చట్టం పట్ల న్యాయమూర్తులకే శ్రద్ధ లేదా?! | N Venugopal opinion on Chhattisgarh high court verdict | Sakshi
Sakshi News home page

చట్టం పట్ల న్యాయమూర్తులకే శ్రద్ధ లేదా?!

May 10 2025 2:43 PM | Updated on May 10 2025 2:49 PM

N Venugopal opinion on Chhattisgarh high court verdict

అభిప్రాయం

ఒక కీలకమైన కేసు సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేష్‌ సిన్హా, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌ వర్మల ద్విసభ్య ధర్మాసనం ఇటీవల (2025 మే 5న) చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన తీర్పు మన ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులకు కూడా చట్ట బద్ధ పాలన పట్ల శ్రద్ధాసక్తులు లేవా అనే అనుమానాన్ని బలోపేతం చేస్తున్నాయి. ఈ కేసు ‘మూలవాసి బచావో మంచ్‌’ (ఎంబీఎం) అనే ఆదివాసీ సంస్థ మీద ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం విధించిన నిషేధపు నోటిఫికేషన్‌ చెల్లదని, దాన్ని కొట్టివేయాలనీ కోరుతూ దాఖలైన పిటిషన్‌కు సంబంధించినది.

‘ఛత్తీస్‌గఢ్‌ విశేష్‌ జన సురక్షా అధినియమ్‌ – 2005’ (ఛత్తీస్‌గఢ్‌ ప్రత్యేక ప్రజా భద్రతా చట్టం–2005) అనే చట్టం ప్రకారం అక్టోబర్‌ 30న ఆ నోటిఫికేషన్‌ విడుదలయింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్య క్రమాలకు వ్యతిరేకంగా ఎంబీఎం నిరంతరంగా ప్రజలను రెచ్చగొడుతున్నదని, ప్రజలలో శాసనోల్లంఘనను ప్రోత్సహిస్తూ, సామాజిక శాంతిని భగ్నం చేస్తూ, రాజ్య భద్రతకు ప్రమాదంగా మారిందని, అందువల్ల నిషేధం విధిస్తున్నామని ఆ నోటిఫికేషన్‌లో ప్రభుత్వం చెప్పింది. ఆ చట్టం ప్రకారం ప్రభుత్వం ఏదైనా ఒక సంస్థను చట్టవ్యతిరేకమైనదిగా భావిస్తే, ఆ సంస్థపై నిషేధం విధించవచ్చు. ఈ ‘భావిస్తే’ అనే మాట చాలా అస్పష్టమైనదని, ఎవరి మీదనైనా  చట్టాన్ని నిష్కారణంగా ప్రయోగించే అవకాశం ఉందని, అందువల్ల ఈ చట్టమే అన్యాయమైనదని, కొట్టివేయాలని సుప్రీం కోర్టులో వేసిన వ్యాజ్యం ఇరవై ఏళ్లు కావస్తున్నా విచార ణకే రాలేదు!

ఆ చట్టంలోని సెక్షన్‌ 2 ‘చట్టవ్యతిరేక కార్య కలాపాలు’ అనే మాటకు ఇచ్చిన నిర్వచనం ఎంత విశాలమైనదంటే అన్ని ప్రజాస్వామిక నిరసనలనూ ఆ మాట కింద చేర్చవచ్చు. సెక్షన్‌ 3 (2)లో నోటిఫికేషన్‌లో నిషేధానికి కారణాలు స్పష్టీకరించాలి అంటూనే, తర్వాత వాక్యంలో ‘ఆ వాస్తవం బైట పెట్టడం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమని భావిస్తే, ప్రభుత్వం ఆ కారణాలను బైటపెట్టకుండా ఉండవచ్చు’ అని రాశారు. అంటే ఏ కారణమూ చెప్పకుండానే ఒక సంస్థను ‘చట్టవ్యతిరేకమైనద’ని ముద్ర వేసి నిషేధించే అధికారాన్ని ప్రభుత్వం తనకు తానే ఇచ్చుకుంది. ఈ నిరంకుశ, ప్రశ్నాతీత అధికారాన్ని తనకు తాను ఇచ్చుకున్న ప్రభుత్వ చర్యే నిజానికి చట్టవ్యతిరేకమైనది, న్యాయ వ్యతిరేకమైనది. ఈ మితిమీరిన అధికారాన్ని కొట్టివేయ వలసిన న్యాయస్థానాలు దాని వైపే చూడడం లేదు. ఈ చట్టం కింద వందలాది కేసులు పెట్టి, వేలాది మంది ఆదివాసులను సంవత్సరాల తరబడి జైళ్లలో మగ్గి పోయేలా చేస్తుంటే మన న్యాయవ్యవస్థకు చీమ కుట్టిన ట్టయినా లేదు.  

అంతేకాదు, న్యాయస్థానాలలో ఇంకా విచిత్రా లున్నాయి. అనుచితంగా నిషేధపుటుత్తర్వులు జారీ చేస్తే అడ్డుకోవడానికి చట్టమే రెండు మూడు పరిమితులు విధించింది. ఆ పరిమితులను న్యాయబద్ధంగా అమలయ్యేలా చూడాలని కూడా న్యాయస్థానాలు అనుకోవడం లేదు. నోటిఫికేషన్‌ వెలువడినప్పటినుంచి పదిహేను రోజుల్లోగా బాధిత సంస్థ తన అభ్యంతరాలు చెప్పుకోవచ్చునని, నోటిఫికేషన్‌ జారీ అయిన ఆరు వారాలలోగా ప్రభుత్వం హైకోర్టు న్యాయ మూర్తుల స్థాయికి తగ్గని ముగ్గురితో సలహా మండలిని నియమించాలని, బాధిత సంస్థ అభ్యంతరాలను విచారించిన సలహా మండలి మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని, ఆ నివేదికను బట్టి నిషేధం అమలులోకి రావడం గాని, ఉపసంహరించడం గాని జరుగుతుందని సెక్షన్‌ 5, 6, 7 చెబుతాయి.

మూలవాసి బచావ్‌ మంచ్‌ విషయంలో ఈ చట్ట నిబంధనలన్నిటినీ తుంగలో తొక్కారు. అక్టోబర్‌ 30 నోటిఫికేషన్‌ను నవంబర్‌ 8న గెజిట్‌ విడుదల చేసి, నవంబర్‌ 18న బహిరంగంగా ప్రకటించారు. అంటే సాంకే తికంగా బాధిత సంస్థ అభ్యంతరాలు చెప్పే హక్కును కొల్లగొట్టారు. అయినా సరే ఎంబీఎం తన అభ్యంతరాలను నవంబర్‌లో ప్రభుత్వానికి అందజేసింది. తాము అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటు న్నామనేది అబద్ధమని, నిజానికి తాము ఆదివాసీప్రాంతాలలో విద్య, వైద్యం, తాగునీరు వంటి అభివృద్ధి సౌకర్యాలు కల్పించమని కోరుతున్నామని వాదించింది. తాము చట్టవ్యతిరేకంగా ప్రవర్తించడం లేదని, శాసనోల్లంఘనను ప్రోత్సహించడం లేదని, వాస్తవానికి రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్‌ను, ‘పంచాయత్‌    ఎక్స్‌టెన్షన్‌ టు షెడ్యూల్డ్‌ ఏరియాస్‌ చట్టం – 1996’ను, ‘అటవీ హక్కుల చట్టం–2006’ను ప్రభుత్వం ఉల్లంఘిస్తుండగా, వాటిని పాటించమని కోరుతున్నామని వాదించింది. సలహా మండలి మరిన్ని వివరాలు కావాలని తాత్సారం చేస్తూ, తనకు చట్టం ఇచ్చిన మూడు నెలల కాలం దాటి, మరొక మూడు నెలలు గడిచినా కిమ్మనకుండా ఉన్నది. ఈలోగా నిషేధం పేరిట ఎడాపెడా అరెస్టులు జరిగిపోతున్నాయి.  

అసలు ఎంబీఎం స్థాపనే ప్రభుత్వ బలగాల చట్టవ్యతిరేక ఆక్రమణలకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన శాంతియుత నిరసనల క్రమంలో జరిగింది. 2021 మే 12 ఉదయానికల్లా ‘సిల్గేర్‌’ అనే గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న పది ఎకరాల పంట భూమిని ఆక్రమించి సీఆర్‌పీఎఫ్‌ క్యాంపు నిర్మాణాలు చేశారు. తెల్లవారిన తరువాత వాటిని చూసి ఆ గ్రామస్థులు... ఐదవ షెడ్యూల్, పీసా, అటవీ హక్కుల చట్టాల ద్వారా తమ ప్రాంతంలో ప్రభుత్వమైనా సరే ఏ నిర్మాణం చేయా లన్నా గ్రామసభ ముందస్తు అనుమతి పొందాలి కదా, తమ భూమిని ఎలా ఆక్రమించారని క్యాంపు అధికారులను అడిగారు. పోలీసులు తమకు తెలిసిన ఏకైక భాషలో ఆదివాసుల మీద లాఠీచార్జీ జవాబు ఇచ్చారు. 

మూడు రోజుల తర్వాత పరిసర గ్రామాల ఆదివాసులందరూ దాదాపు ఇరవై వేల మంది ఆ క్యాంపు ముందు నిరసన ప్రదర్శనకు వచ్చారు. పోలీసులు వారి మీద కాల్పులు జరిపి అక్కడికక్కడే ముగ్గురు ఆదివాసులను చంపేశారు. కాల్పులకు బాధ్యుల మీద చర్య తీసుకునే వరకూ మృతదేహాలను అక్కడి నుంచి కదిలించబోమని ఆదివాసులు చేసిన ఆందోళన నుంచి మూలవాసి బచావో మంచ్‌ పుట్టింది. సల్వా జుడుమ్‌ కాలంలో పోలీసు క్యాంపుల్లో తమ కుటుంబాల మీద జరిగిన హత్యాకాండను, అత్యాచా రాలను చూసిన బాల బాలికలు ఇప్పుడు యువతగా ఎదిగి, ఈ నిరాయుధ, శాంతియుత ఆందోళనా రూపాన్ని చేపట్టి ఎంబీఎంను స్థాపించారు.

ఆ సంస్థ సిల్గేర్‌ లో నాలుగు సంవత్సరాలుగా నిరసన శిబిరాన్ని నడుపుతున్నది. మరొక ముప్పై చోట్ల క్యాంపుల పట్ల నిరసన తెలుపుతున్నది. ఈ శాంతి యుత ప్రజా నిరసనలను అడ్డుకోవడానికే ప్రస్తుత నిషేధం. ‘సంస్థ అభ్యంతరాల మీద సలహా మండలి ఇంకా మాట్లాడలేదు గనుక మేం దీనిలో జోక్యం చేసుకోలేం’ అంటూ ధర్మాసనం... సారాంశంలో నిషేధానికీ, నిర్బంధానికీ ఆమోదముద్ర వేసింది. ప్రాసిక్యూటర్ల అబద్ధాలకు, ప్రభుత్వపు చట్ట ఉల్లంఘనలకు, రాజ్యపు దౌర్జన్యా లకు వత్తాసు పలకడమే తమ విధి అని కొందరు న్యాయమూర్తులు అను కోవడమే విషాదం!

- ఎన్‌. వేణుగోపాల్‌
‘వీక్షణం’ ఎడిటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement