
బిహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ అంశంలో ఈసీని హెచ్చరించిన సుప్రీం
న్యూఢిల్లీ: బిహార్‌లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియ ఏమాత్రం చట్టవిరుద్ధంగా అనిపించినా మొత్తం ప్రక్రియను పక్కన పడేస్తామని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. ఎస్‌ఐఆర్ చట్టవిరుద్ధంగా చేపడుతున్నారంటూ దాఖలైన పిటిషన్లపై సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని హెచ్చరించింది.
‘‘ రాజ్యాంగబద్ధ సంస్థగా ఎలక్షన్ కమిషన్ ప్రతి పనినీ చట్టప్రకారమే నిర్వర్తిస్తుందని మేం మొదట్నుంచీ భావిస్తున్నాం. అయితే కొత్తగా చేపట్టిన ఎస్‌ఐఆర్ ఏ దశలోనైనా చట్టవిరుద్ధమని తేలితే మొత్తం విధానాన్ని రద్దుచేస్తాం. ఇప్పటికిప్పుడే ఎస్‌ఐఆర్‌పై తుది నిర్ణయానికి రాబోం. కేసులో చివరి వాదోపవాదనలను అక్టోబర్ ఏడోతేదీన ఆలకిస్తాం. ఈ కేసులో మేం ఇచ్చే తుది తీర్పు బిహార్‌కు మాత్రమేకాదు యావత్‌భారతదేశానికి వర్తిస్తుంది. ప్రస్తుతానికి ఎస్‌ఐఆర్‌లాంటి ప్రక్రియను ఇతర రాష్ట్రాల్లో ఈసీ చేపట్టినా మేం అడ్డుచెప్పబోం.
దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్ అమలుపై అభ్యంతరాలు ఉంటే పిటిషనర్లు తమ వాదనలను అక్టోబర్ ఏడో తేదీన వినిపించుకోవచ్చు. అక్టోబర్ ఏడున కేసు విచారణ ఉండబోతోంది ఆలోపే అంటే సెప్టెంబర్ 30వ తేదీన బిహార్ ఓటర్ల తుది జాబితా ముద్రణ ఉండబోతోంది. ఈ తేదీకి కేసు విచారణకు ఎలాంటి సంబంధం లేదు. ఆ తుది జాబితాలో ఏవైనా చట్టవిరుద్ధత కనిపిస్తే ఎస్‌ఐఆర్ ప్రక్రియను అప్పడైనా రద్దుచేస్తాం’’ అని కోర్టు స్పష్టంచేసింది.
ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది, పిటిషన్ వేసిన అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఎస్‌ఐఆర్ చేపట్టేందుకు ఈసీ సన్నాహాలు చేస్తోందని, ఈ విషయంలో ఈసీని అడ్డుకోవాలని న్యాయవాది గోపాల్ వాదించారు. ‘‘ అసలు ఈ విధానంలో చట్టబద్ధతను ఇంకా తేల్చాల్సి ఉంది. రాజ్యాంగంలో ఇలాంటి విధానం నియమనిబంధనలను పరిశీలించాల్సి ఉంది.
ఆలోపే ఇతర రాష్ట్రాల్లో ప్రక్రియను ఆపాలని ఈసీకి ఆదేశాలు ఇవ్వలేం’’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. దేశవ్యాప్త ఎస్‌ఐఆర్‌పై ఈసీ మరింత ముందుకు వెళ్లేలోపే ఈసీని నిలువరించాలని కాంగ్రెస్‌సహా పలు విపక్ష పార్టీల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్‌సిబల్ కోర్టును కోరారు. చట్టాన్ని తుంగలోతొక్కి ఈసీ తన సొంత నిర్ణయాలను అమలుచేస్తోందని రాష్ట్రీయ జనతాదళ్ తరఫున సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదించారు. ‘‘జాబితాలో తప్పులుంటే 24 గంటల్లోపు వెబ్‌సైట్‌లో అభ్యంతరాలను అప్‌లోడ్‌చేయాలని ఈసీ చెబుతోంది. ఇది చాలా కష్టమైన పని’’ అని ఆయన వాదించారు.