం బహుశా తెలుగు సమాజంలో వ్యక్తిగత గ్రంథాలయాలలో అతిపెద్ద వాటిలో ఒకటి కావచ్చు. నియతమైన చదువు లేకపోవడం వల్ల కాజీపేట రైల్వేస్టేషన్ క్యాంటీన్లో ఉద్యోగం దగ్గరి నుంచి మిత్రులు తీసిన సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ దాకా అనేక ఉద్యోగాలు చేసి చిట్టచివరికి ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకుని 1960ల చివర విశాఖపట్నం మిసెస్ ఏవీఎన్ కాలేజీలో రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా చేరి, మూడు దశాబ్దాలకు పైగా అక్కడే ఉన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధపోరాట కాలం నుంచీ రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, సుందరయ్య, బసవపున్నయ్య వంటి ఎందరితోనో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, 1960ల మధ్య కాజీపేటలో ఉన్న రోజులనుంచే ఆయన కొండపల్లి సీతారామయ్య, కె.జి.సత్యమూర్తి ఆలోచనలకు దగ్గరయ్యారు. ఇక విశాఖపట్నం జీవితం, పొరుగున ఉన్న శ్రీకాకుళ విప్లవోద్యమంతో, నక్సల్బరీతో సంబంధాన్ని ఇచ్చింది. శ్రీశ్రీ అరవయ్యో పుట్టినరోజు సందర్భంగా ‘రచయితలారా, మీరెటువైపు’ అని విశాఖ విద్యార్థులు విసిరిన సవాలులో, ఆ సవాలుకు ప్రతిస్పందనగా జరిగిన పరిణామాలలో, శ్రీశ్రీని విప్లవ రచయితల సంఘం వైపు తీసుకురావడంలో చలసాని ప్రసాద్ పాత్ర ఇంకా పూర్తిగా చరిత్రకు ఎక్కవలసే ఉంది. ఆయనే చాలాసార్లు 1970 గురించి చెపుతూ రెస్ట్ ఈజ్ హిస్టరీ అన్నట్టు ఆ తర్వాత గడిచిన నలభై ఐదు సంవత్సరాలలో ఆయన ఇంకా ఎక్కువ చరిత్రను రచించారు, చరిత్రను నిర్మించారు. శ్రీశ్రీ సమగ్ర సాహిత్యం ఇరవై సంపుటాలనూ, కొడవటిగంటి కుటుంబరావు సాహిత్య సర్వస్వం పద్దెనిమిది సంపుటాలనూ ఒక్కచేతిమీద ప్రచురించడంలోగాని, వక్తగా, కార్యకర్తగా, నాయకుడిగా, సాహిత్య ప్రేమికుడిగా, పుస్తక ప్రేమికుడిగా, స్నేహశీలిగా రాష్ట్రంలోనూ, దేశంలోనూ వేలాది మంది హృదయాలలో తన సుతిమెత్తని హృదయంతో, నిరాడంబర ఆత్మీయతతో విద్యుత్తేజం నింపడంలో గానీ ఆయన మేరునగధీరుడు. మరొక కమ్యూనిస్టు సంప్రదాయపు కుటుంబం నుంచి వచ్చిన సహచరి విజయలక్ష్మి ఒక దశాబ్దం కింద మరణించినా పుస్తకాలతో, స్నేహితులతో, విశాఖ సమాజంతో కొనసాగిన ఆయన సాహచర్యం శనివారం ఉదయం ముగిసిపోయింది. ఎన్.వేణుగోపాల్ (వ్యాసకర్త ‘వీక్షణం’ సంపాదకుడు). -
వాన పడతాది జాన... ఎట్ట బొమ్మందునో...
జ్ఞాపకం ‘‘నేను హనుమకొండకు వచ్చిన తర్వాత వెలువడిన ‘సృజన’ సంచిక జూలై 1973. అప్పటికే ఎన్.కె, జనసేన, కానూరి వెంకటేశ్వరరావుల పాటలు విని, వాటిలో కవిత్వం కొంతైనా అనుభవించి ఉన్నానుగాని ఆ సంచికలోనే మొదటిసారిగా వి.బి. గద్దర్ పాటలు చూశాను. అప్పటికే లయ ఉన్న కవిత్వం, గొంతెత్తి చదువుకునే కవిత్వం రుచి దొరికి ఉన్న నాకు ఆ సంచికలో అచ్చయిన నాలుగు గద్దర్ పాటలు కొత్త కవిత్వాన్ని పరిచయం చేశాయి. ‘నీవు నిజం దెలుసుకోవరో కూలన్న నీవు నడుం గట్టి నడవాలి రైతన్నా’... ‘రిక్షాదొక్కేరహీమన్న రాళ్లుగొట్టే రామన్న డ్రైవర్ మల్లన్న హమాలి కొమ్రన్న’... ‘వాన పడతాది జాన ఎట్టబొమ్మందునో’ ‘కల్లుముంతో మాయమ్మ నిన్ను మరువజాలనే’... అనే పాటలు చదువుతుంటే ఒళ్లు పులకించింది. ఇంత మామూలు మాటలతో ఇంతగా ఉద్రేకపరిచే కవిత్వం ఉంటుందా అని ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత మూడు నెలలకు ఆ పాటలు గద్దర్ నోటి వెంట విన్నప్పుడు కలిగిన ఉత్తేజం నిజంగా చెప్పడం అసాధ్యం. నిజానికి గద్దర్ పాటలు అచ్చుకెక్కడం అదే మొదటిసారి. అందుకే అవి అచ్చవుతున్నప్పుడు సృజన సంపాదకీయ వ్యాఖ్య కూడా రాసింది. ‘ఈ సంచికలోనూ రాగల వొకటి రెండు సంచికల్లోనూ ఎక్కువ సంఖ్యలో వేయనున్న వి.బి.గద్దర్ పాటలు త్వరలో పుస్తకరూపంలో కూడా వస్తాయి. హైదరాబాద్ జిల్లా మాండలికాలు, అక్కడి ప్రజాజీవితం మాత్రమే కాదు- ఈ పాటలన్నీ ఆ చుట్టుపట్ల పల్లెల్లో ప్రజలు పాడుకునే బాణీల్లో వచ్చినవే. కొన్ని పాటల మకుటాలు చరణాలు కూడా ప్రజలు పడుకునే పాటల నుంచే తీసుకుని విప్లవభావాలకు అనుగుణంగా మలచినవి. ఈనాడివి హైదరాబాద్ చుట్టూ దాదాపు ఇరవై గ్రామాల్లో విరివిగా పాడుకోబడుతున్నాయి’ అని సృజన రాసింది. అప్పటికి ఎంత అర్థమయ్యాయో చెప్పలేనుగాని ఆ తర్వాత నాలుగు నెలలు నిజంగా జీవితం మారిపోయిన రోజులు. ఆ తర్వాత వెలువడిన ఆగస్ట్ 1973 సంచికలో ‘వీడేనమ్మో డబ్బున్న బాడుకావు’, ‘పోదామురో జనసేనలో కలిసి’, సెప్టెంబర్ 1973 సంచికలో ‘రెక్కబొక్క వొయ్యకుండ సుక్కసెమ్ట వొడ్వకుండ బొర్ర బాగా బెంచావురో దొరోడో’, ‘పిల్లో నేనెల్లిపోతా’, ‘నిజం తెలుసుకోవరో కూలన్న’... గద్దర్ పాటల ప్రభంజనం. - ఎన్. వేణుగోపాల్ ఫేస్బుక్ గ్రూప్ ‘కవి సంగమం’లో ‘కవిత్వంతో ములాకాత్’ పేరిట వస్తున్న వ్యాస పరంపర నుంచి