
అభిప్రాయం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గందరగోళం సృష్టించాయి. ట్రంప్ రోజుకో మాదిరిగా మార్చివేస్తున్న ఈ సుంకాలు ఎంతోకాలం మనలేవు. అయితే, వీటిని భౌగోళిక రాజకీయ ఆయు ధాలుగా ప్రయోగిస్తున్న తీరు మాత్రం రానున్న సంవత్సరాల్లో అంతర్జాతీయ వాణిజ్య రూపురేఖలను మార్చేస్తుంది.
ఇతర దేశాలు తమ వస్తువుల మీద అధిక సుంకాలు విధిస్తు న్నాయని అదేపనిగా చెబుతూ అమెరికా ప్రపంచ ప్రజల దృష్టి మళ్లిస్తోంది. నిజానికి సుంకాల ముసుగులో అగ్రరాజ్యం అల్పా దాయ దేశాల అభివృద్ధిని బలిచేస్తూ, తమ కంపెనీలకు ప్రపంచ మార్కెట్లలో పెద్ద పీట వేయించడమే ఎజెండాగా పెట్టుకుంది.
టెక్నాలజీ వంటి కీలక రంగాల్లో అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టకుండా చైనాను నిలువరించాలన్న వ్యూహాత్మక లక్ష్యాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. పేటెంట్లు, కాపీరైట్లు, పారిశ్రామిక డిజైన్లతో కూడిన మే«ధాసంపత్తి వర్ధమాన దేశాలకు అందకుండా నిరోధించడం అమెరికా ధ్యేయం. ఇండోనేషియాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఇందుకు ఒక ఉదాహరణ.
ఇండోనేషియాకు జరిగినట్టే...
అమెరికా పారిశ్రామిక, ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై ఇండో నేషియా 99 శాతం సుంకాలను ఎత్తివేసింది. ఇక ఆ దేశ ఎగు మతులపై అమెరికా 19 శాతం సుంకం విధిస్తుంది. ఈ ఒప్పంద ఫలితంగా ఇండోనేషియా రైతులు ప్రభుత్వ భారీ సబ్సిడీల ఫలితంగా చౌకగా లభించే అమెరికా వ్యవసాయోత్పత్తులతో పోటీ పడాల్సి ఉంటుంది. అమెరికా సంస్థలు అత్యధిక ప్రయోజనాలు పొందుతాయి.
యూఎస్ తయారీ వస్తువులపై పరిమాణపరంగా ఎలాంటి నిబంధనలూ ఉండవు. అమెరికా వెహికల్ సేఫ్టీ నిబంధ నలను, ఉద్గార ప్రమాణాలను ఇండోనేషియా యథాతథంగా ఆమో దించింది. వైద్య పరికరాలు, ఔషధాల విషయంలోనూ అమెరికా ఎఫ్డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) అనుమతులను అంగీకరిస్తుంది. యూఎస్ ఆహార, వ్యవసాయ ఉత్పత్తులకు స్థానిక లైసెన్సింగ్ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది.
మరింత సమస్యాత్మకంగా మేధాసంపత్తి నిబంధనలు ఉన్నాయి. సాంప్రదాయిక విజ్ఞానం, జన్యు వనరులు, నిర్బంధ లైసెన్సులు వంటి అంశాల్లో ఇప్పటికే ఉన్న అన్ని వివాదాలనూ పరిష్కరించుకోవాలని ఈ ఒప్పందం ఒత్తిడి చేస్తోంది. దీంతో, అమెరికా కంపెనీలు ఎలాంటి సమ్మతి పొందాల్సిన, పరిహారం చెల్లించాల్సిన అవసరం లేకుండానే అక్కడి సాంప్రదాయిక విజ్ఞా నాన్ని కొల్లగొడతాయి.
ఇండియాకు ఏం లాభం?
ఇలాంటి ఎజెండాతో ముందుకు పోతున్న దేశం అమెరికా ఒక్కటే కాదు. యూకేతో ఇటీవలే ఇండియా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఇండోనేషియా ఒప్పందం కంటే ఎక్కువగా ప్రశ్నలు రేకెత్తిస్తోంది. చెప్పాలంటే ఈ ఒప్పందానికి వాణిజ్యపరంగా ఎలాంటి ప్రాధాన్యతా లేదు. కారణం, ఈ రెండు దేశాలు ప్రపంచ వ్యాప్తంగా చేసే ఎగుమతుల విలువలో వీటి ద్వైపాక్షిక వాణిజ్యం 2.5 శాతం కంటే కూడా తక్కువే.
యూకే–ఇండియా తాజా ఒప్పందం పర్యవసానంగా, 92 శాతం యూకే ఎగుమతులకు ఇండియా పూర్తిగానో పాక్షికంగానో సుంకాల మినహాయింపు ఇచ్చింది. అలాగే యూకేకు ఇండియా చేసే 99 శాతం ఎగుమతులు ‘ట్యాక్స్ ఫ్రీ’గా ఉంటాయి. వాటిపై ఆ దేశం ఎలాంటి సుంకాలూ విధించదు.
అయితే, యూఎస్–ఇండోనేషియా ఒప్పందంలో వలే ఈ ఒప్పందంలోనూ మేధాసంపత్తి నిబంధనలు కీలకమైనవి. ఇవి పశ్చిమ దేశాల పేటెంట్ దారులకు అనుకూల రీతిలో ఉన్నాయి. ఔషధాల విషయంలో భారత పౌరులు, దేశీయ ఉత్పత్తి సంస్థల కంటే యూకే ‘బిగ్ ఫార్మా’ ప్రయోజనాలకే ప్రాధాన్యం లభించింది.
ఉదాహరణకు, నిర్బంధ లైసెన్సులకు బదులు ‘స్వచ్ఛంద లైసెన్సు’లను ఈ ఒప్పందం ప్రోత్సహిస్తోంది. భవిష్యత్తులో ధరల తగ్గింపు అవకాశాలను ఈ నిబంధన నీరుగార్చుతుంది. పేటెంటు ప్రమాణాల సమన్వయీకరణ క్లాజుకూ ఇండియా అంగీకారం తెలిపింది. దీంతో ప్రస్తుత ఔషధాలకు చిన్నా చితకా మార్పులు చేసి వాటి పేటెంట్ హక్కులు పొడిగించుకునే దొడ్డిదారికి ద్వారాలు పూర్తిగా తెరచినట్లయింది.
ఇండియాలో పేటెంటెడ్ డ్రగ్ వాడకం వివరాలు వెల్లడించాల్సిన గడువును ఏడాది నుంచి మూడేళ్లకు పొడిగించే నిబంధన వినాశ కరమైంది. గిరాకీకి తగినంత సరఫరా లేదని (అన్ మెట్ డిమాండ్) నిరూపించడం ఆ ఔషధం ఉత్పత్తి చేయదలచిన కొత్త దరఖాస్తు దారుకు కష్టతరంగా మారుతుంది. ఇవి ఫార్మా పరిశ్రమ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తాయి. అంతే కాకుండా, అందుబాటు ధర లకు మందులు లభ్యం కాని పరిస్థితి ఉత్పన్నమవుతుంది.
బలహీన పడిన ఒక మాజీ వలసవాద దేశానికి, అదీ ప్రధాన వాణిజ్య భాగస్వామి కూడా కానటువంటి దేశానికి ఇండియా ఇలా రాయితీలు ఇవ్వడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. యూరోపియన్ యూనియన్ (ఈయూ), యూఎస్‌లతో జరుపుతున్న వాణిజ్య చర్చల మీదా ఈ ఒప్పందం వల్ల మరింత ఆందోళనకరమైన ప్రభావం పడుతుంది.
ప్రొ‘‘ జయతీ ఘోష్
వ్యాసకర్త యూనివర్సిటీ ఆఫ్ మసాచూసెట్స్‌లో ఎకనామిక్స్ ప్రొఫెసర్