మారక నిల్వలు కరిగిస్తేనే కదలిక! | Despite high foreign exchange reserves Indian economy is not performing as expected | Sakshi
Sakshi News home page

మారక నిల్వలు కరిగిస్తేనే కదలిక!

Jul 12 2025 4:12 AM | Updated on Jul 12 2025 4:12 AM

Despite high foreign exchange reserves Indian economy is not performing as expected

మోదీ ప్రభుత్వం చెప్పుకొనే గొప్పల్లో తరచూ వినిపించేవి... విదేశీ మారక ద్రవ్య నిల్వలు! ఆయన వచ్చిన తర్వాత ఫారిన్‌ ఎక్స్‌ఛేంజ్‌ (ఫారెక్స్‌) రిజర్వులు 700 బిలి యన్‌ డాలర్లకు పెరిగాయి (2025 జూన్‌ నాటికి). ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న చైనా వద్ద 3 ట్రిలియన్‌ (3,000 బిలియన్లు లేదా 3 లక్షల కోట్లు) డాలర్లు ఉన్నాయి. గతంలో చైనా ఫారెక్స్‌ నిల్వలు 4 ట్రిలియన్‌ డాలర్లుగా ఉండేవి. చైనా తర్వాత జపాన్‌ (1.25 ట్రిలియన్‌ డాలర్లు), స్విట్జర్లాండ్‌ (800 బిలియన్‌ డాలర్లు) ఆగ్రస్థానంలో నిలుస్తాయి. 

మారక ద్రవ్య నిల్వలు ఇంత అధికంగా ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో లేదు. ఎన్డీయే ప్రభుత్వం ఆర్థిక చక్ర వ్యూహంలో చిక్కుకుంది. ఎలా బయట పడాలో తెలియడం లేదు. ఆర్థిక వ్యవస్థను మళ్లీ ఉత్తేజపరచడానికి కొత్త పెట్టుబడులు ఇబ్బడి ముబ్భడిగా రావాలి. కానీ ప్రభుత్వం వాటిని ఆకర్షించలేక పోతోంది. 2004–14 మధ్య మన ఎకానమీ అసాధారణ వృద్ధి సాధించింది. తర్వాత ఆ ఊపు కనబడటం లేదు. యూపీఏ పాలన సాగిన పదేళ్లలో సాధించిన ప్రగతికి 7.7 శాతం సగటు వృద్ధి రేటే నిదర్శనం. గడచిన పదేళ్లలో ఈ సగటు అంతకంటే తక్కువగా 6.2 గానే నమోదైంది.

ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవు!
అయితే, యూపీఏ హయాం చివరి రెండేళ్లలో ఎకానమీ మంద గించింది. పెట్టుబడుల వ్యయం (క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌ – క్యాపెక్స్‌) భారీగా క్షీణించడం ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొ నాలి. దురదృష్టవశాత్తూ అదే ట్రెండ్‌ ఎన్డీయే హయాంలోనూ కొన సాగుతోంది. భారత ఆర్థిక వృద్ధి నేటికీ చాలావరకు ప్రభుత్వ పెట్టు బడి మీదే ఆ«ధారపడుతోంది. పెట్టుబడులు ఎందుకు పడిపోతు న్నాయి? ప్రభుత్వం దగ్గర కాసులు లేవు. యూపీఏ పాలన నాటి అధిక సబ్సిడీలను ఎన్డీయే ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. 

దీనికి తోడు, ఏడో వేతన సంఘం సిఫారసులు అమలు వల్ల వేతనాలు 23 శాతం (రూ. లక్ష కోట్లు) పెరిగాయి. తనకు ముందు సంవత్సరాల మందగమనాన్నుంచి ఎకానమీని గట్టెక్కించి పరుగులు తీయిస్తానని మోదీ హామీ ఇచ్చారు. ప్రభుత్వ పెట్టుబడులను గణనీయంగా పెంచుతానన్నారు. 100 కొత్త సిటీలు, హైస్పీడ్‌ రైళ్ల నేషనల్‌ నెట్‌వర్క్, దేశ వ్యాప్త నదుల అనుసంధానం, ఇంకా ఇలాంటి పలు భారీ ప్రాజెక్టులు చేపట్టబోతున్నట్టు వాగ్దానం చేశారు. 100 కొత్త నగరాల నిర్మాణం కాస్తా 100 స్మార్ట్‌ సిటీలకు పరిమితమైంది.

స్మార్ట్‌ సిటీలంటే ఉచిత వైఫై నెట్‌వర్కులు ఏర్పాటు చేయడమే. ఇక దేశవ్యాప్త హైస్పీడ్‌ రైళ్ల నెట్‌వర్క్‌ కాస్తా అహ్మదాబాద్‌ – ముంబాయి బుల్లెట్‌ ట్రెయిన్‌గా రూపాంతరం చెందింది. అది కూడా ఆర్థికంగా ఓ గుదిబండ అయ్యేట్లుంది. ఇతర వాగ్దానాలు సైతం ‘ప్రతి భారతీయుడి ఖాతాలో 15 లక్షల రూపాయల జమ’ లాంటి జుమ్లాల జాబితాలో చేరాయి. 

దెబ్బ మీద దెబ్బ
ఆ తర్వాత రెండు అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిలో ఒకటైన పెద్దనోట్ల రద్దు (డీమానిటైజేషన్‌) చర్య అసంఘటిత రంగపు దినసరి వేతన జీవులను చావుదెబ్బ తీసింది. దేశ జీడీపీలో 40 శాతం ఈ రంగం నుంచే సమకూరుతుంది. ఉపాధి పరంగా చూసినా, మొత్తం 45 కోట్ల మందిలో 90 శాతం మంది ఈ రంగం నుంచే ఉపాధి పొందుతున్నారు. రెండో చర్య జీఎస్టీ తొందరపాటు అమలు. ఈ రెండు చర్యల వల్ల కచ్చితంగా ఎంత మంది ఉపాధి కోల్పోయారో ఇప్పటికీ గణాంకాలు లభ్యం కావడం లేదు. అంచ నాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. 

ముఖ్యంగా నిర్మాణ రంగం, ఫుడ్, రిటెయిల్‌ రంగాల్లో ఉపాధి నష్టం భారీగా జరిగింది. ఈ నిర్ణ యాలు 2–3 కోట్ల మంది పొట్ట గొట్టి ఉంటాయని అంచనా.  సరైన ఆలోచన లేకుండా జీఎస్టీని తొందరపడి అమలు చేయడం వల్ల ఉత్పత్తిపై ప్రభావం పడింది. తుది గడువు తక్కువగా ఉండటంతో డీలర్లు స్టాక్స్‌ తగ్గించుకున్నారు. దాంతో కంపెనీలు ఉత్పత్తి తగ్గించాయి. జీఎస్టీ ఇన్‌పుట్, ఔట్‌పుట్‌ రేట్లు పొంతన లేకుండాఉండటం వల్ల గందరగోళం మరింత పెరిగింది. మొదటి నెల రూ. 95 వేల కోట్ల వసూళ్లు ఉన్నా, అందులో రూ. 65 వేల కోట్లు తర్వాత రీఫండ్‌ చేయాల్సి వచ్చింది. కానీ అన్ని నిధులు ప్రభుత్వం వద్ద లేవు. 

దాదాపు రూ. 50 వేల కోట్ల వ్యయానికి నిధులు సమకూర్చు కునేందుకు వీలుగా జీడీపీలో 3.2 శాతం మించకూడదన్న ద్రవ్య లోటు లక్ష్యాన్ని సడలించుకోవలసి వచ్చింది. ఈ స్వయంకృత అపరా ధాలకు కోవిడ్‌ వైపరీత్యం తోడైంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. వినియోగం తగ్గింది. దాంతో ఉత్పత్తి తగ్గింది. ఫలితంగా వినియోగం మరింత తగ్గింది. ఈ విషవలయం నుంచి ఆర్థిక వ్యవస్థను తిరిగి ఒడ్డున పడేయాలంటే, ప్రభుత్వ వ్యయాలు భారీగా పెరగాలి. తద్వారా ప్రజల చేతికి డబ్బు వస్తుంది. 

తిరిగి వినియోగం, ఉత్పత్తి పెరుగుతాయి. ప్రభుత్వం సబ్సిడీలను అర్థవంతంగా తగ్గిస్తే తప్ప పెట్టుబడి వ్యయం పెంచలేదు. రాజకీయంగా ఇది సాధ్యం కానిది. కానీ ఎలాగైనా పెట్టుబడులు పెంచాలి. వాస్తవికతను విస్మరించకుండానే సృజనాత్మక ప్రణాళికలు రూపొందించుకోవాలి. పెట్టుబ డులు పెంచాలి. తద్వారా వినియోగం పెరగాలి. ఈ పెట్టుబడుల ప్రణాళిక కోసం నిధులు అవసరం. ఈ డబ్బు సమ కూర్చుకోడానికి మోదీ అటూ ఇటూ పరుగులు తీయాల్సిన పని లేదు. 

డబ్బే డబ్బు!
ప్రభుత్వం డబ్బు పాతర మీద కూర్చుని ఉంది. దశాబ్దాలుగా పోగుపడిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు (ఇందులో అమెరికాబ్యాంకుల్లో మూలుగుతున్నవి 135 బిలియన్‌ డాలర్లు) కొండంతఅండగా కలిసి వస్తాయి. ఈ రిజర్వులు మన విదేశీ రుణాల్లో(736 బిలియన్‌ డాలర్లు) సుమారు 95 శాతానికి సమానం. ఫారెక్స్‌ రిజర్వుల్లో నాలుగో వంతు హాట్‌ మనీ (అంటే ఎన్‌ఆర్‌ఐ ఇన్వెస్టర్లు, విదేశీ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థల స్వల్ప కాలిక పెట్టుబడులు) ఉపసంహ రణల కోసం పక్కన పెట్టినా, మన దగ్గర ఇంకా చాలా డబ్బు చేతిలోఉంటుంది. 

ఇందులో ఎంత వాడుకోగలమన్నది ఇప్పుడు ఆలోచించాలి. కౌశిక్‌ బసు (ప్రపంచ బ్యాంకు మాజీ ప్రధాన ఆర్థికవేత్త) ప్రకారం, విదేశీ మారక ద్రవ్య నిల్వలు మన కరెంట్‌ అకౌంట్‌ డెఫిసిట్‌ (సిఏడీ)కి సరిపడా ఉంటే చాలు. (ప్రస్తుత కరెంట్‌ ఖాతా లోటు 11 బిలియన్‌ డాలర్లు – వస్తుసేవల ఎగుమతులు, విదేశీ పెట్టుబడుల మీద వచ్చే ఆదాయం కంటే దిగుమతులకు చేసే చెల్లింపులు, విదేశీ పెట్టుబడుల మీద వెనక్కు పోయే ఆదాయం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వ్యత్యాసాన్ని  కరెంటు ఖాతా లోటు అంటారు).  

సింపుల్‌గా చెప్పాలంటే, కనీసం 6 నెలల దిగుమతులకు సరి పడా మారక ద్రవ్యం నిల్వ పెట్టుకుంటే చాలని ‘వాషింగ్టన్‌ కన్సెన్సస్‌’  నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా దేశీయ వినియోగదారుల కోసం తాము ఎందుకు చౌకగా నిధులు సమకూర్చాలన్న భావనతో చైనా తన విదేశీ మారక ద్రవ్య నిల్వలను ఒక ట్రిలియన్‌ డాలర్లు తగ్గించుకుంది. మనం కూడా దాన్ని 100 బిలియన్‌ డాలర్లకు తగ్గించుకునే యోచన చేయాలి. ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ నెలకొల్పి, దానిలోకి అదనపు ఫారెక్స్‌ రిజర్వులను కొంచెంకొంచెంగా తరలిస్తూ పోవాలి. 

ఇది ఇండియాలో పెట్టుబడి పెట్టేఇండియా సావరిన్‌ ఫండ్‌ అవుతుంది. దీని ద్వారా పెట్టుబడులు సమ కూర్చుకునే సంస్థలు తమకు అవసరమైన వాటిని దేశీయంగా సమ కూర్చుకోవాలన్న నిబంధన పెట్టాలి. తద్వారా ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ నినాదం ఆచరణలోకి వస్తుంది. పెట్టుబడులు ఊపందుకుని ఆర్థిక వ్యవస్థ ఒడ్డున పడేందుకు ఇదొక అత్యుత్తమ మార్గం.

-వ్యాసకర్త విధాన నిర్ణయాల విశ్లేషకుడు, రచయిత
mohanguru@gmail.com
-మోహన్‌గురుస్వామి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement