
అభిప్రాయం
బ్రెజిల్‌లో జూలై మొదటి వారంలో ముగిసిన ‘బ్రిక్స్’ దేశాల సదస్సులో... తదుపరి 2026 డిసెంబర్‌లో జరిగే సమావేశం ఆతిథ్య బాధ్యత ఇండియాది అయింది. దాంతో – ఆ కూటమిలో సీనియర్ సభ్యదేశంగా ఇక్కడ మూడవ ‘టర్మ్’ కూడా ప్రభుత్వంలో కొనసాగు తున్న ఎన్డీఏ విధానాలలోని ‘బ్రిక్స్’ స్ఫూర్తిని ‘గ్లోబల్’ దృష్టి నుంచి సూక్ష్మ స్థాయి సమీక్షగా చూడటం తప్పనిసరి అవుతుంది. ఎందుకంటే, 2001లో మొదలైన ‘బ్రిక్స్’ కూటమి సమీప దేశాలను కలుపు కొని విస్తృతమై 2025 నాటికి ‘గ్లోబల్ సౌత్’ భావన స్థాయికి చేరింది.
ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ఉపాంగమైన ‘యూఎన్డీపీ’ సభ్యదేశాలకు 2030 నాటికి అమలు లక్ష్యంగా ఇచ్చిన 17 ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్’ (ఎస్‌డీజీ) విష యమై ‘బ్రిక్స్’ సభ్యదేశాల ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయి అని చూసినప్పుడు... బ్రెజిల్ పర్యావరణం ప్రధానంగా తన ప్రాధా న్యతలు ఎంచుకుని, ‘ధరిత్రికి శ్వాస’గా పరిగణించే అమెజాన్ చిత్తడి అడవుల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. అందుకు భిన్నంగా ఒకప్పటి ‘హరిత విప్లవ’ దేశమైన ఇండియా ‘గ్లోబల్ ఐటీ పవర్ హౌస్’గా ఐటీ మ్యాన్‌పవర్ సర్వీసులు యూరోపి యన్ దేశాలకు అందించే వనరుగా ఉంది.
దాంతో యూఎన్డీపీ ఎస్‌డీజీ జాబితాలోని చివరి రెండు అంశాలపై మన ‘స్టాండ్’ ప్రశ్నార్థకం అయింది. అధిక జనాభాతో అసంఖ్యాకంగా ఉన్న మానవ వనరులను పర్యావరణ హితానికి ఏ మేరకు దేశం వాడుతున్నదన్నది ‘పాలసీ’ చర్చ అవుతున్నది. ఉదాహరణకు పదేళ్ళ క్రితం తెలంగాణ అనే ఒక కొత్త రాష్ట్రాన్ని కేంద్రం ఏర్పాటు చేయవలసి వస్తే, ఆ కారణంగా వట్టి చేతులతో మిగిలిన ఆంధ్రప్రదేశ్ ప్రాంతము–ప్రజలు దృష్టి నుంచి కొన్నేళ్ల పాటు అయినా అమలు చేయాల్సిన ఒక ‘పబ్లిక్ పాలసీ’ని రూపొందించే విషయమై కేంద్ర, రాష్ట్రాలు మిన్నకుండి పోయాయి.
రెండు చోట్ల ఏర్పడ్డవి కొత్త ప్రభుత్వాలు కావడంతో వాటి రాజకీయ ప్రయోజనాల ముందు రాష్ట్ర ప్రయోజనాలు చిన్నవి అయ్యాయి. అయితే, ఇవి వేటితోనూ పనిలేని ‘నీతి ఆయోగ్’ ప్రతి మూడు నెలలకు జిల్లాల వారీగా ఎస్‌డీజీ లక్ష్యాలను మదింపు చేయాలి కనుక, అది ఆ యా ప్రభుత్వాల రాజకీయాలతో పనిలేకుండా అధికారుల వెంట పడుతున్నది. దాంతో ‘నీతి ఆయోగ్’కు జవాబుదారీ కావడం అనేది వారికి తప్పనిసరి అయింది.
ఇలా ఇప్పుడు ఇవేవీ ఎవ్వరూ ‘లైట్’ తీసుకునేవి కావు. ఇందులో ‘లెజిస్లేచర్’ బాధ్యత కూడా ఉన్నప్పటికీ, ‘బ్యూరోక్రసీ’ కనుక తమ విధుల్లో వెనకబడితే అది సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉంటుంది. మరి అధికారులను ప్రభుత్వం వారి పని వారిని చేసుకోనిస్తున్నదా? వారి అనుభవానికి తగిన బాధ్యతలు అప్ప గిస్తున్నదా అంటే అది వేరే చర్చ.
రేపు ఏదైనా జిల్లాలో పెరిగిన శాంతిభద్రతల సమస్య వల్ల మేము ఎస్‌డీజీ లక్ష్యాలు సాధించ లేకపోయాం అని కలెక్టర్ అంటే, అందుకు ఆ జిల్లా పోలీస్ ఎస్పీ వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. ‘గుడ్ గవర్నెన్స్’ సాధన దిశలో అన్ని శాఖల సమష్టి కృషి ఇక్కడ అనివార్యం. అప్పట్లో అలా అప్పగించిన పనిచేసి చూపించడం వల్లనే 2024 నాటికి ‘నీతి ఆయోగ్’ ఎంపిక చేసిన ఏలూరు, పార్వతీపురం జిల్లాల కలెక్టర్లు ఢిల్లీ నుంచి అవార్డులు అందు కున్నారు.
మళ్ళీ ప్రధాన విషయానికి వస్తే, కేంద్రం–రాష్ట్రాలకు అప్ప గించిన ప్రాధాన్యతాంశాలను పక్కన పెట్టి ‘వరల్డ్ క్లాస్ కేపిటల్’, ‘క్వాంటమ్ వ్యాలీ’, ‘క్రియేటివ్ సిటీ’, ‘డ్రోన్ సిటీ’ అంటూ మన సొంత ఎజెండా ఎత్తుకుంటే, వ్యవసాయం ప్రధానం అయిన రాష్ట్రంలో ఏడాదిలోనే భూమి పుత్రుల నుంచి వెల్లువెత్తే సమస్యల తీవ్రత ఎలా ఉంటుందో ఈ ఏడాది మొదటి 6 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్ విషయంలో చూశాం.
మిర్చి, పొగాకు, మామిడి, పంటల రైతుల సమస్యలు చివరికి శాంతి భద్రతల విషయంగా మారడం అనేది పెద్ద జాబితాలోని కొన్ని అంశాలు మాత్రమే. అది అలా ఉంచి అస్సలు ఎస్‌డీజీ లక్ష్యాలు రూపొందించడంలోనే యూఎ న్డీపీ సున్నితమైన సూక్ష్మదృష్టి గమనిస్తే స్పష్టం అవుతున్నది. ఈ 17 అంశాల జాబితాలోని 12వది – ‘బాధ్యతాయుతమైన విని యోగం–ఉత్పత్తి’, పదిహేన వది ‘జీవావరణం’. ఈ రెండు కూడా ప్రాధాన్యతల విషయంలో గందరగోళంలో ఉన్న కొత్తద యిన ఏపీకి నేరుగా వర్తించే అంశాలు.
ఇక్కడే మరోసారి బ్రెజిల్–ఇండియా ప్రాధాన్యతలలోని వైరుద్ధ్యాన్ని గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇండియా ‘గ్లోబల్ ఐటీ పవర్ హౌస్’గా పరిణమించడం వరకు బాగుంది. మరి మన ఎకానమీ మాన్యుఫ్యాక్చర్ రంగం నుంచి సర్వీసుల రంగా నికి బదిలీ అయ్యాక, ఏ సర్వీసుల్లో ఏ కులాల ప్రజలు ఉన్నారు అనే వర్గీకరణ అక్కరలేదా? ఎందుకంటే, ‘కులం’ మన దేశానికి మాత్రమే ప్రత్యేకమైన అంశం.
మరి వ్యవసాయం ప్రధానం అయిన దేశంలో యాంత్రీకరణను తెచ్చి, అందరూ ‘సర్వీస్’ రంగంలోనే ఉపాధి అవకాశాలు వెతుక్కోవాలి అన్నప్పుడు, కనీస అర్హతలు లేని అసంఖ్యాక శ్రేణులు జీవిక కోసం మళ్ళీ ఎవరిపై ఆధారపడేట్టుగా మన ‘పాలసీలు’ నిర్దేశిస్తున్నాయి? ఆర్థిక సంస్కరణలతో ‘ప్రైవేట్’ రంగం ‘రాజ్యం’ కార్యక్షేత్రంలోకి చొచ్చుకురావడం తెలిసి జరిగిందే అయినప్పటికీ, ఒక దేశం ‘ఎకానమీ’ వ్యవసాయం ప్రధానం అయినప్పుడు, రాజకీయ కారణాలతో ఏర్పడ్డ ఏపీ వంటి కొత్త రాష్ట్రం విషయంలో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం అయినా, స్థూలంగా అది ఒక ‘లైన్’ తీసుకుని దాని అమలుకు ఒక ‘పాలసీ’ని అనుసరించాలా, వద్దా? మరది ఎటువంటిది అయ్యుండాలి? ఇటు వంటి సోయి ఎరిగే దశకు మనం చేరేది ఎప్పుడు?
జాన్‌సన్ చోరగుడి
వ్యాసకర్త అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత