
గత వైఎస్‌ఆర్సీపీ ప్రభుత్వం ప్రారంభించిన వాణిజ్యం – పరిశ్రమల శాఖ (ఆహార శుద్ధి)... ఆ రంగానికీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి కూడా ప్రయో జనకరంగా మారింది. విశాఖపట్టణంలో ఆగస్టు 29న జరిగిన ఒక సదస్సులో ‘ఆహార శుద్ధి రంగంలో లక్ష కోట్ల పెట్టుబడులు’ అంటూ చంద్రబాబు నాయుడు దీన్ని తనదన్నట్టు ‘వోన్’ చేసుకున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత 2014–2019 మధ్య కాలంలో కేవలం ‘రాష్ట్ర ఆహార శుద్ధి సొసైటీ’ మాత్రమే ఉండేది. దానికి సీఈఓ స్థాయిలో ఒక అధికారి ఉండే వారు. వ్యవసాయ రంగానికి వాణిజ్య పంటల సాగుతో జవజీవాలు ఇవ్వడా నికీ, కార్పొరేట్ సంస్థల పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చి అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా వెనుకబడిన ప్రాంతాల్లో ఆహార పంటల సాగు, ఉత్పత్తుల శుద్ధి, ప్యాకింగ్ వంటి విభాగాల్లో మహిళలకు పెరిగే ఉపాధి వంటి బహుళ ప్రయోజనాలు లక్ష్యంగా ఈ శాఖను గత వైసీపీ ప్రభుత్వం 2020లో ప్రారంభించింది. దీనికున్న విలువను గ్రహించి కూటమి ప్రభుత్వం పరిశ్రమల శాఖ హోదా కల్పిస్తూ జీవో ఇచ్చింది.
ఈ శాఖను ప్రారంభించాక, ఎటువంటి ప్రచార పటాటోపాలు లేకుండానే నాటి సీఎం జగన్‌మోహన్ రెడ్డి 2023 జులై 26న తన క్యాంప్ ఆఫీస్ నుంచి రూ. 1,719 కోట్ల వ్యయంతో 11 ‘ఫుడ్ ప్రాసెసింగ్’ యూనిట్లను ప్రారంభిస్తూ, ఐదింటికి ‘వర్చువల్’ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. వీటి ఉత్పత్తి సామర్థ్యం ఏటా 3.14 లక్షల టన్నులు కాగా, 40,307 మంది రైతులు వీటి ద్వారా ప్రయోజనం పొందు తున్నారు. వీటిని ‘లొకేట్’ చేసిన పద్ధతి మొదటి నుంచి జగన్ ప్రభుత్వ విధానమైన ‘వికేంద్రీకరణ’ సూత్రానికి కట్టుబడి జరిగింది. కూరగాయలు, పండ్లు ‘ప్రాసెసింగ్ కేంద్రాలు అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు; చిరు ధాన్యాల ప్రాసెసింగ్ కేంద్రం విజయనగరం జిల్లా ఎస్.కోట; ఉల్లిపాయలు, టమోటా ‘ప్రాసెసింగ్’ కోసం కర్నూలు జిల్లా తడకనపల్లిలను ఎంపిక చేయడం జరిగింది.
2023 అక్టోబర్ 5న తన ఆఫీస్ నుంచి ‘గ్రీన్ ల్యాండ్ సౌత్ లిమిటెడ్’, ‘డీపీ చాక్లెట్ ప్రైవేట్ లిమిటెడ్’, ‘బనానా ప్రాసెసింగ్ క్లస్టర్’... ఇలా మూడు ‘ఫుడ్ ప్రాసెసింగ్’ కంపెనీలు ఒకే రోజు ‘వర్చువల్’గా ప్రారంభించి, మరో 9 పరిశ్ర మలకు శంకుస్థాపన చేశారు. వీటి ద్వారా రూ. 3,008 కోట్లు పెట్టుబడి వస్తే, 70 వేల మందికి ఉద్యోగాలు దొరికాయి. 14 జిల్లాలకు చెందిన 91 వేలమంది రైతులకు ప్రయోజనం కలిగింది. అదే రోజు గంటకు 60 టన్నుల ఆయిల్ పామ్ గెలల నుంచి పామాయిల్ నూనె తీసే ఫ్యాక్టరీ– ‘త్రీ ఎఫ్ ఆయిల్ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీని తూర్పు గోదావరి జిల్లా అయ్యవరం వద్ద రూ. 250 కోట్లతో ప్రారంబించడానికి ఒప్పందం జరిగింది. 50వేల మంది రైతులకు ప్రయోజనం, 1500 మందికి ఉపాధి కలుగుతోంది. ఇటువంటి ‘ఫుడ్ ప్రాసెసింగ్’ రంగం ఇప్పుడు రైతులకే కాక ఈ ప్రభుత్వానికి కూడా అక్కరకు వచ్చింది.
– జాన్‌సన్ చోరగుడి ‘ అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత