
విశ్లేషణ
హిరోషిమా పేరు తలచుకోగానే, ఒక కళాత్మక సినిమాలోని ఒక చిన్న దృశ్యం నా మదిలో మెదులుతూ ఉంటుంది. అది రుయుసుకె హమగుచి తీసిన ‘డ్రైవ్ మై కార్’ సినిమా. దానికి 2021లో ఆస్కార్ అవార్డు లభించింది. అది వియోగం, కళాత్మక స్ఫూర్తి గురించిన కళాఖండం. ఆ సినిమాలో ఒక సన్నివేశం. శరదృతువు. ఆరుబయలులో హాయిగొలిపే గాలిలో రిహార్సల్ చేసేందుకు థియేటర్ నుంచి కొందరు నటులు బయటకు వస్తారు.
చెఖోవ్ రాసిన ‘అంకుల్ వన్యా’ రష్యన్ నాటకంలో ఒక ఘట్టం రిహార్సల్ కోసం ఇద్దరు నటీమణులు నడుస్తూంటే వారి పాదాల కింద నలుగుతున్న ఎండు టాకుల చప్పుడు వినిపిస్తుంది. వారు అప్పటి వరకు విచారం, స్తబ్ధత గురించి చెఖోవ్ రాసిన వాక్యాలను వల్లె వేయడంలో సతమత మవుతూంటారు. బతకలేని జీవితాలు, చిదిమేసిన కలలు, కలలు కల్లలేనా? అనుకుంటూ మథనపడుతుంటారు. కానీ, ఆ పార్క్‌లో వారికి ఏదో తట్టింది. వారు బతికి తీరాలనుకున్నారు. జీవితాన్ని కొనసాగించాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చారు. ఆ నటులకు ఈ పార్క్ విచారం, సహనశక్తికి సంబంధించి మొత్తం విశ్వాన్ని ఎలా చూపినట్లు?
బతకడానికి స్ఫూర్తి
ఎందుకంటే, అది ‘హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్’. గొప్ప ఆధునిక ఆర్కిటెక్ట్ కెన్ జో టాంగే 1954లో దాన్ని డిజైన్ చేశారు. అక్కడ 80 ఏళ్ళ క్రితం సుమారు 1,900 అడుగుల ఎత్తున, ఇంచుమించుగా చడీచప్పుడు లేకుండా ఒక కొత్త రకం బాంబు పేలింది. అక్కడ 1945లో నుంచున్నవారందరూ వెంటనే విగత జీవులయ్యారు. తర్వాత మంటలు. మిగిలిన పర్యవసానాలు!
ఆగస్టు 6 తర్వాత, అక్కడ కొద్ది రోజులపాటు వర్షం పడింది.నల్లని జిగట చుక్కలు. మసి, శిథిలాల అణువులతో బరువైనవి. హిరోషిమా శిథిలాల మధ్యన కొనప్రాణాలతో ఉన్నవారు ఆర్తిగా ఆ నీటినే తాగారు. కానీ, అవి అణు ధార్మికతతో నిండిన వర్షపు చినుకులు.
‘‘అణువు మరింత విభజనకు గురైంది. ఈ అణు విచ్ఛిత్తితో, మొత్తం ప్రపంచం కుప్పకూలినట్లు నా అంతరాత్మకు అనిపించింది’’ అని పెయింటర్ వాసిలి కాండినిస్కీ 1913లో రాశారు. గడచిన శతా బ్దపు ఆరంభంలో ఎర్నెస్ట్ రూథర్ ఫర్డ్, పియరీ, మేరీ క్యూరీ, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వంటివారు అణు భౌతిక శాస్త్ర రహస్యాలను విప్పడం ప్రారంభించినపుడు, తదనంతర కాలంలో, నిర్ణీత కాల వ్యవధుల్లో వచ్చిన ఆర్టిస్టులు, రచయితలు, తత్త్వవేత్తలు ఈ కొత్త సైన్స్ సాంస్కృతిక పర్యవసానాలపై ఒకే రకమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ వచ్చారు. ‘‘ప్రతీదీ అస్థిరమైనదిగా, ప్రమాదకరమైనదిగా, నిస్సారమైనదిగా పరిణమించింది’’ అని కాండినిస్కీ వ్యాఖ్యానించారు.
ఆ వాదన ఎక్కడికి దారితీసిందో చూసేందుకు, అనుభూతి చెందేందుకు ప్రయత్నించడానికి నేను హిరోషిమా వచ్చాను. పీస్ మెమోరియల్ మ్యూజియం జనంతో నిండినా, మౌనం రాజ్య మేలుతూ, అణు శక్తి పార్శా్వన్ని చూపింది. కాలిపోయిన విద్యార్థుల యూనిఫారాలు. పిల్లల దుస్తులు. హిరోషిమాలోని కుటుంబం ఒకటి ఈ మధ్యనే ఆరు ముడతల తెరను మ్యూజియానికి ఇచ్చింది. దాని బంగారపు అంచులపై నల్లని వాన చారికలు. ఇంత భయం గొలిపే నైరూప్య చిత్రాన్ని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు.
హిరోషిమాలో హైపోసెంటర్‌కి సుమారు 850 అడుగుల దూరంలో ఓ బ్యాంక్ బిల్డింగ్ ఉంది. సుమారు 3,871 డిగ్రీల సెల్సి యస్ లేదా అంతకుమించిన ఉష్ణోగ్రతలో అక్కడ చనిపోయిన ఒక వ్యక్తి శాశ్వత నీడతో బ్యాంకు మెట్లు నల్లని రూపు సంతరించు కున్నాయి. వాటిని చూడడంతోనే ఆధునిక కళారీతి ‘ఆటమిక్ ఆప్టిమిజం’ దెబ్బకు అదృశ్యమైపోయిందని చెప్పాలి. ఒక డాక్యుమెంటరీలో ఆ మెట్లను చూసిన పెయింటర్ ఈవ్ క్లేన్ కొన్ని భయంకర మానవాకారాలను సృష్టించారు. నీలి రంగు ‘ట్రేడ్ మార్క్’గా గుర్తింపు పొందిన ఆయన చిత్రాలు కొన్ని ఆ తర్వాత బూడిద తెలుపునకు మారాయి.
ఏదీ రాజకీయ వివేకం?
హిరోషిమాపై మొదటి బాంబును ప్రయోగించిన మూడు రోజులకే నాగసాకిపై రెండవ బాంబు వదిలారు. 1945 ఆగస్టు 6 తదనంతర దశాబ్దాలలో చిత్రకళ, సినిమా, సాహిత్య రంగాలు పరస్పర విధ్వంసం వల్ల ఉత్పన్నమయ్యే వినాశకర పరిస్థితులను రూపుకట్టించేందుకు నడుం బిగించాయి. ‘ఆన్ ద బీచ్’ (1959) సినిమాలో, మూడవ ప్రపంచ యుద్ధం నుంచి బతికి బట్టకట్టిన వారు, అణు ధార్మికత ఆస్ట్రేలియాను తాకనుందని బితుకు బితుకు మంటూ ఉంటారు.
జార్జ్ ఆర్వెల్, ఫిలిప్ కె. డిక్, కిమ్ స్టాన్లీ రాబిన్‌సన్ వంటివారు అణు ఉత్పాతం తర్వాత జీవితం ఎలా ఉండ గలదో లేదా ఏం మిగిలి ఉంటుందో ఊహించారు. వారంతా అణు భవిష్య ప్రవక్తలు. మన సంస్థలు, మన నాయకులు ప్లుటోనియం మాదిరిగానే అస్థిరమైనవారని వారు కనుగొన్నారు.
హిరోషిమాపై దాడి జరిగిన 80 ఏళ్ళ తర్వాత, మనం మన నడవడికను సరిదిద్దుకోకపోగా అణు వినాశనపు నూతన శకంలోకి అడుగులు వేసే పెద్ద పొరపాట్లు చేస్తున్నాం. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ తర్వాత, క్యూబా క్షిపణుల సంక్షోభం తర్వాత తిరిగి, ఈ భూగోళం అణు యుద్ధపు అత్యంత ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ అన్నారు.
‘‘మును పెన్నటికన్నా కూడా అణ్వస్త్రాలతో నిర్మూలనం కాగల ప్రమాదం అంచున’’ మనం ఉన్నట్లు అధ్యక్షుడు ట్రంప్ పాలనా యంత్రాంగంలో జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ ఈ ఏడాది మొదట్లో హెచ్చరించారు. ఇరాన్‌లోని అణుశక్తి అభివృద్ధి ప్రదే శాలపై అమెరికా, ఇజ్రాయెల్ జూన్‌లో బాంబులు కురిపించాయి. అణు సామర్థ్య శక్తులను ఆధునికీకరించే పనులను ఉత్తర కొరియా కొనసాగిస్తోంది.
అణ్వస్త్ర అగ్ర రాజ్యాలు రెండు కాదు మూడు అని తెలుసుకుని తీరాలన్నట్లుగా చైనా అణ్వాయుధాలను విస్తరిస్తోంది. అమెరికా–రష్యాల మధ్య కుదిరిన కడపటి ఆయుధ నియంత్రణ ఒడంబడికకు ఇంకో ఆరు నెలల్లో కాలం చెల్లనుంది. ఆయుధాల నియంత్రణ అనే సూత్రానికే దాంతో కాలం చెల్లుతుందని అను కోవచ్చు.
ఇంత జరుగుతున్నా ప్రజల నుంచి ఆగ్రహావేశాలు ఏమంత లేవు. అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎక్కడా గతంలోలా శాంతి కాముక అడ్వర్టయిజ్‌మెంట్లు లేవు. పైగా, గ్రహాంతరవాసులు, ఏ దిశగా దూసుకెళతాయో చెప్పలేని గ్రహ శకలాలు, అత్యంత తాజాగా అయితే కిల్లర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వాటివల్ల ఈ భూగోళానికి ప్రమాదం పొంచి ఉన్నట్లుగా పుస్తకాలు, సినిమాలు వస్తున్నాయి.
ప్రస్తుతం వివిధ దేశాల వద్ద 12,000 అణ్వాయుధాలు ఉన్నట్లు ‘ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్’ అంచనా. అయినా, అవేవో రెండవ ప్రపంచ యద్ధం నాటివనే భ్రమల్లోనే మనం ఇప్పటికీ ఉన్నాం. హిరోషిమా దాడిపై ఆగ్రహావేశాలు వ్యక్తం కావడానికి బదులు అణుబాంబు అంత విధ్వంసాన్ని సృష్టించిందా అనే ఆశ్చ ర్యమే అమెరికన్లలో ఎక్కువ వ్యక్తమైంది.
బతికి ఉండగలమా?
‘ద న్యూయార్కర్’ పత్రిక 1946లో తెచ్చిన ప్రత్యేక సంచికలో హిరోషిమాపై జాన్ హెర్షే రాసిన వార్తా కథనాన్ని మినహాయిస్తే, అణు విధ్వంసాన్ని మొదట్లో విహంగ వీక్షణంగానే చూశారు. అమెరికా ఆక్రమిత దళాలు 1945 నుంచి 1952 వరకు ఆ రెండు విధ్వంస నగరాలలోని దృశ్యాలను నిష్ఠగా సెన్సార్ చేస్తూ వచ్చాయి. హిరోషిమాలో అమెరికా సైన్యం తీసిన ఫోటోలలో జనం అరకొర గానే కనిపిస్తారు. అవి చికిత్స పొందుతున్నవారిని చూపుతాయి. ప్రజలు ఎంత బాధకు ఓర్చు కున్నదీ తెలియదు.
నాగసాకిలో ఎట్సూయూకీ మాట్సీ అనే హైస్కూలు టీచరు ఉన్నారు. తీరిక వేళల్లో ఆయన హైకూలు రాస్తూంటారు. ఆయన 1945 ఆగస్టు 9న ఒక ఆహార పంపిణీ కేంద్రం వద్ద పనిచేస్తున్నారు. అర్ధరాత్రి మంటలను దాటుకుంటూ ఎలాగో ఇంటికి పరుగెత్తారు. ఆయన పిల్లల్లో ఇద్దరు అప్పటికే చనిపోయారు. ఇంకో పిల్లాడు ఆ మర్నాడు కన్నుమూశాడు. భార్య వారం లోపలే గతించింది.
అణు విస్ఫోటం గురించి 1946లో నాగసాకిలోని ఒక జర్నల్‌లో ఆయన కవితలను ప్రచురించాలని కోరుకున్నప్పుడు దాని ఎడిటర్లు అందుకు నిరాకరించారు. దానికి విరుద్ధంగా 1960లు, 1970లలో అమెరికాలో చాలామంది ఆర్టిస్టులకు ఈ బాంబులు కథా వస్తువుగా మారాయి.
అణుబాంబు దాడి వంటి అత్యంత వినాశకర ఘట్టాన్ని నిజంగా పూర్తిగా అర్థం చేసుకోవడం సాధ్యం కాని పని. టోక్యో నుంచి హిరోషిమాకు బులెట్ రైలులో వెళుతూ నేను గుంథర్ యాండర్స్ రాసిన పుస్తకాన్ని చదవడం ప్రారంభించా. ఆయన 1945 ఆగస్టు 6న న్యూయార్క్‌లో ఉన్నారు. ఆ రోజు రేడియోలో వార్తలు విన్నప్పుడు ఆయన మెదడు మొద్దుబారిపోయింది.
తర్వాత కొన్నేళ్ళపాటు ఆయన కాగితంపై కలం పెట్టలేక పోయారు. సవ్యంగా లేదా సత్ప్రవర్తనతో జీవించడం గురించిన పరిశీలనే 2,500 ఏళ్ళుగా తత్త్వశాస్త్రానికి మూల బిందువుగా ఉంటూ వస్తోంది. అది కాస్తా, ఒక్క రోజులో, ఒక్క చర్యతో, తుడిచి పెట్టుకుపోయింది. హిరోషిమా తర్వాత, ‘‘గత యుగాల మౌలిక నైతిక ప్రశ్నను విప్లవాత్మకంగా పునర్ నిర్వచించుకోవాల్సిన అవసరం ఉంది’’ అని యాండర్స్ వాదించవచ్చు. ‘‘మనం ఎలా జీవించాలి? అని ప్రశ్నించుకోవడానికి బదులుగా, అసలు మనం జీవించి ఉంటామా?’’ అని ప్రశ్నించుకుని తీరాలి. మన ముఖ్య నైతిక వైఫల్యం అందులోనే ఉంది.
జేసన్ ఫారగో
వ్యాసకర్త కళా విమర్శకుడు (‘న్యూయార్క్ టైమ్స్ సౌజన్యంతో)