
సందర్భం
టి.వి. నారాయణ (తక్కెళ్ల వెంకట నారాయణ) గారు 1925 జూలై 26న సికింద్రాబాదులోని బొల్లారంలో వెంకయ్య, నర్సమ్మ దంపతులకు జన్మించారు. ఆ రోజుల్లో సామాజిక అసమానతలకు, అంటరానితనానికి గురైనా, విద్యకు నోచుకోని దళిత సమాజంలో ఒక సామాన్య పేద కుటుంబంలో జన్మించినా వాటినన్నింటిని తట్టుకొని ప్రాథ మిక విద్యను బొల్లారంలో, కళాశాల విద్యను నిజాం కాలేజీలో అభ్యసించారు. అంతటితో ఆగకుండా బెనారస్‌లోని హిందూ విశ్వ విద్యాలయంలో ఆంగ్లంలో పీజీ విద్యను, కర్ణాటకలో పీహెచ్‌డీని పూర్తి చేసుకున్నారు.
నారాయణ నిత్య విద్యార్థి. అన్ని విషయాల్లో నిష్ణాతుడు. అకుంఠిత దీక్షతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుడు. వీరి సతీమణి టి.ఎన్. సదాలక్ష్మి మాజీ మంత్రివర్యులు, తెలంగాణ ఉద్యమకారిణి, మంచి సాహసి. నాకు 1980లో తొలినాళ్లలో రాజకీయాల్లో ఎలా పనిచేయాలో తెలియజేశారు.
నారాయణ తెలంగాణ విమోచన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. నిరంకుశ నిజాం పాలన నుండి విముక్తి కోసం రజాకార్ల మీద పోరాటంలో భాగంగా స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో పనిచేసి జైలుకు సైతం వెళ్లి వచ్చారు. రజాకార్ల నుండి తప్పించు కోవడానికి అండర్ గ్రౌండ్‌కు కూడా వెళ్ళారు.
నారాయణ గారు మొదట్లో పాఠశాల ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి, స్కూల్స్ ఇన్‌స్పెక్టర్‌గా, సిటీ కాలేజ్ ప్రిన్సి పాల్‌గా, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరీగా పనిచేసి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ చేశారు. తదనంతరం 1978–80 కాలంలో ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ గానూ సేవలు అందించారు.
ఆయన ఆర్య ప్రతినిధి సభ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పని చేశారు. సామాజిక సేవలో భాగంగా వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ‘బంధు సేవ మండలి’ని స్థాపించారు. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో వారిలో పూర్తి స్వదేశీ భావన ఉండేది. ఎల్లప్పుడూ ఖాదీ వస్త్రాలను ధరించి వాటి వాడకాన్ని విరివిగా ప్రోత్సహించారు. వారి మాటల్లో, వేషంలో, ఆచరణలో అది స్పష్టంగా కనిపించేది.
ఆయన మంచి రచయిత. నిర్మాణాత్మకమైన సూచనలతో, జీవిత విలువల గురించి భారతీయ ఉపనిషత్, వేదాలలో ఉన్న అనేక అంశాలను వివరిస్తూ పుస్తకాలు రచించారు. వారి సేవలను గుర్తించిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2016లో వారిని ‘పద్మశ్రీ’తో గౌరవించింది. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ‘దళిత రత్న’ పురస్కారం అందుకున్నారు.
నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)లో ఉమ్మడి రాష్ట్ర సేవ ప్రముఖ్‌గా నియమితులైన తరువాత, హైదరాబాద్‌లోని దళిత బస్తీల్లో సేవా కార్యక్రమాలు చేపట్టాం. దోమలగూడలోని ఫూల్ బాగ్ బస్తీలో దళిత పిల్లలను చేరదీసి వారు ప్రాథమికంగా శారీరక శుభ్రత పాటించేలా చర్యలు తీసుకునేవాళ్ళం. ఈ కార్యక్రమం గురించి తెలుసుకున్న నారాయణ ‘ఇది చాలా మంచి కార్యక్రమం’ అని ఎంతగానో ప్రోత్సహించారు. తాను కూడా ఇందులో భాగం అవుతానని అన్నారు. ఈ సేవా కార్యక్రమాలకు ఏ పేరు పెడదామని ఆలోచిస్తుండగా, ఆయనే స్వయంగా ‘సేవా భారతి’ అని నామ కరణం చేశారు. ఇందులో చేపట్టే సంస్కార కేంద్రాల సిలబస్‌ను సైతం తయారు చేశారు. వేదాల సారాంశం, సుమతీ శతకాలు, రామాయణ శ్లోకాలు సేకరించి వాటిని పిల్లలకు బోధించే ఏర్పాటు చేశారు. ఆయా సంస్కార కార్యక్రమాలు పేద, దళిత విద్యార్థుల్లోకి అత్యధికంగా తీసుకెళ్లాలని సూచించారు. తదనుగుణంగానే హైదరాబాద్‌లో వీటిని విస్తృతంగా నిర్వహించాం.
చదవండి: ఉన్నత విద్యకు డిజిటల్ వేగం
నేను రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత కూడా ఆయన నన్ను ఎంతో ఆత్మీయతతో ప్రోత్సహించారు. నేను కేంద్ర మంత్రి అయ్యాక వారి ఇంటికి వెళ్తే నన్ను ప్రేమగా ఆశీర్వదించి, సన్మానించి సంతోషించారు. నారాయణ గారి శతజయంతి సందర్భంగా మనం అందరం కూడా విద్య పట్ల వారికున్న శ్రద్ధను; పేదలు, దళితుల పట్ల వారి అనురాగాన్ని; దేశం, ధర్మం మీద వారి చింతనను ఆదర్శంగా తీసుకోవడమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి.
- బండారు దత్తాత్రేయ
మాజీ గవర్నర్
జూలై 26న, ‘పద్మశ్రీ’డాక్టర్ టి.వి. నారాయణ శత జయంతి