మావోయిస్టులు ఎన్‌కౌంటర్లను ఖండిస్తూ ఆదివారం నిరసన దినంకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అభయారణ్యంలో పోలీసు బలగాలు జల్లెడపడుతున్నాయి. గట్టి ఎదురుదెబ్బ తిన్న మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్త మయ్యాయి. పొరుగు రాష్ట్రాల పోలీసుల సహకారంతో సరిహద్దు వెంబడి విస్తృతంగా తనిఖీలు, సోదాలు ముమ్మరం చేశాయి. దీంతో దండకారణ్యంలోని ఆంధ్రా, చత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
చింతూరు: మారేడుమిల్లి అటవీప్రాంతంలో జరిగిన వరుస ఎన్‌కౌంటర్లను ఖండిస్తూ ఆదివారం నిరసన దినం పాటించాలని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నెల్లూర్, జీఎం వలస అటవీ ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు ప్రకటించడం తెలిసిందే. వీరిలో కీలకమైన కేంద్ర కమిటీ సభ్యుడు మడివి హిడ్మా, భార్య రాజే, ఏవోబీ ఇన్‌చార్జి టెక్ శంకర్ ఉండటంతో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

ఎన్‌కౌంటర్లను ఖండిస్తూ..
వరుస ఎన్‌కౌంటర్లను ఖండిస్తూ ఈనెల 20న మావోయిస్టులు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఘాటు లేఖను విడుదల చేశారు. వైద్యం నిమిత్తం విజయవాడలో ఉన్న హిడ్మాతోపాటు అనుచరులను కొంతమంది వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో అదుపులోకి తీసుకున్నారని, నిరాయుధులైన వారిని మారేడుమిల్లి అటవీప్రాంతంలో కాల్చి చంపారని లేఖలో అభయ్ ఆరోపించారు. టెక్ శంకర్‌తో పాటు మిగతా వారిని కూడా ఇలాగే హతమార్చి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారని ఆయన ఆరోపించారు. ఈ ఎన్‌కౌంటర్లను ఖండిస్తూ ఆదివారం నిరసన దినంగా పాటించాలని ఆ లేఖలో అభయ్ పేర్కొన్నారు.

ఎన్‌కౌంటర్లను ఖండిస్తూ మావోయిస్టులు ఆదివారం నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అభయారణ్యంలో పోలీసు బలగాలు జల్లెడపడుతున్నాయి. దీంతో ఆంధ్రా, ఒడిశా సరిద్దులతో పాటు దండకారణ్యంలోని ఆంధ్రా, చత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
మావోయిస్టులకు గట్టిపట్టున్న సరిహద్దు ప్రాంతాల్లో ఏవైనా ఘటనలకు పాల్పడవచ్చనే నిఘావర్గాల హెచ్చరికలతో ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలతో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ఆంధ్రాలో ఎన్‌కౌంటర్లు జరిగిన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి ఇటువైపు వచ్చి ఘటనలకు పాల్పడే అవకాశముందని అనుమానిస్తున్న పోలీసులు సరిహద్దుల వెంబడి గస్తీని మరింత పెంచారు. పొరుగు రాష్ట్రాల పోలీసుల సహకారంతో సరిహద్దు వెంబడి విస్తృతంగా తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్న మారేడుమిల్లితో పాటు రంపచోడవరం ప్రాంతాల్లో పోలీసులు మరింత అలర్టయ్యారు.
మావోయిస్టులు నిరసన దినంకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు మావోయిస్టుల టార్గెట్‌లో ఉన్న వ్యక్తులకు నోటీసులు ఇస్తున్నారు. రంపచోడవరం, చింతూరు డివిజన్ల మండలాల్లో ఉన్న రాజకీయ పారీ్టల నేతలతో పాటు కాంట్రాక్టర్లకు అప్రమత్తంగా ఉండాలని నోటీసుల్లో పేర్కొంటున్నారు. కీలక నేతలతో పాటు టార్గెట్‌లో ఉన్న వ్యక్తులు ఏజన్సీని వీడి మైదాన ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచనలు జారీ చేస్తున్నారు.
వివిధ డిపోల నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు వచ్చే నైట్‌సర్వీసులు నిలిపి వేయాలని పోలీసులు ఇప్పటికే ఆయా డిపో మేనేజర్లకు సమాచారమిచ్చారు. దీంతోపాటు రంపచోడవరం, భద్రాచలం వైపునుంచి అటవీప్రాంతాల్లో ప్రయాణించే వాహనాలను రాత్రిపూట నిలిపి వేయడంతో పాటు మరికొన్ని వాహనాలను దారి మళ్లిస్తున్నారు.


