
అభిప్రాయం
ప్రపంచీకరణ ప్రభావాన్ని సకాలంలో అంచనావేసి, ఆసియాలో ముందుగా దాన్ని అందిపుచ్చుకున్న చైనా... తన తదుపరి ఆర్థిక విస్తరణకు ‘వన్ బెల్ట్ – వన్ రోడ్’ (‘ఓబిఓఆర్’) విధానాన్ని చేపట్టింది. 2017 మేలో జరిగిన ఆ అధికారిక ప్రకటనకు 28 దేశాల అధిపతులు, వంద దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఆ రోజు 50కి పైగా వాణిజ్య ఒప్పందాలు అక్కడ జరి గాయి. అయితే భారత్ దీనికి హాజరు కాలేదు. మధ్య ఆసియా, యూరప్, ఇండో–పసిఫిక్ దేశాలతో–‘బెల్ట్’ ద్వారా, అలాగే ‘రోడ్’– ద్వారా ఆగ్నేయ ఆసియా దేశాల్లోకి సముద్ర జలాల ద్వారా, రైలు మార్గాల ద్వారా చైనా ప్రవేశించింది. అయితే ‘ఈ గైర్హాజరీ వల్ల మనం ఒంటరి కావడం అనే రిస్క్ (ఇదే పదం వాడారు)ను కూడా కాదనలేము’ అని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారి ఒకరు అన్నట్టు ‘ది హిందూ’ అప్పట్లో రాసింది. ఇంతకూ దీనిపై మోదీ ప్రభుత్వం అభ్యంతరం ఏమిటి?
‘బెల్ట్’లో భాగంగా పాకిస్తాన్ పశ్చిమ తీరాన అరేబియా సముద్రంలో ఉన్న గ్వాదర్ పోర్టుకు ‘చైనా–పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్’ పేరుతో చైనా తన నిధులతో ఒక ప్రత్యేక రోడ్డును 3,217 కి.మీ. మేర నిర్మించింది. అది పాకిస్తాన్ భూభాగాన్ని తూర్పు నుంచి పడ మరకు ఆసాంతం దాటి గ్వాదర్ పోర్ట్ చేరుతుంది. పాక్ దాన్ని అనుమతించింది. కానీ దానిలో పాక్ ఆక్రమిత కశ్మీర్ ఉండడం మోదీ ప్రభుత్వం అభ్యంతరంగా భావించింది. నిజానికి అప్పుడే ఇండియా దాన్ని అవకాశంగా తీసుకుని ‘రికార్డు’లో అది ‘పాక్ ఆక్రమిత కశ్మీర్’ అనే ‘క్లాజ్’తో చైనా ప్రతిపాదనను అంగీకరించి ఉంటే ఎలా ఉండేదో! కానీ అది జరగలేదు. మన అభ్యంతరం గురించి అప్పట్లోనే – ‘విస్తరిస్తున్న ఆసియా మార్కెట్‌తో కలిసి, దాని సప్లై, తయారీ, మార్కెట్ అవసరాలతో అనుసంధానం అయితేనే 2032 నాటికి ఇండియా 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యానికి చేరగలదు’ అని యూఎన్‌ఓ మాజీ డైరెక్టర్ ముకుల్ సన్వల్ అన్నారు.
మరిప్పుడు ‘గ్లోబల్ సౌత్’ భావన ముందుకొచ్చి ఈ దేశాలు తమ మధ్య ఉండాల్సింది ‘సౌత్–సౌత్ కో–ఆపరేషన్’ అంటుంటే, మన పొరుగున ఉన్న చైనా, పాక్‌లతో ఇన్నాళ్లుగా ‘ఎన్డీఏ’ ప్రభుత్వం అనుసరించిన దౌత్య విధానం మాటేమిటి? ప్రస్తుతం జీ–7 దేశాల మధ్య కంటే ‘బ్రిక్స్’ దేశాల మధ్య వాణిజ్యం శరవేగంగా సాగుతోంది. గత 20 ఏళ్లలో బ్రెజిల్–చైనా మధ్య అది యాభై రెట్లు పెరిగితే, చైనా–ఇండియాల మధ్య కేవలం 28 రెట్లు మాత్రమే పెరిగింది. అంతే కాదు ఇండో– పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని నిలువరించడం లక్ష్యంగా 2007లో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా ‘క్వాడ్’ కూటమిగా ఏర్పడితే... అందులో ఇండియా కలిసింది.
చదవండి: ఇండియాలోనూ పదహారేళ్లకు తగ్గించాలా?
కానీ ‘ఎన్డీఏ’ పాలనలో మన వేగం పెరిగి అదిప్పుడు ‘మలబార్’ పేరుతో విశాఖపట్టణం కేంద్రంగా మన సముద్ర జలాల్లో ఏటా అక్టోబర్‌లో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ల నౌకాదళాలతో కలిసి విన్యాసాలు చేసే స్థాయికి చేరింది. కాకినాడ పోర్టు వద్ద ఈ ఏప్రిల్‌లో అమెరికా నౌకా దళాలు మన త్రివిధ దళాలతో కలిసి విపత్తు నివారణ చర్యల రిహార్సల్ చేశాయి. ఇవికాక ఈశాన్య రాష్ట్రాలలోని మణిపూర్ జాతుల సమస్య, వెస్ట్ బెంగాల్లోకి వలస వస్తున్న బంగ్లాదేశ్ పౌరుల ఓటర్ల సమస్య వంటివాటికి వ్యూహాత్మకంగా జాతీయ వార్తల స్థాయిలో ఏళ్ల తరబడి ఇస్తున్న ప్రచారాన్ని బట్టి, సరిహద్దు దేశాలతో మన దౌత్య సంబంధాలు ఎలా ఉండాలి అని మనం అను కుంటున్నదీ చెప్పక చెప్పే అంశాలు.
- జాన్‌సన్ చోరగుడి
అభివృద్ధి– సామాజిక అంశాల వ్యాఖ్యాత