
అభిప్రాయం
ఎమర్జెన్సీ విధించి యాభై ఏళ్ల యిన సందర్భంగా సంజయ్ గాంధీ ప్రోద్బలంతో 1975– 77ల్లో జరిగిన నస్ బందీ (బల వంతపు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స) గురించి చాలామంది తలచుకున్నారు. అలాగే, తొమ్మి దేళ్ల కిందటి నోట్ బందీ (పెద్ద నోట్ల రద్దు) పర్యవసానాలు అందరికీ స్వానుభవమే. సరిగ్గా ఎమర్జెన్సీని గుర్తు చేసుకునే రోజు (జూన్ 25)కు ఒక రోజు ముందు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాన్ని ఇప్పుడు ప్రతిపక్షాలు ‘వోట్ బందీ’ అంటున్నాయి. అది గత జూన్ 24న ఎన్నికల సంఘం బిహార్‌లో ప్రత్యేక తీవ్రతర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – ఎస్‌ఐఆర్– సర్) కోసం ఇచ్చిన ఆదేశం. బిహార్‌లోని 7,80,22,933 మంది వోటర్లలో 2003లో ఉండిన నాలుగు కోట్ల మంది పోగా, మిగిలిన వోటర్లలో ప్రతి ఒక్కరినీ కలిసి అర్హులా అనర్హులా ధ్రువీకరించి, కొత్త వోటర్ల జాబితా తయారు చేయాలనేది ఈ ఆదేశం.
ప్రస్తుతం ఉన్న వోటర్ల జాబితా తప్పుల తడక అనీ, అందులో పేర్లన్నీ అనుమానాస్పదమైనవనీ ఎన్ని కల సంఘం అంటున్నది. విపరీతమైన వర్షాలతో, రాష్ట్రంలో 70 శాతం భూభాగం వరదల్లో చిక్కుకుని ఉన్న ప్రస్తుత స్థితిలో ఈ ఇంటింటి పర్యటన సాధ్యమా అనుమానమే.
2003 జాబితా తర్వాత చేరిన వోటర్లందరూ బర్త్ సర్టిఫికేట్, ప్రభుత్వోద్యోగి ఐడెంటిటీ కార్డ్, పెన్షన్ కార్డ్, పాస్ పోర్ట్, విద్యార్హతల సర్టిఫికేట్, నివాస ధ్రువీకరణ పత్రం, అటవీ హక్కుల సర్టిఫికేట్, కుల ధ్రువీకరణ పత్రం, జాతీయ పౌర రిజిస్టర్, స్థానిక అధికారులు తయారు చేసిన కుటుంబ పట్టిక, ప్రభుత్వం భూమి పంపిణీ చేసి ఉంటే ఆ పత్రం వంటి పదకొండు పత్రాలలో ఏదైనా ఒకటి చూపితేనే అర్హుడైన వోటర్‌గా లెక్కి స్తారు. ఈ అర్హతా పత్రాలలో ఆశ్చర్యకరంగా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, గ్రామీణ ఉపాధి హామీ పథకపు జాబ్ కార్డ్ లేవు. చివరికి ఎన్నికల కమిషన్ తానే స్వయంగా జారీ చేసిన వోటర్ కార్డ్ కూడా లేదు. బిహార్ లాంటి వెనుకబడిన రాష్ట్రంలో ఆ పదకొండు పత్రాలలో ఏదో ఒకటి కన్నా వోటర్ కార్డ్, జాబ్ కార్డ్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉండే అవకాశమే ఎక్కువ. కొన్ని రోజులు గడిచాక, ‘అర్హత నిర్ధారణను బూత్ లెవల్ ఆఫీసర్ల విచక్షణకు వదులుతున్నాం’ అని ఎన్నికల సంఘం అంది. అంటే ఒక వ్యక్తి వోటరా కాదా అన్నది స్థానిక అధికారి ఇష్టాయిష్టాల మీద ఆధారపడుతుందన్నమాట!
ఈ కార్యక్రమం అనుమానాస్పదంగా ఉన్నదనీ, దీన్ని ఆపాలనీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను కలిసి ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేసినప్పుడు ఆయన స్వయంగా బిహార్ వోటర్ల జాబితా నుంచి కనీసం ఇరవై శాతం పేర్లు తొలగించవలసి ఉంటుందని అన్నారు. అంటే ఒక కోటీ అరవై లక్షల వోటర్ల అర్హత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వాళ్లలో కొందరు నిజంగానే అనర్హులు కావచ్చు గాని, ఈ పేరుతో అధి కార పక్షం చాలామంది పేర్లు తొలగించదలచుకున్న దన్న అనుమానాలు విస్తారంగా ఉన్నాయి.
2003లో వోటర్ల జాబితా సవరించడానికి 700 రోజులు పట్టింది. ఇప్పుడు నిర్దేశించిన నెల రోజుల్లో శిక్షణ, మెటీరియల్ తరలింపునకు పట్టిన కాలాన్ని మినహాయిస్తే 19 రోజుల్లో కార్యక్రమాన్ని ముగించాల్సి ఉంది. అంటే తూతూమంత్రంగా ముగిస్తారన్నమాట.
ఎన్నికల సంఘం ప్రకటనలను బట్టి మొత్తం కోటీ అరవై లక్షల వోటర్ల అర్హత ప్రశ్నార్థకమయింది. అసలు వోటర్ల జాబితాలు ఎప్పటికప్పుడు పునర్నవీకరణ చెందుతూనే ఉంటాయి. 2003 నుంచి ఇప్పటివరకూ జరిగిన ఐదు లోకసభ ఎన్నికలలో, ఐదు శాసనసభ ఎన్నికలలో వోటు వేసిన వారందరినీ ఇప్పుడు అనర్హు లుగా, అర్హత రుజువు చేసుకోవలసినవారిగా ఎన్నికల సంఘం ప్రకటిస్తున్నది. అంటే ఆ ఐదు లోకసభలూ, శాసనసభలూ ఈ అనర్హులైన వోటర్ల వల్ల ఏర్పడ్డాయని ఎన్నికల సంఘం భావిస్తున్నదా? అలా అయితే వాటి సాధికారత, చట్టబద్ధత ఎంత?
వోటర్ల జాబితాల సవరణ ఎప్పటికప్పుడు చేయ వలసిన పనే గనుక ఎన్నికల నిబంధనలు అది ఎట్లా చేయాలో నిర్దేశించాయి. ఆ నిబంధనల్లో ఇంటెన్సివ్ రివి జన్ ఉంది గాని ఇప్పుడు ప్రకటించిన స్పెషల్ ఇంటె న్సివ్ రివిజన్ లేదు. అటువంటి పని చేసే అధికారం చట్ట ప్రకారం ఎన్నికల సంఘానికి ఉందా అనే ప్రశ్నకు జవాబు లేదు. బిహార్ నుంచి ప్రతి జూన్–జూలై–ఆగస్ట్ నెలల్లో కనీసం 21 శాతం వోటర్లు ఇతర రాష్ట్రాలకు పనుల కోసం వలస వెళ్తారని ఎన్నికల సంఘమే ఇది వరకు అంచనా వేసింది. మరి సరిగ్గా అదే సమయంలో ప్రతి వోటర్‌నూ కలిసి జాబితాను సంస్కరించాలనడంలో ఔచిత్యం ఏమిటి? ఇంకా విచిత్రం, ఇదే ఎన్నికలసంఘం గత సంవత్సరం జూన్‌లో వోటర్ల జాబితాను సంస్కరించమని బిహార్ ఎన్నికల అధికారులను ఆదేశించింది. వారు ఆరు నెలల పాటు శ్రమించి 2025 జన వరిలో జాబితా ప్రకటించారు. దాన్ని జూన్ 24 వరకూ ఎన్నికల సంఘం కూడా ఆమోదిస్తూ వచ్చింది.
చదవండి: మారక నిల్వలు కరిగిస్తేనే కదలిక!
ఇప్పుడు హఠాత్తుగా బిహార్ ఎన్నికల్లో విజయం సాధించాలంటే, ప్రతిపక్షానికి వోటు వేస్తారనే అను మానం ఉన్న లక్షలాది వోటర్లను అనర్హులుగా మార్చ డమే ఏకైక మార్గంగా ఏలినవారు భావించినట్టున్నారు. అందుకు అనుగుణంగా ఎన్నికల సంఘం ఈ వోట్ బందీ ప్రకటించినట్టుంది. నస్ బందీ తలపెట్టినవారు 1977లో ఓటమి పాలయ్యారు. 2016 నోట్ బందీ ప్రకటిత లక్ష్యాలు సాధించలేక బొక్కబోర్లా పడింది. ఇప్పుడు 2025 వోట్ బందీకి ఏమవుతుంది?
- ఎన్. వేణుగోపాల్
‘వీక్షణం’ సంపాదకుడు