
‘ఇండియన్ ఎకానమీ... డెడ్ ఎకానమీ’ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించడం, వెనువెంటనే రాహుల్ గాంధీ ఆ వ్యాఖ్యలను సమర్థించడం; శశిథరూర్, రాజీవ్ శుక్లా లాంటి కాంగ్రెస్ నేతలే రాహుల్ వ్యాఖ్యల్ని తప్పు పట్టడం... తాజా పరిణామాలు.
నిజానికి ఏ ప్రభుత్వం పనితీరును అయినా అంచనా వేయడా నికి కీలక అంశం ద్రవ్యోల్బణం. అది ముఖ్యంగా... పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలను ప్రభావితం చేస్తుంది. యూపీఏ రెండో హయాంలో ప్రజల్లో ఏర్పడిన ఆగ్రహానికి ఒక కారణం... దేశంలోని ద్రవ్యోల్బణం. ఇది అప్పట్లో గరిష్ఠంగా 12 శాతానికి చేరుకుంది. ఆ తరువాత ప్రతిపక్ష నేతలు... ఆర్థిక మాంద్యాన్ని, ద్రవ్యోల్బణాన్ని ఆయుధంగా మలచుకుని మోదీ ప్రభుత్వాన్ని బద్నాం చెయ్యాలని పదేపదే ప్రయత్నించారు.
కానీ... వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్పటికీ, ద్రవ్యోల్బణం అనేది 2019 ఎన్నికల్లో గానీ, 2024 ఎన్నికల్లో గానీ ప్రముఖ ఎన్నికల నినాదంగా మారలేదు. ద్రవ్యోల్బణాన్ని నిర్ధారించటానికి మన దేశంలో... 2012 వరకు హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ)ని అనుసరించారు. ఆ తర్వాత నుంచి కంజ్యూ మర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ)ని అనుసరిస్తున్నారు.
ఎన్డీయే హయాంలో సగటు సీపీఐ ద్రవ్యోల్బణం 5.03 శాతంగా ఉంది. ఇది ఆర్‌బీఐ ద్రవ్యోల్బణం లక్ష్యం 4 శాతం నుండి 6 శాతానికి మధ్యలో ఉంది. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం రేటు ఇంకా తక్కువగా... 3.1 శాతమే ఉంది. కాబట్టి ఇది ఆల్ టైవ్‌ు రికార్డ్ అన్నమాట! మోదీకి ముందు ప్రధానిగా పని చేసిన మన్మోహన్ సింగ్ పాలనా కాలంతో పోల్చినా కూడా ఇది ఎంతో మెరుగైన స్థితి.
తక్కువ సమయంలో ద్రవ్యోల్బణం అంతగా నియంత్రణ అయిందంటే, దాని పైన ప్రభుత్వ ప్రభావం ఉందనే కదా! దీర్ఘకాలిక ద్రవ్యోల్బణ సమస్యను అధిగమించడంలో మోదీ ప్రభుత్వం తెచ్చిన అనేక సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థకు సహాయపడ్డాయి.
అంతకుముందు, భారతదేశంలో ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వస్తువుల రవాణాలో... పర్మిట్లు, పన్నుల పరంగా ఆలస్యం చోటు చేసుకునేది. జీఎస్టీ రావడంతో పరిస్థితి మారిపోయింది. దీనివల్ల రవాణా వేగంగా జరిగి ఇంధన ఆదా పెరిగింది.
క్రూడాయిల్ ధరలలో తగ్గుదల, డిజిటల్ సంస్కరణలు, పాల నలో అవినీతి తగ్గడం... ముఖ్యంగా ప్రజలకు సంక్షేమ ఫలాలు నేరుగా అందేలా చెయ్యడం కూడా ద్రవ్యోల్బణ నియంత్రణకు తోడ్ప డ్డాయి. ప్రజలకి డబ్బులివ్వడం కంటే... వాళ్లకి పనికొచ్చే నాణ్యమైన ఇళ్ళను ‘పీఎమ్ ఆవాస్ యోజన’ ద్వారా ప్రభుత్వమే కట్టించి ఇవ్వడం, టాయిలెట్‌లు కట్టించి ఇవ్వడం లాంటి ప్రత్యక్ష ప్రయోజన కార్యక్రమాలు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయ పడ్డాయి.
కార్పొరేట్ పన్ను తగ్గింపులు, పీఎల్‌ఐలతో సహా అనేక పథకాలతో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడంలో కేంద్రం సఫలమైంది. ఇవన్నీ పటిష్ఠమైన ఆర్థిక క్రమశిక్షణతో వచ్చాయి. వాటి కారణంగానే ప్రపంచంలోని బలమైన ఆర్థిక వ్యవస్థలలో 4వ స్థానానికి మనం ఎగబాకాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రస్తుత పరిస్థితులపై ఎవరైనా ఒక అంచనాకు రావాలి.
– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి ‘ సామాజిక విశ్లేషకుడు